సాక్షి, అమరావతి: కర్నూలు–కడప (కేసీ) కెనాల్ కోటా నీటిని తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు చోరీ చేస్తున్నాయని కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై నేతృత్వంలో అధికారుల బృందం తేల్చింది. ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలంటే తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపును తక్షణమే నిలిపేయాలని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకు మల్లమ్మకుంట రిజర్వాయర్ పంపింగ్ స్కీంను ఆపేయాలని స్పష్టం చేసింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల, మల్లమ్మకుంట పంపింగ్ స్కీమ్‌ను నిలిపివేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని బోర్డుకు ఇచ్చిన నివేదికలో సూచించింది.
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకు ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కుడి కాలువ పనులనూ ఆపేసేలా ఏపీ సర్కార్‌ను నియంత్రించాలని పేర్కొంది. ఆర్డీఎస్ కోటా నీటిని ఏపీ ప్రభుత్వం చౌర్యం చేస్తోందని గతేడాది అక్టోబర్ 30న కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ ఫిర్యాదు చేశారు. స్పందించిన కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, వాస్తవాలను తేల్చి నివేదిక ఇచ్చేందుకు బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
తెలంగాణ తప్పుడు ఫిర్యాదు
కృష్ణా బోర్డు కమిటీ గత నెల 28న ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల, సుంకేశుల బ్యారేజీలు, కాలువల వ్యవస్థలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసింది. కర్ణాటక సర్కార్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఏపీ కోటా కింద కేసీ కెనాల్‌కు విడుదల చేసిన నీటిని చౌర్యం చేస్తున్నట్లు బోర్డు కమిటీ తేల్చింది. తానే చౌర్యం చేస్తూ ఏపీ సర్కార్‌పై తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ తప్పుడు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేసింది. తుంగభద్ర డ్యామ్‌లో కేసీ కెనాల్ వాటా 10 టీఎంసీల్లో రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని తుంగభద్ర బోర్డుకు ఏపీ సర్కార్ ప్రతిపాదనలు పంపింది.
ఆ మేరకు తుంగభద్ర బోర్డు విడుదల చేస్తోంది. ఆర్డీఎస్ కోటా కింద నీటిని విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలు పంపలేదు. కేసీ కెనాల్ కోటా కింద తుంగభద్ర బోర్డు విడుదల చేస్తున్న 2 వేల క్యూసెక్కుల్లో ఆర్డీఎస్ ఎడమ కాలువ ద్వారా కర్ణాటక సర్కార్ 219, తెలంగాణ ప్రభుత్వం 419 క్యూసెక్కుల చొప్పున రోజూ చౌర్యం చేస్తున్నట్లు బోర్డు కమిటీ తనిఖీల్లో వెల్లడైంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్ కోటా కింద విడుదల చేసిన నీటిలో 300 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్ అక్రమంగా తరలిస్తున్నట్లు బోర్డు కమిటీ తేల్చింది. మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు కూడా కేసీ కెనాల్ కోటా నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్నట్లు వెల్లడైంది.
ఏపీ హక్కులను పరిరక్షించాలంటే..
ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలంటే ఆర్డీఎస్ నిర్వహణను సంయుక్త కమిటీ నేతృత్వంలో చేపట్టాలని బోర్డుకు కమిటీ సూచించింది. టెలీ మీటర్లు ఏర్పాటు చేసి కర్ణాటక, తెలంగాణ వినియోగిస్తున్న నీటిని లెక్కించి.. వాటి కోటాలో కలపాలని పేర్కొంది. అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న తుమ్మిళ్ల ఎత్తిపోతలను తక్షణమే ఆపేసేలా ఆదేశాలివ్వాలని బోర్డుకు స్పష్టం చేసింది. మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు నీటి తరలింపులను నిలిపేయాలని సూచించింది. బోర్డు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకోవడానికి చైర్మన్ ఎంపీ సింగ్ సిద్ధమైనట్లు అధికార వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment