jilla parisad
-
పోలీసులపై టీఆర్ఎస్ జడ్పీటీసీ అనుచరుల దాడి
సాక్షి, నిర్మల్: జిల్లాలోని కడెం మండలం లింగాపూర్ గామంలో టీఆర్ఎస్ వర్గీయులు పోలీసులుపై అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా పోలీసులపై దాడికి తెగపడ్డారు. కడెం జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి అన్న భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోస్టుమార్టం లేకుండానే ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఖననం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కడెం జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త పెద్దది కావటంతో శ్రీనివాసరెడ్డి అనుచరులు ఏఎస్ఐ సహా హోంగార్డుపై దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డితో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: Hyderabad: హైటెక్స్‌లో రేపు 40 వేల మందికి టీకాలు -
నిధులున్నా నిర్లక్ష్యమే!
సాక్షి, రంగారెడ్డి: జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరి దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా అభివృద్ధి పనులకు, సమస్యల పరిష్కారానికి మోక్షం లభించడం లేదు. జెడ్పీ ఖజానాలో నిధులు మూలుగుతున్నా కాలయాపనతో సరిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపాదనల పేరుతో దాదాపు నెల రోజులుపాటు సమయం వృథా చేసినా ఇప్పటికీ తుదిరూపునకు రాకపోవడంపై జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల వారీగా ఈఏడాది జూలై 5న జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం ఏర్పాటైంది. మొత్తం 21 జెడ్పీటీసీలు బాధ్యతలు స్వీకరించారు. తమ మండలాల పరిధిలో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలుపొందారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సతమతం అవుతున్నారు. పల్లెల పర్యటనకు వెళ్తున్న వీరిని ప్రజలు పలుచోట్ల నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సమస్యల సంద్రంలో చిక్కుకున్నాయి. చాలా బడులకు ప్రహరీలు లేవు. తాగునీటి కొరత వేధిస్తోంది. మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్వహణకు నోచుకోవడం లేదు. అంగన్ వాడీలకు శాశ్వత భవనాల కొరత నెలకొంది. అలాగే గ్రామాల్లో అంతర్గత వీధులు సరిగా లేవు. ఇలా చాలా ప్రాంతాల్లో సమస్యలు నెలకొనడంతో తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. అయినా జెడ్పీ అధికారుల్లో చలనం లేకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. నేతలకు తలనొప్పి.. ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు జెడ్పీ ఖజానాలో నిధులున్నాయి. అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (ఎస్ఎఫ్సీ) నిధులు సుమారు రూ.18 కోట్ల వరకు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, దాదాపు 350కిపైగా పనుల కోసం రూ.16 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించాలని జెడ్పీ వర్గాలు ప్రాథమికంగా నిర్ణయించాయి. వీటికి సంబంధించి కొన్ని రోజులుగా జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. వాస్తవంగా ప్రతిపాదనల ప్రక్రియ పూర్తి చేసి ప్రొసీడింగ్‌లు అందజేయాలి. ఇప్పటికీ ప్రతిపాదనల అంశం కొలిక్కి రాకపోవడంతో అడుగు ముందుకు పడటం లేదు. దీనికితోడు ఎస్సీ, ఎస్టీలు ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుపైనా తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఒక్కో జెడ్పీటీసీకి రూ.30 లక్షల నిధుల కేటాయించి వారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కాగా, ఒక్కో జెడ్పీటీసీ రూ.కోటి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేస్తున్నారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈక్రమంలో ఈ మొత్తాన్ని కుదించడానికి సమయం పడుతోందని, అందుకే ప్రతిపాదనలు తుది రూపునకు రాలేదని అధికారులు వివరిస్తున్నారు. జెడ్పీటీసీలుగా గెలిచి నాలుగు నెలలు పూర్తయింది. ఇప్పటికీ ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. దీంతో ఏ పనులు చేసే వీలు లేకపోవడంతో ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు. అధికార కార్యక్రమాల్లో పాల్గొనాలంటే సంకోచిస్తున్నాం. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వస్తే.. ప్రజల ముందు తల ఎత్తుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి’ – అధికార పారీ్టకి చెందిన ఓ జెడ్పీటీసీ ఆవేదన -
కొత్త జెడ్పీ.. నిధుల బదిలీ ఎలా?
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాల పునర్విభజన జరిగి ఈ దసరా పండుగ నాటికి సరిగ్గా మూడేళ్లు పూర్తి కానుంది. నాలుగు జిల్లాల్లో కొత్త జిల్లా పరిషత్‌లు, కొత్త మండల పరిషత్‌ల ఏర్పాటు జరిగి ఏడు నెలలు దాటింది. గత నాలుగు నెలల క్రితం ఆయా జెడ్పీ పరిధిలోనే ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు గెలుపొంది బాధ్యతలు కూడా చేపట్టారు. కానీ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించే మండల, జిల్లా పరిషత్‌లకు మాత్రం ఇంత వరకు నిధుల కేటాయింపు జరగలేదు. కొత్తగా ఏర్పాటైన జెడ్పీలు నిధులు లేక విలవిలలాడుతుంటే.. కొత్త మండలాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఏ పని చేపట్టినా.. ఖర్చు చేయాల్సి రావడంతో కొత్త మండల పరిషత్‌లు అభివృద్ధి బాట పట్టలేకపోతున్నాయి. ఇదిలా ఉండగా, పరిషత్ విజభన సమయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం పాత జెడ్పీ నుంచి కొత్త జిల్లా పరిషత్‌లకు ఉద్యోగులను, ఫర్నిచర్‌ను, సిబ్బందిని కేటాయించారు. ఈ లెక్కన పాత మండలాల నుంచి కొత్త మండలాలకు కేటాయించింది. కొత్త పరిషత్‌ల ఏర్పాటు సమయంలో ఆదిలాబాద్ జెడ్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన ఉద్యోగులను ప్రభుత్వం ఆయా జిల్లాలకు బదిలీ చేసింది. బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు ఇప్పటికీ ఆదిలాబాద్ జెడ్పీ నుంచే నెలనెలా జీతాలు చెల్లిస్తున్నారు. కాగా, అటు మండలాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పాత మండలాల నుంచి కొత్త మండలాలకు వెళ్లిన ఉద్యోగులు ఇప్పటికీ పాత మండలాల నుంచే వేతనాలు పొందుతున్నారు. చెక్‌పవర్ లేక.. ఖర్చు చేయలేక.. కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు ముందు ఉమ్మడి జెడ్పీలో సభలు, సమావేశాలు జరిగాయి. ఆ సమయాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల అభివృద్ధికి పనులు, యూనిట్లు మంజూరు చేయించుకున్నారు. పాత జెడ్పీ నుంచే అభివృద్ధి పనులు మంజూరు చేయడం, వాటికి సంబంధించి నిధులు విడుదల చేయడం లాంటివి జరిగేవి. ప్రస్తుతం కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటైనందున ఇక వాటి పరిధిలోనే చేపట్టాలి. కానీ గతంలో మంజూరైన కొన్ని పనులు నాలుగు జిల్లాల పరిధిలో ఇప్పటికీ కొనసాగుతుండగా, కొన్ని పూర్తయ్యాయి. అయితే అప్పట్లో మంజూరైన పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి పాత జెడ్పీ ఖాతాలో జమ చేసింది. ఈ నిధులతోపాటు ఏటా తలసరి ఆదాయం (జనరల్ ఫండ్), రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు (ఎస్ఎఫ్సీ) ఉమ్మడి జెడ్పీ ఖాతాలో జమయ్యాయి. ఇలా ప్రస్తుతం ఆదిలాబాద్ జెడ్పీ ఖాతాలో రూ.3.50 కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులు మండలాల ప్రతిపాదికన ఆయా జిల్లాలకు కేటాయించాల్సి ఉంది. ఏ జిల్లాలో మండలాల సంఖ్య ఎక్కువగా ఉంటుందో.. ఆ జిల్లాకు అధిక నిధుల కేటాయింపు జరుగుతుంది. ఈ లెక్కన ఒక్కో జిల్లాకు రూ.87 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు వస్తాయి. ప్రస్తుతమున్న నిధులు ఆయా జిల్లాలకు పంచాలంటే డ్రాయింగ్ పవర్ (చెక్ పవర్) అవసరముంటుంది. ఆ నిధులను డ్రా చేసి ఇతర జిల్లాలకు అప్పగించాలి. కానీ పరిషత్‌లో ఏ అధికారికి ‘డ్రాయింగ్ పవర్ లేకపోవడంతో నిధులు అందుబాటులో ఉన్నా.. వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్పా.. ఆ నిధులు ఖర్చు కాదు కదా.. పైసా కూడా కదలడానికి వీలు లేకుండా ఉంది. దీంతో కొత్త జిల్లా పరిషత్‌లకు నిధుల కేటాయింపు సమస్యగా మారింది. జెడ్పీ నిధులు ఖర్చు చేస్తారిలా.. జిల్లా పరిషత్‌కు పలు ఆదాయ మార్గాలున్నాయి. ప్రతీ సంవత్సరం ప్రభుత్వం నుంచి జెడ్పీ ఖాతాలో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు (ఎస్ఎఫ్సీ) జమవుతాయి. జనరల్ ఫండ్ (సీనరేజి–స్టాంప్ డ్యూటీ కలిపి) ఏటా వస్తుంది. తలసరి ఆదాయం మూడు రకాలుగా ఉంటుంది. జనరల్ కాంపోనెంట్, ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ (ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినవి). అయితే జనరల్ ఫండ్స్ నుంచి వివిధ పనుల నిమిత్తం ఇలా ఖర్చు చేస్తారు. 16 శాతం నిధులను కార్యాలయ ఖర్చుల (కాంటిజెన్సీ ఫండ్) నిమిత్తం వినియోగిస్తారు. 30 శాతం నిధులను అత్యవసరాలతోపాటు అన్ని పనులకు ఖర్చు చేస్తారు. 15 శాతం ఎస్సీ, 15 శాతం ఎస్టీ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. 15 శాతం మహిళా, స్త్రీశిశు సంక్షేమం కోసం, 14 శాతం తాగునీటి కోసం వినియోగిస్తారు. చెక్‌పవర్‌పై సందిగ్ధత.. జిల్లా పరిషత్ అభివృద్ది నిధులను డ్రాచేసే అధికారం ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. జిల్లా పరిషత్ సీఈవోలకు ‘చెక్‌పవర్’ అధికారం కల్పిస్తున్నట్లు గత నెల క్రితం సర్కారు నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రెండు రోజులకే సీఈవోలకు చెక్‌పవర్ నిలిపేస్తూ మరో జీవో జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డ్రాయింగ్ పవర్ ఎవరికి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది జరిగిన పరిషత్ ఎన్నికల ముందు వరకు జెడ్పీ డిప్యూటీ సీఈవోలకు చెక్‌పవర్ ఉండేది. గత నెలలో (అకౌంట్ అధికారి/ డిప్యూటీ సీఈవో)గా పరిషత్ ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సీఈవోలకు పవర్ ఇస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుని విరమించుకుంది. అయితే కొత్త జిల్లా పరిషత్‌లకు కేవలం సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులు మాత్రమే కేటాయించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న డిప్యూటీ సీఈవోకే మళ్లీ పవర్ ఇస్తారా.. లేక సీఈవోలకు అవకాశం కల్పిస్తారా.. అనే విషయంపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. ఆదేశాలు వస్తేనే నిధుల కేటాయింపు కొత్త జిల్లా పరిషత్‌లకు అభివృద్ధి నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే విభజన చేయగలం. ఈ విషయం ప్రభుత్వం పరిధిలో ఉండడంతో వేచి చూస్తున్నాం. మండలాల ప్రతిపాదికన ఆయా జిల్లాలకు కేటాయించేందుకు అన్ని సిద్ధం చేశాం. చెక్‌పవర్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి నిధుల బదలాయింపుపై స్పష్టత రానుంది. – కిషన్, జిల్లా పరిషత్ సీఈవో -
తొలి సమావేశానికి వేళాయె
సాక్షి, సిద్దిపేట: నూతన జిల్లాల ఆవిర్భావంతో ప్రజలకు ప్రభుత్వం చేరువైంది. అదే వేగంతో నూతన జిల్లా పరిషత్‌ల ఏర్పాటు, ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగా సర్వం సిద్ధం చేసింది. నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం తర్వాత నిర్వహించే తొలి సర్వసభ్య సమావేశం కావడం గమనార్హం. అయితే ఇంతవరకు స్థాయీ సంఘాల నియామకం కూడా జరగకపోవడంతో ఉదయం స్థాయీ సంఘాల నియామకం చేపట్టి, మధ్యాహ్నం జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోపాటు ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సభ్యులు హాజరుకానున్నారు. అదేవిధంగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్‌తోపాటు అన్నిశాఖలకు చెందిన అధికారులు కూడా ఈ సభకు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది.జిల్లా పరిషత్ పనివిధానంలో భాగమైన స్థాయీ సంఘాల నియామకం కూడా బుధవారం ఉదయం జరగనుంది. ఆర్థిక, పనులు, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యంతోపాటు స్త్రీశిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ, వ్యవసాయ స్థాయీ సంఘాల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సంఘాలకు ఆర్థిక, అభివృద్ధి పనులు, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం సంఘాలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజాశర్మ చైర్మన్‌గా ఉంటుంది. మరో నలుగురు జెడ్పీటీసీలు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా స్త్రీ శిశుసంక్షేమశాఖకు మహిళా జెడ్పీటీసీ సభ్యురాలు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సాంఘిక సంక్షేమ స్టాండింగ్ కమిటీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన వారిని సభ్యులుగా, ఒకరిని చైర్మన్‌గా నియమిస్తారు. వీటితోపాటు వ్యవసాశాఖ స్థాయి సంఘానికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ తంతు అంతా ఉదయం పూర్తి చేసి, మధ్యాహ్నం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి వెళ్తారు. హాజరు కానున్న సభ్యులు తొలి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, 22 మంది జిల్లా పరిషత్ సభ్యులు, ఇద్దరు కో–ఆప్షన్ సభ్యులతోపాటు, 23 మంది ఎంపీపీలు హాజరు కానున్నారు. జిల్లాకు చెందిన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌లతోపాటు, మానకొండూరు, జనగామ ఎమ్మెల్యేలు జెడ్పీ పరిధిలోకి వస్తారు. ఇందులో గజ్వేల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ మినహా మిగిలిన హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, ఒడితల సతీష్‌కుమార్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రసమయి బాలకిషన్ హాజరుకానున్నారు. అదేవిధంగా మెదక్, నల్గొండ, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ హాజరవుతారు. వీరితోపాటు ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తంరెడ్డికి కూడా ఆహ్వానం పత్రాం అందజేశామని ఇన్చార్జి సీఈవో గోపాల్‌రావు తెలిపారు. అత్యవసర శాఖలపై సమీక్ష జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో ప్రస్తుత పరిస్థితులకు అవసరమైన అత్యవసర శాఖలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకోసం ఎజెండా కాపీలను సైతం అందరు సభ్యులకు పంపించామన్నారు. ప్రధానంగా వ్యవసాయం, విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. ప్రధానంగా హరిత హారంలో అందరిని భాగస్వామ్యం చేసేందుకు తొలి జెడ్పీ సమావేశం వేదిక కానుంది. -
సుదీర్ఘ చర్చ
వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యంపై నిలదీసిన సభ్యులు ఉదయం 11 నుంచి రాత్రి 8వరకు సాగిన జెడ్పీ సమావేశం కరీంనగర్ : వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులపై సోమవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, శాసనమండలి చీప్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ నీతూప్రసాద్, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వీరజవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం శాసనమండలి చీఫ్‌విప్‌గా ఎంపికై మొదటిసారి సమావేశానికి వచ్చిన పాతూరి సుధాకర్‌రెడ్డిని, ఆర్టీసీ చైర్మన్‌గా ఎంపికై తొలిసారి సమావేశానికి హాజరైన సోమారపు సత్యనారాయణను, వీర్నపల్లిని ఆదర్శ గ్రామంగా నిలిపేందుకు కృషి చేసిన ఎంపీ వినోద్‌కుమార్‌లను జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వ్యవసాయంపై జరిగిన చర్చలో శంకరపట్నం, బోయినపల్లి జెడ్పీటీసీలు సంజీవరెడ్డి, లచ్చిరెడ్డి మాట్లాడుతూ... వ్యవసాయ శాఖ నుంచి అందించే డ్రిప్, తదితర యంత్రాలకు రైతులు డీడీలు తీసి ఆరు నెలలు అవుతోందని, పరికరాలు వస్తాయా రావా చెప్పాలని పట్టుబట్టారు. వ్యవసాయ శాఖ జేడీ తేజోవతి, ఉద్యానశాఖ డీడీ సంగీతలక్ష్మి జోక్యం చేసుకొని రైతులకు డీడీలు వాపసు ఇస్తామన్నారు. దీంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులకు డీడీలు వాపసు ఇస్తారా.. ఇదేనా పద్ధతి అంటూ నిలదీశారు. కలెక్టర్ జోక్యం చేసుకోని రాబోయే జాబితాలో రైతులకు యంత్ర, పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. – మల్హర్, బెజ్జంకి జెడ్పీటీసీలు శ్రీనివాస్‌రావు, శరత్‌రావు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ పనిముట్ల మంజూరు జాబితాను వెల్లడించడంలో అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని, ఆన్లైన్లో వివరాలను పొందుపరిచామని దాటవేయడం పద్ధతి కాదని నిలదీశారు. గతంలో మంథని డివిజన్లో మిర్చి పంట వేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో మీనవేషాలు లెక్కిస్తున్నారని వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. – కమాన్‌పూర్ జెడ్పీటీసీ సంపత్, మంథని జెడ్పీటీసీ సరోజన, కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ సారయ్య మాట్లాడుతూ ఎస్సారెస్పీ కింద ఆయకట్టు రైతులకు నీరందించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే సమాధానాలు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తారా అంటూ మండిపడ్డారు. వర్షకాలం గడిచిపోతున్నా ఎస్సారెస్పీ ద్వారా ఇంతవరకు చెరువులు, కుంటలు నింపలేదని, పంపింగ్ ద్వారా చెరువులు, కుంటలు నింపుతామనే మాటలు ఉత్తమాటలుగా మారాయని సభ్యులు ధ్వజమెత్తారు. కాల్వశ్రీరాంపూర్, ఓదెల ప్రాంతాల రైతులు ఇప్పటికే ఐదు పంటలు నష్టపోయారని, ఇకనైనా నీటి విడుదల చేసి వారాబందీ విధానం కాకుండా పదిహేను రోజులపాటు నిరంతరం అందించాలని డిమాండ్ చేశారు. – ఎల్లంపల్లి పంపింగ్ ద్వారా చొప్పదండి, మోతె రిజర్వాయర్లకు నీటిని వదిలి రైతాంగాన్ని ఆదుకోవాలని జెడ్పీటీసీ సభ్యుడు ఇప్పనపల్లి సాంబయ్య కోరారు. ఎల్లంపెల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ద్వారా రామగుండం మండలం కుక్కలగూడూర్ గ్రామం ముంపునకు గురవుతోందని, బాధితులను ఆదుకొని తగిన సహాయం చేయాలని రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యరాణి కోరారు. – మిషన్ కాకతీయలో చెరువుల ఎంపికలో హుస్నాబాద్ మెట్ట ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, 33 చెరువులను ఎంపిక చేయాలని ప్రతిపాదనలు పంపిస్తే ఒక్కదానికీ అనుమతి ఇవ్వరా అంటూ జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మిడ్‌మానేర్ వరదకాల్వలో మూడు టీఎంసీల నీటిని నిల్వ చేయాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని, అలా చేస్తే చీర్లవంచ, కొదురుపాక, నీలోజిపల్లె గ్రామాల తీవ్రంగా నష్టపోతున్నారని జెడ్పీటీసీ లచ్చిరెడ్డి అన్నారు. చీర్లవంచలో 37 కుటుంబాలకు చెల్లించాల్సిన ఎంఎంఆర్ నిధులు ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకోని 15రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖపై గరంగరం... విద్యాశాఖపై జరిగిన సమీక్షలో ఆ శాఖ పనితీరుపై సభ్యులు మండిపడ్డారు. మల్హర్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ వంట గదుల నిర్మాణం విషయంలో స్పష్టత లేదని, ప్రతి సమావేశంలో ప్రశ్నించడం.. అధికారులు జవాబు ఇవ్వడం రివాజుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగిందని, ఎల్కేజీ, యూకేజీ చదివే పిల్లలకు సైతం పాఠశాలల్లోనే భోజనంతోపాటు పుస్తకాలు, యూనిఫాం అందజేస్తే బాగుంటుందని చొప్పదండి జెడ్పీటీసీ ఇప్పనపెల్లి సాంబయ్య సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన ఎల్కేజీ , యూకేజీ పిల్లలు సమీప అంగన్వాడీ కేంద్రాల్లోనే భోజనం చేయాలనే నిబంధన సరికాదని పలువురు సభ్యులు అన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకటో తరగతి నుంచి మధ్యాహ్నభోజనం పెట్టాలనే నిబంధన ఉందని, సభ్యులు సహకరించాలని సూచించారు. – కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ, జెడ్పీటీసీ సారయ్య, లంక సదయ్య మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాలల్లో గతంలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ రమేశ్‌ను తొలగించి మళ్లీ అదే చోటికి ఎలా పోస్టింగ్ ఇచ్చారని ప్రశ్నించారు. డీఈఓ జోక్యం చేసుకొని రమేశ్‌పై ఆరోపణలు రుజువు కానందున యథాస్థానంలో పోస్టింగ్ ఇచ్చామన్నారు. మిగతా సభ్యులు జోక్యం చేసుకొని ఆయనను అక్కడినుంచి తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. కలెక్టర్ , జెడ్పీ చైర్పర్సన్ జోక్యం చేసుకొని రమేశ్‌ను బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ జమీలోద్దీన్ మాట్లాడుతూ కరీంనగర్‌తో పాటు మండలంలోని వివిధ పాఠశాలల్లో మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయన్నారు. చిన్నపాటి వర్షానికే పాఠశాలలు చెరువులను తలపిస్తున్నాయని, యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. – సైదాపూర్, ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీలు బిల్లా వెంకట్‌రెడ్డి, తోట ఆగయ్య మాట్లాడుతూ.. పాఠశాలల విధులకు ఎగనామం పెడుతూ లాంగ్‌లీవ్ పేరిట విదేశాల్లో ఉన్న ఉపాధ్యాయుల పట్ల చర్యలు తీసుకోవాలన్నారు. లేనట్లయితే వారి స్థానంలో ఉపాధ్యాయులను నియమించాలని పట్టుబట్టారు. మద్దిమల్ల గ్రామంలో రెండేళ్లుగా రాజేశ్వర్ అనే ఉపాధ్యాయుడు దీర్ఘకాలిక సెలవులో వెళ్లాడన్నారు. ఇలా అయితే నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులను ఉపేక్షించవద్దని పలువురు సభ్యులు కోరారు. – మహాముత్తారం జెడ్పీటీసీ మందల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేడిపల్లి ఎంపీపీ జమున మాట్లాడుతూ.. తమ మండలంలోని ఆదర్శ పాఠశాలలో వాచ్మెన్, అటెండర్లు లేరని, విద్యార్థినులు భయాందోళనలతో గడుపుతున్నారని తెలిపారు. తక్షణమే ప్రహరీ గోడ నిర్మించి వారికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీలంటే ఇంత అలుసా..? ఉపాధిహామీ పథకంపై జరిగిన చర్చలో కోహెడ జెడ్పీటీసీ పోన్నాల లక్ష్మయ్య, కో ఆప్షన్ సభ్యులు జమీలోద్దీన్, ఇల్లంతకుంట ఎంపీపీ అయిలయ్య మాట్లాడుతూ ఉపాధిహమీ కూలీలకు కూలీ చెల్లింపులో జాప్యంపై ప్రశ్నించారు. ఉపాధిహామీలో పంచాయతీ భవనాల నిర్మాణానికి ఎంపీపీ, జెడ్పీటీసీల ప్రతిపాదనల ఆమోదం వద్దన్నారు. మల్హర్ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రావు, హుజూరాబాద్ జెడ్పీటీసీ సరోజన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు పాత, కొత్త బిల్లులతోపాటు హరితహారం బిల్లులు కూడా చెల్లించకపోవడం తగదన్నారు. ఇలా అయితే రైతు కూలీలు ఎలా జీవనం సాగిస్తారని మండిపడ్డారు. – మేడిపల్లి, బెజ్జంకి ఎంపీపీలు జమున, దామోదర్ మాట్లాడుతూ నర్సరీ బిల్లుల చెల్లింపులో అవకతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రామడుగు, బోయినపల్లి, మహాముత్తారం, రామగుండం జెడ్పీటీసీలు వీర్ల కవిత, లచ్చిరెడ్డి, రాజిరెడ్డి, కందుల సంధ్యరాణి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏఎన్ఎంలు విధులు సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేయడం లేదని, దోమతెరల కోసం పంచాయతీలకు రూ.10వేలు ఎక్కడా ఇవ్వడం లేదని, ఒకవేళ ఇస్తే.. ఎక్కడో చెప్పాలని వైద్యాధికారిని నిలదీశారు. స్వచ్ఛభారత్ కాదు సచ్చినభారత్ అంటూ సభ్యులు ఎద్దేవా చేశారు. – రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవిత మాట్లాడుతూ.. గుండి ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ విధులకు రావడం లేదని, నిధులు ఖర్చు చేయడం లేదని, డిప్యూటేషన్‌పై ఉన్న వైద్యాధికారులను తక్షణమే తమ స్థానాలకు పంపించాలని డిమాండ్ చేశారు. భవనాలు ఉన్నచోట మందులు లేవు, సిబ్బంది ఉన్న చోట భవనాలు లేవు, అన్నీ ఉన్న చోట డాక్టర్లు, వైద్యసిబ్బంది ఉండడం లేదు... రాకపోకలతోనే కాలం వెళ్లదీస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకొని విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఉద్యోగులను ఉపేక్షించేది లేదన్నారు. అలాంటి వారిపై తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.