అటు నావిగేషన్.. ఇటు రక్షణ..
* ఏడో ఉపగ్రహ ప్రయోగంతో పూర్తయిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థ
* దేశంతోపాటు చుట్టూ 1,500 కి.మీ. పరిధిలో నావిగేషన్ సౌకర్యం
* విమాన, నౌకాయానానికి, రక్షణ, పౌర అవసరాలకూ ప్రయోజనం
సాక్షి,హైదరాబాద్/సూళ్లూరుపేట: ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థలో చివరి ఉపగ్రహ ప్రయోగం పూర్తవడంతో మరో రెండు నెలల్లోనే మనదైన నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
ఈ స్వదేశీ దిక్సూచి వ్యవస్థతో భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులను, దిక్కులను తెలియజేయడం, ప్రకృతి వైపరీత్యాలు, భారీ ప్రమాదాల సమయాల్లో వివిధ ప్రాంతాలకు సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నెట్‌తో అనుసంధానం వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. విమాన, నౌకాయాన మార్గాలకూ తోడ్పడుతుంది. భారతదేశానికి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థ అవసరాన్ని 2006లోనే ఇస్రో గుర్తించింది. ఏడు ఉపగ్రహాలతో రూ.3,425 కోట్ల వ్యయంతో ఈ వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదించింది. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసి నిధులు కేటాయించడంతో ఇస్రో పని ప్రారంభించింది. 2014 జూలై 1న ఈ వ్యవస్థలో తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
వ్యవస్థ స్థూల రూపం..
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌లో మొత్తం ఏడు ఉపగ్రహాలున్నాయి. వాటిలో మూడు భూస్థిర కక్ష్యలో భూమి నుంచి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో 34 డిగ్రీలు, 83 డిగ్రీలు, 130.5 డిగ్రీల తూర్పు రేఖాంశాల వద్ద ఉండి పనిచేస్తాయి. మిగతా నాలుగు జియోసింక్రనస్ కక్ష్యలో (భూమధ్య రేఖను ఖండించే భూస్థిర కక్ష్యలో) 55 డిగ్రీలు, 115 డిగ్రీల తూర్పు భూమధ్య రేఖాతలానికి 31 డిగ్రీల వాలుతో తిరుగుతుంటాయి. నిర్దేశిత భూభాగంలో ఏ ప్రాంతాన్నయినా కచ్చితంగా గుర్తించేందుకు ఈ ఏర్పాటు ఉపయోగపడుతుంది. ఒక్కో ఉపగ్రహం నిర్ధారితకాలంపాటు సేవలు అందిస్తుంది. అనంతరం ఇతర ఉపగ్రహాలను వాటికి బదులుగా ప్రయోగిస్తారు.
సైనిక, పౌర అవసరాలకు..
మన నావిగేషన్ వ్యవస్థ ద్వారా స్థూలంగా రెండు రకాల సేవలు అందుతాయి. మొబైల్ ఫోన్లు, వాహనాలు, ఇతర పరికరాల్లో జీపీఎస్ స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ను వాడుకునే అవకాశం ఉంటుంది. దేశంలోని ప్రాంతానికైనా కచ్చితమైన మ్యాపులు అందివ్వగలదు. విమానాలు, నౌకల రాకపోకలు, వాటి మార్గాలను నిర్ణయించడం మరింత సులువు అవుతుంది.
జీపీఎస్ వంద మీటర్లు అటుఇటూగా నావిగేషన్ సౌకర్యాన్ని అందిస్తే... ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ మరింత కచ్చితత్వంతో కేవలం 20 మీటర్ల తేడాతో వివరాలు అందిస్తుంది. నావిగేషన్‌తోపాటు పట్టణ ప్రణాళికల రూపకల్పన, మౌలిక వసతుల గుర్తింపు, సవివరమైన, కచ్చితమైన భూ సర్వేలకూ దీన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రక్షణ కోసం..: ప్రస్తుతం మనం అమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను వాడుతున్నాం. అత్యవసర సమయాల్లో జీపీఎస్‌ను మిలటరీ అవసరాల కోసం వాడుకునేందుకు అమెరికా అనుమతిస్తుందన్న నమ్మకం లేదు. అందువల్ల మనదైన నావిగేషన్ వ్యవస్థ అవసరమవుతుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ అందుబాటులోకి రావడంతో పౌర అవసరాలు తీరడంతోపాటు దేశ రక్షణ వ్యవస్థకు బలమైన ఊతం లభిస్తుంది.
ఖర్చెంత?: ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థ ఏర్పాటుకు దాదాపు రూ.3,425 కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఒక్కో ఉపగ్రహానికి దాదాపు రూ.150 కోట్లు వ్యయం చేశారు. పీఎస్‌ఎల్వీ ఎక్స్‌ఎల్ రాకెట్ల ద్వారా ప్రయోగించిన వాటి ఖర్చు కొంచెం తక్కువగా రూ.130 కోట్ల వరకూ ఉంది. మొత్తంగా ఈ వ్యవస్థలోని ఏడు ఉపగ్రహాలకు సుమారు రూ.1,400 కోట్లు, రాకెట్లకు రూ.1,125 కోట్లు ఖర్చుకాగా.. బెంగళూరు సమీపంలోని బైలాలు వద్ద రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్‌ను నిర్మించారు.53 ప్రయోగాల్లో 46 విజయాలు
ఇస్రోను స్థాపించినప్పటి నుంచి 89 ఉపగ్రహాలు, 53 రాకెట్ ప్రయోగాలు, ఒక స్పేస్ క్యాప్సూల్ రికవరీ ప్రయోగం, ఒక జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగాత్మక ప్రయోగాన్ని నిర్వహించారు. ఇస్రో ఆధ్వర్యంలో చేసిన 53 రాకెట్ ప్రయోగాల్లో 46 విజయవంతమయ్యాయి. అందులో 34 విజయాలు పీఎస్‌ఎల్వీలవే కావడం విశేషం. వాణిజ్యపరమైన ప్రయోగాలకు కూడా పీఎస్‌ఎల్వీ అత్యంత కీలకంగా మారింది. 2008లో పీఎస్‌ఎల్వీ-సీ9 ద్వా రా ఒకేసారి పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. జూన్ మొదటి వారంలో పీఎస్‌ఎల్వీ-సీ34 ద్వారా ఒకేసారి 22 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.