తెలుగు శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు
హైదరాబాద్: ఏరోనాటిక్స్ రంగంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు లండన్‌లోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీ అందించే ప్రతిష్టాత్మక సిల్వర్ మెడల్‌కు తెలుగు శాస్త్రవేత్త ఎంపికయ్యారు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్, రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ఎంపికయ్యారు. భారత రక్షణ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తకు ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి.
భారత్ అమ్ములపొదిలోని అగ్నితోపాటు దాదాపు అన్ని క్షిపణులకు కీలకమైన నావిగేషన్ వ్యవస్థను రూపొందించిన వారిలో సతీశ్‌రెడ్డి ఒకరు. ఏరోనాటిక్స్ రంగం అభివృద్ది లక్ష్యంగా 1866లో ఏర్పాటైన ఈ సొసైటీ 1909 నుంచి ఈ రంగంలో అత్యద్భుత ప్రతిభ చూపిన వారికి ఏటా అవార్డులు అందజేస్తోంది. తొలి బంగారు పతకాన్ని విమానాన్ని ఆవిష్కరించిన రైట్ సోదరులు అందుకున్నారు.