సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తరహాలోనే.. పోలవరం ప్రాజెక్టుకూ నీటిపారుదల విభాగం పనులకు నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలపరుస్తూ జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు ఎస్కే హల్దార్ మంగళవారం నివేదిక ఇచ్చారు.
యూపీ సింగ్ అధ్యక్షతన పనిచేసే సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ కమిటీకి కూడా యూపీ సింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం ఇక లాంఛనమే. ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ఫైలును కేంద్ర ఆర్థిక శాఖ యథాత«థంగా ఆమోదించి కేంద్ర కేబినెట్‌కు పంపుతుంది. విభజన చట్టం ప్రకారం ఆ ఫైలును కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. దాంతో.. 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.
చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి
విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి. కానీ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని పదేపదే కోరుతూ వచ్చారు. ఇందుకోసం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను సైతం తాకట్టు పెట్టారు. ఈ నేపథ్యంలో 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆ మరుసటి రోజే 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టు నీటిపారుదల విభాగంలో మిగిలిన పనికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామనే మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తూ అదే నెల 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ ప్యాకేజీకి ఆమోద ముద్ర వేసింది.
అన్యాయంపై నోరుమెదపని వైనం
పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేస్తామని.. డిజైన్ మారినా, ధరలు పెరిగి అంచనా వ్యయం పెరిగినా, భూసేకరణ వ్యయం పెరిగినా ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తేల్చిచెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు 2010–11 ధరల ప్రకారం మొదటిసారి సవరించిన అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లకు 2017 మే 8న కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్‌ను ఇచ్చినప్పుడు కూడా 2014 ఏప్రిల్ 1కి ముందు నీటిపారుదల విభాగానికి చేసిన ఖర్చుపోనూ, ఆ రోజు ధరల మేరకు మిగిలిన మొత్తాన్ని మాత్రమే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అప్పట్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలు కేంద్ర కేబినెట్‌లో సభ్యులుగా ఉన్నారు. అయినా ఈ అన్యాయంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదప లేదు.
2013–14 ధరలతో నిధుల విడుదలకు ప్రధానికి లేఖ
పైగా 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించి నిధులు విడుదల చేయాలని కోరుతూ 2018 జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇదే అంశాలను ఎత్తిచూపుతూ 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదించాలని.. అప్పుడే రూ.2,234.28 కోట్లను రీయింబర్స్ చేస్తామని తేల్చిచెబుతూ 2020 అక్టోబర్ 12న కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. దాన్ని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి పంపిన కేంద్ర జల్ శక్తి శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవాలని కోరింది.
2017–18 ధరల ప్రకారమే ఇవ్వాలన్న జగన్ ప్రభుత్వం
కేంద్ర ప్రతిపాదనపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌లను హుటాహుటిన ఢిల్లీకి పంపారు. కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్‌లతో వారిద్దరూ సమావేశమై 2017–18 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్రం ఆమోదించిన భూసేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాస (ఆర్‌ఆర్) ప్యాకేజీ వ్యయం రూ.28,191.03 కోట్లకు పెరిగిందని.. ఈ నేపథ్యంలో 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాధ్యం కాదని.. 2017–18 ధరల ప్రకారమే నిధులను విడుదల చేసి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ అక్టోబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లోపాలను లేఖలో ఎత్తిచూపారు.
బేషరతుగా రూ.2,234.28 కోట్లు
సీఎం లేఖపై ప్రధాని మోదీ స్పందించారు. కేంద్ర ఆర్థిక శాఖకు మార్గనిర్దేశనం చేశారు. దాంతో రూ.2,234.28 కోట్లను పోలవరానికి బేషరతుగా విడుదల చేస్తూ నవంబర్ 2న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. అదే రోజున సమావేశమైన పీపీఏ సర్వసభ్య సమావేశం కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని తేల్చిచెబుతూ కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక పంపింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో సమావేశమైన ప్రతిసారి పోలవరానికి 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చి.. శరవేగంగా పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. రూ.2,234.28 కోట్లను ఇప్పటికే రీయింబర్స్ చేసింది.
ఫలించిన సీఎం వైఎస్ జగన్ కృషి
పోలవరానికి 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేయాలన్న పీపీఏ సిఫారసుపై కేంద్ర జల్ శక్తి శాఖ సీడబ్ల్యూసీ అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే ఎస్కే హల్దార్ మంగళవారం నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు పనుల్లో నీటిపారుదల, నీటి సరఫరా వేర్వేరు కాదని.. రెండు ఒకటేనని పునరుద్ఘాటించారు. నీటిపారుదల విభాగం కిందకు జలాశయం(హెడ్‌వర్క్స్),భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ (సహాయ పునవాస ప్యాకేజీ), కాలువలు, పిల్ల కాలువలు (డిస్ట్రిబ్యూటరీలు) వస్తాయని తేల్చిచెప్పారు. సాగునీటి కాలువల ద్వారానే తాగునీరు.. పారిశ్రామిక అవసరాలకు నీరు సరఫరా చేస్తారని స్పష్టం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకూ నీటిపారుదల విభాగం కింద నిధులు ఇస్తున్నామని ఎత్తిచూపారు. పోలవరం ప్రాజెక్టుకూ అదే రీతిలో నిధులు ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే పోలవరం అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది.
ఆర్‌సీసీ ఆమోదించిన వ్యయానికే..
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ 2019 ఫిబ్రవరి 11న ఆమోదించింది. జాతీయ ప్రాజెక్టుల అంచనా వ్యయం 25 శాతం కంటే పెరిగితే.. వాటిని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ)కి పంపి.. మదింపు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆర్‌సీసీకి ప్రతిపాదించారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్‌సీసీ పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా తేల్చి కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు నివేదిక ఇచ్చింది. ఈ అంచనా వ్యయానికే కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇస్తుందని అధికారవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment