సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నావిగేషన్ కెనాల్‌ను జాతీయ జలమార్గం క్లాస్–3 ప్రమాణాల మేరకు నిర్మించాలని సూచించిన ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ).. ఆ పనులకయ్యే నిధులపై మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే పోలవరం స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి.. వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్‌పై దృష్టి పెట్టింది. జలాశయం పూర్తయితే నావిగేషన్ కెనాల్, టన్నెల్ నిర్మాణం చేపట్టడం అతి పెద్ద సవాల్‌గా మారుతుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్ర నౌకాయాన శాఖ, ఐడబ్ల్యూఏఐ దృష్టికి తీసుకెళ్లింది. అయినా ఆ రెండు సంస్థలు మాత్రం నిధుల మంజూరుపై స్పష్టత ఇవ్వట్లేదు.
90 శాతం పనులు పూర్తి..
వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను 2004–05లోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ మేరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరిపై ఎగువకు, దిగువకు నౌకయానానికి వీలుగా 36.6 మీటర్ల వెడల్పు.. 9.6 మీటర్ల పూర్తి ప్రవాహ లోతు(ఎఫ్‌ఎస్‌డీ)తో 1.423 కి.మీ.ల పొడవుతో అప్రోచ్ ఛానల్.. దానికి కొనసాగింపుగా 40 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్ లాక్‌లు, 12 మీటర్ల వెడల్పు, 3.81 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీ.ల పొడవున నావిగేషన్ కెనాల్.. 12 మీటర్ల వెడల్పు, 3.66 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీ, 2.34 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టింది.
ఇందులో 2014 నాటికే నావిగేషన్ లాక్‌ల పనులను దాదాపుగా పూర్తిచేసింది. నావిగేషన్ టన్నెల్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అలాగే.. 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన వ్యయం మేరకు నావిగేషన్ కెనాల్ పనుల అంచనా వ్యయం రూ.261.62 కోట్లు. ఇందులో రూ.137.93 కోట్ల విలువైన పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది.
జాతీయ జల మార్గంలో స్థానం..
ధవళేశ్వరం–భద్రచాలం స్ట్రెచ్(అఖండ గోదావరి)ను జాతీయ జలమార్గం–4లో అంతర్భాగంగా 2016లో ఐడబ్ల్యూఏఐ ప్రకటించింది. ఈ జలమార్గాన్ని క్లాస్–3 ప్రమాణాలతో చేపట్టాలని నిర్ణయించింది. క్లాస్–3 ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ కెనాల్‌ను నిర్మించాలంటే.. 1.423 కి.మీ.ల పొడవున అప్రోచ్ ఛానల్‌ను 40 మీటర్ల వెడల్పు, 2.20 ఎఫ్‌ఎస్‌డీతోనూ.. దానికి కొనసాగింపుగా 70 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల ఎత్తు గేటుతో 3 నావిగేషన్ లాక్‌లు, 40 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీ.ల పొడవున నావిగేషన్ కెనాల్.. 20 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీ, 7 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టాలి. ఈ పనులకు రూ.876.38 కోట్ల వ్యయమవుతుంది.
ఉలుకూపలుకు లేని ఐడబ్ల్యూఏఐ..
నిధులిస్తే పనులు చేపడతామని ఐడబ్ల్యూఏఐకి అనేకసార్లు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ప్రతిపాదించారు. ఈ వ్యయాన్ని ఐడబ్ల్యూఏఐ భరించాలని సీడబ్ల్యూసీ, కేంద్ర జల్ శక్తి శాఖలు కూడా స్పష్టం చేశాయి. ఐడబ్ల్యూఏఐ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర నౌకాయాన శాఖ, సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించి.. నిధులు మంజూరు చేయాలని ఐడబ్ల్యూఏఐకి తేల్చిచెప్పారు. అయినా కూడా ప్రతి సమావేశంలోనూ జాతీయ ప్రమాణాల మేరకు పోలవరం నావిగేషన్ కెనాల్ పనులు చేయాలని ఐడబ్ల్యూఏఐ ఉన్నతాధికారులు నిర్దేశిస్తారేగానీ.. నిధులిచ్చే అంశాన్ని మాత్రం ఎటూ తేల్చడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment