సాక్షి, రంగారెడ్డి: జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరి దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా అభివృద్ధి పనులకు, సమస్యల పరిష్కారానికి మోక్షం లభించడం లేదు. జెడ్పీ ఖజానాలో నిధులు మూలుగుతున్నా కాలయాపనతో సరిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపాదనల పేరుతో దాదాపు నెల రోజులుపాటు సమయం వృథా చేసినా ఇప్పటికీ తుదిరూపునకు రాకపోవడంపై జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల వారీగా ఈఏడాది జూలై 5న జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం ఏర్పాటైంది. మొత్తం 21 జెడ్పీటీసీలు బాధ్యతలు స్వీకరించారు. తమ మండలాల పరిధిలో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలుపొందారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సతమతం అవుతున్నారు. పల్లెల పర్యటనకు వెళ్తున్న వీరిని ప్రజలు పలుచోట్ల నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సమస్యల సంద్రంలో చిక్కుకున్నాయి. చాలా బడులకు ప్రహరీలు లేవు. తాగునీటి కొరత వేధిస్తోంది. మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్వహణకు నోచుకోవడం లేదు. అంగన్ వాడీలకు శాశ్వత భవనాల కొరత నెలకొంది. అలాగే గ్రామాల్లో అంతర్గత వీధులు సరిగా లేవు. ఇలా చాలా ప్రాంతాల్లో సమస్యలు నెలకొనడంతో తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. అయినా జెడ్పీ అధికారుల్లో చలనం లేకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
నేతలకు తలనొప్పి..
ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు జెడ్పీ ఖజానాలో నిధులున్నాయి. అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (ఎస్‌ఎఫ్‌సీ) నిధులు సుమారు రూ.18 కోట్ల వరకు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, దాదాపు 350కిపైగా పనుల కోసం రూ.16 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించాలని జెడ్పీ వర్గాలు ప్రాథమికంగా నిర్ణయించాయి. వీటికి సంబంధించి కొన్ని రోజులుగా జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. వాస్తవంగా ప్రతిపాదనల ప్రక్రియ పూర్తి చేసి ప్రొసీడింగ్‌లు అందజేయాలి. ఇప్పటికీ ప్రతిపాదనల అంశం కొలిక్కి రాకపోవడంతో అడుగు ముందుకు పడటం లేదు. దీనికితోడు ఎస్సీ, ఎస్టీలు ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుపైనా తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఒక్కో జెడ్పీటీసీకి రూ.30 లక్షల నిధుల కేటాయించి వారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కాగా, ఒక్కో జెడ్పీటీసీ రూ.కోటి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేస్తున్నారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈక్రమంలో ఈ మొత్తాన్ని కుదించడానికి సమయం పడుతోందని, అందుకే ప్రతిపాదనలు తుది రూపునకు రాలేదని అధికారులు వివరిస్తున్నారు.
జెడ్పీటీసీలుగా గెలిచి నాలుగు నెలలు పూర్తయింది. ఇప్పటికీ ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. దీంతో ఏ పనులు చేసే వీలు లేకపోవడంతో ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు. అధికార కార్యక్రమాల్లో పాల్గొనాలంటే సంకోచిస్తున్నాం. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వస్తే.. ప్రజల ముందు తల ఎత్తుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి’ – అధికార పారీ్టకి చెందిన ఓ జెడ్పీటీసీ ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment