వరద నీటిలో సంగమేశ్వర ఆలయం
సాక్షి, అమరావతి/ శ్రీశైలంప్రాజెక్ట్: కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమేణా తగ్గుతూ వస్తోంది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,87,698 క్యూసెక్కులు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 107.45 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
► శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కులను విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 560.5 అడుగుల్లో 233.59 టీఎంసీలకు చేరుకుంది.
► మరో 25 టీఎంసీల ప్రవాహం వస్తే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది.
► పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో కృష్ణా నదికి మంగళవారం వరద పెరుగుతుందని కేంద్ర జలసంఘం అంచనా వేస్తోంది.
► ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు నుంచి గోదావరి నదిలోకి వరద ప్రవాహం చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 1.73 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ గోదావరికి ఇదే గరిష్ట వరద.
కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వర ఆలయం!
పాములపాడు/కొత్తపల్లి: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి వెళ్తోంది. సోమవారానికి ఆలయ శిఖరం నాలుగు అడుగులు మాత్రమే బయటకు కన్పిస్తోంది. శ్రీశైలం జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మంగళవారం ఉదయానికల్లా ఆలయ శిఖరం పూర్తిగా మునిగిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment