thummilla lift irrigation
-
ప్రజాప్రతినిధులకు రోజూ అవమానాలేనా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి పట్ల ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరుపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో ప్రతినిధులకు ప్రతిరోజు అవమానాలేనా? ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పైన గద్వాల జిల్లా యంత్రాంగం వ్యవహరించిన అనుచిత తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చేతిలో తిరస్కరించబడిన కాంగ్రెస్ నాయకులను అధికారిక సమావేశాలు, కార్యక్రమాల్లో ఎందుకు ఆహ్వానిస్తున్నారో? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమానించేందుకు ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ విధానాలను ఏమైనా మార్చిందా? ’అని కేటీఆర్ నిలదీశారు.Praja Palana where our public representatives are humiliated every dayI condemn the atrocious conduct of District officials who have insulted our MLA, Alampur Vijayudu Garu@TelanganaCS What is the reason for insisting on inviting the Congress party leaders who’ve been… https://t.co/p490wZePDl— KTR (@KTRBRS) August 6, 2024తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటి విడుదలపై వివాదం మంగళవారం వివాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్టు మోటార్లను స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేసి నీళ్లు విడుదల చేశారు. మోటార్లు ఆన్‌చేసి మూడు గంటలైనా నీళ్లు రాకపోవడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. తుమ్మిళ్ల నుంచి విజయుడు వెళ్లిన కొంత సమయానికి అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పంప్‌లను ఆఫ్ చేశారు. దీంతో ఆర్డీఎస్ కాలువకు నీరు నిలిచిపోయిందని ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రైతులతో కలిసి తుమ్మిళ్లకు లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద రోడ్డుపై భైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తిత పరిస్థితి చోటుచేసుకుంది. -
తుమ్మిళ్ల ఎత్తిపోతలను ఆపాల్సిందే
సాక్షి, అమరావతి: కర్నూలు–కడప (కేసీ) కెనాల్ కోటా నీటిని తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు చోరీ చేస్తున్నాయని కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై నేతృత్వంలో అధికారుల బృందం తేల్చింది. ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలంటే తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపును తక్షణమే నిలిపేయాలని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకు మల్లమ్మకుంట రిజర్వాయర్ పంపింగ్ స్కీంను ఆపేయాలని స్పష్టం చేసింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల, మల్లమ్మకుంట పంపింగ్ స్కీమ్‌ను నిలిపివేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని బోర్డుకు ఇచ్చిన నివేదికలో సూచించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకు ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కుడి కాలువ పనులనూ ఆపేసేలా ఏపీ సర్కార్‌ను నియంత్రించాలని పేర్కొంది. ఆర్డీఎస్ కోటా నీటిని ఏపీ ప్రభుత్వం చౌర్యం చేస్తోందని గతేడాది అక్టోబర్ 30న కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఫిర్యాదు చేశారు. స్పందించిన కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, వాస్తవాలను తేల్చి నివేదిక ఇచ్చేందుకు బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ తప్పుడు ఫిర్యాదు కృష్ణా బోర్డు కమిటీ గత నెల 28న ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల, సుంకేశుల బ్యారేజీలు, కాలువల వ్యవస్థలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసింది. కర్ణాటక సర్కార్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఏపీ కోటా కింద కేసీ కెనాల్‌కు విడుదల చేసిన నీటిని చౌర్యం చేస్తున్నట్లు బోర్డు కమిటీ తేల్చింది. తానే చౌర్యం చేస్తూ ఏపీ సర్కార్‌పై తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తప్పుడు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేసింది. తుంగభద్ర డ్యామ్‌లో కేసీ కెనాల్ వాటా 10 టీఎంసీల్లో రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని తుంగభద్ర బోర్డుకు ఏపీ సర్కార్ ప్రతిపాదనలు పంపింది. ఆ మేరకు తుంగభద్ర బోర్డు విడుదల చేస్తోంది. ఆర్డీఎస్ కోటా కింద నీటిని విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలు పంపలేదు. కేసీ కెనాల్ కోటా కింద తుంగభద్ర బోర్డు విడుదల చేస్తున్న 2 వేల క్యూసెక్కుల్లో ఆర్డీఎస్ ఎడమ కాలువ ద్వారా కర్ణాటక సర్కార్ 219, తెలంగాణ ప్రభుత్వం 419 క్యూసెక్కుల చొప్పున రోజూ చౌర్యం చేస్తున్నట్లు బోర్డు కమిటీ తనిఖీల్లో వెల్లడైంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్ కోటా కింద విడుదల చేసిన నీటిలో 300 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్ అక్రమంగా తరలిస్తున్నట్లు బోర్డు కమిటీ తేల్చింది. మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు కూడా కేసీ కెనాల్ కోటా నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఏపీ హక్కులను పరిరక్షించాలంటే.. ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలంటే ఆర్డీఎస్ నిర్వహణను సంయుక్త కమిటీ నేతృత్వంలో చేపట్టాలని బోర్డుకు కమిటీ సూచించింది. టెలీ మీటర్లు ఏర్పాటు చేసి కర్ణాటక, తెలంగాణ వినియోగిస్తున్న నీటిని లెక్కించి.. వాటి కోటాలో కలపాలని పేర్కొంది. అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న తుమ్మిళ్ల ఎత్తిపోతలను తక్షణమే ఆపేసేలా ఆదేశాలివ్వాలని బోర్డుకు స్పష్టం చేసింది. మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు నీటి తరలింపులను నిలిపేయాలని సూచించింది. బోర్డు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకోవడానికి చైర్మన్ ఎంపీ సింగ్ సిద్ధమైనట్లు అధికార వర్గాల సమాచారం. -
సీఎం దృష్టికి తీసుకెళ్తాం: స్మితా సబర్వాల్
సాక్షి, అలంపూర్(మహబూబ్‌నగర్) : తుమ్మిళ్ల ఎత్తిపోతలలో చేపట్టాల్సిన పనులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ చెప్పారు. మంగళవారం ఉదయం రాజోళి మండలంలోని ఈ పథకాన్ని ఆమె పరిశీలించారు. అంతకుముందు హెలికాప్టర్లో తుమ్మిళ్లకు చేరుకున్న ఆమెకు జెడ్పీచైర్‌పర్సన్ సరిత, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, కలెక్టర్ శశాంక స్వాగతం పలికారు. అనంతరం అల్పాహారం తీసుకున్న ఆమె పథకం పనులను పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తుమ్మిళ్ల పథకంలోని జీరో పాయింట్ వద్దకు రాష్ట్ర నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈ అనంతారెడ్డిలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా తుంగభద్ర నది నుంచి అప్రోచ్ కెనాల్లోకి నీరు వచ్చే విధానాన్ని పరిశీలించారు. తుంగభద్ర నదిలో వరద నీరు ఎన్ని రోజులు కొనసాగుతుందో, నది అవతలివైపు ఉన్న గ్రామాలపై అధికారులతో ఆరా తీశారు. సమీపంలోని సుంకేసుల బ్యారేజీ, కేసీ కెనాల్ వివరాలను అడిగారు. ఈ లిఫ్టులో ప్రస్తుతం రెండు 5.5 హెచ్‌పీ, మరొకటి 10.5హెచ్‌పీ మోటార్లు ఉన్నాయని అధికారులు బదులిచ్చారు. ప్రస్తుతం మొదటి విడత పనులు పూర్తి కాగా, ఒక 5.5హెచ్‌పీ మోటార్ ద్వారా మాత్రమే నీటి పంపింగ్ అవుతోందన్నారు. అనంతరం తనగల వద్ద ఉన్న ఆర్డీఎస్ కెనాల్ డి–23 వద్దకు ఆమె వెళ్లి లిఫ్ట్ నుంచి నీరు చేరుకోవడాన్ని పరిశీలించారు. రెండో దశ పనులపైనా.. ఈ ఎత్తిపోతలలో భాగంగా రెండో దశలో చేపట్టాల్సిన రిజర్వాయర్లకు స్థల సేకరణకు రైతులు సిద్ధంగా ఉన్నారా? లేదా? అనే దానిపై స్మితాసబర్వాల్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి మాట్లాడుతూ.. 1.1 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు సంబంధించి సుమారు వంద ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందన్నారు. మిగతా భూమిని సేకరించేందుకు అధికారులు సన్నద్ధమైతే రైతులు తప్పకుండా సహకరిస్తారన్నారు. ఈ ఎత్తిపోతల ద్వారా శాశ్వత ప్రయోజనాలు కలగాలంటే రిజర్వాయర్ల నిర్మాణం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది బాగా వర్షాలు కురవడం, ఎగువ నుంచి తుంగభద్రకు వరద నీరు రావడం వల్ల నీరు సమృద్ధిగా ఉందన్నారు. ఏటా ఇలాగే ఉంటుందని భావించలేమని, దీనిని దృష్టిలో ఉంచుకుని, వీలైనంత త్వరగా రిజర్వాయర్లు నిర్మించి, ఆర్డీఎస్ కెనాల్‌ను ఆధునికీకరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు సుగుణమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు రేణుక, నీటిపారుదలశాఖ ఎస్ఈ రఘునాథ్‌రావు, ఈఈ శ్రీనివాసులు, డీఈ శ్రీనివాస్, ఏఈఈలు శివరాజు, అంజనేయులు, వరుణ్ పాల్గొన్నారు. ఆర్డీఎస్ కెనాల్ వద్ద డెలివరీ సిస్టర్న్‌లో నీటి విడుదలను పరిశీలిస్తున్న అధికారులు పకడ్బందీగా ‘ప్రణాళిక’ పనులు గ్రామాల్లో ‘ప్రణాళిక’ పనులు పకడ్బందీగా నిర్వహించాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ ఆదేశించారు. తుమ్మిళ్ల పంప్‌హౌస్ సమీపంలో మొక్కను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారం, ప్రణాళిక పనులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, వీటి ద్వారా భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్ ఏఈఈ శివరాజ్, డిప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
29న గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన
సాక్షి, గద్వాల: ఈనెల 29న గట్టు ఎత్తిపోతల పథకానికి గట్టు మండలం పెంచికల పాడు వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. గట్టు ఎత్తిపోతల పథకానికి గతంలోనే శంకుస్థాపన చేశామని కొందరు కాంగ్రెస్ నేతలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 29న జోగుళాంబ గద్వాల జిల్లాకు రానున్న నేపథ్యంలో మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి పర్యటించారు. సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న స్థలంతో పాటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు, గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో తుమ్మిళ్ల పనులను పరిశీలించిన అనంతరం హరీశ్ రావు విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు సర్వేల పేరుతో పాలమూరు ఎత్తిపోతల, డిండీ, గట్టు ఎత్తిపోతల పథకాలను కాలయాపన చేస్తూ మోసం చేశారని ఆరోపించారు. అయితే, ఇచ్చిన మాట ప్రకారం పనులను పూర్తి చేసి ప్రజలకు ఫలాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆగస్టు 15 నాటికి: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఆగస్టు 15వ తేదీ నాటికి మొదటి మోటార్ ద్వారా ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హరీశ్ అన్నారు. ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందేదని ప్రస్తుతం 15 వేల ఎకరాలకు పడిపోయిందని, గత ప్రభుత్వాలు ఎవ్వరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రస్తుతం రూ.554 కోట్లతో 33 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేయడానికి వస్తుంటే గౌరవంగా ఆహ్వానించేది పోయి, ప్రజలను మభ్యపెట్టే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అంతకు ముందు తుమ్మిళ్ల పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తుమ్మిళ్ల ఎత్తిపోతలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని తుమ్మిళ్ల దగ్గర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ఇరిగేషన్ కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఆర్డీఎస్ పరిధిలోని ఆయకట్టుకు నీరందించడానికి తుమ్మిళ్ల ఎత్తిపోతలే శరణ్యమని కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు గురువారం జరిగిన భేటీలో కమిటీ దీనికి అంగీకారం తెలిపింది. ఈ పథకానికి రూ.120 కోట్లు ఖర్చవుతుందని ఇంజనీర్లు తెలిపారు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు మొత్తం 15.9 టీఎంసీలు రావాల్సి ఉండగా, కేవలం 5 టీఎంసీలే అందుతున్నాయి. దీంతో ఆ ప్రాంత ఆయకట్టుకు నీరందించలేక పోతున్నారు. దీంతో తుమ్మిళ్లను చేపట్టి ఆర్డీఎస్ కింద ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ఇందిరాసాగర్ ప్రాజెక్టులో ఉన్న పంపులు, పైపులు తుమ్మిళ్ల పథకానికి ఉపయోగించాలని మంత్రులు ఈ సందర్భంగా సూచించారు.