సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి ఆమోదంతోపాటు విభజన సమస్యలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాల పరిష్కారానికి కేంద్రం కదిలింది. ఈ సమస్యలపై చర్చించి, పరిష్కారాలను సూచించడానికి ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమంచింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రధాని చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే పలు ప్రాజెక్టులు, విభజన సమస్యలు, అపరిష్కృత అంశాల పరిష్కారమే అజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 3న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడంతోపాటు ప్రధానికి సీఎం జగన్ వినతిపత్రం అందజేశారు.
ఇదే అంశాలపై ఈనెల 5న ప్రధానికి సీఎం లేఖ రాశారు. తనతో జరిగిన సమావేశంలో, లేఖలో సీఎం జగన్ లేవనెత్తిన అంశాలను అధ్యయనం చేసి, పరిష్కారానికి నివేదిక ఇవ్వాలని ప్రధాని కార్యాలయం (పీఎంవో) అధికారులను ప్రధాని ఆదేశించారు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి (వ్యయ విభాగం) అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేస్తూ పీఎంవో ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు పీఎంవో డిప్యూటీ సెక్రటరీ కట్టా ఆమ్రపాలి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి, ఆహార, పౌర సరఫరాల శాఖ కార్యదర్శిలను కమిటీలో సభ్యులుగా నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారుల బృందంతో ఈ కమిటీ చర్చిస్తుంది. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీకి నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రధాని చర్యలు తీసుకుంటారని పీఎంవో వర్గాలు వెల్లడించాయి.
ప్రధానితో జరిపిన చర్చల్లో సీఎం జగన్ లేవనెత్తిన ప్రధానాంశాలు..
1. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించాలి. ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నీటి పారుదల విభాగం కింద నిధులివ్వాలి. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,100 కోట్లను మంజూరు చేయాలి.
2. రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 45 శాతం ఆదాయం (రెవెన్యూ) మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా.. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,979లు మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇవే నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చే లక్ష్యంతో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీతోపాటు పలు హామీలిచ్చారు. వాటిని అమలు చేయాలి.
3. 2014 జూన్ నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతి తీసుకొచ్చి రెవెన్యూ లోటును రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులు, ఇతర బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రాన్ని ఆదుకోవాలి.
4. విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసింది. ఇందుకు ఏపీకి రూ.6,284 కోట్లను తెలంగాణ చెల్లించాలి. ఏపీ విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆ బిల్లులను తెలంగాణ చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలి.
5. జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఏపీలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా రేషన్ అందిస్తోంది. దీనివల్ల భారం పడుతోంది. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన జరిపి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలి.
6. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందే వెసులుబాటు కల్పించాలి.
7. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చిన సైట్ క్లియరెన్స్‌ను రెన్యువల్ చేయాలి.
8. వైఎస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మెకాన్ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గనులను వేగంగా కేటాయిస్తే.. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతుంది.
సమస్యల పరిష్కారంపై కదిలిన కేంద్రం
Published Wed, Jan 12 2022 3:56 AM | Last Updated on Wed, Jan 12 2022 3:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment