సాక్షి, అమరావతి/హొసపేటె: ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి కృష్ణా వరద జలాలు జూరాల, శ్రీశైలానికి మరో వారం రోజుల్లో చేరే అవకాశం ఉందని అధికాలు అంచనా వేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతోంది. శనివారం ఆల్మట్టి జలాశయంలోకి 73,791 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 92.45 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి నిండాలంటే ఇంకా 37 టీఎంసీలు అవసరం. శనివారం నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం ఆల్మట్టిలోకి వరద ప్రవాహం మరింత పెరుగుతుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం లేదా మంగళవారం ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదిలే అవకాశంఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
శనివారం నీటితో కళకళలాడుతున్న తుంగభద్ర జలాశయం
► ఆల్మట్టికి దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 27,756 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 29.86 టీఎంసీలకు చేరుకుంది. నారాయణపూర్ డ్యామ్ నిండాలంటే మరో 8 టీఎంసీలు అవసరం. ఆల్మట్టి నుంచి భారీ వరదను విడుదల చేయనున్న నేపథ్యంలో ఒకే రోజులో నారాయణపూర్ నిండే అవకాశం ఉంది. నారాయణపూర్ గేట్లను బుధవారంలోగా ఎత్తే అవకాశం ఉంది.
► కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం పెరిగింది. తుంగభద్ర జలాశయంలోకి 34,374 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.25 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర జలాశయం నిండాలంటే ఇంకా 82 టీఎంసీలు అవసరం.
► తుంగభద్ర జలాశయానికి దిగువన కురిసిన వర్షాలకు సుంకేశుల బ్యారేజీలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేశుల నుంచి కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయగా మిగిలిన నీటిని దిగువకు వదులుతున్నారు.
► నదీ పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల గోదావరిలో వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,23,122 క్యూసెక్కులు వస్తుండగా.. కాలువలకు 7,900 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 1,15,222 క్యూసెక్కులను కడలిలోకి వదిలారు. జూన్ 1 నుంచి శనివారం వరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 52.885 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి.
► గొట్టా బ్యారేజీలోకి వంశధార ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. బ్యారేజీలోకి 5,474 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 294 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 5,180 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. జూన్ 1 నుంచి శనివారం వరకు గొట్టా బ్యారేజీ నుంచి 7.477 టీఎంసీలు సముద్రంలో కలిశాయి.
► నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 2,808 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 980 క్యూసెక్కులను వదలి మిగిలిన 1828 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
ప్రకాశం బ్యారేజీ ఐదు గేట్లు ఎత్తివేత
సముద్రంలోకి 3,625 క్యూసెక్కుల నీరు విడుదల
కృష్ణా నదికి వరద ప్రవాహం వస్తుండటంతో శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద ఐదు గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో మున్నేరు, కట్టలేరు, వైరా నుంచి కృష్ణా నదిలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉంచి మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేయాలని నిర్ణయించగా.. సాయంత్రం 4 గంటలకు కీసర నుంచి 11,725 క్యూసెక్కుల నీరు వచ్చిందని డ్యామ్ కన్జర్వేషన్ ఈఈ రాజా స్వరూప్‌కుమార్ తెలిపారు. దీంతో 3,625 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment