సాక్షి, అమరావతి: పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి, తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలని కోరుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టువల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని.. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేసింది. పర్యావరణ అనుమతిలేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు, నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కన్పించలేదని పేర్కొంది.
విభజన చట్టాన్ని ఉల్లంఘించి.. కృష్ణాబోర్డు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), అపెక్స్ కౌన్సిల్ ఆమోదంలేకుండా చేపట్టిన ఈ పథకాన్ని నిలుపుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణా బోర్డులను కోరినా ఫలితం లేకపోయిందని ఎన్జీటీకి వివరించింది. ఈ రిట్ పిటిషన్‌లో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి, నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్ చైర్మన్, కృష్ణా బోర్డు ఛైర్మన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చింది. తక్షణమే ఈ పనులను నిలుపుదల చేయించి.. ఏపీ హక్కులను పరిరక్షించడంతోపాటు ప్రజల జీవనోపాధికి విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ రిట్ పిటిషన్‌పై సోమవారం ఎన్జీటీ విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్జీటీలో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు పేర్కొన్న ప్రధానాంశాలు ఇవీ..
► ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా)–2006 నోటిఫికేషన్ ప్రకారం పది వేల ఎకరాల కంటే ఎక్కువగా కొత్త ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులకు ముందస్తుగా పర్యావరణ అనుమతి తీసుకుని పనులు చేపట్టాలి.
► ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం.. కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
► కానీ.. తెలంగాణ సర్కార్ అవేమీ లేకుండానే శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తరలించి.. 3,60,680 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిండి పనులను 2015, జూన్ 11న చేపట్టింది.
► దీనిపై పలుమార్లు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేశాం. ఈ పనులవల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని చెప్పాం. డిండి ఎత్తిపోతల పనులు చేసే ప్రదేశం పులుల అభయారణ్యంలో ఉండటంవల్ల.. వాటి ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందని నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశాం. కానీ, ఎలాంటి స్పందన కన్పించలేదు.
► ఈ ఎత్తిపోతలవల్ల ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని కృష్ణా బోర్డు, కేంద్ర జల్‌శక్తి శాఖకు అనేకసార్లు ఫిర్యాదు చేశాం. వాటిపైనా ఎలాంటి స్పందనలేదు.
► ఈ పథకం పూర్తయితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. తాగు, సాగునీటి కొరతకు.. వాతావరణ అసమతుల్యతకు దారితీస్తుంది. ప్రజలు జీవించే హక్కును దెబ్బతీస్తుంది.
డిండి ఎత్తిపోతలపై ఎన్జీటీకి
Published Sun, Oct 3 2021 4:10 AM | Last Updated on Sun, Oct 3 2021 4:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment