సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల వాటా మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా ఒక నీటి సంవత్సరంలో కోటా మేరకు నీటిని వాడుకోకపోతే.. ఆ మిగులు జలాలపై ఇరు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పునరుద్ఘాటించింది. క్యారీ ఓవర్ జలాలపై సంపూర్ణ హక్కును కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–1 కేడబ్ల్యూడీటీ) ఉమ్మడి రాష్ట్రానికి కల్పించిందని గుర్తు చేసింది. విభజన నేపథ్యంలో ఆ జలాలపై రెండు రాష్ట్రాలకూ హక్కు ఉంటుందని.. ఈ వివాదాన్ని బోర్డు నేతృత్వంలో పరిష్కరించుకోవాలని సూచించింది. లేదంటే కేడబ్ల్యూడీటీ–2లో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. ఈ అంశంపై ఈ నెల 25న జరిగే 13వ సర్వసభ్య సమావేశంలో చర్చించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512.06, తెలంగాణకు 298.96 టీఎంసీలను కోటాగా నిర్ణయిస్తూ 2015 జూన్ 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఈ వాటాల మేరకు కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది.
మళ్లీ అదే విషయాన్ని తేల్చి చెప్పిన సీడబ్ల్యూసీ
ప్రస్తుత నీటి సంవత్సరంలోనూ కోటాలో సుమారు 49 టీఎంసీలను వాడుకోలేమని.. వాటిని 2021–22లో వినియోగించుకుంటామని కృష్ణా బోర్డుకు ఏప్రిల్ 9న తెలంగాణ చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. కోటాలో మిగిలిన నీటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని పునరుద్ఘాటించింది. దాంతో ఈ వివాదాన్ని కృష్ణా బోర్డు మళ్లీ సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ వ్యవహారంపై మరోసారి అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ గతేడాది చూపిన పరిష్కార మార్గాన్ని పునరుద్ఘాటిస్తూ కృష్ణా బోర్డుకు దిశానిర్దేశం చేసింది. దాంతో ఈ నెల 25న వర్చువల్ విధానంలో నిర్వహించే 13వ సర్వసభ్య సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది.
ఎప్పటి లెక్కలు అప్పటికే పరిమితం
2019–20 నీటి సంవత్సరంలో తమ కోటా నీటిలో 50.85 టీఎంసీలను వాడుకోలేదని.. వాటిని 2020–21లో వినియోగించుకుంటామని 2020 జూన్ 3న తెలంగాణ సర్కారు కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభిప్రాయం తెలపాలంటూ కృష్ణా బోర్డు కోరింది. ఏ నీటి సంవత్సరం లెక్కలు అదే ఏడాదితో ముగుస్తాయని.. కోటాలో వాడుకోని నీటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని 2020 జూన్ 25న ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి కృష్ణా బోర్డు తీసుకెళ్లింది. ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కేంద్ర జల సంఘం సీఈ విమల్‌కుమార్ నేతృత్వంలో ఓ కమిటీని కేంద్ర జల్ శక్తి శాఖ ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదంపై సమగ్రంగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ ఏపీ వాదనతో ఏకీభవిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇచ్చింది. కోటాలో వాడుకోకుండా మిగిలిన నీటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని రెండు రాష్ట్రాలు బోర్డు నేతృత్వంలో పరిష్కరించుకోవాలని.. లేదంటే కేడబ్ల్యూడీటీ–2లో తేల్చుకోవాలని సూచించింది. దీన్ని అప్పట్లో తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది.
Comments
Please login to add a commentAdd a comment