Polavaram Project : CM Y S Jagan To Visit Polavaram Today Review Progress Of Work] - Sakshi
Sakshi News home page

Polavaram: సిద్ధిస్తున్న సంకల్పం

Published Mon, Jul 19 2021 2:35 AM | Last Updated on Mon, Jul 19 2021 10:25 AM

CM Jagan to monitor progress of Polavaram works at field level today - Sakshi

రికార్డు స్థాయిలో ఈ రెండేళ్లలో పూర్తయిన స్పిల్‌వే

సాక్షి, అమరావతి: ఉత్తుంగ గోదావరిపై రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఆవిష్కృతం చేస్తోంది. జీవచ్ఛవంలా మారిన ప్రాజెక్టు జీవనాడిగా మారుతోంది. కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నప్పటికీ పోలవరం పనులకు ఎలాంటి ఆటంకం కలగరాదనే ఉద్దేశంతో జనవరి నుంచి దాదాపు రూ.1,971 కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి చెల్లించి పరుగులు పెట్టిస్తోంది. గత సర్కారు అవగాహనా రాహిత్యం, ప్రణాళిక లోపం, కమీషన్ల దాహంతో వరద మళ్లించే స్పిల్‌ వేను పూర్తి చేయకుండా పునాది స్థాయిలోనే వదిలేసింది.

చంద్రబాబు అధికారంలో ఉండగా ఐదేళ్లలో నిర్వాసితులను పట్టించుకోలేదు. పునరావాసాన్ని గాలికి వదిలేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే నదీ ప్రవాహానికి అడ్డంగా కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టి చివరకు వాటిని చేయలేక చేతులెత్తేశారు. దీంతో 2019లో గోదావరి వరద ముంపు గ్రామాలను చుట్టుముట్టింది. స్పిల్‌ వేను ముంచెత్తింది. కాఫర్‌ డ్యామ్‌ మీదుగా వరద ప్రవహించడంతో ప్రధాన డ్యామ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌) పునాది డయాఫ్రమ్‌ వాల్‌ కొంతమేర దెబ్బతింది.
 

తొలి పర్యటన నుంచి పక్కా ప్రణాళికతో..
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా 2019 జూన్‌ 20న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్‌ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు,  సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు. ఆలోగా కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాలు, డిస్ట్రిబ్యూటరీల పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ సర్కారు నామినేషన్‌ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన పనులను రద్దు చేసి  రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 2020 ఫిబ్రవరి 28, డిసెంబర్‌ 14న క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాజాగా సీఎం జగన్‌ సోమవారం పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో మరోసారి పరిశీలించనున్నారు.

పనులు పరుగులు..
వరదను మళ్లించేలా స్పిల్‌ వేను పూర్తి చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను దాదాపుగా పూర్తి చేశారు. నదీ ప్రవాహానికి ఎగువన కాఫర్‌ డ్యామ్‌తో అడ్డుకట్ట వేయడంతో నదీ గర్భంలో సుమారు 25 టీఎంసీల వరకూ నిల్వ ఉన్నాయి. అంటే పోలవరం అప్పుడే జలాశయంగా రూపుమార్చుకుంటోందన్న మాట. అప్రోచ్‌ చానల్‌ మీదుగా సహజమార్గం నుంచి 6.6 కి.మీ. పొడవున దారి మళ్లిన గోదావరి స్పిల్‌ వే 48 గేట్ల ద్వారా స్పిల్‌ ఛానల్‌లోకి దూసుకెళ్తోంది. స్పిల్‌ ఛానల్, పైలట్‌ ఛానల్‌ మీదుగా సహజ మార్గంలోకి ప్రవేశించి ధవళేశ్వరం వైపు పరుగులు పెడుతోంది. పోలవరం జలాశయంతోపాటు కుడి, ఎడమ కాలువలను 2022 నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. కుడి, ఎడమ కాలువ కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. పనుల పురోగతిని ముఖ్యమంత్రి జగన్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలించి 2022 నాటికి పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఐదేళ్లలో టీడీపీ సర్కార్‌ నిర్వాకాలు, 26 నెలల్లోనే పోలవరం పనుల్లో సాధించిన ప్రగతిపై వాస్తవాలు ఇవిగో..

ప్రపంచంలోనే భారీ సామర్థ్యం ఉన్న స్పిల్‌ వే: గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగుకు విడుదల చేసేలా 1,118.4 మీటర్ల పొడవుతో 55 మీటర్ల ఎత్తుతో స్పిల్‌ వేను నిర్మించాలి. ప్రపంచంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో భారీ సామర్థ్యంతో వరదను దిగువకు విడుదల చేసే స్పిల్‌ వేల్లో పోలవరం స్పిల్‌ వేదే అగ్రస్థానం.
నాడు: స్పిల్‌ వేను 53 బ్లాక్‌లుగా నిర్మించాలి. గరిష్టంగా 18.5 మీటర్ల నుంచి కనిష్టంగా పది మీటర్ల లోతు వరకూ పునాది వేయాలి. ఐదేళ్లలో టీడీపీ సర్కార్‌ పునాదితోపాటు 53 బ్లాక్‌ల పియర్స్‌(కాంక్రీట్‌ దిమ్మెలు)ను సగటున 22 మీటర్ల ఎత్తున చేసింది. 42, 43 పియర్స్‌ను 34 మీటర్ల ఎత్తు వరకూ చేసి వాటి మధ్య ఒక ఇనుప రేకును అడ్డుగా పెట్టి గేట్లు బిగించేసినట్లు 2018 డిసెంబర్‌ 24న అప్పటి సీఎం చంద్రబాబు డ్రామాలాడారు. వాస్తవంగా స్పిల్‌ వేకు 25.72 మీటర్ల ఎత్తు నుంచి 45.72 మీటర్ల ఎత్తు వరకూ 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను బిగించాలి. వీటిని పరిశీలిస్తే టీడీపీ సర్కార్‌ ఐదేళ్లలో స్పిల్‌ వేను పునాది స్థాయిలోనే వదిలేసినట్లు స్పష్టమవుతోంది.

నేడు: స్పిల్‌ వే 53 పియర్స్‌ను 55 మీటర్ల ఎత్తుతో పూర్తి చేశారు. స్పిల్‌ వే 54.5 మీటర్ల ఎత్తులో గడ్డర్లు 192 గడ్డర్లను ఏర్పాటు చేసి వాటిపై 1118.4 మీటర్ల పొడవుతో స్పిల్‌ వే బ్రిడ్జిని ప్రభుత్వం పూర్తి చేసింది. స్పిల్‌ రివర్‌ స్లూయిజ్‌లకు పది గేట్లను బిగించింది. ఇక స్పిల్‌ వేకు 48 గేట్లకుగానూ 42 గేట్లను బిగించింది. వాటిని ఎత్తడానికి దించడానికి  వీలుగా 84 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌లను జర్మనీని నుంచి దిగుమతి చేసుకుని బిగించింది. తాజాగా ఇటీవలే జర్మనీ నుంచి వచ్చిన మరో 14 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లను వరద తగ్గగానే బిగించనున్నారు. రికార్డు సమయంలో అతి భారీ స్పిల్‌ వేను పూర్తి చేశారని కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ సైతం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సరే సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌ వేను సిద్ధం చేశారు. 

అప్రోచ్‌ ఛానల్‌: గోదావరి సహజప్రవాహ మార్గాన్ని స్పిల్‌ వే వైపు మళ్లించేందుకు సింగన్నపల్లి నుంచి స్పిల్‌ వే వరకూ ప్రారంభంలో 500 మీటర్ల వెడల్పు, చివరకు వచ్చే సరికి వెయ్యి మీటర్ల వెడల్పుతో 2.18 కి.మీ. పొడవున అప్రోచ్‌ ఛానల్‌ తవ్వాలి.  ఇందుకు 154.88 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వాలి. 

నాడు: ఐదేళ్ల టీడీపీ సర్కార్‌ హయాంలో అప్రోచ్‌ ఛానల్‌ డిజైన్‌ను కూడా రూపొందించలేకపోయింది. 

నేడు: పుణేలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌)లో 3–డీ నమూనాలో నిర్మించిన మినీ పోలవరం ప్రాజెక్టులో నిర్వహించిన ప్రయోగాల ఆధారంగా జనవరిలో అప్రోచ్‌ ఛానల్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఫిబ్రవరిలో పనులు చేపట్టిన ప్రభుత్వం ఇప్పటివరకూ 112.48 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని చేసింది. దాంతో అప్రోచ్‌ ఛానల్‌ పనులను 80.06 శాతం పూర్తి చేసింది. జూన్‌ 11న అప్రోచ్‌ ఛానల్‌ అడ్డుకట్ట తొలగించి స్పిల్‌ వే వైపు వరదను మళ్లించింది. 

స్పిల్‌ ఛానల్‌: స్పిల్‌ వే నుంచి విడుదల చేసిన వరద జలాలను గోదావరి సహజమార్గంలోకి కలిపేందుకు 2.92 కి.మీ. పొడవున వెయ్యి మీటర్ల వెడల్పుతో స్పిల్‌ ఛానల్‌ తవ్వాలి. వాటికి కాంక్రీట్‌ లైనింగ్‌ చేయాలి. ఆ తర్వాత 1.5 కి.మీ. పొడవున వెయ్యి మీటర్ల వెడల్పుతో ఫైలట్‌ ఛానల్‌ తవ్వాలి.

నాడు: స్పిల్‌ ఛానల్‌కు సంబంధించి అత్యంత కీలకమైన డిజైన్‌లను సీడబ్ల్యూసీతో ఆమోదింపజేసుకోవడంలో టీడీపీ సర్కార్‌ విఫలమైంది. ఎడమ గట్టు, కుడి గట్టు వాలులకు సంబంధించిన మట్టి జారిపోతోంది. గట్టు వాలును పటిష్టం చేసే పనులకు సంబంధించిన డిజైన్‌ కూడా ఐదేళ్లలో ఆమోదింపజేసుకోలేకపోయింది. ప్రణాళికా రాహిత్యం వల్ల గోదావరికి అడ్డుగా కాఫర్‌ డ్యామ్‌ నిర్మించడంతో వరద స్పిల్‌ వే మీదుగా స్పిల్‌ ఛానల్‌ను ముంచెత్తింది. బురద పేరుకుపోయింది.

నేడు: కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ గత రెండు సీజన్లలో స్పిల్‌ ఛానల్‌లో బురదను.. ఒక టీఎంసీకిపైగా నీటిని తోడేసిన ప్రభుత్వం కీలక డిజైన్‌లను ఆమోదింపజేసుకుంది. కాంక్రీట్‌ లైనింగ్‌ పనులను దాదాపుగా పూర్తి చేసింది. ఫైలట్‌ ఛానల్‌ ముగిసే ప్రాంతంలో అత్యంత కీలకమైన ఎండ్‌ కటాఫ్‌ డిజైన్‌ను ఆమోదింపజేసుకోవడమే కాకుండా రికార్డు సమయంలో పూర్తి చేసింది. 1.5 కి.మీ. పొడవున ఫైలట్‌ ఛానల్‌ తవ్వకం పనులు పూర్తి చేసింది. ప్రస్తుతం స్పిల్‌ వే నుంచి విడుదలైన గోదావరి వరదను స్పిల్‌ ఛానల్‌ మీదుగా పైలట్‌ ఛానల్‌ ద్వారా సహజ ప్రవాహ మార్గంలోకి మళ్లిస్తున్నారు. 

కాఫర్‌ డ్యామ్‌: ప్రాజెక్టులో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా గోదావరి సహజ ప్రవాహానికి అడ్డంగా 2454 మీటర్ల పొడవున మూడు భాగాలుగా ఈసీఆర్‌ఎఫ్‌ను నిర్మించాలి. ఈసీఆర్‌ఎఫ్‌ను నిర్మించాలంటే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించాలి. ఇందుకు ఈసీఆర్‌ఎఫ్‌కు 500 మీటర్ల ఎగువన 2480 మీటర్ల పొడవున 42.5 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్‌ డ్యామ్, 350 మీటర్ల దిగువన 1,617 మీటర్ల పొడవు, 30.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలి.

నాడు: వరదను మళ్లించేలా స్పిల్‌ వేను పూర్తి చేయకుండానే గోదావరికి అడ్డంగా 1,200 మీటర్ల పొడవున 28 నుంచి 33 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టి మధ్యలోనే వదిలేసింది. 2019, 2020లో సహజ ప్రవాహానికి కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారడంతో వరద నీటి మట్టం పెరిగి ముంపు గ్రామాల్లోకి ఎగదన్ని నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాఫర్‌ డ్యామ్‌ మీదుగా వరద ప్రవహించడం వల్ల ఈసీఆర్‌ఎఫ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ కొంత దెబ్బతింది. ఇసుక పొరలు కోతకు గురయ్యాయి.

నేడు: ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 39 మీటర్ల ఎత్తుకు ఎత్తుతో పూర్తి చేసింది. ఈ నెలాఖరు నాటికి 42.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసేలా పనులను వేగవంతం చేసింది. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను సగటున 16.5 మీటర్ల నుంచి 24 మీటర్ల ఎత్తుకు చేసింది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌తో గోదావరికి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి స్పిల్‌ వే మీదుగా దిగ్విజయంగా గోదావరి వరదను మళ్లించింది. ఈ సీజన్‌లో వరద సమయంలోనూ ఈసీఆర్‌ఎఫ్‌ పనులు చేపట్టి గడువులోగా పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేసింది.
నిర్వాసితులకు పునరావాసం: పోలవరంతో ఉభయ గోదావరి జిల్లాల్లో 371 గ్రామాలు ముంపునకు గురవుతాయి. 1,05,601 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి.

నాడు: టీడీపీ సర్కార్‌ ఐదేళ్లలో అతి కష్టమ్మీద 15 పునరావాస కాలనీల్లో 1,846 ఇళ్లను పూర్తి చేసింది. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించలేదు.

నేడు: తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో ముంపు గ్రామాల్లోని 17,269 కుటుంబాలకు ఆగస్టులోగా పునరావాసం కల్పించేందుకు 75 కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఇళ్లను నిర్మిస్తోంది. ఇందులో ఇప్పటికే 26 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 49 కాలనీల్లో పనులను వేగవంతం చేశారు. వరద వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా అందరికీ పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. రెండో దశలో 41.15 మీటర్ల నుంచి 45.72 మీటర్ల పరిధిలోని ముంపు గ్రామాల్లోని 85,136 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు 140 కాలనీల నిర్మాణాన్ని చేపట్టింది.  

ఇంజనీరింగ్‌ అద్భుతం..
సాగునీటి ప్రాజెక్టుల్లో సాధారంగా నదీ సహజ ప్రవాహ మార్గంలోనే వరదను దిగువకు విడుదల చేసేలా స్పిల్‌ వే(కాంక్రీట్‌ డ్యామ్‌) నిర్మించడం పరిపాటి. భూభౌతిక పరిస్థితుల ప్రభావం వల్ల గోదావరి ఇసుక తిన్నెలపై 194.6 టీఎంసీలను నిల్వ చేసే ప్రధాన డ్యామ్‌ ఈసీఆర్‌ఎఫ్‌ను నదికి కుడి వైపున, రాతి నేలపై స్పిల్‌ వేను నిర్మించేలా కేంద్ర జలసంఘం ఆమోదించిన డిజైన్‌తో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో పోలవరానికి శ్రీకారం చుట్టారు. సహజ ప్రవాహ మార్గాన్ని స్పిల్‌వే వైపు 2.18 కి.మీ. మేర తవ్వే అప్రోచ్‌ ఛానల్‌ ద్వారా మళ్లించి.. స్పిల్‌ వే నుంచి వరద జలాలను 2.92 కి.మీ. పొడవున నిర్మించే స్పిల్‌ ఛానల్, 1.5 కి.మీ. పొడువున తవ్వే పైలట్‌ ఛానల్‌ మీదుగా తిరిగి గోదావరి సహజమార్గంలోకి వదిలేసేలా వరద మళ్లింపు డిజైన్‌ చేశారు. అంటే సహజమార్గం నుంచి 6.6 కి.మీ. మేర నదీ మార్గాన్ని మళ్లించారు. ప్రపంచంలో నదీ సహజ ప్రవాహ మార్గాన్ని ఇంత పొడవున మళ్లించడం ఇదే తొలిసారని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈసీఆర్‌ఎఫ్‌కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మించేలా డిజైన్‌ చేశారు. స్పిల్‌ వే.. ఈసీఆర్‌ఎఫ్‌.. జలవిద్యుత్కేంద్రం.. మొత్తం మూడు భాగాలుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అందుకే పోలవరాన్ని ఇంజనీరింగ్‌ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. 

జలవిద్యుత్కేంద్రం: ఈసీఆర్‌ఎఫ్‌కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మించాలి.

నాడు: జలవిద్యుత్కేంద్రం పునాది పనులకుగానూ కొండను 18 మీటర్ల మేర మాత్రమే టీడీపీ సర్కార్‌ తవ్వింది.

నేడు: పునాది పనుల కోసం 107.52 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వింది. పునాది పనులను 91 శాతం పూర్తి చేసింది. ఈ పనులు పూర్తయ్యాయక యుద్ధప్రాతిపదికన జలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది.

నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటన షెడ్యూల్‌
సీఎం జగన్‌ ఉదయం 10.10కి తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరతారు. 11.10 గంటల నుంచి 12 వరకు క్షేత్ర స్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన అనంతరం ఒంటి గంట వరకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.20కి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement