CM YS Jagan Focus For Progress In Polavaram Project Works - Sakshi
Sakshi News home page

Polavaram Project: సీఎం జగన్‌ భగీరథ యత్నం.. వడివడిగా జీవనాడి

Published Mon, Feb 13 2023 2:34 AM | Last Updated on Mon, Feb 13 2023 11:01 AM

CM YS Jagan Focus for progress in Polavaram works - Sakshi

దాదాపు పూర్తయిన దిగువ కాఫర్‌ డ్యామ్‌

పోలవరం ప్రాజెక్టు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కోసం నాటి సీఎం చంద్రబాబు చేసిన తప్పిదాలతో ఎదురవుతున్న సవాళ్లను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ.. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భగీరథ యత్నం చేస్తున్నారు.

పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ.2,948.04 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. కేంద్రం నిధులు ఇవ్వకున్నప్పటికీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర ఖజానా నుంచే నిధులు కేటాయిస్తూ ప్రణాళికా బద్ధంగా ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. రైతులకు ఫలాలను అందించే దిశగా అడుగులు వేస్తోంది. 

దిగువ కాఫర్‌ డ్యామ్‌ దాదాపు పూర్తి 
గోదావరి వరదల ఉధృతికి ఇసుక తిన్నెలు కోతకు గురవడం వల్ల దిగువ కాఫర్‌ డ్యామ్‌ 0 నుంచి 680 మీటర్ల వరకు ఏర్పడిన అగాధాన్ని డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్పీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు మేఘా సంస్థ జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌లలో ఇసుక నింపి.. జెట్‌ గ్రౌటింగ్, వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ పూడ్చింది. ఆ తర్వాత 20 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసింది. కానీ.. జూలై 10న గోదావరికి వచ్చిన భారీ వరద ముంచెత్తడంతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులకు ఆటంకం కలిగింది.

వరదలు తగ్గడంతో నవంబర్‌లో పనులను ప్రారంభించి.. 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ను దాదాపుగా పూర్తి చేసింది. కేవలం రివిట్‌మెంట్‌ పనులు మాత్రమే మిగిలాయి. రివిట్‌మెంట్‌తో సహా దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను నెలాఖరుకు పూర్తి చేస్తామని పోలవరం ఎస్‌ఈ నరసింహమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తవడంతో గోదావరికి ఎంత పెద్ద వరద వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు చేపట్టవచ్చని చెప్పారు. 
పోలవరం స్పిల్‌ వే  

శరవేగంగా అగాధాల పూడ్చివేత 
గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించడానికి 2,840 మీటర్ల పొడవున 43 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయాల్సిన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను టీడీపీ సర్కార్‌ పూర్తి చేయలేక చేతులెత్తేసింది. కుడి, ఎడమ వైపున 680 మీటర్ల ఖాళీ ప్రదేశాన్ని వదిలేసింది. దాంతో 2019లో 2,454 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారడం వల్ల ఖాళీగా వదిలిన 680 మీటర్లకు కుంచించుకుపోయి ప్రవహించాల్సి వచ్చింది.

దాంతో వరద ఉధృతి మరింత పెరిగి ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై.. నాలుగు ప్రదేశాల్లో –12 నుంచి –22 మీటర్ల లోతుతో అగాధాలు ఏర్పడ్డాయి. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో 1,750 మీటర్ల పొడవునా పునాది డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు అధికారులు అగాధాల పూడ్చివేతకు గతేడాది 11 రకాల పరీక్షలు చేశారు.

వాటి ఫలితాలను డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ విశ్లేషించి, జారీ చేసిన మార్గదర్శకాల మేరకు.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఉన్న నీటిని మోటార్లతో తోడేస్తున్నారు. పురుషోత్తపట్నం వద్ద గోదావరిలోని ఇసుకను వందలాది టిప్పర్లతో తెచ్చి, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో అగాధాలు ఏర్పడిన చోట పోసి, రోలింగ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత వైబ్రో కాంపాక్షన్‌ (వైబ్రో కాంపాక్టర్‌ యంత్రంతో బోరు వేసి.. అధిక ఒత్తిడితో మెలి తిప్పడం) చేస్తూ ఆ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులను ముమ్మరం చేశారు. 

ఎన్‌హెచ్‌పీసీ నివేదికే కీలకం
ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యాన్ని తేల్చేందుకు జనవరి 26 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు 16 రోజులపాటు హై రెజల్యూషన్‌ జియోఫిజికల్‌ రెసిస్టివిటీ ఇమేజింగ్, సెస్మిక్‌ టోమోగ్రఫీ పరీక్షలను ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌) బృందం నిర్వహించింది. ఈ పరీక్షల ఫలితాలను విశ్లేషించి.. నెలాఖరులోగా డయాఫ్రమ్‌ వాల్‌ భవిత్యాన్ని తేల్చుతూ నివేదిక ఇవ్వనుంది.

డయాఫ్రమ్‌ వాల్‌ పటిష్టంగా ఉన్నట్లు తేలితే.. ఆ వెంటనే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులను చేపట్టి, వరదల్లోనూ నిర్విఘ్నంగా కొనసాగించి, పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఒకవేళ డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యంపై ఎన్‌హెచ్‌పీసీ నివేదిక అనుమానం వ్యక్తం చేస్తే.. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు ముందడుగు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

డెల్టాకు నీటిని సరఫరా చేస్తూ మిగతా పనులు 
► గోదావరి ప్రవాహాన్ని అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా స్పిల్‌ వే వైపు మళ్లించడానికి.. స్పిల్‌ వేకు ఎగువన ఎడమ వైపున ఉన్న కొండకు సమాంతరంగా సుమారు 1.3 కి.మీల పొడవు, 52 మీటర్ల ఎత్తుతో గైడ్‌ వాల్‌ పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. ఇదే రీతిలో ఎగువ కాఫర్‌ డ్యామ్‌కు ఎగువన కుడి వైపున ఉన్న కొండకు సమాంతరంగా గైడ్‌ బండ్‌ నిర్మిస్తోంది. 
► గోదావరి డెల్టాలో రబీ పంటలకు పోలవరం స్పిల్‌ వే రివర్‌ స్లూయిజ్‌ల ద్వారా నీటిని విడుదల చేస్తూ.. అప్రోచ్‌ ఛానల్‌లో మిగిలిపోయిన 36.54 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, స్పిల్‌ ఛానల్‌లో 1.20 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 1.96 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది.
► పోలవరం ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు నీటిని విడుదల చేసే అనుసంధానాలలో హెడ్‌ రెగ్యులేటర్, ఈ–శాడిల్‌ డ్యామ్, ఎఫ్‌–శాడిల్‌ డ్యామ్‌ ఇప్పటికే పూర్తయ్యాయి. జంట సొరంగాల్లో 8.63 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులను జూన్‌లోగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టారు.
► పోలవరం ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసే అనుసంధానాలలో సొరంగం పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. హెడ్‌ రెగ్యులేటర్, కేఎల్‌ బండ్, నావిగేషన్‌ కెనాల్, నావిగేషనల్‌ లాక్‌ పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించారు. 

స్పిల్‌ వే పనితీరు అత్యద్భుతం 
గోదావరి ప్రవాహాన్ని మళ్లించే స్పిల్‌ వేను టీడీపీ సర్కార్‌ పునాది స్థాయిలోనే వదిలేస్తే.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ కేంద్రం నిధులు రీయింబర్స్‌ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నప్పటికీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. రాష్ట ఖజానా నుంచే నిధులను వ్యయం చేసి 2021 జూన్‌ 11 నాటికే 48 గేట్లతో సహా సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేశారు. స్పిల్‌ వే మీదుగా అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్, పైలట్‌ ఛానల్‌ ద్వారా 6.1 కి.మీల పొడవునా గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. 2021లో 3,690.38 టీఎంసీలు, 2022లో 6,150.04 టీఎంసీలు వెరసి 9,840.42 టీఎంసీలను పోలవరం స్పిల్‌ వే మీదుగా సమర్థవంతంగా దిగువకు విడుదల చేశారు. ఈ గణాంకాలను పరిశీలించిన సీడబ్ల్యూసీ అధికారులు.. ప్రపంచంలో అతి పెద్దదైన పోలవరం స్పిల్‌ వే పనితీరు అత్యద్భుతమని ప్రశంసించారు.

చంద్రబాబు పాపం.. ప్రపంచ వింత 
► పశ్చిమగోదావరి జిల్లా రామన్నగూడెం వద్ద గోదావరి నదిలో ఉన్న భూ భౌగోళిక పరిస్థితుల వల్ల నది గర్భంలో ప్రధాన డ్యామ్‌ అంటే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ను, నది తీరానికి ఆవల కుడి వైపున వరద ప్రవాహాన్ని మళ్లించే స్పిల్‌ వేను నిర్మించేలా పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు.

► నది ప్రవాహాన్ని మళ్లించేలా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, స్పిల్‌ వే, అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్, పైలట్‌ ఛానల్‌లను పూర్తి చేసి, 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలి. ఆ తర్వాత ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు చేపట్టి పూర్తి చేయాలి. 

► విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే వరకూ అంటే 2016 డిసెంబర్‌ 30 వరకు తట్టెడు మట్టి కూడా టీడీపీ సర్కార్‌ ఎత్తలేదు. ఆ తర్వాత అధికంగా కమీషన్లు వచ్చే పనులనే సబ్‌ కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టారు. వరదను మళ్లించేలా స్పిల్‌ వే, కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయకుండానే.. డయాఫ్రమ్‌ వాల్‌ను 2018 జూన్‌ నాటికే పూర్తి చేశారు. 

► స్పిల్‌ వేను పునాది స్థాయిలో.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయలేక టీడీపీ సర్కార్‌ వదిలేసింది. దాంతో 2019లో గోదావరి వరద కాఫర్‌ డ్యామ్‌ ద్వారా అధిక ఉధృతితో ప్రవహించం వల్ల ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో, దిగువ కాఫర్‌ డ్యామ్‌లో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. 

► డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలు చేయడానికి ఇటీవల పోలవరానికి వచ్చిన ఎన్‌హెచ్‌పీసీ బృందం.. చంద్రబాబు పాపాన్ని ప్రపంచ వింతగా అభివర్ణించిందని అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల పోలవరం పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోందని తేల్చి చెప్పాయి. 

ఈ పాటికే పూర్తయ్యేది.. 
గతంలో ప్రణాళికా రాహిత్యంతో చేపట్టిన పనుల వల్ల గోదావరి వరదల ఉధృతికి ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు ప్రదేశాల్లో భారీ అగాధాలు ఏర్పడ్డాయి.

వాటిని సరిదిద్దేందుకు 2020 నుంచి డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ, దేశంలోని ఢిల్లీ, చెన్నై, తిరుపతి తదితర ఐఐటీల ప్రొఫెసర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యం తేల్చడానికి ఎన్‌హెచ్‌పీసీ ఇటీవలే పరీక్షలు చేసింది. ఎన్‌హెచ్‌పీసీ నివేదికే కీలకం. గోదావరి వరదల ఉధృతి ప్రభావం లేకపోయిఉంటే.. ఈపాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. 
– సుధాకర్‌ బాబు, సీఈ, పోలవరం ప్రాజెక్టు
 
ఎంత పెద్ద వరద వచ్చినా భయం లేదిక
పోలవరం ప్రాజెక్టును సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ఖజానా నుంచే ఇస్తున్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే.. కరోనా కష్టకాలంలోనూ రికార్డు సమయంలో స్పిల్‌ వే ను పూర్తి చేశాం. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు దెబ్బతిన్న పనులను చేపడుతున్నాం. గతేడాది జూలైలో ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును 44 మీటర్లకు పెంచాం. ఇప్పటికే దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేశాం.

గోదావరికి ఎంత పెద్ద వరద వచ్చినా ఇక భయం లేదు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో అగాధాలను పూడ్చుతున్నాం. ఎన్‌హెచ్‌పీసీ నివేదిక మేరకు.. గోదావరి వరదల్లోనూ ఈసీఆర్‌ఎఫ్‌ పనులు చేపట్టి పూర్తి చేస్తాం. 
– సి.నారాయణరెడ్డి, ఈఎన్‌సీ, జల వనరుల శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement