సాక్షి, అమరావతి: తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు అన్నీ అనుమతులు ఉన్నాయని కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విభజన చట్టం 11వ షెడ్యూలు సెక్షన్–85(7)(ఈ)లో ఆ నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిని అనుమతి లేని ప్రాజెక్టులుగా వర్గీకరిస్తే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని కృష్ణా బోర్డుకు స్పష్టం చేయాలని నిర్ణయించింది.
అనుమతి ఉన్న ఆ నాలుగు ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేయనుంది. కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆ ఆరు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న వీటిని పూర్తి చేసేందుకు విభజన చట్టం ద్వారా కేంద్రం అనుమతించింది. వాటికి ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నీటి కేటాయింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
గెజిట్ నోటిఫికేషన్‌లోనే తప్పిదం..
ఏదైనా అనుమతించిన ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు చేసినా, నీటిని తరలించే సామర్థ్యాన్ని పెంచినా మళ్లీ అనుమతి తీసుకోవాలన్నది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిబంధన. విభజన తర్వాత వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల డిజైన్లను గానీ సామర్థ్యాన్ని గానీ రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. అంటే ఈ నాలుగు ప్రాజెక్టులకు మళ్లీ కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. మరోవైపు కల్వకుర్తి (25 నుంచి 40 టీఎంసీలకు), నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల డిజైన్లను మార్చడంతోపాటు సామర్థ్యాన్ని కూడా తెలంగాణ సర్కార్ పెంచింది.
అయితే కేంద్ర జల్ శక్తి శాఖ మాత్రం కల్వకుర్తి, నెట్టెంపాడుతో పాటు వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను గతేడాది జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో అనుమతి లేని ప్రాజెక్టులుగా గుర్తించింది. వాటికి ఏడాదిలోగా అనుమతి పొందాలని, లేదంటే నీటి వినియోగానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. డిజైన్లు మార్చకున్నా, సామర్థ్యం పెంచకున్నా వెలిగొండ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులను అనుమతి లేనివిగా పేర్కొనడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసింది.
చట్టాన్ని ఉల్లంఘించినట్లే..
కేంద్ర జల్‌శక్తి శాఖ విధించిన గడువు సమీపిస్తుండటంతో అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలపై ఒత్తిడి పెంచుతోంది. వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగలకు అనుమతి తీసుకోవాలని చెబుతోంది. ఇదే అంశాన్ని ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. నాలుగు ప్రాజెక్టులను అనుమతి ఉన్న వాటిగా విభజన చట్టం గుర్తించిందన్నారు. ఇప్పుడు వాటికి మళ్లీ అనుమతి తీసుకోవాలని కోరడం విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు. ఇదే అంశాన్ని బోర్డుకు, జల్‌శక్తి శాఖకు స్పష్టం చేస్తామని తెలిపారు.
ఆ నాలుగూ అనుమతి ఉన్నవే
Published Mon, Jun 6 2022 4:16 AM | Last Updated on Mon, Jun 6 2022 3:53 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment