మంగళవారం తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, గద్వాల: ఈనెల 29న గట్టు ఎత్తిపోతల పథకానికి గట్టు మండలం పెంచికల పాడు వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. గట్టు ఎత్తిపోతల పథకానికి గతంలోనే శంకుస్థాపన చేశామని కొందరు కాంగ్రెస్ నేతలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 29న జోగుళాంబ గద్వాల జిల్లాకు రానున్న నేపథ్యంలో మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి పర్యటించారు.
సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న స్థలంతో పాటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు, గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో తుమ్మిళ్ల పనులను పరిశీలించిన అనంతరం హరీశ్ రావు విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు సర్వేల పేరుతో పాలమూరు ఎత్తిపోతల, డిండీ, గట్టు ఎత్తిపోతల పథకాలను కాలయాపన చేస్తూ మోసం చేశారని ఆరోపించారు. అయితే, ఇచ్చిన మాట ప్రకారం పనులను పూర్తి చేసి ప్రజలకు ఫలాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తోందన్నారు.
ఆగస్టు 15 నాటికి: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఆగస్టు 15వ తేదీ నాటికి మొదటి మోటార్ ద్వారా ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హరీశ్ అన్నారు. ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందేదని ప్రస్తుతం 15 వేల ఎకరాలకు పడిపోయిందని, గత ప్రభుత్వాలు ఎవ్వరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రస్తుతం రూ.554 కోట్లతో 33 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేయడానికి వస్తుంటే గౌరవంగా ఆహ్వానించేది పోయి, ప్రజలను మభ్యపెట్టే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అంతకు ముందు తుమ్మిళ్ల పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment