సాక్షి, అమరావతి: తుంగభద్రలో 29.90 టీఎంసీల నీటిని అదనంగా వినియోగించుకునేలా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు హైడ్రలాజికల్, టెక్నికల్ (సాంకేతిక) అనుమతివ్వడంలో సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) వ్యవహరించిన తీరును నీటిపారుదల రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతివ్వడంపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ‘బచావత్ ట్రిబ్యునల్’ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయింపుల ఆధారంగానే అప్పర్ భద్రకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సీడబ్ల్యూసీ సమర్థించుకోవడాన్ని చూసి నివ్వెరపోతున్నారు. తుంగభద్రలో నీటి లభ్యతలేదని చెబుతూ అప్పర్ భద్రకు అనుమతిచ్చేందుకు బచావత్ ట్రిబ్యునల్ నిరాకరించడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.
బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్–9 (బీ) ప్రకారం.. తుంగభద్రలో 295 టీఎంసీలకు మించి వాడుకోకూడదని నియంత్రణ పెట్టినా.. కర్ణాటక 1980–81 నాటికే ఏటా 319.558 టీఎంసీలను వాడుకుందని.. ఆ తర్వాత నీటి వినియోగం మరింత పెరిగిందని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) స్పష్టంచేయడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్ల ఉత్తర్వులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల అభిప్రాయం తీసుకోకుండా అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ అనుమతివ్వడంపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టాన్ని పాటించాల్సిన సీడబ్ల్యూసీనే.. ఆ చట్టాన్ని తుంగలో తొక్కడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖలు రాయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కార్‌లు నిర్ణయించాయి. అప్పర్ భద్రకు ఇచ్చిన హైడ్రాలాజికల్, టెక్నికల్ అనుమతులను పునఃసమీక్షించి.. దిగువ పరీవాహక రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేయనున్నాయి.
తప్పును సమర్థించుకునేందుకు మరో తప్పు
65 శాతం నీటి లభ్యత ఆధారంగా అప్పర్ భద్రకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పది టీఎంసీలను మాత్రమే కేటాయించింది. కానీ, ఈ తీర్పును కేంద్రం ఇప్పటికీ అమలుచేయలేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే అమల్లో ఉంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం అమలుచేసే వరకూ.. కృష్ణా బేసిన్ (పరీవాహక ప్రాంతం)లో ఏ ప్రాజెక్టును చేపట్టినా దానికి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు కేటాయింపుల ఆధారంగానే సీడబ్ల్యూసీ అనుమతివ్వాల్సి ఉంటుంది. ‘కృష్ణా’.. అంతర్రాష్ట్ర నది అయిన నేపథ్యంలో సీడబ్ల్యూసీ ఏ ప్రాజెక్టుకు అనుమతివ్వాలన్నా బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, కర్ణాటక సర్కార్ తుంగభద్రలో 29.90 టీఎంసీలను వాడుకోవడానికి చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతిచ్చే సమయంలో నిబంధనలను తుంగలో తొక్కింది. ఇదే తప్పును ఏపీ సర్కార్ ఇటీవల ఎత్తిచూపుతూ.. అప్పర్ భద్రకు ఇచ్చిన అనుమతిని పునఃసమీక్షించాలని కోరింది. ఈ అనుమతిని సమర్థించుకునే క్రమంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడే ఇచ్చామని తప్పులో కాలేసింది. బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్రకు అనుమతిని నిరాకరించడాన్ని సీడబ్ల్యూసీ విస్మరించడంపై నీటిపారుదలరంగ నిపుణులు నివ్వెరపోతున్నారు.
తీర్పు అమల్లోకి రాకముందే అదనపు వినియోగానికి ఓకే
అప్పర్ భద్ర ద్వారా తరలించే 29.90 టీఎంసీల్లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన పది టీఎంసీలు కూడా ఉన్నాయని డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లో కర్ణాటక స్పష్టంచేసింది. కానీ, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలుపై కేంద్రం ఇంకా ఉత్తర్వులు జారీచేయలేదు. అయినా ఆ ట్రిబ్యునల్ కేటాయించిన పది టీఎంసీలను వాడుకోవడానికి సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులు చట్టవిరుద్ధమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే తుంగభద్రలో కేటాయించిన నీటి కంటే అధికంగా కర్ణాటక వాడుకుంటోందని.. అప్పర్ భద్ర పూర్తయితే.. ఆ వినియోగం మరింత పెరుగుతుందని.. ఇది తుంగభద్ర డ్యామ్ ఆయకట్టుతోపాటూ కేసీ కెనాల్ (కర్నూల్–కడప కాలువ), ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం), శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీలపై ఆధారపడ్డ ఆయకట్టుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment