-
వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యంపై నిలదీసిన సభ్యులు
-
ఉదయం 11 నుంచి రాత్రి 8వరకు సాగిన జెడ్పీ సమావేశం
కరీంనగర్ : వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులపై సోమవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, శాసనమండలి చీప్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ నీతూప్రసాద్, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వీరజవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం శాసనమండలి చీఫ్‌విప్‌గా ఎంపికై మొదటిసారి సమావేశానికి వచ్చిన పాతూరి సుధాకర్‌రెడ్డిని, ఆర్టీసీ చైర్మన్‌గా ఎంపికై తొలిసారి సమావేశానికి హాజరైన సోమారపు సత్యనారాయణను, వీర్నపల్లిని ఆదర్శ గ్రామంగా నిలిపేందుకు కృషి చేసిన ఎంపీ వినోద్‌కుమార్‌లను జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
వ్యవసాయంపై జరిగిన చర్చలో శంకరపట్నం, బోయినపల్లి జెడ్పీటీసీలు సంజీవరెడ్డి, లచ్చిరెడ్డి మాట్లాడుతూ... వ్యవసాయ శాఖ నుంచి అందించే డ్రిప్, తదితర యంత్రాలకు రైతులు డీడీలు తీసి ఆరు నెలలు అవుతోందని, పరికరాలు వస్తాయా రావా చెప్పాలని పట్టుబట్టారు. వ్యవసాయ శాఖ జేడీ తేజోవతి, ఉద్యానశాఖ డీడీ సంగీతలక్ష్మి జోక్యం చేసుకొని రైతులకు డీడీలు వాపసు ఇస్తామన్నారు. దీంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులకు డీడీలు వాపసు ఇస్తారా.. ఇదేనా పద్ధతి అంటూ నిలదీశారు. కలెక్టర్ జోక్యం చేసుకోని రాబోయే జాబితాలో రైతులకు యంత్ర, పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
– మల్హర్, బెజ్జంకి జెడ్పీటీసీలు శ్రీనివాస్‌రావు, శరత్‌రావు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ పనిముట్ల మంజూరు జాబితాను వెల్లడించడంలో అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని, ఆన్‌లైన్‌లో వివరాలను పొందుపరిచామని దాటవేయడం పద్ధతి కాదని నిలదీశారు. గతంలో మంథని డివిజన్‌లో మిర్చి పంట వేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో మీనవేషాలు లెక్కిస్తున్నారని వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారుల తీరుపై ధ్వజమెత్తారు.
– కమాన్‌పూర్ జెడ్పీటీసీ సంపత్, మంథని జెడ్పీటీసీ సరోజన, కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ సారయ్య మాట్లాడుతూ ఎస్సారెస్పీ కింద ఆయకట్టు రైతులకు నీరందించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే సమాధానాలు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తారా అంటూ మండిపడ్డారు. వర్షకాలం గడిచిపోతున్నా ఎస్సారెస్పీ ద్వారా ఇంతవరకు చెరువులు, కుంటలు నింపలేదని, పంపింగ్ ద్వారా చెరువులు, కుంటలు నింపుతామనే మాటలు ఉత్తమాటలుగా మారాయని సభ్యులు ధ్వజమెత్తారు. కాల్వశ్రీరాంపూర్, ఓదెల ప్రాంతాల రైతులు ఇప్పటికే ఐదు పంటలు నష్టపోయారని, ఇకనైనా నీటి విడుదల చేసి వారాబందీ విధానం కాకుండా పదిహేను రోజులపాటు నిరంతరం అందించాలని డిమాండ్ చేశారు.
– ఎల్లంపల్లి పంపింగ్ ద్వారా చొప్పదండి, మోతె రిజర్వాయర్లకు నీటిని వదిలి రైతాంగాన్ని ఆదుకోవాలని జెడ్పీటీసీ సభ్యుడు ఇప్పనపల్లి సాంబయ్య కోరారు. ఎల్లంపెల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ద్వారా రామగుండం మండలం కుక్కలగూడూర్ గ్రామం ముంపునకు గురవుతోందని, బాధితులను ఆదుకొని తగిన సహాయం చేయాలని రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యరాణి కోరారు.
– మిషన్ కాకతీయలో చెరువుల ఎంపికలో హుస్నాబాద్ మెట్ట ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, 33 చెరువులను ఎంపిక చేయాలని ప్రతిపాదనలు పంపిస్తే ఒక్కదానికీ అనుమతి ఇవ్వరా అంటూ జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మిడ్‌మానేర్ వరదకాల్వలో మూడు టీఎంసీల నీటిని నిల్వ చేయాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని, అలా చేస్తే చీర్లవంచ, కొదురుపాక, నీలోజిపల్లె గ్రామాల తీవ్రంగా నష్టపోతున్నారని జెడ్పీటీసీ లచ్చిరెడ్డి అన్నారు. చీర్లవంచలో 37 కుటుంబాలకు చెల్లించాల్సిన ఎంఎంఆర్ నిధులు ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకోని 15రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
విద్యాశాఖపై గరంగరం...
విద్యాశాఖపై జరిగిన సమీక్షలో ఆ శాఖ పనితీరుపై సభ్యులు మండిపడ్డారు. మల్హర్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ వంట గదుల నిర్మాణం విషయంలో స్పష్టత లేదని, ప్రతి సమావేశంలో ప్రశ్నించడం.. అధికారులు జవాబు ఇవ్వడం రివాజుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగిందని, ఎల్‌కేజీ, యూకేజీ చదివే పిల్లలకు సైతం పాఠశాలల్లోనే భోజనంతోపాటు పుస్తకాలు, యూనిఫాం అందజేస్తే బాగుంటుందని చొప్పదండి జెడ్పీటీసీ ఇప్పనపెల్లి సాంబయ్య సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన ఎల్‌కేజీ , యూకేజీ పిల్లలు సమీప అంగన్‌వాడీ కేంద్రాల్లోనే భోజనం చేయాలనే నిబంధన సరికాదని పలువురు సభ్యులు అన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకటో తరగతి నుంచి మధ్యాహ్నభోజనం పెట్టాలనే నిబంధన ఉందని, సభ్యులు సహకరించాలని సూచించారు.
– కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ, జెడ్పీటీసీ సారయ్య, లంక సదయ్య మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాలల్లో గతంలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ రమేశ్‌ను తొలగించి మళ్లీ అదే చోటికి ఎలా పోస్టింగ్ ఇచ్చారని ప్రశ్నించారు. డీఈఓ జోక్యం చేసుకొని రమేశ్‌పై ఆరోపణలు రుజువు కానందున యథాస్థానంలో పోస్టింగ్ ఇచ్చామన్నారు. మిగతా సభ్యులు జోక్యం చేసుకొని ఆయనను అక్కడినుంచి తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. కలెక్టర్ , జెడ్పీ చైర్‌పర్సన్ జోక్యం చేసుకొని రమేశ్‌ను బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు.
జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ జమీలోద్దీన్ మాట్లాడుతూ కరీంనగర్‌తో పాటు మండలంలోని వివిధ పాఠశాలల్లో మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయన్నారు. చిన్నపాటి వర్షానికే పాఠశాలలు చెరువులను తలపిస్తున్నాయని, యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
– సైదాపూర్, ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీలు బిల్లా వెంకట్‌రెడ్డి, తోట ఆగయ్య మాట్లాడుతూ.. పాఠశాలల విధులకు ఎగనామం పెడుతూ లాంగ్‌లీవ్ పేరిట విదేశాల్లో ఉన్న ఉపాధ్యాయుల పట్ల చర్యలు తీసుకోవాలన్నారు. లేనట్లయితే వారి స్థానంలో ఉపాధ్యాయులను నియమించాలని పట్టుబట్టారు. మద్దిమల్ల గ్రామంలో రెండేళ్లుగా రాజేశ్వర్ అనే ఉపాధ్యాయుడు దీర్ఘకాలిక సెలవులో వెళ్లాడన్నారు. ఇలా అయితే నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులను ఉపేక్షించవద్దని పలువురు సభ్యులు కోరారు.
– మహాముత్తారం జెడ్పీటీసీ మందల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేడిపల్లి ఎంపీపీ జమున మాట్లాడుతూ.. తమ మండలంలోని ఆదర్శ పాఠశాలలో వాచ్‌మెన్, అటెండర్లు లేరని, విద్యార్థినులు భయాందోళనలతో గడుపుతున్నారని తెలిపారు. తక్షణమే ప్రహరీ గోడ నిర్మించి వారికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
కూలీలంటే ఇంత అలుసా..?
ఉపాధిహామీ పథకంపై జరిగిన చర్చలో కోహెడ జెడ్పీటీసీ పోన్నాల లక్ష్మయ్య, కో ఆప్షన్ సభ్యులు జమీలోద్దీన్, ఇల్లంతకుంట ఎంపీపీ అయిలయ్య మాట్లాడుతూ ఉపాధిహమీ కూలీలకు కూలీ చెల్లింపులో జాప్యంపై ప్రశ్నించారు. ఉపాధిహామీలో పంచాయతీ భవనాల నిర్మాణానికి ఎంపీపీ, జెడ్పీటీసీల ప్రతిపాదనల ఆమోదం వద్దన్నారు. మల్హర్ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రావు, హుజూరాబాద్ జెడ్పీటీసీ సరోజన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు పాత, కొత్త బిల్లులతోపాటు హరితహారం బిల్లులు కూడా చెల్లించకపోవడం తగదన్నారు. ఇలా అయితే రైతు కూలీలు ఎలా జీవనం సాగిస్తారని మండిపడ్డారు.
– మేడిపల్లి, బెజ్జంకి ఎంపీపీలు జమున, దామోదర్ మాట్లాడుతూ నర్సరీ బిల్లుల చెల్లింపులో అవకతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రామడుగు, బోయినపల్లి, మహాముత్తారం, రామగుండం జెడ్పీటీసీలు వీర్ల కవిత, లచ్చిరెడ్డి, రాజిరెడ్డి, కందుల సంధ్యరాణి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏఎన్‌ఎంలు విధులు సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేయడం లేదని, దోమతెరల కోసం పంచాయతీలకు రూ.10వేలు ఎక్కడా ఇవ్వడం లేదని, ఒకవేళ ఇస్తే.. ఎక్కడో చెప్పాలని వైద్యాధికారిని నిలదీశారు. స్వచ్ఛభారత్ కాదు సచ్చినభారత్ అంటూ సభ్యులు ఎద్దేవా చేశారు.
– రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవిత మాట్లాడుతూ.. గుండి ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ విధులకు రావడం లేదని, నిధులు ఖర్చు చేయడం లేదని, డిప్యూటేషన్‌పై ఉన్న వైద్యాధికారులను తక్షణమే తమ స్థానాలకు పంపించాలని డిమాండ్ చేశారు. భవనాలు ఉన్నచోట మందులు లేవు, సిబ్బంది ఉన్న చోట భవనాలు లేవు, అన్నీ ఉన్న చోట డాక్టర్లు, వైద్యసిబ్బంది ఉండడం లేదు... రాకపోకలతోనే కాలం వెళ్లదీస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకొని విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఉద్యోగులను ఉపేక్షించేది లేదన్నారు. అలాంటి వారిపై తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.