Navigation
-
ఔననదు.. కాదనదు!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నావిగేషన్ కెనాల్‌ను జాతీయ జలమార్గం క్లాస్–3 ప్రమాణాల మేరకు నిర్మించాలని సూచించిన ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ).. ఆ పనులకయ్యే నిధులపై మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే పోలవరం స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి.. వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌పై దృష్టి పెట్టింది. జలాశయం పూర్తయితే నావిగేషన్ కెనాల్, టన్నెల్ నిర్మాణం చేపట్టడం అతి పెద్ద సవాల్‌గా మారుతుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్ర నౌకాయాన శాఖ, ఐడబ్ల్యూఏఐ దృష్టికి తీసుకెళ్లింది. అయినా ఆ రెండు సంస్థలు మాత్రం నిధుల మంజూరుపై స్పష్టత ఇవ్వట్లేదు. 90 శాతం పనులు పూర్తి.. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను 2004–05లోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ మేరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరిపై ఎగువకు, దిగువకు నౌకయానానికి వీలుగా 36.6 మీటర్ల వెడల్పు.. 9.6 మీటర్ల పూర్తి ప్రవాహ లోతు(ఎఫ్ఎస్డీ)తో 1.423 కి.మీ.ల పొడవుతో అప్రోచ్ ఛానల్.. దానికి కొనసాగింపుగా 40 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్ లాక్‌లు, 12 మీటర్ల వెడల్పు, 3.81 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీ.ల పొడవున నావిగేషన్ కెనాల్.. 12 మీటర్ల వెడల్పు, 3.66 మీటర్ల ఎఫ్ఎస్డీ, 2.34 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టింది. ఇందులో 2014 నాటికే నావిగేషన్ లాక్‌ల పనులను దాదాపుగా పూర్తిచేసింది. నావిగేషన్ టన్నెల్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అలాగే.. 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన వ్యయం మేరకు నావిగేషన్ కెనాల్ పనుల అంచనా వ్యయం రూ.261.62 కోట్లు. ఇందులో రూ.137.93 కోట్ల విలువైన పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది. జాతీయ జల మార్గంలో స్థానం.. ధవళేశ్వరం–భద్రచాలం స్ట్రెచ్(అఖండ గోదావరి)ను జాతీయ జలమార్గం–4లో అంతర్భాగంగా 2016లో ఐడబ్ల్యూఏఐ ప్రకటించింది. ఈ జలమార్గాన్ని క్లాస్–3 ప్రమాణాలతో చేపట్టాలని నిర్ణయించింది. క్లాస్–3 ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ కెనాల్‌ను నిర్మించాలంటే.. 1.423 కి.మీ.ల పొడవున అప్రోచ్ ఛానల్‌ను 40 మీటర్ల వెడల్పు, 2.20 ఎఫ్‌ఎస్‌డీతోనూ.. దానికి కొనసాగింపుగా 70 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల ఎత్తు గేటుతో 3 నావిగేషన్ లాక్‌లు, 40 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీ.ల పొడవున నావిగేషన్ కెనాల్.. 20 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్ఎస్డీ, 7 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టాలి. ఈ పనులకు రూ.876.38 కోట్ల వ్యయమవుతుంది. ఉలుకూపలుకు లేని ఐడబ్ల్యూఏఐ.. నిధులిస్తే పనులు చేపడతామని ఐడబ్ల్యూఏఐకి అనేకసార్లు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ప్రతిపాదించారు. ఈ వ్యయాన్ని ఐడబ్ల్యూఏఐ భరించాలని సీడబ్ల్యూసీ, కేంద్ర జల్ శక్తి శాఖలు కూడా స్పష్టం చేశాయి. ఐడబ్ల్యూఏఐ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర నౌకాయాన శాఖ, సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించి.. నిధులు మంజూరు చేయాలని ఐడబ్ల్యూఏఐకి తేల్చిచెప్పారు. అయినా కూడా ప్రతి సమావేశంలోనూ జాతీయ ప్రమాణాల మేరకు పోలవరం నావిగేషన్ కెనాల్ పనులు చేయాలని ఐడబ్ల్యూఏఐ ఉన్నతాధికారులు నిర్దేశిస్తారేగానీ.. నిధులిచ్చే అంశాన్ని మాత్రం ఎటూ తేల్చడం లేదు. -
క్వాడ్‌తో మనకు ఒరిగేదేమిటి?
క్వాడ్ సభ్యదేశాలకు చెందిన ప్రత్యేక ఆర్థిక జోన్లలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరిట అమెరికా వంటి ప్రాంతీయేతర శక్తులు విహరించడాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి వ్యూహాన్నీ భారత్ రూపొందించలేదు. భారత్‌కు హిందూ మహాసముద్ర రీజియన్ చాలా ముఖ్యమైనది. 90 శాతం చమురు దిగుమతులు, 95 శాతం వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడినుంచే జరుగుతున్నాయి. విదేశీ ఆధిపత్య శక్తుల ద్వారా హిందూ మహా సముద్ర ప్రాంతంలో సైనికీకరణ, పోటీ నెలకొంటే అది భారత్ భద్రతకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒక ప్రాంతీయ శక్తిగా తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవడమే కాకుండా, హిందూ మహా సముద్ర ప్రాంత సమీప దేశాల ప్రయోజనాలను కాపాడటంలోనూ భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో, ఇటీ వలే జపాన్‌లో ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా మధ్య ముగిసిన నాలుగుదేశాల సంభాషణ లేదా క్వాడ్ సదస్సు పలువురు అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులను విశేషంగా ఆకర్షించింది. తైవాన్‌పై చైనా దాడిచేస్తే సైనికపరంగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్య ప్రాధాన్యతను సంతరించుకుంది. సదస్సు తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటన... 2021 మార్చ్ 12న జరిగిన తొలి సదస్సులో చేసిన ప్రకటనలోని క్వాడ్ స్ఫూర్తిని నొక్కి చెప్పింది. అమెరికా ఇంతవరకూ 1982 నాటి సముద్ర చట్టాలపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్‌ను ఆమోదించలేదు కానీ 1958 నాటి నడి సము ద్రంపై కన్వెన్షన్ (సీహెచ్ఎస్)లో మాత్రం భాగం పుచ్చుకుంది. అయితే నడిసముద్రంపై కన్వన్షన్ని తదుపరి వచ్చిన సముద్ర చట్టాలపై ఐరాస కన్వెన్షన్ తోసిపుచ్చిందనుకోండి! అమెరికా దీన్నే లాంఛనప్రాయమైన అంతర్జాతీయ చట్టంగా గుర్తించినప్పటికీ, 1982 నాటి తాజా కన్వెన్షన్‌ని అమెరికా ఇంకా ఆమోదించకపోవడం వల్ల యూఎన్సీఎల్ఓఎస్ ప్రతిపాదించిన ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఈఈజెడ్) భావనకు గణనీయంగా సవాలు ఎదురవుతోంది. తీరం నుంచి 200 నాటికల్ మైళ్ల దూరం వరకు సముద్ర అన్వేషణలపై, సముద్ర వనరుల ఉపయోగంపై, నీటినుంచి, గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తిపై ఆయా దేశాలకు ఉండే ప్రత్యేక హక్కులను ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ల భావన గుర్తిస్తోంది. గత సంవత్సరం క్వాడ్ దేశాల మధ్య తొలి సదస్సు జరిగిన నెల రోజుల్లోపే అంటే 2021 ఏప్రిల్ 7న అమెరికా భారత్‌కు నిజంగానే షాక్ కలిగించింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉండే లక్షద్వీప్ దీవుల సమీపంలోని భారత ప్రత్యేక ఆర్థిక మండలి జలాల లోపలికి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ (ఎఫ్ఓఎన్ఓఎఫ్) పేరిట తన భారీ నౌకను పంపించినట్లు అమెరికా తెలిపింది. అయితే తీరప్రాంత దేశం సమ్మతి లేకుండా అలాంటి విన్యాసం నిర్వహించడం చట్టవిరుద్ధమని భారత్ తీవ్రంగానే స్పందించింది. సముద్ర మండళ్ల చట్టం 1976 ప్రకారం తన ప్రాదేశిక జలాల్లోకి, ప్రత్యేక ఎకనమిక్ జోన్లోకి విదేశీ నౌకలు ప్రత్యేకించి సైనిక నౌకలు ప్రవేశించాలంటే ముందస్తు సమా చారం, అనుమతి తీసుకోవాలని భారత్ చెబుతోంది. దీని ప్రకారం చూస్తే అమెరికా చేపట్టిన నౌకా విన్యాసం సముద్ర చట్టాలపై ఐక్య రాజ్య సమితి కన్వెన్షన్‌ని మాత్రమే కాదు, భారత జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించినట్లే అవుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ అన్ని దేశాలకూ వర్తిస్తుందనీ, క్వాడ్ డిక్లరేషన్ ఏ ప్రత్యేక దేశాన్నీ లక్ష్యంగా చేసుకోదని చెబుతూనే, చైనాకు బలమైన సందేశాన్ని పంపడంలో భాగంగా అమెరికా అలాంటి చర్యకు పాల్పడిందని కొంతమంది పరిశీలకులు సమర్థిస్తుండవచ్చు. అమెరికా పాదముద్రల్లో నడిచి, చైనాతో సహా ఇతర విదేశీ శక్తులు కూడా ఇదే వాదన వినిపించి భారత ప్రత్యేక ఆర్థిక జోన్లోకి స్వేచ్ఛగా తమ నౌకలను పంపిస్తే, భారత్‌కు ఇది తక్షణ ఆందోళన కలిగించక మానదు. ఈ అర్థంలో క్వాడ్ ప్రకటన స్థూలంగానే భారత భద్రతా పరమైన ఆందోళనలను విస్మరించిందనే చెప్పాలి. అంతేకాకుండా యూరేషి యన్ భౌగోళిక వ్యూహాన్ని దక్షిణాసియా, హిందూ మహాసముద్ర తీర ప్రాంతంతో సహా ఓ ఒక్క శక్తీ లేదా సంకీర్ణ శక్తులు కూడా డామినేట్ చేయడాన్ని అనుమతించకూడదనే అమెరికన్ వ్యూహాన్ని మాత్రమే క్వాడ్ ప్రకటన సంతృప్తి పర్చనుంది. ‘చైనా–ఇండియా గ్రేట్ పవర్ కాంపిటీషన్ ఇన్ ది ఇండియన్ ఓషన్ రీజియన్ ఇష్యూస్ ఫర్ కాంగ్రెస్’ శీర్షికతో అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ పేపర్ని 2018లో ట్రంప్ పాలనా కాలంలో ప్రచురించారు. భారత్, చైనా మధ్య పోటీ, శత్రుత్వం పెరుగుతున్న నేపథ్యంలో హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో ఒక సమతుల్య శక్తిగా అమెరికా వ్యవహరించాలని ఈ పత్రం స్పష్టం చేసింది. తమ హిందూ మహాసముద్ర తీర ప్రాంత వ్యూహంలో భారత్ అతిముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటని ట్రంప్, బైడెన్ పాలనా యంత్రాంగాలు రెండూ ప్రకటించాయి గానీ, భారత ప్రత్యేక ఆర్థిక జోన్లో అమెరికా యుద్ధ నౌకా విహారం దాని విశ్వసనీయతకు తూట్లు పొడిచింది. అలాగే ఒక ప్రాంతీయ శక్తిగా ఈ మొత్తం రీజియన్ ప్రయోజనాలను పరిరక్షించే మాట దేవుడెరుగు, భారత్ తన సొంత ప్రయోజనాలనైనా కాపాడుకునే సామర్థ్యం కలిగివుందా అనే సందేహాలను ఇతర తీరప్రాంత దేశాల్లో పెంచి పోషించింది. తన ప్రత్యేక ఆర్థిక మండలిలోకి ఇతరులు ప్రవేశించడానికి భారత్ తీసుకున్న వైఖరి లాగానే, ఇతర దేశాలు కూడా తన ప్రత్యేక ఆర్థిక మండలిలోకి ప్రవేశించడానికి ముందుగా అనుమతి తీసుకోవలసి ఉందని చైనా పేర్కొంటోంది. అయితే ఈ ప్రత్యేక ఆర్థిక మండలి తనదే అని చైనా చెబుతుండటం వల్ల జపాన్, దక్షిణ కొరియా, పిలిఫ్పైన్స్, వియత్నాంతో దానికి వివాదాలు ఎదురవుతున్నాయి. అమెరికాకు ఈ దేశాలతో భద్రతాపరమైన బాధ్యతలు ఉంటున్నాయి. ప్రస్తుతానికి అయితే తూర్పు, దక్షిణ తీర ప్రాంతంలో భారత్ తన ఉనికిని ప్రదర్శించుకోవడానికి చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి చైనా తీరప్రాంతంపై క్వాడ్ చేసిన ప్రకటన భారత్‌కు ఉపకరించదు. అదే సమయంలో అమెరికాకు, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని తన పొత్తుదారుల ప్రయోజనాలను మాత్రమే ఈ ప్రకటన నెరవేరుస్తుందని గ్రహించాలి. హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలోని లేదా ఇండో పసిఫిక్ రీజియన్‌లోని భౌగోళిక ప్రాంతాన్ని క్వాడ్ గుర్తించడం లేదు. 2017 నాటి జాతీయ భద్రతా వ్యూహం ప్రకారం, భారత పశ్చిమ తీర ప్రాంతం నుంచి అమెరికా పశ్చిమ తీరప్రాంతం వరకు వ్యాపించిన ప్రాంతాన్ని ఇండో–పసిఫిక్ ప్రాంతమని అమెరికా నిర్వచించింది. కాగా, ఆఫ్రికా కొమ్ము అని చెబుతున్న ప్రాంతం నుంచి పసిఫిక్ రీజియన్ తీరం వరకు ఉన్నదే ఇండో–పసిఫిక్ ప్రాంతమని భారత్ భావిస్తోంది. ఈ ప్రాంతంలో భారత ప్రయోజనాలు చాలావరకు ఆగ్నేయాసియా దేశాలతోనే ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ పేరిట పెరుగుతున్న చైనా మదుపు ప్రాజెక్టులు, మిలిటరీ వ్యవస్థల నిర్మాణం భారత్ ఆర్థిక, భద్రతా ప్రయోజనాలకు ప్రత్యక్ష ప్రమాదంగా మారుతున్నాయి. భారతీయ హిందూ మహాసముద్ర వ్యూహంలో రెండు కీలక అంశాలున్నాయి. ఒకటి, భారత ప్రాంతీయ నౌకల ఉనికిని బలోపేతం చేయడం. దీనివల్ల విదేశీ శక్తుల ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చు. రెండు, ఆర్థిక, సాంకేతిక సహకార చర్యలను ప్రోత్సహించడం. సభ్యదేశాలకు చెందిన ప్రత్యక ఆర్థిక జోన్లలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరిట ప్రాంతీ యేతర శక్తులు విహరించడాన్ని సామూహికంగా అడ్డుకునేందుకు ఇంతవరకు ఎలాంటి వ్యూహాన్నీ భారత్ రూపొందించలేదు. భారత్‌కు సంబంధించినంతవరకూ హిందూ మహాసముద్ర రీజియన్ చాలా ముఖ్యమైనది. 90 శాతం చమురు దిగుమతులు, 95 శాతం వాణిజ్య కార్యకలాపాలు ఈ ప్రాంతం ద్వారానే జరుగుతున్నాయి. విదేశీ శక్తుల ద్వారా హిందూ మహాసముద్ర రీజియన్‌లో సైనికీకరణ, పోటీ నెల కొంటే అది భారత్ భద్రతకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒక ప్రాంతీయ శక్తిగా తన సొంత ప్రయోజనాలను కాపాడు కోవడం కోసమే కాకుండా, హిందూ మహా సముద్ర ప్రాంతం సమీప దేశాల ప్రయోజనాలను కూడా కాపాడటంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. దీనికోసం స్వతంత్ర హిందూ మహాసముద్ర వ్యూహాలను భారత్ బలోపేతం చేసుకోవలసి ఉంది. అప్పుడే ఈ రీజి యన్‌లో నిజమైన నికర భద్రతా ప్రదాతగా భారత్ ఆవిర్భవిస్తుంది. వ్యాసకర్త: డాక్టర్ గద్దె ఓంప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ మొబైల్: 79089 33741 -
గూగుల్ మ్యాప్స్: ఓ గుడ్ న్యూస్-ఓ బ్యాడ్ న్యూస్
టెక్నాలజీలో గూగుల్ మ్యాప్స్ నిజంగానే ఓ గేమ్ ఛేంజర్. గమ్యస్థానం చేరుకునేందుకు సరైన మార్గం కోసం కోట్ల మంది గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఒక సెకనులో 70వేలమంది, గంటలకు 227 మిలియన్ల మంది.. ఒకరోజులో దాదాపు ఐదున్నర బిలియన్ల గూగుల్ యూజర్లు మ్యాప్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి యాప్ ఇప్పుడు రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్లు అందించింది. గూగుల్ మ్యాప్.. ఓ ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకురాబోతోంది. రహదారులపై టోల్ ఛార్జ్ వివరాల్ని యూజర్లకు ముందుగానే తెలియజేయబోతోంది. తద్వారా వాహనదారుడు ముందుగానే తన రూట్‌ను ఎంచుకునే అవకాశం కలగనుంది. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను వీలైనంత త్వరలోనే గూగుల్ మ్యాప్ అందుబాటులోకి రానుంది. కొందరు వాహనదారులకు కొత్త రూట్లో ప్రయాణించినప్పుడు రహదారి ఎలా ఉండబోతోంది? మధ్యలో ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి? ఎంత వసూలు చేస్తారు? అనే వాటిపై ఒక ఐడియా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసం గూగుల్ మ్యాప్ ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. అయితే దీనిపై గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా.. గూగుల్ మ్యాప్ ప్రివ్యూ ప్రోగ్రాం ఓ సందేశాన్ని పంపింది. చాలా దేశాల్లో వాజే మ్యాపింగ్ యాప్(ఇది కూడా గూగుల్ కిందే పని చేస్తోంది) ఇలాంటి ఫీచర్‌గా వాహనదారులకు ఉపయోగపడుతోంది. ఇక గూగుల్ మ్యాప్ టోల్ ట్యాక్స్ ధరలను ఎలా తెలియజేస్తుందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయినా.. బహుశా టోల్ ఆపరేటర్లు ఫిక్స్ చేసే ధరల పట్టిక, రోడ్డు మార్గాలు తదితర వివరాల వెబ్సైట్ ఆధారంగా.. వాహనదారులకు తెలియజేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చెల్లిస్తేనే.. ముందుకు వెళ్లేది! గూగుల్ మ్యాప్‌లో బెస్ట్ ఫీచర్‌గా ‘టర్న్ బై టర్న్’ నావిగేషన్‌కు పేరుంది. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో, ఇరుకు గల్లీల్లో, సిటీల్లో చాలామంది ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇది ఉపయోగించాలంటే ఇప్పుడు ఎంతో కొంత చెల్లించాల్సిందే. అవును.. ప్రస్తుతం ఈ ఫీచర్.. గూగుల్ క్రౌడ్‌ఫండింగ్ ఫీచర్ కిందకు వెళ్లిపోయింది. జీపీఎస్ లొకేషన్-నేవిగేషన్ను యూజర్‌కు అందించడం భారంగా మారుతున్న నేపథ్యంలోనే గూగుల్ మ్యాప్.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచే ఈ ఫీచర్‌ను మొదలుపెట్టింది గూగుల్ మ్యాప్(అప్డేట్ చేసుకోవాల్సిందే!). అయితే మొత్తం గూగుల్ యాప్‌నే ‘పే అండ్ యూజ్’ కిందకు తీసుకురానుందా? అనే ప్రశ్నపై మాత్రం గూగుల్ మ్యాప్ మౌనం వహిస్తోంది. చదవండి: కంటిచూపుతోనే ఇక ఫోన్ ఆపరేటింగ్! -
సత్యం స్వర్గమార్గం – అసత్యం నరకం
మానవుడు తన నిత్యజీవితంలో అసత్యానికి తావులేకుండా సదా సత్యమే పలకడానికి ప్రయత్నించాలి. సంకల్పం ఉంటే ఇదేమీ అసాధ్యమైన పనికాదు. కాని, ఈనాడు చాలామంది సత్యాన్ని గురించి అంతగా పట్టించుకుంటున్నట్లు గాని, సత్యాసత్యాల మధ్య విచక్షణ చూపుతున్నట్లుగాని కనిపించడం లేదు. తమకు సంబంధించినంత వరకు ఇతరులు అబద్ధమాడకూడదని, తమ విషయంలో వారు నిక్కచ్చిగా ఉండాలని కోరుకుంటారు. తాము మాత్రం ఇతరుల వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోరు. సత్యమనే ఈ మహత్తర సుగుణాన్ని గురించి దైవప్రవక్త ముహమ్మద్ (స) ప్రజలకు ఎటువంటి హెచ్చరికతో కూడిన సందేశమిచ్చారో గమనిద్దాం. ‘సత్యం మానవులను మంచివైపుకు మార్గదర్శకం చేస్తుంది. మంచి వారిని స్వర్గం వైపుకు తీసుకుపోతుంది. అలాగే, అసత్యం మానవులను చెడువైపుకు మార్గదర్శకం చేస్తుంది. చెడువారిని నరకం దాకా తోడ్కొని వెళుతుంది.’ సత్యానికి ఇంతటి మహత్తు, ప్రాముఖ్యత ఉన్నాయని అందరికీ తెలుసు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు పలికేవారు కూడా సత్యానికి మించిన సంపద మరొకటి లేదని అంగీకరిస్తారు. అయినా ఆచరణలో మాత్రం తప్పులో కాలు వేస్తుంటారు. అసత్యాన్నే ఆశ్రయిస్తారు. తిమ్మిని బమ్మిని చేసి పబ్బం గడుపుకోడానికి ప్రయత్నిస్తారు. ఈనాటి పరిస్థితుల్ని మనం కాస ్తనిశితంగా గమనిస్తే, ‘అసత్యం’ అన్నది ఈనాడు చెడు అని ఎవరూ అనుకోవడంలేదు. అది చెడుల జాబితానుండి మినహాయింపు పొంది, ఒక కళగా రూపాంతరం చెందింది. పరిస్థితి చూస్తుంటే, సత్యానికి అసత్యానికి మధ్య అసలు కాస్త కూడా తేడాయే లేనట్లు అనిపిస్తోంది. చాలామంది తమ పబ్బం గడుపుకోడానికి తమకు ప్రయోజనాన్ని, లాభాలను చేకూర్చిపెట్టే ఒక సాధనంగా అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. స్వార్థం, స్వలాభాలకోసం ఎంత పెద్ద అబద్ధం పలకడానికి కూడా ఏమాత్రం సంశయించడంలేదు. కాని, ముహమ్మద్ ప్రవక్త(స) ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధమాడవద్దని, సత్యం పలికిన కారణంగా మీరు సర్వస్వం కోల్పోయినా సరే అసత్యాన్ని ఆశ్రయించవద్దని హితవు పలికారు. ఇంట్లో పిల్లలకు సైతం ఏదైనా తెస్తానని, ఇస్తానని ఆశజూపి ఇవ్వకపోవడం కూడా తప్పే అన్నారు. ఇది కూడా అసత్యమే అవుతుందని, రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవలసి ఉంటుందని సెలవిచ్చారు. ఒకవేళ మానవ సహజ బలహీనత కారణంగా, పొరపాటున ఏదైనా అసత్యం దొర్లిపోతే, దానికి చింతించి, పశ్చాత్తాపంతో దైవాన్ని క్షమాపణ వేడుకోవాలని సూచించారు. కనుక, సాధ్యమైనంతవరకు సర్వకాల సర్వావస్థల్లో సత్యమే పలకడానికి, అబద్ధాలకు దూరంగా ఉంటూ దేవుని ప్రేమకు పాత్రులు కావడానికి ప్రయత్నిద్దాం. అబద్ధాలకోరును ప్రజలు ఎన్నటికీ నమ్మరు, విశ్వసించరు, ప్రేమించరు, ఆదరించరు, గౌరవించరు. ఇది నిజం. అల్లాహ్ మనందరికీ సదాసత్యమే పలికే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఫోన్‌ను నమ్మి.. ప్రాణాలు కోల్పోయింది!
లండన్ : టెక్నాలజీని గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదమో ఎవరైనా చెబితే లైట్ తీసుకుంటాం. కానీ వాటి పరిణామాలు ఎంత విషాదకరంగా ఉంటాయో ఈ కథనాన్ని చదివిదే తెలుస్తుంది. సాంకేతికతను నమ్ముకున్న ఓ బ్రిటిష్ జంట.. ఫోన్ నావిగేషన్ సూచించిన దారిలో ప్రయాణించి 3000 అడుగుల ఎత్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. లండన్ కు చెందిన జేన్ విల్సన్, ఆమె భర్త గ్యారీ కొద్దిరోజుల కిందట వేల్స్ లోని ట్రైఫ్యాన్ పర్వతారోహణకు వెళ్లారు. శిఖరాగ్రం నుంచి సురక్షితంగా కిందికి దిగే ప్రయత్నంలో సులువైన మార్గాన్నిఅన్వేషించాలనుకున్నారు. అందుకోసం మొబైల్ నేవిగేషన్ ను ఆశ్రయించారు. గ్రేట్ బ్రిటైన్ నేషనల్ మ్యాపింగ్ ఏజెన్సీ ఆఫర్ చేసే ఆర్డినెన్స్ సర్వే స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా దారి కనిపెట్టాలనుకున్నారు. నిజానికి ఈ జంటకు పర్వాతారోహణ కోత్తేమీ కాకపోయినప్పటికీ.. ఈసారి స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని వాడుకుందామన్న నిర్ణయమే జీవితాలను మార్చేసింది. నావిగేషన్ ను చూస్తూ గ్యారీ కంటే ముందు నడిచిన జేన్.. ప్రమాదవశాత్తు పర్వతం పై నుంచి కిందికిపడిపోయింది. భార్య కింద పడిపోవడంతో స్థాణువయిన గ్యారీ.. కొద్ది సేపటికి తేరుకుని రెస్క్యూ టీమ్ సహాయం కోరాడు. పర్వత శిఖరం నుంచి 500 అడుగుల కింద రక్తపు మడుగులో పడిఉన్న జేన్ మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. కాగా, ఈ ప్రమాదంపై నావిగేషన్ యాప్ ను రూపొందించిన ఆర్డినెన్స్ సర్వే ఒక ప్రకటన విడుదల చేసింది. జేన్ మృతికి సంతాపం తెలుపుతూనే.. పర్వతారోహకులకు విలువైన సూచనలు చేసింది. ఓఎస్ స్మార్ట్‌ఫోన్ యాప్ వాడుతున్నప్పటికీ పేపర్ మ్యాప్‌ను కూడా వెంట తీసుకెళ్లాలని చెప్పింది. -
అటు నావిగేషన్.. ఇటు రక్షణ..
* ఏడో ఉపగ్రహ ప్రయోగంతో పూర్తయిన ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ * దేశంతోపాటు చుట్టూ 1,500 కి.మీ. పరిధిలో నావిగేషన్ సౌకర్యం * విమాన, నౌకాయానానికి, రక్షణ, పౌర అవసరాలకూ ప్రయోజనం సాక్షి,హైదరాబాద్/సూళ్లూరుపేట: ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థలో చివరి ఉపగ్రహ ప్రయోగం పూర్తవడంతో మరో రెండు నెలల్లోనే మనదైన నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ స్వదేశీ దిక్సూచి వ్యవస్థతో భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులను, దిక్కులను తెలియజేయడం, ప్రకృతి వైపరీత్యాలు, భారీ ప్రమాదాల సమయాల్లో వివిధ ప్రాంతాలకు సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నెట్తో అనుసంధానం వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. విమాన, నౌకాయాన మార్గాలకూ తోడ్పడుతుంది. భారతదేశానికి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థ అవసరాన్ని 2006లోనే ఇస్రో గుర్తించింది. ఏడు ఉపగ్రహాలతో రూ.3,425 కోట్ల వ్యయంతో ఈ వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదించింది. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసి నిధులు కేటాయించడంతో ఇస్రో పని ప్రారంభించింది. 2014 జూలై 1న ఈ వ్యవస్థలో తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. వ్యవస్థ స్థూల రూపం.. ఐఆర్ఎన్ఎస్ఎస్లో మొత్తం ఏడు ఉపగ్రహాలున్నాయి. వాటిలో మూడు భూస్థిర కక్ష్యలో భూమి నుంచి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో 34 డిగ్రీలు, 83 డిగ్రీలు, 130.5 డిగ్రీల తూర్పు రేఖాంశాల వద్ద ఉండి పనిచేస్తాయి. మిగతా నాలుగు జియోసింక్రనస్ కక్ష్యలో (భూమధ్య రేఖను ఖండించే భూస్థిర కక్ష్యలో) 55 డిగ్రీలు, 115 డిగ్రీల తూర్పు భూమధ్య రేఖాతలానికి 31 డిగ్రీల వాలుతో తిరుగుతుంటాయి. నిర్దేశిత భూభాగంలో ఏ ప్రాంతాన్నయినా కచ్చితంగా గుర్తించేందుకు ఈ ఏర్పాటు ఉపయోగపడుతుంది. ఒక్కో ఉపగ్రహం నిర్ధారితకాలంపాటు సేవలు అందిస్తుంది. అనంతరం ఇతర ఉపగ్రహాలను వాటికి బదులుగా ప్రయోగిస్తారు. సైనిక, పౌర అవసరాలకు.. మన నావిగేషన్ వ్యవస్థ ద్వారా స్థూలంగా రెండు రకాల సేవలు అందుతాయి. మొబైల్ ఫోన్లు, వాహనాలు, ఇతర పరికరాల్లో జీపీఎస్ స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ను వాడుకునే అవకాశం ఉంటుంది. దేశంలోని ప్రాంతానికైనా కచ్చితమైన మ్యాపులు అందివ్వగలదు. విమానాలు, నౌకల రాకపోకలు, వాటి మార్గాలను నిర్ణయించడం మరింత సులువు అవుతుంది. జీపీఎస్ వంద మీటర్లు అటుఇటూగా నావిగేషన్ సౌకర్యాన్ని అందిస్తే... ఐఆర్ఎన్ఎస్ఎస్ మరింత కచ్చితత్వంతో కేవలం 20 మీటర్ల తేడాతో వివరాలు అందిస్తుంది. నావిగేషన్‌తోపాటు పట్టణ ప్రణాళికల రూపకల్పన, మౌలిక వసతుల గుర్తింపు, సవివరమైన, కచ్చితమైన భూ సర్వేలకూ దీన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రక్షణ కోసం..: ప్రస్తుతం మనం అమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను వాడుతున్నాం. అత్యవసర సమయాల్లో జీపీఎస్‌ను మిలటరీ అవసరాల కోసం వాడుకునేందుకు అమెరికా అనుమతిస్తుందన్న నమ్మకం లేదు. అందువల్ల మనదైన నావిగేషన్ వ్యవస్థ అవసరమవుతుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ అందుబాటులోకి రావడంతో పౌర అవసరాలు తీరడంతోపాటు దేశ రక్షణ వ్యవస్థకు బలమైన ఊతం లభిస్తుంది. ఖర్చెంత?: ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ ఏర్పాటుకు దాదాపు రూ.3,425 కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఒక్కో ఉపగ్రహానికి దాదాపు రూ.150 కోట్లు వ్యయం చేశారు. పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ రాకెట్ల ద్వారా ప్రయోగించిన వాటి ఖర్చు కొంచెం తక్కువగా రూ.130 కోట్ల వరకూ ఉంది. మొత్తంగా ఈ వ్యవస్థలోని ఏడు ఉపగ్రహాలకు సుమారు రూ.1,400 కోట్లు, రాకెట్లకు రూ.1,125 కోట్లు ఖర్చుకాగా.. బెంగళూరు సమీపంలోని బైలాలు వద్ద రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్‌ను నిర్మించారు.53 ప్రయోగాల్లో 46 విజయాలు ఇస్రోను స్థాపించినప్పటి నుంచి 89 ఉపగ్రహాలు, 53 రాకెట్ ప్రయోగాలు, ఒక స్పేస్ క్యాప్సూల్ రికవరీ ప్రయోగం, ఒక జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాత్మక ప్రయోగాన్ని నిర్వహించారు. ఇస్రో ఆధ్వర్యంలో చేసిన 53 రాకెట్ ప్రయోగాల్లో 46 విజయవంతమయ్యాయి. అందులో 34 విజయాలు పీఎస్‌ఎల్వీలవే కావడం విశేషం. వాణిజ్యపరమైన ప్రయోగాలకు కూడా పీఎస్ఎల్వీ అత్యంత కీలకంగా మారింది. 2008లో పీఎస్ఎల్వీ-సీ9 ద్వా రా ఒకేసారి పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. జూన్ మొదటి వారంలో పీఎస్ఎల్వీ-సీ34 ద్వారా ఒకేసారి 22 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. -
స్వదేశీ దిక్సూచి 'నావిక్'
► రెండు నెలల్లో మన జీపీఎస్ అందుబాటులోకి.. ► ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థలో ఏడో ప్రయోగం సక్సెస్ ► పీఎస్ఎల్వీ-సీ33 ప్రయోగం విజయవంతం ► గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయోగం ► 20 నిమిషాల 19 సెకన్లలో ప్రయోగం పూర్తి ► ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్ష్యలోకి చేర్చిన పీఎస్ఎల్వీ శ్రీహరికోట (సూళ్లూరుపేట): ప్రపంచ యవనికపై భారత్ మరో కీర్తి పతాకను ఎగురవేసింది.. అతికొద్ది సంపన్న దేశాలకే పరిమితమైన సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటును దాదాపు పూర్తిచేసుకుంది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-ఐఆర్ఎన్ఎస్ఎస్)లో చివరిదైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని కదనాశ్వం పీఎస్ఎల్వీ-సీ33 ద్వారా గురువారం విజయవంతంగా ప్రయోగించింది. వరుస విజయాలతో వినువీధిలో భారత కీర్తిపతాకను రెపరెపలాడిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది. ఈ ప్రయోగంతో ఐఆర్ఎన్ఎస్ఎస్లోని చివరిదైన ఏడో ఉపగ్రహం అంతరిక్షంలోకి చేరింది. దీంతో మరో రెండు నెలల్లోనే పూర్తిస్థాయిలో మన ‘జీపీఎస్’ అందుబాటులోకి రానుంది. సెల్ఫోన్లు ఇతర పరికరాల ద్వారా నావిగేషన్ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు వైమానిక, నౌకాయాన రంగాలకు, రక్షణ, పౌర సేవలకూ ఐఆర్ఎన్ఎస్ఎస్ ఎంతో ఊతమివ్వనుంది. ఇస్రో శాస్త్రవేత్తలు వినువీధిలో భారత కీర్తి ప్రతిష్టలను ఎగురవేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఐఎన్ఆర్ఎస్ఎస్ వ్యవస్థను జాతికి అంకితం చేస్తున్నట్లు ఢిల్లీలో ప్రకటించారు. ఉత్కంఠగా కౌంట్‌డౌన్.. పీఎస్ఎల్వీ-సీ33 ప్రయోగానికి మంగళవారం ఉదయం 9.20 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 51 గంటల 30 నిమిషాలపాటు నిర్విఘ్నంగా కొనసాగిన కౌంట్‌డౌన్ ముగిశాక... గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయోగం మొదలైంది. 44.4 మీటర్ల పొడవైన పీఎస్ఎల్వీ-సీ33 దాదాపు 320 టన్నుల బరువుతో నిప్పులు కక్కుతూ నింగికి ప్రయాణాన్ని ప్రారంభించింది. రాకెట్ నాలుగు దశలూ విజయవంతంగా పూర్తయి... 20 నిమిషాల 19 సెకన్లకు ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ దిగ్విజయంగా భూస్థిర బదిలీ కక్ష్య (జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టింది. దీంతో మిషన్ కంట్రోల్ రూంలో శాస్త్రవేత్తల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. శాస్త్రవేత్తలంతా ఒకరినొకరు అభినందించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఇక ఉపగ్రహాన్ని కర్ణాటకలోని హాసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాని పనితీరును పరీక్షించి.. అంతా సవ్యంగా ఉందని ప్రకటించారు. ఉపగ్రహంలో ఉన్న 827 కిలోల ద్రవ ఇంధనాన్ని దశల వారీగా మండించి... భూస్థిర బదిలీ కక్ష్య నుంచి భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో సింక్రొనస్ ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెడతారు. ఇందుకు దాదాపు వారం రోజులు సమయం పట్టే అవకాశముంది. జూన్ నాటికి నావిగేషన్ వ్యవస్థ: ఇస్రో చైర్మన్ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ మాట్లాడారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థలో చివరిదైన ఏడో ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. దీనితోపాటు ఈ వ్యవస్థకు చెందిన ఉపగ్రహాలన్నింటినీ పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారానే ప్రయోగించామన్నారు. ఏడు ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరిన వెంటనే జూన్ నాటికి సొంత నావిగేషన్ వ్యవస్థను మన దేశానికి అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా అభినందించారు. ప్రయోగం జరిగిందిలా.. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ-సీ33 రాకెట్‌ను ఆరు ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. ప్రయోగ సమయంలో ఉపగ్రహం సహా రాకెట్ మొత్తం బరువు సుమారు 320 టన్నులు. ఇంత బరువును మోసుకెళ్లేందుకు తొలి దశలోని స్ట్రాపాన్ బూస్టర్లలో 73.2 టన్నుల ఘన ఇంధనాన్ని, కోర్ అలోన్ దశలో మరో 138.2 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించారు. రెండో దశలో 42 టన్నుల ద్రవ ఇంధనం, మూడో దశలో 7.6 టన్నుల ఘన ఇంధనం, నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించారు. తొలిదశ 110 సెకన్లలో, రెండో దశ 262 సెకన్లలో, మూడో దశ 663 సెకన్లలో, నాలుగో దశ 1,182 సెకన్లలో పూర్తయింది. మొత్తంగా 20 నిమిషాల 19 సెకన్లకు 1,425 కిలోల బరువున్న ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పెరిగీ (భూమికి దగ్గరగా) 286 కిలోమీటర్లు, అపోగీ (భూమికి దూరంగా) 20,657 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార భూస్థిర బదిలీ కక్ష్య (జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లో 17.82 డిగ్రీల వాలులో ఉపగ్రహం ప్రయాణం ప్రారంభించింది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఈ ప్రయోగం 35వది. ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో 13వ ప్రయోగం. -
తెలుగు శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు
హైదరాబాద్: ఏరోనాటిక్స్ రంగంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు లండన్‌లోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీ అందించే ప్రతిష్టాత్మక సిల్వర్ మెడల్‌కు తెలుగు శాస్త్రవేత్త ఎంపికయ్యారు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్, రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ఎంపికయ్యారు. భారత రక్షణ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తకు ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. భారత్ అమ్ములపొదిలోని అగ్నితోపాటు దాదాపు అన్ని క్షిపణులకు కీలకమైన నావిగేషన్ వ్యవస్థను రూపొందించిన వారిలో సతీశ్‌రెడ్డి ఒకరు. ఏరోనాటిక్స్ రంగం అభివృద్ది లక్ష్యంగా 1866లో ఏర్పాటైన ఈ సొసైటీ 1909 నుంచి ఈ రంగంలో అత్యద్భుత ప్రతిభ చూపిన వారికి ఏటా అవార్డులు అందజేస్తోంది. తొలి బంగారు పతకాన్ని విమానాన్ని ఆవిష్కరించిన రైట్ సోదరులు అందుకున్నారు. -
యాపిల్ చేతికి కోహిరెంట్ నావిగేషన్ కంపెనీ
వాషింగ్టన్: హై-అక్యూరసి జీపీఎస్, నావిగేషన్ టెక్నాలజీస్ వంటి కార్యకలాపాలను నిర్వహిం చే కోహిరెంట్ నావిగేషన్ కంపెనీని యాపిల్ కైవసం చేసుకుంది. దీని ద్వారా యాపిల్ తన నావిగేషన్, మ్యాపింగ్ వ్యవ స్థను మరింత పటిష్టం చేసుకోనుంది. ఈ ఒప్పందాన్ని యాపిల్ కంపెనీ ధ్రువీకరించింది. -
జాబుకు.. జీపీఎస్..!
ఉత్తరాల బాక్స్‌కు ‘ఉపగ్రహంతో’ అనుసంధానం ప్రతి పోస్టల్ బాక్స్‌కు ఓ బార్‌కోడింగ్ దేశంలోనే తొలి ప్రయత్నం ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో ఏర్పాటు ప్రజల్లో ఉత్తరం పట్ల భరోసా, ఆసక్తి పెంచే యోచన స్మార్ట్‌ఫోన్.. చేతిలో ఉంటే మహానగరాల్లో సైతం రూటుకోసం వెతుక్కోనక్కర లేదు.జస్ట్ జీపీఎస్ ఆన్‌చేసి వెళ్లే ప్రాంతం నమోదు చేస్తే నావిగేషన్ కీ మిమ్మల్ని నమ్మకంగా తీసుకెళ్తుంది. ఇదే విధానాన్ని మీకు ఆత్మీయంగానో, అవసరమైన సమాచారంతోనో వచ్చే జాబులకూ జతచేయనున్నారు పోస్టల్ శాఖవారు. తన వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు తపాలా డబ్బాలోని సమాచారాన్ని పోస్ట్‌మన్ ఫీడ్ చేయగానే అది గమ్యం చేరే వరకూ పోస్టల్ అధికారులు వెంటాడతారన్న మాట. అంటే నిర్దేశిత కాలంలోనే మీ లేఖ మీకు వచ్చితీరుతుందన్న మాట. అది దారి తప్పడం కల్ల అన్నమాట. ఇంకెందుకూ ఆలస్యం మీరూ జాబు రాయండి..జీపీఎస్‌ను నమ్మండి. హైదరాబాద్: ఉత్తరం... దాదాపు ప్రజలు మరిచి పోతున్న రోజులివి. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ విప్లవంతో దానికి రోజులు దగ్గరపడ్డాయి. ఈ తీరు ఇలాగే కొనసాగితే మరికొద్దిరోజుల్లో అది కూడా టెలిగ్రామ్ తరహాలో కాలగర్భంలో కలిసిపోవటం ఖాయం. మళ్లీ ‘లేఖల’పై ప్రజల్లో ఆసక్తి పెంచేందుకు తపాలా శాఖ కొంతకాలంగా వినూత్న చర్యలు చేపడుతోంది. మన ఫొటోతో ఉండే స్టాంపునే ఎంచక్కా మనం రాసిన జాబులపై అతికించి పంపించుకునేలా ‘మైస్టాంప్’ పథకాన్ని తెచ్చింది. ఈ క్రమంలోనే ఉత్తరాల డబ్బా (పోస్టుబాక్సు)లకు జీపీఎస్‌తో అనుసంధానించి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రజల ముందుంచాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాల బట్వాడా జరుగుతున్న తీరును సమీక్షించటంతోపాటు... అవి ఎప్పటికప్పుడు గమ్యానికి చేరతాయని ప్రజలకు భరోసా ఇవ్వటం దీని ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి పోస్టు బాక్సుల క్లియరెన్సు సరిగా ఉండటం లేదనే అనుమానం ప్రజల్లో ఉంది. దీంతో చాలామంది వీధిలో ఉండే పోస్టుబాక్సుల్లో ఉత్తరాలు, దరఖాస్తు పత్రాలు.. తదితరాలు వేయటం లేదు. వాటిపై నమ్మకం లేక తపాలాకార్యాలయాలకు వెళ్లి నేరుగా సిబ్బందికి అందజేస్తున్నారు. ఈ అంశాన్ని గుర్తించిన తపాలాశాఖ ఏపీ సర్కిల్ చీఫ్‌పోస్టుమాస్టర్ జనరల్ సుధాకర్ దీన్ని తీవ్రంగా పరిగణించి అన్ని పోస్టు బాక్సులను జీపీఎస్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు. ఇది దేశంలోనే తొలిప్రయత్నం. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని 775 తపాలా డబ్బాలకు జీపీఎస్‌తో అనుసంధానిస్తారు. ప్రతి పెట్టెకూ బార్ కోడింగ్... జీపీఎస్‌తో అనుసంధానించే అన్ని తపాలా డబ్బాలకు బార్‌కోడింగ్ కేటాయిస్తున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేక స్మార్ట్ఫోన్లలో నిక్షిప్తం చేసి వాటిని తపాలా డబ్బాల్లో ఉత్తరాలు సేకరించే సిబ్బందికి ఇస్తారు. డబ్బా తెరిచి అందులోని బార్‌కోడింగ్ వద్ద స్మార్ట్‌ఫోన్‌ను ఉంచగానే దాని సమాచారం నేరుగా జీపీఓలోని ప్రత్యేక కేంద్రానికి చేరుతుంది. అందులో ఉన్న ఉత్తరాలు, అవి ఏ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది, అవి దరఖాస్తులా, సాధారణ ఉత్తరాలా... అన్న వివరాలను ఆ ఫోన్ ద్వారా పంపిస్తారు. దీన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తారు. ఫలితంగా బట్వాడాలో జాప్యం నివారించే వీలుకలుగుతుంది. స్పీడ్‌పోస్టు లేఖలు పోస్ట్మేన్కిస్తే చాలు... సాధారణంగా పోస్ట్మేన్లు ఇళ్లకు ఉత్తరాలు తెచ్చిస్తుంటారు. ఇక నుంచి వారు ఉత్తరాలు సేకరించేపనీ మొదలుపెట్టబోతున్నారు. దీన్ని స్పీడ్‌పోస్టు లేఖలతో ప్రారంభిస్తున్నారు. మనం తపాలాకార్యాయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మన వీధిలో కనిపించే పోస్ట్‌మేన్‌కు ఆ లేఖలిస్తేచాలన్నమాట. దాని చార్జీని ఆయనే వసూలు చేసి రశీది స్తాడు. దీన్ని ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నారు. అంతర్గత సాంకేతిక సమాచారం నిక్షిప్తమైఉన్న స్మార్ట్ఫోన్లను ఆధారం చేసుకుని పోస్ట్మేన్లు ఈ విధులు నిర్వహించనున్నారు.