సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో తక్షణ అవసరాల కోసం డీఆర్‌డీవో అనేక టెక్నాలజీలను రూ పొందిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే డీఆర్‌డీవో పరిశోధన సంస్థలు శానిటైజర్లు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే వెంటిలేటర్లను ప్రైవేట్ సంస్థల సహ కారంతో తయారు చేస్తున్నట్లు ఆయన ‘సాక్షి’తో చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం ఊపిరితిత్తులపైనే ఎక్కువ కాబట్టి డీఆర్‌డీవోకి చెందిన సొసైటీ ఫర్ బయో మెడికల్ టెక్నాలజీ (ఎస్‌బీఎంటీ) కార్యక్రమం కింద డెబెల్ అనే పరిశోధనశాలలో వినూత్న వెంటిలేటర్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రెషర్ ఫ్లో సెన్సార్లు, బ్రీత్ రెగ్యులేటర్ల సాయంతో ఈ వెంటిలేటర్లను అభివృద్ధి చేశామని చెప్పారు.
ఒకే వెంటిలేటర్ ద్వారా పలువురు రోగులకు సేవలందించే మల్టీ పేషెంట్ వెంటిలేటర్ తయారీకి కూడా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. మరో వారంలో ఈ వెంటిలేటర్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెప్పారు. దీంతోపాటు ఎన్–95, ఎన్–99 మాస్కుల ఉత్పత్తి ఇప్పటికే మొదలు కాగా.. తాజాగా చికిత్స చేసే వైద్యులకు వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు వినూత్నమైన బయో సూట్‌లను అభివృద్ధి చేశామని చెప్పారు. దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కొత్త బయో సూట్ల అవసరం చాలా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి తాము రోజుకు 15 వేల నుంచి 20 వేల బయో సూట్లను తయారు చేయగలమని ఆయన ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. డీఆర్‌డీవో గతంలోనే రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించేందుకు ఒక బయో సూట్‌ను అభివృద్ధి చేసిందని, వీటిని మాత్రం రోజుకు లక్ష వరకు తయారు చేయగలమని చెప్పారు. పాత బయో సూట్‌ను కరోనా వైరస్‌ను కూడా తట్టుకునేలా మార్చడం ద్వారా కొత్త సూట్ సిద్ధమైం దని తెలిపారు. భవిష్యత్‌లో కరోనా తరహా వైరస్‌ల ముప్పును ఎదుర్కొనేందుకు డీఆర్‌డీవో కూడా పరిశోధనలు చేపడుతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment