సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ వ్యవస్థలకు కీలకమైన నావిగేషన్ వ్యవస్థలు అందించిన శాస్త్రవేత్త..డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ప్రతిష్టాత్మకమైన ‘‘2019 మిస్సైల్ సిస్టమ్స్’’అవార్డుకు ఎంపికయ్యారు. ద అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ అస్ట్రోనాటిక్స్ (ఏఐఏఏ) ఇచ్చే ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సతీశ్‌రెడ్డి రికార్డు సృష్టించారు. రెండేళ్లకు ఒకసారి అందించే ఈ అత్యున్నత అవార్డును ఇప్పటివరకూ అమెరికన్లకు మాత్రమే అందిస్తుండగా.. తొలిసారి ఇతర దేశపు నిపుణుడికి ఇవ్వటం విశేషం. క్షిపణి వ్యవస్థను అభివృద్ధి, తయారీల్లో అత్యున్నత నైపుణ్యం కనబరిచే వారికి అందించే ఈ అవార్డును రోండెల్ జే.విల్సన్‌తో కలసి పంచుకోనున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో మే ఏడు నుంచి తొమ్మిది వరకూ జరిగే డిఫెన్స్ ఫోరం కార్యక్రమంలో రోండెల్ ఈ అవార్డు అందుకుంటారని.. సతీశ్‌రెడ్డికి భారత్‌లోనే అంద జేస్తామని ఏఐఏఏ ఒక ప్రకటనలో తెలిపింది.
కలామ్ స్ఫూర్తితో..
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఓ కుగ్రామంలో జన్మించిన జి.సతీశ్‌రెడ్డి అనంత పురంలోని జేఎన్‌టీయూ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో స్నాతకోత్తర విద్యతోపాటు పీహెచ్‌డీ కూడా పూర్తి చేసిన ఆయన 1986లో డీఆర్‌డీఎల్‌లో చేరారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్ అధ్యక్షుడిగా పనిచేసిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ)లో విధులు కొనసాగించారు. మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిస్సైల్ కాంప్లెక్స్‌కు నేతృత్వం వహించారు కూడా. అంతర్జాతీయంగా అనేక నిషేధాజ్ఞలు, కట్టుబాట్లు ఉన్న తరుణంలో రక్షణ రంగంలో స్వావలంబన కోసం కృషి చేశారు. సతీశ్‌రెడ్డి డిజైన్ చేసి సిద్ధం చేసిన అత్యాధునిక ఏవియానిక్స్ వ్యవస్థలు క్షిపణులతోపాటు స్మార్ట్ గైడెడ్ బాంబుల్లోనూ వాడుతున్నారు. హోమీ జే.బాబా స్మారక బంగారు మెడల్, జాతీయ ఏరోనాటికల్ ప్రైజ్, నేషనల్ డిజైన్ అవార్డు, నేషనల్ సిస్టమ్స్ గోల్డ్ మెడల్ ఐఈఐృఐఈఈఈ (అమెరికా) అవార్డులు కూడా సతీశ్‌రెడ్డిని వరించాయి.
క్షిపణి నావిగేషన్ వ్యవస్థల రూపశిల్పి
భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన క్షిపణులకు నావిగేషన్ వ్యవస్థలను డిజైన్ చేయడంతోపాటు తయారీకి అవసరమైన అనేక పరికరాలను పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే అభివృద్ధి చేసుకునేందుకు సతీశ్‌రెడ్డి కృషి చేసిన విషయం తెలిసిందే. అగ్ని, పృథ్వీ, నాగ్ క్షిపణులతోపాటు అనేక ఇతర వ్యూహాత్మక క్షిపణులకు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలను అందించిన ఘనత సతీశ్ రెడ్డి సొంతం. రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్, రాయల్ ఏరోనాటికల్ సొసైటీ, అకాడమీ ఆఫ్ నావిగేషన్ అండ్ మోషన్ కంట్రోల్ (రష్యా) సభ్యత్వం లభించిన తొలి భారతీయుడిగా సతీశ్‌రెడ్డి గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment