కృష్ణా బోర్డు తీరు సరికాదు!  | Irrigation experts comments on Krishna board | Sakshi
Sakshi News home page

కృష్ణా బోర్డు తీరు సరికాదు! 

Published Mon, Mar 21 2022 4:44 AM | Last Updated on Mon, Mar 21 2022 3:55 PM

Irrigation experts comments on Krishna board - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్న సమయంలో మళ్లించిన వరద జలాలను కృష్ణా బోర్డు ఏపీ కోటాలో కలపడంపై సాగునీటిరంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించడమేనని స్పష్టంచేస్తున్నారు. నిజానికి.. వరద జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛను కృష్ణా బేసిన్‌లో దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చింది. అలాగే, విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్ధారించింది. ఈ నేపథ్యంలో.. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పే ఇప్పటికీ అమల్లో ఉన్నందున వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే 2019లో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండిపోవడంతో కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి కలిసే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఏపీ సర్కార్‌ వరద నీటిని దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు మళ్లించింది.

రెండేళ్లయినా నివేదిక ఇవ్వని సీడబ్ల్యూసీ
వరద జలాలు వృథాగా కడలిలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. దీన్ని తెలంగాణ సర్కార్‌ వ్యతిరేకించింది. దాంతో.. ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి 2020, జూన్‌లోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని 2019లో కృష్ణా బోర్డు కోరింది. కానీ, 2020 మేలో రెండు రాష్ట్రాల జలనవరుల శాఖ అధికారులతో ఒకసారి మాత్రమే సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ తర్వాత దీనిపై సీడబ్ల్యూసీ దృష్టిసారించకపోవడమేకాక.. నివేదిక కూడా ఇవ్వలేదు.

బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును ఉల్లంఘించినట్లే..
ప్రకాశం బ్యారేజీ నుంచి 2019–20లో 798.29, 2020–21లో 1,289, 2021–22లో 501.36 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి. మూడేళ్లలోనూ సగటున 72 రోజులు వరద ప్రవాహం వృథాగా సముద్రంలో కలిసింది. సీడబ్ల్యూసీ నివేదిక వచ్చే వరకూ ఏపీ మళ్లించిన వరద జలాల్లో 50 శాతాన్ని కోటా కింద పరిగణించాలని తెలంగాణ ప్రతిపాదనను కృష్ణా బోర్డు ఆమోదించింది. 2020–21లో 22 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 11, 2021–22లో 40 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 20 టీఎంసీలను ఏపీ కోటాలో బోర్డు కలిపింది. ఇక 2020–21లో కృష్ణాలో 953 టీఎంసీల లభ్యత ఉంటే ఇందులో 66 శాతం అంటే 629 టీఎంసీలు ఏపీకి, 34 శాతం అంటే 324 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఏపీ వాడుకున్న వరద జలాల్లో 20 టీఎంసీలను నికర జలాల కోటాలో కలిపింది. లేదంటే.. ఏపీకి అదనంగా 20 టీఎంసీల జలాలు వచ్చేవే. ఇది బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును ఉల్లంఘించడమేనని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు.

మళ్లించకపోతే వరద ముప్పే
నిజానికి.. శ్రీశైలం నుంచి కృష్ణా వరదను మళ్లించకపోతే దిగువన కృష్ణా, గుంటూరు జిల్లాలకు తీవ్ర ముప్పు తప్పదు. అందుకే విభజన చట్టంలో సెక్షన్‌–85 (7) ప్రకారం విపత్తు నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం అప్పగించింది. ఆ చట్టం ప్రకారం వరద ముప్పును తప్పించడానికి ఏపీ సర్కార్‌ మళ్లించిన వరద జలాలను నికర జలాల కోటాలో కలపడంపై నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కృష్ణా బోర్డు సీడబ్ల్యూసీ నివేదిక ఇవ్వలేదనే సాకుచూపి.. ఏపీ ప్రయోజనాలను పరిరక్షించకపోవడం సరికాదంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement