సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకం, విద్యుదుత్పత్తి, బోర్డు పరిధిని ఖరారుచేస్తూ జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు తదితర పది అంశాలు అజెండాగా బుధవారం కృష్ణాబోర్డు సమావేశమవుతోంది. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడమే లక్ష్యంగా బలమైన వాదనలు విన్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ సర్కార్ దుందుడుకు వైఖరిని బోర్డు సమావేశం వేదికగా మరోసారి ఎండగట్టాలని నిర్ణయించింది.
కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన హైదరాబాద్‌లో బుధవారం 14వ సర్వసభ్య సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి.. తెలంగాణ సర్కార్ తరఫున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్ తదితరులు సమావేశంలో పాల్గొననున్నారు.
పరిధిలోలేని అంశంపై చర్చకు కళ్లెం?
ఉమ్మడి రాష్ట్రానికి ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ 2015, జూన్ 18–19 తేదీల్లో కేంద్ర జల్‌శక్తి శాఖ తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఈ ఒప్పందంపై రెండు రాష్ట్రాలు సంతకాలు చేశాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ రెండు రాష్ట్రాలు ఇదే పద్ధతిలో కృష్ణా జలాలను వినియోగించుకోవాలని 2020, అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టంచేసింది. కానీ, ఈ నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డుకు ప్రతిపాదించింది.
దీన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. నదీ జలాల పంపిణీ అధికారం కేవలం ట్రిబ్యునళ్లకు మాత్రమే ఉందని.. పరిధిలోకి రాని ఈ అంశంపై చర్చించేందుకు ఆస్కారం ఇవ్వకూడదని బోర్డుకు ఇప్పటికే తేల్చిచెప్పింది. చిన్న నీటివనరుల విభాగంలో తెలంగాణకు 89.15 టీఎంసీల కేటాయింపు ఉంటే.. 175 టీఎంసీలు వాడుకుంటున్న నేపథ్యంలో ఏపీ వాటాను 79.88 టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేసింది. ఇదే అంశాన్ని బోర్డు సమావేశంలో తెగేసి చెప్పాలని నిర్ణయించింది.
విద్యుదుత్పత్తితో రెండు రాష్ట్రాలకూ నష్టమే..
శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేయాలి. కానీ.. దిగువన నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం, సాగర్, పులిచింతల్లో విద్యుదుత్పత్తి చేస్తూ తమ హక్కులను కాలరాస్తోందని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం అనేకసార్లు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో తెలంగాణ సర్కార్‌ను కట్టడి చేయాలని కోరింది.
అంతేకాక.. ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖల దృష్టికీ ఈ అంశాన్ని తీసుకెళ్లి.. రాష్ట్ర హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది. అయినా.. తెలంగాణ సర్కార్ తీరు మారకపోవడంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నుంచి 185.78 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. దీని ఫలితంగా శ్రీశైలంలో నీటినిల్వ 158.63 టీఎంసీలకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ వైఖరితో రెండు రాష్ట్రాలకూ నష్టం వాటిల్లుతుందనే అంశాన్ని బోర్డు సమావేశంలో మరోసారి ఎలుగెత్తాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తయ్యే విద్యుత్‌లో ఏపీకి 66, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేయాలని డిమాండ్ చేయనుంది.
సీడబ్ల్యూసీ ప్రతిపాదన మేరకే..
ఒక నీటి సంవత్సరంలో వినియోగించుకోని వాటా నీళ్లను మరుసటి ఏడాది వాడుకోవడానికి అనుమతివ్వాలన్న తెలంగాణ సర్కార్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది. వాటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో సీడబ్ల్యూసీ ఏకీభవించింది. క్యారీ ఓవర్ జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని.. వాటిని ఏకాభిప్రాయంతో పంచుకోవడం లేదంటే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో తేల్చుకోవాలని సీడబ్ల్యూసీ స్పష్టంచేసింది. ఆ మేరకే క్యారీ ఓవర్ జలాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేయనుంది. శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వృథాగా వరద జలాలు కలుస్తున్నప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎవరు ఆ నీటిని వాడుకున్నా వాటిని కోటా కింద పరిగణించకూడదని మరోసారి ఏపీ ప్రతిపాదించనుంది.
తేల్చాల్సింది బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలే..
కృషాడెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ సాగర్‌కు ఎగువన కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీలను వాడుకోవడానికి ఉమ్మడి రాష్ట్రానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. వాటిని తమకే కేటాయించాలంటున్న తెలంగాణ వాదనను ఏపీ తోసిపుచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ జలాలు రెండు రాష్ట్రాలకు దక్కుతాయని.. ఈ అంశాన్ని తేల్చాల్సింది బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలేగానీ బోర్డుకాదని తెగేసి చెప్పనుంది. ఇక కృష్ణా బేసిన్‌కు తెలంగాణ సర్కార్ మళ్లిస్తున్న 211 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని నిర్ణయించింది.
నేడు గోదావరి బోర్డు భేటీ
గోదావరి బోర్డు పరిధిని ఖరారుచేస్తూ జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలే ప్రధాన అజెండాగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో బోర్డు సమావేశమవుతోంది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి, తెలంగాణ సర్కార్ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్‌లు పాల్గొననున్నారు. గత నెల 3న జరిగిన సమన్వయ కమిటీ, 9న జరిగిన ఉమ్మడి బోర్డుల సమావేశాలకు తెలంగాణ సర్కార్ ప్రతినిధులు గైర్హాజరైన నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment