
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు మరమ్మతులు, ఆధునికీకరణ పనులను చేపట్టేందుకు రూ.1,123.41 కోట్లు అవసరమని కృష్ణా బోర్డు అంచనా వేసింది. ఇక ఈ రెండు ప్రాజెక్టుల స్పిల్ వేలు, విద్యుత్కేంద్రాలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ఏటా మరో రూ.819.62 కోట్లు అవసరమని తేల్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి శాఖ గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఏపీ, తెలంగాణ చెరో రూ.200 కోట్లు చొప్పున సీడ్ మనీగా బోర్డు ఖాతాలో జమ చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖతో పాటు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇవీ..
► శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు రూ.73.66 కోట్లు అవసరం కాగా నాగార్జునసాగర్‌లో పనులను పూర్తి చేసేందుకు రూ.207.25 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో పనులను పూర్తి చేసేందుకు రూ.280.91 కోట్లు అవసరమవుతాయి.
► శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే ఫ్లంజ్ ఫూల్ దెబ్బతింది. స్పిల్ వే మరమ్మతులు, ఆధునికీకరణకు రూ.810.89 కోట్లు అవసరం. సాగర్ స్పిల్‌వే ఆధునికీకరణకు రూ.31.61 కోట్లు అవసరం.
► ప్రస్తుతం చేపట్టిన పనులతో పాటు మరమ్మతులు, ఆధునికీకరణ పనులను పూర్తి చేసేందుకు మూడు నాలుగేళ్ల సమయం పడుతుంది. ఇందుకు రూ.1,123.41 కోట్లు వ్యయం కానుంది.
► ఏటా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు రూ.38.39 కోట్లు, రెండు విద్యుత్ కేంద్రాల నిర్వహణకు రూ.4.13 కోట్లు, శ్రీశైలంపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలు(హంద్రీ–నీవాలో భాగమైన మల్యాల, ముచ్చుమర్రి.. కల్వకుర్తి) నిర్వహణకు రూ.372.89 కోట్లు అవసరం. శ్రీశైలం నిర్వహణకు ఏటా రూ.415.41 కోట్లు అవసరం.
► నాగార్జునసాగర్ స్పిల్ వేకు రూ.17.45 కోట్లు, విద్యుత్కేంద్రాలకు రూ.14.70, ఎత్తిపోతల పథకాలకు రూ.372.06 కోట్లు వెరసి నిర్వహణకు రూ.404.21 కోట్లు కావాలి.
► ఉమ్మడి ప్రాజెక్టులను ఏటా నిర్వహించడం, చేపట్టిన పనులను పూర్తి చేయడం, మరమ్మతులు, ఆధునికీకరణకు రూ.1,943.03 కోట్లు అవ సరం.
► సీడ్ మనీని తగ్గించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం. గెజిట్ నోటిఫికేషన్ మేరకు ఒక్కో రాష్ట్రం ఒకేసారి రూ.200 కోట్లు చొప్పున బోర్డు ఖాతాలో జమ చేయాలి. వ్యయాన్ని నీటి వాటాలు, విద్యుత్ వాటాల దామాషా పద్ధతిలో రెండు రాష్ట్రాలు భరించాలి.
Comments
Please login to add a commentAdd a comment