G.Satish Reddy
-
కరోనా నియంత్రణకు డీఆర్డీవో టెక్నాలజీలు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో తక్షణ అవసరాల కోసం డీఆర్డీవో అనేక టెక్నాలజీలను రూ పొందిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే డీఆర్డీవో పరిశోధన సంస్థలు శానిటైజర్లు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే వెంటిలేటర్లను ప్రైవేట్ సంస్థల సహ కారంతో తయారు చేస్తున్నట్లు ఆయన ‘సాక్షి’తో చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం ఊపిరితిత్తులపైనే ఎక్కువ కాబట్టి డీఆర్డీవోకి చెందిన సొసైటీ ఫర్ బయో మెడికల్ టెక్నాలజీ (ఎస్బీఎంటీ) కార్యక్రమం కింద డెబెల్ అనే పరిశోధనశాలలో వినూత్న వెంటిలేటర్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రెషర్ ఫ్లో సెన్సార్లు, బ్రీత్ రెగ్యులేటర్ల సాయంతో ఈ వెంటిలేటర్లను అభివృద్ధి చేశామని చెప్పారు. ఒకే వెంటిలేటర్ ద్వారా పలువురు రోగులకు సేవలందించే మల్టీ పేషెంట్ వెంటిలేటర్ తయారీకి కూడా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. మరో వారంలో ఈ వెంటిలేటర్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెప్పారు. దీంతోపాటు ఎన్–95, ఎన్–99 మాస్కుల ఉత్పత్తి ఇప్పటికే మొదలు కాగా.. తాజాగా చికిత్స చేసే వైద్యులకు వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు వినూత్నమైన బయో సూట్లను అభివృద్ధి చేశామని చెప్పారు. దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కొత్త బయో సూట్ల అవసరం చాలా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి తాము రోజుకు 15 వేల నుంచి 20 వేల బయో సూట్లను తయారు చేయగలమని ఆయన ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. డీఆర్డీవో గతంలోనే రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించేందుకు ఒక బయో సూట్‌ను అభివృద్ధి చేసిందని, వీటిని మాత్రం రోజుకు లక్ష వరకు తయారు చేయగలమని చెప్పారు. పాత బయో సూట్‌ను కరోనా వైరస్‌ను కూడా తట్టుకునేలా మార్చడం ద్వారా కొత్త సూట్ సిద్ధమైం దని తెలిపారు. భవిష్యత్‌లో కరోనా తరహా వైరస్ల ముప్పును ఎదుర్కొనేందుకు డీఆర్డీవో కూడా పరిశోధనలు చేపడుతోందని తెలిపారు. -
జి. సతీశ్‌రెడ్డికి అంతర్జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ వ్యవస్థలకు కీలకమైన నావిగేషన్ వ్యవస్థలు అందించిన శాస్త్రవేత్త..డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ప్రతిష్టాత్మకమైన ‘‘2019 మిస్సైల్ సిస్టమ్స్’’అవార్డుకు ఎంపికయ్యారు. ద అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ అస్ట్రోనాటిక్స్ (ఏఐఏఏ) ఇచ్చే ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సతీశ్‌రెడ్డి రికార్డు సృష్టించారు. రెండేళ్లకు ఒకసారి అందించే ఈ అత్యున్నత అవార్డును ఇప్పటివరకూ అమెరికన్లకు మాత్రమే అందిస్తుండగా.. తొలిసారి ఇతర దేశపు నిపుణుడికి ఇవ్వటం విశేషం. క్షిపణి వ్యవస్థను అభివృద్ధి, తయారీల్లో అత్యున్నత నైపుణ్యం కనబరిచే వారికి అందించే ఈ అవార్డును రోండెల్ జే.విల్సన్‌తో కలసి పంచుకోనున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో మే ఏడు నుంచి తొమ్మిది వరకూ జరిగే డిఫెన్స్ ఫోరం కార్యక్రమంలో రోండెల్ ఈ అవార్డు అందుకుంటారని.. సతీశ్‌రెడ్డికి భారత్‌లోనే అంద జేస్తామని ఏఐఏఏ ఒక ప్రకటనలో తెలిపింది. కలామ్ స్ఫూర్తితో.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఓ కుగ్రామంలో జన్మించిన జి.సతీశ్‌రెడ్డి అనంత పురంలోని జేఎన్టీయూ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో స్నాతకోత్తర విద్యతోపాటు పీహెచ్డీ కూడా పూర్తి చేసిన ఆయన 1986లో డీఆర్డీఎల్లో చేరారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్ అధ్యక్షుడిగా పనిచేసిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ)లో విధులు కొనసాగించారు. మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిస్సైల్ కాంప్లెక్స్‌కు నేతృత్వం వహించారు కూడా. అంతర్జాతీయంగా అనేక నిషేధాజ్ఞలు, కట్టుబాట్లు ఉన్న తరుణంలో రక్షణ రంగంలో స్వావలంబన కోసం కృషి చేశారు. సతీశ్‌రెడ్డి డిజైన్ చేసి సిద్ధం చేసిన అత్యాధునిక ఏవియానిక్స్ వ్యవస్థలు క్షిపణులతోపాటు స్మార్ట్ గైడెడ్ బాంబుల్లోనూ వాడుతున్నారు. హోమీ జే.బాబా స్మారక బంగారు మెడల్, జాతీయ ఏరోనాటికల్ ప్రైజ్, నేషనల్ డిజైన్ అవార్డు, నేషనల్ సిస్టమ్స్ గోల్డ్ మెడల్ ఐఈఐృఐఈఈఈ (అమెరికా) అవార్డులు కూడా సతీశ్‌రెడ్డిని వరించాయి. క్షిపణి నావిగేషన్ వ్యవస్థల రూపశిల్పి భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన క్షిపణులకు నావిగేషన్ వ్యవస్థలను డిజైన్ చేయడంతోపాటు తయారీకి అవసరమైన అనేక పరికరాలను పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే అభివృద్ధి చేసుకునేందుకు సతీశ్‌రెడ్డి కృషి చేసిన విషయం తెలిసిందే. అగ్ని, పృథ్వీ, నాగ్ క్షిపణులతోపాటు అనేక ఇతర వ్యూహాత్మక క్షిపణులకు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలను అందించిన ఘనత సతీశ్ రెడ్డి సొంతం. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్, రాయల్ ఏరోనాటికల్ సొసైటీ, అకాడమీ ఆఫ్ నావిగేషన్ అండ్ మోషన్ కంట్రోల్ (రష్యా) సభ్యత్వం లభించిన తొలి భారతీయుడిగా సతీశ్‌రెడ్డి గుర్తింపు పొందారు. -
తెలుగు శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు
హైదరాబాద్: ఏరోనాటిక్స్ రంగంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు లండన్‌లోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీ అందించే ప్రతిష్టాత్మక సిల్వర్ మెడల్‌కు తెలుగు శాస్త్రవేత్త ఎంపికయ్యారు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్, రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ఎంపికయ్యారు. భారత రక్షణ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తకు ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. భారత్ అమ్ములపొదిలోని అగ్నితోపాటు దాదాపు అన్ని క్షిపణులకు కీలకమైన నావిగేషన్ వ్యవస్థను రూపొందించిన వారిలో సతీశ్‌రెడ్డి ఒకరు. ఏరోనాటిక్స్ రంగం అభివృద్ది లక్ష్యంగా 1866లో ఏర్పాటైన ఈ సొసైటీ 1909 నుంచి ఈ రంగంలో అత్యద్భుత ప్రతిభ చూపిన వారికి ఏటా అవార్డులు అందజేస్తోంది. తొలి బంగారు పతకాన్ని విమానాన్ని ఆవిష్కరించిన రైట్ సోదరులు అందుకున్నారు.