Central Water Board
-
నీటి పంపిణీ బాధ్యత కృష్ణా బోర్డుదే
సాక్షి, అమరావతి: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 అవార్డు అమల్లోకి వచ్చేవరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాలు పంపిణీ చేసే బాధ్యత కృష్ణా బోర్డుదేనని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది. నీటి పంపకాల్లో అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకోబోదని బోర్డుకు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలకు నీటి పంపిణీపై జనవరి 21న నిర్వహించే 19వ సర్వసభ్య సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను ఉమ్మడి ఏపీకి కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. విభజన నేపథ్యంలో కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా చూసేందుకు 2014 మే 28న కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన నీటి కేటాయింపుల ఆధారంగా 2015–16 నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 512.06, తెలంగాణకు 298.94 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర జల్ శక్తి తాత్కాలిక సర్దుబాటు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 2016 సెప్టెంబర్ 21న అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశంలో 2016–17 సంవత్సరంలోనూ తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే నీటిని పంపిణీ చేసుకోవడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని..రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకాల అంశాన్ని అపెక్స్ కౌన్సిల్లో చర్చించి.. తుది నిర్ణయం తీసుకునేలా అజెండాలో చేర్చాలని కేంద్ర జల్ శక్తి శాఖకు కృష్ణా బోర్డు విజ్ఞప్తి చేసింది. కృష్ణా బోర్డు పనితీరుపై 2024 జనవరి 9న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కృష్ణా జలాల పంపకం అంశాన్ని కృష్ణా బోర్డు అధికారులు లేవనెత్తారు. కృష్ణా జలాల పంపకం జోలికి అపెక్స్ కౌన్సిల్ వెళ్లబోదని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి తేల్చిచెప్పారు. కేడబ్ల్యూడీటీ–2 అవార్డు అమల్లోకి వచ్చే వరకూ ఇప్పటిలానే రెండు రాష్ట్రాలతో ఏటా సంప్రదింపులు జరిపి.. నీటిని పంపిణీ చేసే బాధ్యత కృష్ణా బోర్డుదేనని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 66:34 నిష్ఫత్తిలో పంపిణీఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో లభ్యత గల జలాల్లో ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం వాడుకునేలా 2017–18 నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. 2018–19, 2019–20, 2020–21, 2021–22, 2022–23 సంవత్సరాల్లో బోర్డు సర్వసభ్య సమావేశాల్లో రెండు రాష్ట్రాలతో చర్చించి అదే పద్ధతి ప్రకారం కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేసింది. కానీ.. 2023–24 నీటి సంవత్సరానికి సంబంధించి నీటి పంపకాలపై 2023 మే 10న నిర్వహించిన కృష్ణా బోర్డు సమావేశంలో తమకు 50 శాతం వాటా కావాలని తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. దీన్ని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి తోసిపుచ్చారు. దాంతో కృష్ణా జలాల లభ్యత, అవసరాలపై ఎప్పటికప్పుడు చర్చించి, కేటాయింపులు చేసే బాధ్యతను త్రిసభ్య కమిటీకి కృష్ణా బోర్డు అప్పగించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. పాత పద్ధతి ప్రకారమే ఉమ్మడి ప్రాజెక్టుల్లో 66 శాతం ఏపీ, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేస్తూ కృష్ణా బోర్డు తుది నిర్ణయం తీసుకుంది. -
ఔననదు.. కాదనదు!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నావిగేషన్ కెనాల్‌ను జాతీయ జలమార్గం క్లాస్–3 ప్రమాణాల మేరకు నిర్మించాలని సూచించిన ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ).. ఆ పనులకయ్యే నిధులపై మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే పోలవరం స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి.. వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌పై దృష్టి పెట్టింది. జలాశయం పూర్తయితే నావిగేషన్ కెనాల్, టన్నెల్ నిర్మాణం చేపట్టడం అతి పెద్ద సవాల్‌గా మారుతుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్ర నౌకాయాన శాఖ, ఐడబ్ల్యూఏఐ దృష్టికి తీసుకెళ్లింది. అయినా ఆ రెండు సంస్థలు మాత్రం నిధుల మంజూరుపై స్పష్టత ఇవ్వట్లేదు. 90 శాతం పనులు పూర్తి.. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను 2004–05లోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ మేరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరిపై ఎగువకు, దిగువకు నౌకయానానికి వీలుగా 36.6 మీటర్ల వెడల్పు.. 9.6 మీటర్ల పూర్తి ప్రవాహ లోతు(ఎఫ్ఎస్డీ)తో 1.423 కి.మీ.ల పొడవుతో అప్రోచ్ ఛానల్.. దానికి కొనసాగింపుగా 40 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్ లాక్‌లు, 12 మీటర్ల వెడల్పు, 3.81 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీ.ల పొడవున నావిగేషన్ కెనాల్.. 12 మీటర్ల వెడల్పు, 3.66 మీటర్ల ఎఫ్ఎస్డీ, 2.34 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టింది. ఇందులో 2014 నాటికే నావిగేషన్ లాక్‌ల పనులను దాదాపుగా పూర్తిచేసింది. నావిగేషన్ టన్నెల్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అలాగే.. 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన వ్యయం మేరకు నావిగేషన్ కెనాల్ పనుల అంచనా వ్యయం రూ.261.62 కోట్లు. ఇందులో రూ.137.93 కోట్ల విలువైన పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది. జాతీయ జల మార్గంలో స్థానం.. ధవళేశ్వరం–భద్రచాలం స్ట్రెచ్(అఖండ గోదావరి)ను జాతీయ జలమార్గం–4లో అంతర్భాగంగా 2016లో ఐడబ్ల్యూఏఐ ప్రకటించింది. ఈ జలమార్గాన్ని క్లాస్–3 ప్రమాణాలతో చేపట్టాలని నిర్ణయించింది. క్లాస్–3 ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ కెనాల్‌ను నిర్మించాలంటే.. 1.423 కి.మీ.ల పొడవున అప్రోచ్ ఛానల్‌ను 40 మీటర్ల వెడల్పు, 2.20 ఎఫ్‌ఎస్‌డీతోనూ.. దానికి కొనసాగింపుగా 70 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల ఎత్తు గేటుతో 3 నావిగేషన్ లాక్‌లు, 40 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీ.ల పొడవున నావిగేషన్ కెనాల్.. 20 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్ఎస్డీ, 7 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టాలి. ఈ పనులకు రూ.876.38 కోట్ల వ్యయమవుతుంది. ఉలుకూపలుకు లేని ఐడబ్ల్యూఏఐ.. నిధులిస్తే పనులు చేపడతామని ఐడబ్ల్యూఏఐకి అనేకసార్లు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ప్రతిపాదించారు. ఈ వ్యయాన్ని ఐడబ్ల్యూఏఐ భరించాలని సీడబ్ల్యూసీ, కేంద్ర జల్ శక్తి శాఖలు కూడా స్పష్టం చేశాయి. ఐడబ్ల్యూఏఐ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర నౌకాయాన శాఖ, సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించి.. నిధులు మంజూరు చేయాలని ఐడబ్ల్యూఏఐకి తేల్చిచెప్పారు. అయినా కూడా ప్రతి సమావేశంలోనూ జాతీయ ప్రమాణాల మేరకు పోలవరం నావిగేషన్ కెనాల్ పనులు చేయాలని ఐడబ్ల్యూఏఐ ఉన్నతాధికారులు నిర్దేశిస్తారేగానీ.. నిధులిచ్చే అంశాన్ని మాత్రం ఎటూ తేల్చడం లేదు. -
నీటి దోపిడీ కోసమే పాలమూరు–రంగారెడ్డి
సాక్షి, అమరావతి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో అనుమతి ఇచ్చిన దానికంటే తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున పనులు చేసిందని సుప్రీం కోర్టుకు కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు నివేదించాయి. తాగునీటి అవసరాల పేరుతో భారీ ఎత్తున సాగునీటి అవసరాలకు నీటిని తరలించేలా తెలంగాణ ప్రభుత్వం పనులు పూర్తి చేసిందని స్పష్టం చేశాయి. 7.15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు తరలించేలా పనులు చేపట్టడానికి అనుమతి ఇస్తే.. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థ, 65.17 టీఎంసీలను నిల్వ చేసేలా 5 రిజర్వాయర్లను తెలంగాణ పూర్తి చేసిందని తేల్చిచెప్పాయి. ఇప్పటివరకూ పూర్తయిన పనులను పరిశీలిస్తే.. తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున కృష్ణా జలాలను తరలించేలా చేపట్టిందని పేర్కొన్నాయి. ఆ ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు లేని నేపథ్యంలో దాని డీపీఆర్‌ను మదింపు చేయలేమని తెలంగాణ సర్కార్‌కు తేల్చిచెప్పామని గుర్తు చేశాయి. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఈ నెల 2న కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు సంయుక్తంగా అఫిడవిట్ దాఖలు చేశాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై ఈ నెల 4న జరగాల్సిన విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్‌కు వాయిదా వేసింది. అఫిడవిట్లో ఏం చెప్పాయంటే.. కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను రూ.55,086.57 కోట్లతో తెలంగాణ సర్కార్ చేపట్టింది. ఇందులో నీటిపారుదల వ్యయం రూ.50,508.88 కోట్లు, తాగునీటి విభాగం వ్యయం రూ.4,577.69 కోట్లు. ఈ ఎత్తిపోతల కింద అంజనగిరి (8.51 టీఎంసీలు), వీరాంజనేయ (6.55 టీఎంసీలు), వెంకటాద్రి (16.74 టీఎంసీలు), కరుమూర్తిరాయ (17.34 టీఎంసీలు), ఉద్దండాపూర్ (16.03 టీఎంసీలు), కేపీ లక్ష్మిదేవిపల్లి (2.80 టీఎంసీల) రిజర్వాయర్లను చేపట్టింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు.. ఆ జిల్లాల్లో తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ఎత్తిపోతల కింద తరలించే 120 టీఎంసీల్లో తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 7.15 టీఎంసీలు. ఇప్పటికే 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కరుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను.. 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థను పూర్తి చేసింది. ఆరో రిజర్వాయర్ కేపీ లక్ష్మిదేవిపల్లి వద్ద ఇప్పటిదాకా చేపట్టలేదు. పూర్తయిన 5 రిజర్వాయర్ల కింద తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 3.40 టీఎంసీలే. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలకు, చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలను జతచేసి.. 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టామని తెలంగాణ సర్కార్ డీపీఆర్‌ను సమర్పించింది. కానీ.. ఈ ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదు. నీటి కేటాయింపులపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను మదింపు చేయలేమని తెలంగాణ సర్కార్‌కు వెనక్కి పంపాం. నేపథ్యం ఇదీ.. చంద్రమౌళీశ్వరరెడ్డి అనే రైతు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలిపేయాలని 2021 అక్టోబర్ 29న ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించిన తెలంగాణ సర్కార్‌పై 2022 డిసెంబర్ 22న ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ.. ఆ రెండు ఎత్తిపోతల పథకాల వ్యయంపై 1.50 శాతం చొప్పున రూ.620.85 కోట్లను తెలంగాణ సర్కార్‌కు జరిమానా విధించింది. తెలంగాణ ఉద్దేశపుర్వకంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నందున రూ.300 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మొత్తం రూ.920.85 కోట్లు మూడు నెలల్లోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద డిపాజిట్ చేయాలని నిర్దేశించింది. దీనిపై తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ.. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు అనుమతిస్తూ 2023 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
కోతకు గురైన ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్
సాక్షి, అమరావతి: గోదావరి వరదల ఉద్ధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో ఇరువైపులా కోతకు గురైన ప్రాంతంలో దెబ్బతిన్న చోట సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని జలవనరుల శాఖకు డీడీఆర్పీ సూచించింది. కోతకు గురికాని ప్రాంతంలో రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడంపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. జలవనరుల శాఖ అధికారులతో భేటీ గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో ఏర్పడిన భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ (బోరు బావి తవ్వి వైబ్రో కాంపాక్షన్ యంత్రంతో అధిక ఒత్తిడితో భూగర్భాన్ని మెలి తిప్పడం ద్వారా పటిష్టం చేయడం) ద్వారా యథాస్థితికి తేవచ్చంటూ ఏడు నెలల క్రితం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు డీడీఆర్పీ తాజాగా ఆమోదం తెలిపింది. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులను గోదావరికి వరద వచ్చేలోగా పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన సమస్యలకు డీడీఆర్పీ పరిష్కార మార్గాలు చూపడంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. పోలవరం పనులను ఏబీ పాండ్య నేతృత్వంలోని డీడీఆర్పీ బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ క్రమంలో ఆదివారం రాజమహేంద్రవరంలో సీడబ్ల్యూసీ సభ్యులు ఎస్కే సిబాల్, పీపీఏ సీఈవో శివ్‌నందన్‌కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించింది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలు నిర్వహించిన ఎన్‌హెచ్‌పీసీ బృందం సమర్పించిన నివేదికను తాజా సమావేశంలో డీడీఆర్పీ ప్రవేశపెట్టింది. సరిదిద్దే మార్గం ఇలా.. ♦ కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ గ్యాప్–2లో ఎడమ వైపున 175 నుంచి 363 మీటర్ల పొడవున అంటే 188 మీటర్ల పొడవు.. కుడి వైపున 1,170 నుంచి 1,370 మీటర్ల పొడవున అంటే 200 మీటర్ల పొడవున పూర్తిగా దెబ్బతిందని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. ఈ ప్రాంతంలో ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని డీడీఆర్పీ ఆదేశించింది. ♦డయాఫ్రమ్ వాల్లో 480 – 510 మీటర్ల మధ్య 30 మీటర్ల పొడవున ఒక చోట, 950 – 1,020 మీటర్ల మధ్య 70 మీటర్ల పొడవున మరోచోట 20 మీటర్ల లోతు వరకూ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు ఎన్‌హెచ్‌పీసీ తేల్చింది. ఈ రెండు ప్రాంతాల్లో డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడంపై మరింత అధ్యయనం చేసి సీడబ్ల్యూసీ సూచనల మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డీడీఆర్పీ సూచించింది. ♦మిగతా ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్‌కు రెండు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి (కోర్) నింపి దానిపై ప్రధాన డ్యామ్‌ను నిర్మించేలా సీడబ్ల్యూసీ గతంలో డిజైన్‌ను ఆమోదించింది. అయితే డయాఫ్రమ్ వాల్‌కు ఐదు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి నింపి దానిపై ప్రధాన డ్యామ్‌ను నిర్మించాలని డీడీఆర్పీ సూచించింది. దీనివల్ల ఊట నీటిని డయాఫ్రమ్ వాల్ సమర్థంగా అడ్డుకుంటుందని తేల్చింది. రూ.రెండు వేల కోట్లకు పైగా వ్యయం.. గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడం, కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు సుమారు రూ.రెండు వేల కోట్లు వ్యయం అవుతుందని అధికారవర్గాలు అంచనా వేశాయి. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకే 48 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో అదనంగా వ్యయమయ్యే రూ.రెండు వేల కోట్లను మంజూరు చేసేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ చేసిన విజ్ఞప్తిపై డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అధికారుల ప్రతిపాదనకే మొగ్గు.. గోదావరి వరద ఉద్ధృతి ప్రభావం వల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భం కోతకు గురైంది. గ్యాప్–1 నిర్మాణ ప్రాంతంలో 35 మీటర్ల లోతుతో, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. కోతకు గురైన ప్రాంతంతోపాటు భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా యథాస్థితికి తెచ్చే విధానాన్ని ఏడు నెలల క్రితమే జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదించగా అప్పట్లో డీడీఆర్పీ తోసిపుచ్చింది. దీంతో కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులు చేపడుతూనే అగాధాలను పూడ్చేందుకు డీడీఆర్పీ సూచించిన మేరకు 11 రకాల పరీక్షలను నిర్వహించారు. ఆ ఫలితాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. వీటితో సంతృప్తి చెందిన డీడీఆర్పీ ఏడు నెలల క్రితం రాష్ట్ర అధికారులు ప్రతిపాదించిన విధానం ప్రకారమే అగాధాలను పూడ్చి యథాస్థితికి తేవాలని ఆదేశించింది. ఈ పనులను గోదావరికి వరదలు వచ్చేలోగా పూర్తి చేయాలని సూచించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టడం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. -
‘పాలమూరు’ అవసరమని ప్రధానే అన్నారు
సాక్షి, హైదరాబాద్: కరువుపీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను 2014లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ స్వయంగా ప్రస్తావించారని, అందువల్ల ఈ ప్రాజెక్టుకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టుకు అనుమతులపై సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్ (పీపీవో) చీఫ్ ఇంజనీర్‌కు బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ప్రధాని నాడు చేసిన ప్రసంగాన్ని సైతం ప్రదర్శించింది. ఉమ్మడి ఏపీలో 2013 ఆగస్టు 8న ప్రాజెక్టు సమగ్ర సర్వే కోసం రూ. 6.91 కోట్లను విడుదల చేస్తూ జీవో నంబర్ 72 జారీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది. 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించింది. శ్రీశైలం జలాశయంలో అన్ని అవసరాలు పోనూ మిగిలిన 230 టీఎంసీల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులైన పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీలు, శ్రీశైలం ఎడమగట్టు కాల్వకు 40 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 40 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల పథకానికి 30 టీఎంసీల నీటి లభ్యత ఉందని రాష్ట్రం స్పష్టం చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ సి.మురళీధర్, పాలమూరు–రంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ హమీద్ ఖాన్ హాజరయ్యారు. శ్రీశైలంలో 582.5 టీఎంసీల లభ్యత.. 75 శాతం డిపెండబులిటీ (వందేళ్లలో కచ్చితంగా వచ్చిన 75 ఏళ్ల వరద) ఆధారంగా శ్రీశైలం జలాశయంలో 582.5 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఇందులో నాగార్జునసాగర్ అవసరాలకు 280 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 16.5 టీఎంసీలు, చెన్నై నగర తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, 22 టీఎంసీల ఆవిరి నష్టా లు కలుపుకుని మొత్తం 352.50 టీఎంసీలు అవసరమని, మిగిలిన 230 టీఎంసీల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టు అయిన పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీలు అవసరమని తెలంగాణ తెలిపింది. మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలతోపాటు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలు వాడుకోవాలని 1978 ఆగస్టు 4న బచావత్ ట్రిబ్యునల్ ముందు ఒప్పందం జరిగిన విషయాన్ని తెలంగాణ గుర్తుచేసింది. ఈ ఒప్పందం ప్రకారం 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటకలు వాడుకోగా మిగిలిన 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డికి కేటాయించామని తెలిపింది. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ అవసరాలకు 90.81 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందని, 2012– 13 నుంచి 2021–22 మధ్య 45.15 టీఎంసీలను మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసినట్లు తెలియజేసింది. ఇలా పొదుపు చేసిన 45 టీఎంసీలతోపాటు పోలవరం ద్వారా గోదావరి జలాల తరలింపుతో లభించనున్న 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించినట్టు వివరించింది. రూ. 55 వేల కోట్లకు పెరిగిన వ్యయం.. తొలిదశలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు, హైదరాబాద్ నగరంతోపాటు 1,226 గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం పనులు చేపట్టేందుకు గతంలో ఎన్జీటీ సైతం అనుమతిచ్చిందని తెలంగాణ తెలిపింది. గత ఆగస్టు 24న రెండోదశ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించింది. 2015లో రూ. 35,200 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా ప్రస్తుతం రూ. 55,086 కోట్లకు పెరిగిందని తెలిపింది. -
సమస్యల పరిష్కారంపై కదిలిన కేంద్రం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి ఆమోదంతోపాటు విభజన సమస్యలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాల పరిష్కారానికి కేంద్రం కదిలింది. ఈ సమస్యలపై చర్చించి, పరిష్కారాలను సూచించడానికి ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమంచింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రధాని చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే పలు ప్రాజెక్టులు, విభజన సమస్యలు, అపరిష్కృత అంశాల పరిష్కారమే అజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 3న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడంతోపాటు ప్రధానికి సీఎం జగన్ వినతిపత్రం అందజేశారు. ఇదే అంశాలపై ఈనెల 5న ప్రధానికి సీఎం లేఖ రాశారు. తనతో జరిగిన సమావేశంలో, లేఖలో సీఎం జగన్ లేవనెత్తిన అంశాలను అధ్యయనం చేసి, పరిష్కారానికి నివేదిక ఇవ్వాలని ప్రధాని కార్యాలయం (పీఎంవో) అధికారులను ప్రధాని ఆదేశించారు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి (వ్యయ విభాగం) అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేస్తూ పీఎంవో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పీఎంవో డిప్యూటీ సెక్రటరీ కట్టా ఆమ్రపాలి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి, ఆహార, పౌర సరఫరాల శాఖ కార్యదర్శిలను కమిటీలో సభ్యులుగా నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారుల బృందంతో ఈ కమిటీ చర్చిస్తుంది. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీకి నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రధాని చర్యలు తీసుకుంటారని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. ప్రధానితో జరిపిన చర్చల్లో సీఎం జగన్ లేవనెత్తిన ప్రధానాంశాలు.. 1. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించాలి. ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నీటి పారుదల విభాగం కింద నిధులివ్వాలి. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,100 కోట్లను మంజూరు చేయాలి. 2. రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 45 శాతం ఆదాయం (రెవెన్యూ) మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా.. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,979లు మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇవే నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చే లక్ష్యంతో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీతోపాటు పలు హామీలిచ్చారు. వాటిని అమలు చేయాలి. 3. 2014 జూన్ నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతి తీసుకొచ్చి రెవెన్యూ లోటును రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులు, ఇతర బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రాన్ని ఆదుకోవాలి. 4. విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసింది. ఇందుకు ఏపీకి రూ.6,284 కోట్లను తెలంగాణ చెల్లించాలి. ఏపీ విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆ బిల్లులను తెలంగాణ చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలి. 5. జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఏపీలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా రేషన్ అందిస్తోంది. దీనివల్ల భారం పడుతోంది. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన జరిపి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలి. 6. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందే వెసులుబాటు కల్పించాలి. 7. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చిన సైట్ క్లియరెన్స్‌ను రెన్యువల్ చేయాలి. 8. వైఎస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మెకాన్ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు గనులను వేగంగా కేటాయిస్తే.. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతుంది. -
అప్పర్ భద్రకు అనుమతులు సరికాదు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) హైడ్రలాజికల్ క్లియరెన్స్ ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే ఈ అనుమతులను పునఃసమీక్షించి.. ప్రాజెక్టు పనులు చేపట్టకుండా కర్ణాటకను ఆదేశించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే సిన్హాను రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలు డిమాండ్ చేశారు. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు అప్పర్ భద్రపై ఏపీ, కర్ణాటక జలవనరుల శాఖ అధికారులతో ఆర్కే సిన్హా మంగళవారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. కేటాయించిన నీటిని వాడుకోవడానికే అప్పర్ భద్ర చేపట్టామని కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి ఎన్.లక్ష్మణ్‌రావు పీష్వా పేర్కొనడంపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1.. అప్పర్ భద్రకు ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు ఇప్పటిదాకా అమల్లోకి రాలేదన్నారు. ప్రాజెక్టుల ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఎక్కడా తగ్గలేదని కేడబ్ల్యూడీటీ–2 తేల్చిచెప్పినా.. దానికి భిన్నంగా మిగులు ఉందంటూ.. వాటిని వాడుకోవడానికే అప్పర్ భద్ర చేపట్టామని కర్ణాటక పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో కృష్ణా బేసిన్ ఆయకట్టుకు తీవ్ర నీటి ఎద్దడి అప్పర్ తుంగ ప్రాజెక్టు నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి.. భద్ర ప్రాజెక్టు నుంచి 29.90 టీఎంసీలను తరలించేలా కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు చేపట్టిందని ఏపీ అధికారులు వివరించారు. నీటిని తరలించే క్రమంలో కర్ణాటకలోని వాణివిలాసాగర్, ఏపీలోని భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) మధ్య వేదవతిపై రిజర్వాయర్‌ను నిర్మిస్తోందన్నారు. ఈ రిజర్వాయర్‌ను నిర్మించకూడదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్ కింద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల ఆయకట్టుతోపాటూ కేసీ కెనాల్ కింద ఏపీ, ఆర్డీఎస్ కింద ఏపీ, తెలంగాణల్లోని ఆయకట్టుకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంలో జాప్యం చోటు చేసుకుంటుందన్నారు. ఇది ఆ ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు ఇబ్బందులను సృష్టిస్తుందన్నారు. దీనిపై ఆర్కే సిన్హా స్పందిస్తూ.. ప్రాజెక్టుపై అభ్యంతరాలను కర్ణాటక సర్కార్‌కు పంపాలని సూచించారు. వాటిపై కర్ణాటక సర్కార్ వివరణ ఇచ్చిన తర్వాత మరోసారి 2 రాష్ట్రాల అధికారులతో సమావేశమై.. అప్పర్ భద్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకున్నా.. అప్పర్ భద్రకు 36 టీఎంసీలు కేటాయించాలని కర్ణాటక చేసిన ప్రతిపాదనను.. నీటి లభ్యత లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చిందని గుర్తు చేశారు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకున్నా సరే.. అప్పర్ భద్ర ద్వారా 29.90 టీఎంసీలను వినియోగించుకుని 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా కర్ణాటక చేపట్టిన ఈ ప్రాజెక్టుకు గతేడాది డిసెంబర్ 24న సీడబ్ల్యూసీ టీఏసీ అనుమతి ఇచ్చిందని ఎత్తిచూపారు. దీనికి ఈ ఏడాది మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చిందన్నారు. కేడబ్ల్యూడీటీ–1, కేడబ్ల్యూడీటీ–2లు అప్పర్ భద్రకు 10 టీఎంసీలు కేటాయించనే లేదన్నారు. తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర ఛానల్స్ ఆధునికీకరణ వల్ల 6.25, కృష్ణా డెల్టాకు పోలవరం ద్వారా మళ్లించిన జలాల్లో వాటాగా దక్కిన నీటిలో 2, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాల రూపంలో 6 టీఎంసీల లభ్యత ఉందని.. ప్రవాహ, ఆవిరి నష్టాలుపోనూ మిగిలిన నీటిని అప్పర్ భద్ర ద్వారా వాడుకుంటామని కర్ణాటక పేర్కొందన్నారు. కానీ.. వాటి ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని.. అదనపు మిగులు జలాలు లేవని కేడబ్ల్యూడీటీ–2 ఎత్తిచూపిన అంశాన్ని గుర్తు చేశారు. -
రామోజీ మార్కు ‘వైఫల్యం’
కావాల్సిన బాబు అధికారంలో ఉంటే మానవ తప్పిదాన్ని ప్రకృతి విపత్తుగా చిత్రీకరిస్తారు. వేరొకరు అధికారంలో ఉంటే ప్రకృతి విపత్తునూ మానవ తప్పిదంగా వక్రీకరిస్తారు. ఇదీ రామోజీ మార్కు జర్నలిజం. ‘ఈనాడు’ రాతల్లో నీతి. 2003 అక్టోబర్ 30. అప్పటికి రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 20వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ప్రాజెక్టు నిండిపోయింది. గేట్లు ఎత్తితే నీరు దిగువకు వెళ్లేది. గేట్లు ఎత్తడానికి జనరేటర్ ఆన్ చేయబోతే... దాన్లో డీజిల్ లేదు. ఫలితం... సకాలంలో ఎత్తకపోవడంతో గేట్లు కొట్టుకుపోయాయి. అపార నష్టం వాటిల్లింది. జనరేటర్‌ను చెక్ చేసుకోకపోవటం మానవ తప్పిదం. నాటి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం. కానీ దాన్ని ‘ఈనాడు’ ప్రకృతి విపత్తుగానే రాసింది. 2021 నవంబరు 19. అప్పటికి మూడు రోజులుగా నల్లమల అటవీ ప్రాంతంతో పాటు చెయ్యేరు, బహుదా, పింఛా, మాండవ్య పరివాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. గత 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఈ స్థాయి కుంభవృష్టిని వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేదు. ఏ నది నుంచి ఎంత ప్రవాహం వస్తుందో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) కూడా అంచనా వేయలేదు. సామర్థ్యానికి మించి వరద ముంచెత్తడంతో పింఛా ప్రాజెక్టు రింగ్‌బండ్ తెగింది. ఆ వరదకు బహుదా, చెయ్యేరు, మాండవ్య ప్రవాహాలు తోడయ్యాయి. ఏకంగా 3.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం అన్నమయ్య ప్రాజెక్టులోకి దూసుకొచ్చింది. సామర్థ్యానికన్నా ఒకటిన్నర రెట్లు అధిక వరద కావడంతో... స్పిల్ వే నుంచి వరదను దిగువకు విడుదల చేసే అవకాశంలేదు. ఫలితం... కట్టపై నుంచి వరద పారింది. మట్టికట్ట తెగింది. ప్రకృతి విపత్తు వల్లే ఇది జరిగినట్లు ప్రాజెక్టును చూసిన కేంద్ర బృందం నివేదించింది. సాగునీటి నిపుణులు, జలవనరుల శాఖ అధికారులూ అదే చెబుతున్నారు. ‘ఈనాడు’ మాత్రం అనూహ్యంగా వరద వచ్చిదంటూనే ఇదంతా సర్కార్ వైఫల్యమంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం మొదలెట్టింది. ఈ రోతరాతల్లో నిజానిజాలేంటి? ఏది నిజం?. – సాక్షి, అమరావతి ఏది నిజం? చరిత్రలోనే గరిష్ఠ వరద.. తెగిన పింఛా మట్టికట్ట..: వైఎస్సార్ కడప జిల్లా టి.సుండుపల్లె మండలం ముదుంపాడు వద్ద 0.32 టీఎంసీల సామర్థ్యంతో పింఛా నదిపై పింఛా ప్రాజెక్టును నిర్మించారు. దాన్లోకి గరిష్ఠంగా 58 వేల క్యూసెక్కులకు మించి వరద వచ్చే అవకాశం లేదనే అంచనాతో స్పిల్ వే నిర్మించారు. కానీ గతనెల్లో ఏకంగా 1.30 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. స్పిల్ వే సామర్థ్యం కంటే 72 వేల క్యూసెక్కుల వరద అదనం. దాంతో 18న అర్ధరాత్రి రింగ్ బండ్ (మట్టికట్ట) తెగింది. ఆ వరద మొత్తం అన్నమయ్య ప్రాజెక్టు వైపు ఉరికింది. అన్నమయ్యకు... అంచనాలకు అందని వరద... వైఎస్సార్ జిల్లాలో రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద 2.24 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును 1981లో ప్రారంభించి.. 2001కి పూర్తి చేశారు. దీన్లోకి 100 ఏళ్లకు ఓసారి గరిష్ఠంగా 2.40 లక్షల క్యూసెక్కులు.. 200 ఏళ్లకోసారి గరిష్ఠంగా 2.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనేది అధికారుల అంచనా. 2.85 లక్షల క్యూసెక్కుల వరదొచ్చినా దిగువకు విడుదల చేసేలా 94 మీటర్ల పొడవుతో స్పిల్ వేను నిర్మించారు. దీనికి 13.75 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల వెడల్పుతో 5 గేట్లు అమర్చారు. 2012లో జల వనరుల శాఖ 3–డీ అధ్యయనంలో స్పిల్‌వే నుంచి గరిష్ఠంగా 2.17 లక్షల క్యూసెక్కులే దిగువకు విడుదల చేయొచ్చునని తేలింది. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యామ్ సేఫ్టీ కమిటీ.. 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్ వే నిర్మించాలని సర్కార్‌కు నివేదిక ఇచ్చింది. కానీ.. నాటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. గత నెల 16, 17, 18–19 తేదీల్లో నల్లమల, చెయ్యేరు, బహుదా, మాండవ్య పరివాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.75 టీఎంసీలను నిల్వ చేస్తూ... వచ్చిన వరదను వచ్చినట్టుగా అధికారులు దిగువకు వదిలేశారు. 18న రాత్రి 8గంటలకు వరద 77,125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కులను వదులుతూ వచ్చారు. 18న రాత్రి పది గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తేసి.. 1,46,056 క్యూసెక్కులు దిగువకు వదిలేశారు. 19 అర్థరాత్రి 3 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కులు రావటంతో మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టికట్ట పైనుంచి దిగువకు వరద పారింది. దాంతో.. 19న ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. ఇదీ వాస్తవం. ఎగువ నుంచి వరద వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా అన్నమయ్య ప్రాజెక్టు దిగువన చెయ్యేరు పరివాహక ప్రాంతంలోని గ్రామాల నుంచి ప్రజలను అధికారులు ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు. భారీ ప్రాణనష్టం నివారించారు. కేంద్ర బృందమూ దీన్నే నిర్ధారిస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కానీ.. ఈ వాస్తవం రామోజీ మార్కు జర్నలిజానికి కన్పించటం లేదు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలే అక్కడ పతాక శీర్షికలవుతున్నాయి. తమ వాడు అధికారంలో లేడన్న అక్కసు.. తామేం చెప్పినా నమ్ముతారనే అతివిశ్వాసమే ‘ఈనాడు’ అబద్ధాలకు మూలం. కానీ తెలుగు నేలపై ఇపుడా పరిస్థితి లేదన్నది నూరుశాతం నిజం!!. -
డీపీఆర్‌లపై కదలిక
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అనుమతుల్లేకుండా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని, వాటికి కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాలని అటు కేంద్రం, ఇటు బోర్డులు చెబుతున్న నేపథ్యంలో డీపీఆర్‌లను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని నిర్ణయించింది. మూడు రోజుల కింద ఇంజనీర్లతో ç సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. డీపీఆర్‌ల తయారీపై దృష్టిపెట్టి అనుమతులు తెచ్చుకునే పనిని ఆరంభించాలని సూచించారు. దీంతో 10 ప్రధాన ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఇరిగేషన్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ప్రధాన ప్రాజెక్టులు టార్గెట్... కృష్ణా, గోదావరి నదీ బేసిన్లో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు మొదలైన నాటి నుంచే కేంద్ర జలశక్తి శాఖ ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, అనుమతుల అంశాన్ని ప్రస్తావిస్తోంది. దీనిపై పలుమార్లు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రభుత్వానికి లేఖలు రాశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు రాగా డీపీఆర్‌లు ఇచ్చేందుకు తెలంగాణ సుముఖత తెలిపింది. ఇంతవరకు సమర్పించలేదు. కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్లోనూ కాళేశ్వరం అదనపు టీఎంసీ, సీతారామ ఎత్తిపోతలు, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, రామప్ప సరç స్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు, పాల మూరు–రంగారెడ్డి, డిండి, మోడికుంటవాగు, తుమ్మిళ్ల ప్రాజెక్టులను కేంద్ర జలసంఘం అనుమతులు లేవని పేర్కొంటూ.. ప్రాజెక్టులకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఆరు నెలల్లో అనుమతులు పొందాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వీటి విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటికే పలుమార్లు ఇంజనీర్లతో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పాలమూరు–రంగారెడ్డికి సంబంధించిన పర్యావరణ అనుమతుల ప్రక్రియను మొదలు పెట్టించారు. మిగతా ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను సైతం మొదలుపెట్టేలా డీపీఆర్‌లను సిద్ధం చేయాలని, వాటిని కేంద్రానికి పంపి అనుమతులు పొందాలని సూచించారు. దీంతో ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ శుక్రవారం జలసౌధలో ప్రాజెక్టుల ఈఎన్సీలు, సీఈలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీపీఆర్‌ల తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొందుపరచాల్సిన అంశాలు, సేకరించాల్సిన వివరాలు తదితరాలపై మార్గదర్శనం చేశారు. శనివారం నుంచే డీపీఆర్‌ల తయారీ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. -
రేపటి నుంచి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాల కోసం ఏర్పాటైన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ బుధవారం తిరిగి మొదలు కానుంది. ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఘన్‌శ్యామ్ ఝాకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది పలు ప్రశ్నలు సంధించనున్నారు. గత మార్చిలో జరిగిన విచారణ సందర్భంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు, కేసీ కెనాల్‌కు సంబంధించిన పలు అంశాలపై ఏపీ తరపు సీనియర్ న్యాయవాది వెంకటరమణి ప్రశ్నలు లేవనెత్తగా తెలంగాణ తరఫు సాక్షి సమాధానమిచ్చారు. ప్రస్తుత విచారణలో ఇవే అంశాలపై క్రాస్ ఎగ్జామిన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవిభాగపు ఇంజనీర్లు సోమవారమే ఢిల్లీ వెళ్లారు. వాదనలపై తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్‌తో వారు చర్చించనున్నారు. -
సగానికి చేరిన ఎస్సారెస్పీ
సాక్షి, హైదరాబాద్: ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహాలు పెరుగుతున్నాయి. ఎగువ వర్షాలకు రాష్ట్ర పరిధిలోని పరీవాహకంలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. 92 వేల క్యూసెక్కులకుపైగా నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో నీటి నిల్వ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులో నిల్వలు 90 టీఎంసీలకుగానూ 47.70 టీఎంసీలకు చేరగా, ఈ సీజన్లోనే ప్రాజెక్టులోకి కొత్తగా 30 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 33.98 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండగా, ఈ ఏడాది మాత్రం మరో 13 టీఎంసీలు అదనంగా ఉండటం ఆయకట్టు రైతులకు పెద్ద ఊరటనిస్తోంది. గోదావరి బేసిన్లో ఇతర ప్రాజెక్టులకు చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి ప్రవాహాలు వస్తున్నా యి. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో సింగూరు, లోయర్‌మానేరు, కడెం, మిడ్‌మానేరులో ప్రవాహాలు స్ధిరంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కడెం, లోయర్‌మానేరు, మిడ్ మానేరు, ఎల్లంపల్లి నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. మరో మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో ఈ ప్రవాహాలు మరింత పుంజుకునే అవకాశాలున్నట్లు నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టే ప్రాజెక్టు ఇంజనీర్లను అప్రమత్తం చేసింది. కృష్ణా బేసిన్లో అప్రమత్తం ఇక కృష్ణా బేసిన్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కృష్ణా నది జన్మస్థలి అయిన మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో 120 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో దిగువన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌లకు భారీ వరద ప్రవాహాలు నమోదయ్యే అవకాశముంది. దీనిపై ఇప్పటికే కేంద్ర జల సంఘం పరీవాహక రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో భారీగా ప్రవాహాలు వచ్చే దృష్ట్యా ప్రాజెక్టుల నిల్వలపై దృష్టి పెట్టాలని, డ్యామ్‌ల్లో నీటి నిల్వలు నిండుగా ఉంచకుండా కొంత ఖాళీగా ఉంచేలా నిర్వహణ చేపట్టాలని సూచించింది. దీంతో ఆల్మట్టిలో 129 టీఎంసీలకుగానూ 93.83 టీఎంసీల నిల్వలు ఉంచి ప్రస్తుతం వస్తున్న 10 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌కి 12 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ఆ నీటిని దిగువకు వదులుతున్నారు ఈ నీరంతా జూరాలకు చేరనుంది. ప్రస్తుతం జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు కేవలం వందల క్యూసెక్కుల్లో మాత్రమే నీటి ప్రవాహాలు వస్తున్నాయి. -
ఇదేం లెక్క.. కృష్ణా?
సాక్షి, అమరావతి: కృష్ణా పరీవాహక ప్రాంతం (బేసిన్)లో సరాసరి నీటి లభ్యత 3,144.42 టీఎంసీలని తాజాగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 2,522.52 టీఎంసీలని లెక్కగట్టింది. అయితే కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేయగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2,173 టీఎంసీల లభ్యత ఉంటుందని వెల్లడించింది. సీడబ్ల్యూసీ 1993లో తొలిసారి నిర్వహించిన అధ్యయనంలో కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,069.08 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కగట్టింది. బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్లు, సీడబ్ల్యూసీ తొలిసారి జరిపిన అధ్యయనాల్లో తేల్చిన దానికంటే కృష్ణాలో సుమారు 20 శాతం నీటి లభ్యత అధికంగా ఉన్నట్లు తాజాగా సీడబ్ల్యూసీ తేల్చడం గమనార్హం. కృష్ణాలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోవడంతో ట్రిబ్యునళ్ల అంచనాల మేరకు కూడా నీళ్లు రావడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ సంస్థలు, ట్రిబ్యునళ్లు తేల్చిన దానికంటే అధికంగా నీటి లభ్యత ఉన్నట్లు తాజాగా సీడబ్ల్యూసీ వెల్లడించడంపై అపార అనుభవం కలిగిన ఇంజనీర్లు, అంతరాష్ట్ర జలవనరుల విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారు లు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతను లెక్కించడం అశాస్త్రీయమని, వీటిని కచ్చితమైన లెక్కలుగా పరిగణించలేమని స్పష్టం చేస్తున్నారు. బేసిన్లో కనీసం 50 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుని నీటి లభ్యత లెక్కించడం శాస్త్రీయమని, బచావత్ ట్రిబ్యునల్, 1993లో సీడబ్ల్యూసీ ఇదే రీతిలో అధ్యయనం చేశాయని గుర్తు చేస్తున్నారు. వర్షపాతం పెరగడం వల్లే..!! దేశవ్యాప్తంగా 1985 నుంచి 2015 మధ్య వరద ప్రవాహాల ఆధారంగా నదుల్లో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఇటీవల హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీతో కలిసి అధ్యయనం చేసింది. కృష్ణా బేసిన్లో వర్షపాతం, వరద ప్రవాహం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఆవిరి, ఆయకట్టు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నీటి లభ్యత లెక్కగట్టింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ప్రధానాంశాలు ఇవీ.. ► 1955–84 మధ్య కృష్ణా బేసిన్లో సగటు వర్షపాతం 842 మిల్లీమీటర్లు. 1965–84 మధ్య కాలంలో సగటు వర్షపాతం 797 మిల్లీమీటర్లకు తగ్గింది. 1985–2015 మధ్య బేసిన్లో సగటు వర్షపాతం 841 మిల్లీమీటర్లకు పెరిగింది. ► 2010–11లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో 9,607.85 టీఎంసీలు వచ్చాయి. ఇందులో నదిలో 4,164.81 టీఎంసీల లభ్యత వచ్చింది. 2002–03లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడంతో 5,457.16 టీఎంసీలే వచ్చాయి. ఇందులో నదిలో 1,934.63 టీఎంసీల లభ్యత వచ్చింది. ► 1985–2015 మధ్య కాలంలో సగటు వర్షపాతం 841 మిల్లీమీటర్ల వల్ల ఏడాదికి 226 బిలియన్ క్యూబిక్ మీటర్లు (7,980.96 టీఎంసీలు) వచ్చాయి. ఇందులో కృష్ణా నదిలో సరాసరి సగటున 3,144.42 టీఎంసీల లభ్యత ఉంటుంది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 2,522.52 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. ► గతంతో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం పెరగడం వల్లే కృష్ణాలో నీటి లభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. 8,070 చ.కి.మీ. పెరిగిన బేసిన్ విస్తీర్ణం.. ► మహారాష్ట్రలోని సతారా జిల్లా మహాబలేశ్వర్కు సమీపంలో పశ్చిమ కనుమల్లో సముద్ర మట్టానికి 1,337 మీటర్ల ఎత్తున జోర్ గ్రామం వద్ద పురుడు పోసుకునే కృష్ణమ్మ 1,400 కి.మీ. ప్రయాణించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణాకు మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర, బీమా, వేదవతి, మూసీ తదితర 12 ఉపనదులున్నాయి. ► కృష్ణా పరీవాహక ప్రాంతం 2,59,439 చదరపు కిలోమీటర్లలో విస్తరించిందని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 7.9 శాతానికి సమానం. 1993లో సీడబ్ల్యూసీ అధ్య యనం జరిపినప్పుడు కృష్ణా బేసిన్ 2,51,369 చదరపు కిలోమీటర్లలో ఉంది. తాజాగా జియో స్పేషియల్ డేటా ఆధారంగా సర్వే చేయడం వల్ల బేసిన్ విస్తీర్ణం 8,070 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. ► 1985–86లో కృష్ణా బేసిన్లో 70,72,365 హెక్టార్ల ఆయకట్టు ఉండగా 2014–15 నాటికి 81,69,157 హెక్టార్లకు పెరిగింది. ► బేసిన్లో ఏటా 72.39 టీఎంసీలు ఆవిరవు తాయి. ఇందులో గరిష్టంగా శ్రీశైలం, నాగార్జున సాగర్‌లోనే ఎక్కువగా ఆవిరవుతాయి. పదేళ్లలో ఏడేళ్లు తీవ్ర నీటి కొరత.. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రపదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. అయితే గత పదేళ్లలో ఏడేళ్లు ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు జలాలు రాలేదు. శ్రీశైలం జలాశయానికి 2011–12లో 733.935, 2012–13లో 197.528, 2014–15లో 614.07 టీఎంసీలు వస్తే 2015–16లో కేవలం 58.692 టీఎంసీలే వచ్చాయి. 2016–17లో శ్రీశైలం జలాశయానికి 337.95 టీఎంసీలు రాగా 2017–18లో 423.93, 2018–19లో 541.31 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. అంటే 2011–12 నుంచి 2020–21 వరకూ గత పదేళ్లలో ఏడేళ్లు తెలుగు రాష్ట్రాలు తీవ్ర నీటి కొరత ఎదుర్కొన్నట్లు స్పష్ట మవుతోంది. బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యున ల్లు కేటాయించిన మేరకు కూడా కృష్ణా జలాలు రాష్ట్రాన్ని చేరలేదు. వీటిని పరిగణలోకి తీసుకుంటే సీడబ్ల్యూసీ తాజాగా చేసిన అధ్యయనం శాస్త్రీయం కాదని నీటిపారుదల నిపుణులు చేస్తున్న వాదన వంద శాతం వాస్తవమని స్పష్టమవుతోంది. -
పోలవరం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తరహాలోనే.. పోలవరం ప్రాజెక్టుకూ నీటిపారుదల విభాగం పనులకు నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలపరుస్తూ జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు ఎస్కే హల్దార్ మంగళవారం నివేదిక ఇచ్చారు. యూపీ సింగ్ అధ్యక్షతన పనిచేసే సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కమిటీకి కూడా యూపీ సింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం ఇక లాంఛనమే. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ఫైలును కేంద్ర ఆర్థిక శాఖ యథాత«థంగా ఆమోదించి కేంద్ర కేబినెట్‌కు పంపుతుంది. విభజన చట్టం ప్రకారం ఆ ఫైలును కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. దాంతో.. 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి. కానీ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని పదేపదే కోరుతూ వచ్చారు. ఇందుకోసం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను సైతం తాకట్టు పెట్టారు. ఈ నేపథ్యంలో 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆ మరుసటి రోజే 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టు నీటిపారుదల విభాగంలో మిగిలిన పనికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామనే మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తూ అదే నెల 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ ప్యాకేజీకి ఆమోద ముద్ర వేసింది. అన్యాయంపై నోరుమెదపని వైనం పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేస్తామని.. డిజైన్ మారినా, ధరలు పెరిగి అంచనా వ్యయం పెరిగినా, భూసేకరణ వ్యయం పెరిగినా ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తేల్చిచెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు 2010–11 ధరల ప్రకారం మొదటిసారి సవరించిన అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లకు 2017 మే 8న కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్‌ను ఇచ్చినప్పుడు కూడా 2014 ఏప్రిల్ 1కి ముందు నీటిపారుదల విభాగానికి చేసిన ఖర్చుపోనూ, ఆ రోజు ధరల మేరకు మిగిలిన మొత్తాన్ని మాత్రమే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అప్పట్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలు కేంద్ర కేబినెట్లో సభ్యులుగా ఉన్నారు. అయినా ఈ అన్యాయంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదప లేదు. 2013–14 ధరలతో నిధుల విడుదలకు ప్రధానికి లేఖ పైగా 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించి నిధులు విడుదల చేయాలని కోరుతూ 2018 జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇదే అంశాలను ఎత్తిచూపుతూ 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదించాలని.. అప్పుడే రూ.2,234.28 కోట్లను రీయింబర్స్ చేస్తామని తేల్చిచెబుతూ 2020 అక్టోబర్ 12న కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. దాన్ని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి పంపిన కేంద్ర జల్ శక్తి శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవాలని కోరింది. 2017–18 ధరల ప్రకారమే ఇవ్వాలన్న జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌లను హుటాహుటిన ఢిల్లీకి పంపారు. కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్‌లతో వారిద్దరూ సమావేశమై 2017–18 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్రం ఆమోదించిన భూసేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాస (ఆర్ఆర్) ప్యాకేజీ వ్యయం రూ.28,191.03 కోట్లకు పెరిగిందని.. ఈ నేపథ్యంలో 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాధ్యం కాదని.. 2017–18 ధరల ప్రకారమే నిధులను విడుదల చేసి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ అక్టోబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లోపాలను లేఖలో ఎత్తిచూపారు. బేషరతుగా రూ.2,234.28 కోట్లు సీఎం లేఖపై ప్రధాని మోదీ స్పందించారు. కేంద్ర ఆర్థిక శాఖకు మార్గనిర్దేశనం చేశారు. దాంతో రూ.2,234.28 కోట్లను పోలవరానికి బేషరతుగా విడుదల చేస్తూ నవంబర్ 2న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. అదే రోజున సమావేశమైన పీపీఏ సర్వసభ్య సమావేశం కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని తేల్చిచెబుతూ కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక పంపింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో సమావేశమైన ప్రతిసారి పోలవరానికి 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చి.. శరవేగంగా పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. రూ.2,234.28 కోట్లను ఇప్పటికే రీయింబర్స్ చేసింది. ఫలించిన సీఎం వైఎస్ జగన్ కృషి పోలవరానికి 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేయాలన్న పీపీఏ సిఫారసుపై కేంద్ర జల్ శక్తి శాఖ సీడబ్ల్యూసీ అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే ఎస్కే హల్దార్ మంగళవారం నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు పనుల్లో నీటిపారుదల, నీటి సరఫరా వేర్వేరు కాదని.. రెండు ఒకటేనని పునరుద్ఘాటించారు. నీటిపారుదల విభాగం కిందకు జలాశయం(హెడ్‌వర్క్స్),భూసేకరణ, ఆర్అండ్ఆర్ (సహాయ పునవాస ప్యాకేజీ), కాలువలు, పిల్ల కాలువలు (డిస్ట్రిబ్యూటరీలు) వస్తాయని తేల్చిచెప్పారు. సాగునీటి కాలువల ద్వారానే తాగునీరు.. పారిశ్రామిక అవసరాలకు నీరు సరఫరా చేస్తారని స్పష్టం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకూ నీటిపారుదల విభాగం కింద నిధులు ఇస్తున్నామని ఎత్తిచూపారు. పోలవరం ప్రాజెక్టుకూ అదే రీతిలో నిధులు ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే పోలవరం అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆర్సీసీ ఆమోదించిన వ్యయానికే.. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ 2019 ఫిబ్రవరి 11న ఆమోదించింది. జాతీయ ప్రాజెక్టుల అంచనా వ్యయం 25 శాతం కంటే పెరిగితే.. వాటిని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ)కి పంపి.. మదింపు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆర్సీసీకి ప్రతిపాదించారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్సీసీ పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా తేల్చి కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు నివేదిక ఇచ్చింది. ఈ అంచనా వ్యయానికే కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. -
డీపీఆర్‌లపై కదలిక..!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్ల పరిధిలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఆరంభించింది. డీపీఆర్‌ల సమర్పణకు సంబంధించి ఇరిగేషన్ శాఖ వాటిని సిద్ధం చేసే పనిలో పడింది. ఈ విషయమై ఇప్పటికే శాఖ ఈఎన్సీ సంబంధిత సీఈలకు లేఖలు రాసినట్లుగా తెలిసింది. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల డీపీఆర్‌ల అప్డేట్ వివరాలతో తమకు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరినట్లుగా ఇరిగేషన్ వర్గాలు తెలిపాయి. డీపీఆర్‌ల విషయమై అపెక్స్ కౌన్సిల్ నుంచి అధికారికంగా మినిట్స్ అందాక వీటిని సమర్పించే విషయమై తుది నిర్ణయం చేయనుంది. కృష్ణా ప్రవాహ వివరాలపై ఏపీకి లేఖ.. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల్లోకి గత 20 ఏళ్లుగా వచ్చిన ప్రవాహాలు, వినియోగం, దిగువకు విడుదల చేసిన వరద వివరాలు ఇస్తే మిగులు జలాల లెక్క తేల్చుతామని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు కార్యదర్శి హరికేష్ మీనా లేఖ రాశారు. జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తేసి.. వరద జలాలు సముద్రంలోకి కలుస్తున్న సమయంలో దిగువ ప్రాంతాలకు ముంపు ముప్పును తప్పించడానికి పులిచింతలకు ఎగువన రెండు రాష్ట్రాల్లో ఎవరు మళ్లించినా వాటిని ఆ రాష్ట్ర కోటాగా లెక్కించకూడదంటూ జనవరి 1న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ నిర్వహించిన సమావేశంలో ఏపీ సర్కార్ ప్రతిపాదించింది. దాంతో ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలసంఘం ఐఎంవో విభాగం సీఈ నేతృత్వంలో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇరు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో 1999–2000 నుంచి 2019–20 దాకా ప్రాజెక్టులోకి వచ్చిన ప్రవాహాల వివరాలు ఇస్తే సమగ్రంగా అధ్యయనం చేసి, రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న మిగులు జలాలను లెక్కలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై నివేదిక ఇస్తామని కమిటీ స్పష్టం చేసింది. -
ప్రాజెక్టుల పునరుద్ధరణకు రూ.778 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, అభివృద్ధి (డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్) రెండు, మూడో విడత అమలుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద రూ.778 కోట్ల వ్యయంతో 31 సాగునీటి ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. పథకం అమలు కోసం ప్రత్యేకంగా స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (ఎస్పీఎంయూ) ఏర్పాటు చేసి బడ్జెట్లో రూ.5 కోట్లను ఫిబ్రవరి 25న మంజూరు చేసింది. పథకం అమలును పర్యవేక్షించడానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ అధ్యక్షుడు ఏబీ పాండ్య అధ్యక్షతన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్ఆర్పీ)ని ఏర్పాటు చేసింది. 2020–21 నుంచి పథకం అమలుకు శ్రీకారం చుట్టనుంది. చేపట్టే పనులివీ.. ► ఈ పథకం కింద సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి అవసరమైన నిధుల్లో.. 70 శాతాన్ని ప్రపంచ బ్యాంకు రుణం, కేంద్ర ప్రభుత్వం వాటాగా ఇస్తాయి. మిగతా 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ► జలాశయాల స్పిల్ వే నుంచి నీరు లీకవుతుంటే.. వాటిని అరికట్టడానికి గ్రౌటింగ్ (స్పిల్ వేపై బోరు బావి తవ్వి.. అధిక పీడనంతో కాంక్రీట్ మిశ్రమాన్ని పంపడం ద్వారా స్పిల్ వే పునాదిలో ఏర్పడిన పగుళ్లను మూసివేయడం) చేస్తారు. లీకేజీలు మరీ అధికంగా ఉంటే స్పిల్ వేకు జియో మెంబ్రేన్ షీట్ అమర్చుతారు. ► స్పిల్ వే గేట్లను ఎత్తడానికి దించడానికి వీలుగా ఏర్పాటు చేసిన హాయిస్ట్‌లకు మరమ్మతులు చేస్తారు. గేట్లు పూర్తిగా పాడైతే.. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తారు. ► వాటి నిర్వహణ నిమిత్తం నిధులను సమకూర్చుకోడానికి జలాశయాల్లో చేపల పెంపకం, పర్యాటక అభివృద్ధి పనులు చేపడతారు. నిధులు రాబట్టని గత సర్కార్ ► దేశంలో సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో 2015లో కేంద్ర ప్రభుత్వం డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (డ్రిప్)ను ప్రారంభించింది. మొదటి దశలో ఏడు రాష్ట్రాల్లోని 198 ప్రాజెక్టులను రూ.3,467 కోట్లతో అభివృద్ధి చేసింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి కేంద్రం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ► ‘డ్రిప్’ రెండు, మూడు దశలను ఈ ఏడాది జూన్ నుంచి కేంద్రం అమలు చేస్తుండగా.. రాష్ట్రానికి సింహభాగం నిధులు రాబట్టి జలాశయాలను అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ► ‘డ్రిప్’ రెండో దశలో రాష్ట్రంలో 31 జలాశయాల అభివృద్ధికి రూ.778 కోట్లను మంజూరు చేయాలంటూ సీడబ్ల్యూసీకి రాష్ట్ర జల వనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. ► రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ ఆమోద ముద్ర వేసి ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. -
అదనపు టీఎంసీతో లబ్ధి ఎంత?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రస్తుతం ఉన్న 2 టీఎంసీల నీటి ఎత్తి పోతలకు అదనంగా మరో టీఎంసీ నీటి ఎత్తిపోతలకు సంబంధించి చేపడుతున్న పనులతో ఎంత కొత్త ఆయకట్టు వినియోగంలోకి వస్తుందో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని స్పష్టం చేసిన కేంద్రం, పర్యావరణ అనుమతులపై సైతం ఆరా తీయగా, తాజాగా అదనపు టీఎంసీతో చేకూరే ప్రయోజనాలపై వివరణ కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం రాష్ట్రానికి లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2015లో సమర్పించిన వ్యయ అంచనాల మేరకు టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపిందని లేఖలో ప్రస్తావిస్తూ, ప్రస్తుత అంచనా వ్యయాలు ఎంతో చెప్పాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. 98 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున 195 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు మాత్రమే టీఏసీ అనుమతిచ్చిందని గుర్తుచేసింది. అయితే అదనంగా రోజుకు మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రతిపాదన ఏదైనా సిద్ధం చేశారా? అలాంటి ప్రతిపాదన ఉంటే.. ఆ వివరాలను తమకు తెలపాలని కేంద్రం ఆదేశించింది. ఇక అదనపు టీఎంసీ పనులపై కేంద్ర జల సంఘానికి ఏవైనా ప్రతిపాదన పంపారా? అని ప్రశ్నిం చింది. నీటి వినియోగానికి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్నంత తమకు అందజేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పాటే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, వరద కాల్వ, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలనూ కోరింది. పాత ఆయకట్టునే కొత్తగా చూపిస్తున్నారంటూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులతో కొత్తగా వృధ్ధిలోకి వచ్చే ఆయకట్టు పెద్దగా లేదని, ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టునే కాళేశ్వరం ఆయకట్టు కింద చూపుతున్నారని వివిధ పార్టీల ఎంపీలు, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ వివరాలను కోరినట్లుగా తెలిసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించాలని పలుమార్లు కోరినా రాష్ట్రం స్పందించలేదు. కాళేశ్వరం అంచనా వ్యయం రూ.80,150 కోట్లుగా గతంలో పేర్కొన్నారని, ప్రస్తుతం సవరించిన అంచనాలు ఎంతో తెలపాలని కేంద్రం ఆదేశించింది. దీనిపై కొనసాగింపుగా ప్రస్తుతం ప్రాజెక్టు అదనపు టీఎంసీతో వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు, ప్రయోజనాల వివరాలను కోరడంతో కేంద్రం కాళేశ్వరం అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కనబడుతోందని ఇరిగేషన్ వర్గాలే అంటున్నాయి. -
శ్రీశైలం @ 107.45 టీఎంసీలు
సాక్షి, అమరావతి/ శ్రీశైలంప్రాజెక్ట్: కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమేణా తగ్గుతూ వస్తోంది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,87,698 క్యూసెక్కులు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 107.45 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కులను విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 560.5 అడుగుల్లో 233.59 టీఎంసీలకు చేరుకుంది. ► మరో 25 టీఎంసీల ప్రవాహం వస్తే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. ► పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో కృష్ణా నదికి మంగళవారం వరద పెరుగుతుందని కేంద్ర జలసంఘం అంచనా వేస్తోంది. ► ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు నుంచి గోదావరి నదిలోకి వరద ప్రవాహం చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 1.73 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ గోదావరికి ఇదే గరిష్ట వరద. కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వర ఆలయం! పాములపాడు/కొత్తపల్లి: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి వెళ్తోంది. సోమవారానికి ఆలయ శిఖరం నాలుగు అడుగులు మాత్రమే బయటకు కన్పిస్తోంది. శ్రీశైలం జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మంగళవారం ఉదయానికల్లా ఆలయ శిఖరం పూర్తిగా మునిగిపోనుంది. -
వారంలో శ్రీశైలానికి కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/హొసపేటె: ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి కృష్ణా వరద జలాలు జూరాల, శ్రీశైలానికి మరో వారం రోజుల్లో చేరే అవకాశం ఉందని అధికాలు అంచనా వేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతోంది. శనివారం ఆల్మట్టి జలాశయంలోకి 73,791 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 92.45 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి నిండాలంటే ఇంకా 37 టీఎంసీలు అవసరం. శనివారం నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం ఆల్మట్టిలోకి వరద ప్రవాహం మరింత పెరుగుతుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం లేదా మంగళవారం ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదిలే అవకాశంఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. శనివారం నీటితో కళకళలాడుతున్న తుంగభద్ర జలాశయం ► ఆల్మట్టికి దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 27,756 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 29.86 టీఎంసీలకు చేరుకుంది. నారాయణపూర్ డ్యామ్ నిండాలంటే మరో 8 టీఎంసీలు అవసరం. ఆల్మట్టి నుంచి భారీ వరదను విడుదల చేయనున్న నేపథ్యంలో ఒకే రోజులో నారాయణపూర్ నిండే అవకాశం ఉంది. నారాయణపూర్ గేట్లను బుధవారంలోగా ఎత్తే అవకాశం ఉంది. ► కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం పెరిగింది. తుంగభద్ర జలాశయంలోకి 34,374 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.25 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర జలాశయం నిండాలంటే ఇంకా 82 టీఎంసీలు అవసరం. ► తుంగభద్ర జలాశయానికి దిగువన కురిసిన వర్షాలకు సుంకేశుల బ్యారేజీలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేశుల నుంచి కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయగా మిగిలిన నీటిని దిగువకు వదులుతున్నారు. ► నదీ పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల గోదావరిలో వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,23,122 క్యూసెక్కులు వస్తుండగా.. కాలువలకు 7,900 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 1,15,222 క్యూసెక్కులను కడలిలోకి వదిలారు. జూన్ 1 నుంచి శనివారం వరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 52.885 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. ► గొట్టా బ్యారేజీలోకి వంశధార ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. బ్యారేజీలోకి 5,474 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 294 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 5,180 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. జూన్ 1 నుంచి శనివారం వరకు గొట్టా బ్యారేజీ నుంచి 7.477 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ► నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 2,808 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 980 క్యూసెక్కులను వదలి మిగిలిన 1828 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ ఐదు గేట్లు ఎత్తివేత సముద్రంలోకి 3,625 క్యూసెక్కుల నీరు విడుదల కృష్ణా నదికి వరద ప్రవాహం వస్తుండటంతో శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద ఐదు గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో మున్నేరు, కట్టలేరు, వైరా నుంచి కృష్ణా నదిలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉంచి మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేయాలని నిర్ణయించగా.. సాయంత్రం 4 గంటలకు కీసర నుంచి 11,725 క్యూసెక్కుల నీరు వచ్చిందని డ్యామ్ కన్జర్వేషన్ ఈఈ రాజా స్వరూప్‌కుమార్ తెలిపారు. దీంతో 3,625 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టినట్టు చెప్పారు. -
30 ఏళ్ల వరద లెక్కలివ్వండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో వరద జలాల లెక్కలను పూర్తిస్థాయిలో సమగ్ర అధ్యయనం చేశాకే మిగులు జలాల సంగతి తేల్చాలని కేంద్ర జల సంఘం (సీబ్ల్యూసీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించాయి. ఇరు రాష్ట్రాలు 30 ఏళ్ల వరద లెక్కలను సమర్పిస్తే వాటి ఆధారంగానే ఓ నిర్ణయానికి రావచ్చనే అభిప్రాయం వెలిబుచ్చాయి. ఈ నెలాఖరులోగా ఇరు రాష్ట్రాలు వరద జలాల డేటా సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించాయి. మిగులు జలాలపై బుధవారం సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు అధికారులు తెలంగాణ, ఏపీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీడబ్ల్యూసీ సీఈ విజయ్‌శరణ్, కృష్ణా బోర్డు తరఫున సాంకేతిక కమిటీ సభ్యకార్యదర్శి హరికేశ్‌మీనా, తెలంగాణ, ఏపీ అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈలు నరసింహారావు, నాగేశ్వరరావు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఇరవై నిమిషాల పాటు సాగిన కాన్ఫరెన్స్‌లో తెలంగాణ తరఫున సీఈ నరసింహారావు మాట్లాడుతూ, ఈ ఏడాది ఏపీ తన వాటాకు మించి నీటిని వినియోగించిన అంశాన్ని దృష్టికి తెచ్చారు. వరద జలాలను సైతం ఎక్కువగా వినియోగించిందని, పోతిరెడ్డిపాడు ద్వారా అధికంగా నీటిని వినియోగించారని వెల్లడించారు. (చదవండి: తెలంగాణకు తీరని నష్టం) ఈ దృష్ట్యా వరద జలాలను ఇరు రాష్ట్రాలు ఏ రీతిన వినియోగించుకోవాలో వాటాలు నిర్ణయించాలని కోరారు. ఏపీ తరఫున సీఈ మాట్లాడుతూ, ఈ నెలాఖరుతో వాటర్ ఇయర్ ముగుస్తున్నందున ఈ ఏడాది మిగులు జలాల వాటా ఎంత దక్కుతుందో చెప్పాలని కోరారు. అయితే దీనికి సీడబ్ల్యూసీ అభ్యంతరం చెబుతూ, ఇప్పటికిప్పుడు మిగులు జలాల వాటాలు తేల్చడం సాధ్యం కాదని తెలిపింది. మిగులు జలాలపై బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు, ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే శాశ్వత పరిష్కారం కనుగొందామని సూచించింది. జూన్ మొదటి వారంలో మరోమారు కాన్ఫరెన్స్ నిర్వహిద్దామని తెలిపింది. -
గేట్లు.. ఎత్తలేక పాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో నీటిపారుదల శాఖ అంతులేని నిర్లక్ష్యం చూపుతోంది. వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాజెక్టులు, వాటి పరిధిలోని డ్యాముల భద్రత, గేట్ల నిర్వహణ, పరికరాల కూర్పు, సిబ్బంది అవసరాలపై పూర్తి అంచనా వేయలేకపోతోంది. ఆ దిశగా చర్యలు లేకపోవడం పెనుముప్పు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. వర్షాలకు ముందే ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ, సిబ్బంది నియామకాలపై శ్రద్ధ చూపకపోవడం ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలు, అంచనాలకు మించి వరద రావడంతో సాత్నాల, కడెం ప్రాజెక్టుల గేట్ల నిర్వహణలో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. పట్టింపులేని ధోరణి.. కృష్ణా బేసిన్లో 2009లో శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 25 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద రాగా, గోదావరి బేసిన్లో 1983లో శ్రీరాంసాగర్ పరిధిలో 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు కేంద్ర జల సంఘం రికార్డులు చెబుతున్నాయి. 2009లోనే నాగార్జునసాగర్ గరిష్ట వరద 14.5 లక్షల క్యూసెక్కుల వరకు ఉండగా, జూరాలకు 11.14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. శ్రీశైలం వరదను ఎదుర్కొనే ముం దస్తు సన్నద్ధతలో విఫలం కావడంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. రెండేళ్ల కింద ఏడాది సెప్టెంబర్‌లో ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు తక్కువ సమయంలో ఎక్కువ వరదొచ్చింది. వీటి నిర్వహణ నీటి పారుదల శాఖకు కత్తిమీద సాములా మారింది. 2016 సెప్టెంబర్‌లో సింగూరులో 20 రోజుల్లోనే 75 టీఎంసీల మేర వరద వచ్చింది. ఈ సమయంలో సింగూరు గేట్లు తెరుచుకోక నానా తంటాలు పడాల్సి వచ్చింది. ప్రాజెక్టు ప్రొటోకాల్ ప్రకారం మధ్య గేట్లు మొదట తెరవాల్సి ఉండగా, అవి తెరుచుకోలేదు. దీంతో ఇతర గేట్లను తెరిచి నీటిని దిగువకు వదలాల్సి వచ్చింది. ఇందుకు ప్రాజెక్టు గేట్ల ఆపరేషన్, మెయింటెనెన్స్‌ను గాలికొదిలేయడం, రోప్ వైర్ల నిర్వహణ పట్టకపోవడమే కారణమని తేల్చారు. తాజాగా కడెంలోనూ అదే జరిగింది. ఈ నెల 16న కడెం ప్రాజెక్టు రెండో నంబర్ గేట్ కౌంటర్ వెయిట్ తెగిపోయిన కారణంగా నీటి ఒత్తిడికి పక్కకు ఒరిగి కిందకి దిగని పరిస్థితి తలెత్తింది. దీంతో గేటు వేయడం సాధ్యంకాక 5 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోయింది. ప్రాజెక్టు చీఫ్ఇంజనీర్ శంకర్ ఆధ్వర్యంలో ఇంజనీర్లు రెండ్రోజులు శ్రమించి గేటును కిందకి దించగలిగారు. సాత్నాల పరిధిలోనూ మూడు రోజుల కిందట 45 వేల క్యూసె క్కుల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులోకి 90 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇదే సమయంలో కరెంట్ పోవడం, జనరేటర్‌పై పిడుగు పడటంతో గేట్లు తెరవడంలో అయోమయం నెలకొంది. గేట్లు ఎత్తే ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తుల సాయంతో గేట్లు ఎత్తాల్సివచ్చింది. సిబ్బంది లేమి.. రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టుల పరిధిలో ఓఅండ్‌ఎంకు సరిపడనంతగా లేదని సిబ్బంది కొరతే శాఖకు పెద్ద సమస్యగా మారింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిధిలో లష్కర్లు, వర్క్ఇన్స్పెక్టర్, గేటు ఆపరేటర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, వాచ్మెన్, పంప్, జనరేటర్ ఆపరేటర్లు కలిపి 5,674 మంది సిబ్బంది అవసరం ఉంది. ఇందు లో వర్క్ ఇన్స్పెక్టర్లు 1,058, లష్కర్లు 3,671, ఎలక్ట్రీషియన్లు 107, గేట్ల ఆపరేటర్లు 169, జనరేటర్ ఆపరేటర్లు 52 మంది అవసరం ఉం దని తేల్చింది. ప్రస్తుతం 1700 మందే ఉన్నారు. లష్కర్లు 1450 మందే ఉండగా, పంప్ ఆపరే టర్లు 180 మంది ఉన్నారు. జూరాల ప్రాజెక్టు పరిధిలో ఒక్కరే ఎలక్ట్రీషియన్ ఉండగా, ఆపరేటర్ల కొరతతో కాల్వల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందిని డ్యామ్ సేవలకు వినియోగిస్తున్నా రు. అక్కడ పూర్తి స్థాయి సిబ్బందిని సమకూర్చడంపై గతేడాదిలోనే ప్రతిపాదన వచ్చినా నీటిపారుదల శాఖ అమలు చేయలేకపోయింది. సింగూరు ప్రాజెక్టు పరిధిలో ఒక హెల్పర్, ఇద్దరు వాచ్మెన్లతో నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది వర్షాల సమయానికి ముందే గత పరిస్థితులు తలెత్తకుండా నీటిపారుదల శాఖ ముందుగానే మేల్కోవాల్సి ఉందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. -
నిధుల సమీకరణ పై సుదీర్ఘ చర్చ
-
కార్యాలయాలు, సిబ్బంది, నిధులెలా?
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: దేశంలోని పనిచేస్తున్న నదీ యాజమాన్య బోర్డుల తరహాలోనే కృష్ణా, గోదావరి బోర్డుల స్వరూపం ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైంది. రెండు బోర్డుల కార్యాలయాల ఏర్పాటుకయ్యే ఖర్చును కేంద్రంతో పాటు రెండు రాష్ట్రాలు భరించాలని, సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలని, నిధుల సమస్య రాని విధంగా తగిన ఏర్పాట్లు ఉండాలని పలువురు ఇంజనీర్లు సూచించారు. బోర్డుల స్వరూపం, పాలనకు సంబంధించిన విధివిధానాలను నిర్ణయించే కసరత్తులో భాగంగా సీడబ్ల్యూసీ శుక్రవారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో వివిధ నదీ యాజమాన్య బోర్డుల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఇంజనీర్లతో పాటు ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ వెంకటేశ్వరావు, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పాల్గొన్నారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. ‘‘కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో, గోదావరి బోర్డు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొత్త రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యేవరకు.. రెండు బోర్డులు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయవచ్చు. రెండు బోర్డులు ఒకే ప్రాంగణంలో ఉండటం మంచిది’’ అన్న అభిప్రాయం వ్యక్తమవుతుందన్నారు.