bachawat tribunal
-
తుంగభద్రలో నీటి లభ్యత సగంలోపే!
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పుల కారణంగా తుంగభద్ర బేసిన్లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడం వల్ల తుంగభద్ర (టీబీ) డ్యామ్‌లో నీటి లభ్యత ఈ ఏడాది సగానికి పడిపోయింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు డ్యామ్‌లోకి 114.58 టీఎంసీల ప్రవాహం మాత్రమే వచ్చింది. తుంగభద్ర నదిలో వందేళ్ల ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని.. టీబీ డ్యామ్ వద్ద 75 శాతం లభ్యత ఆధారంగా 230 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా 1976లో వేసింది. దీన్ని బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ 2010లో ఖరారు చేసింది. కానీ.. రెండు ట్రిబ్యునళ్లు అంచనా వేసిన దాంట్లో సగం నీళ్లు కూడా ఈ ఏడాది టీబీ డ్యామ్‌లోకి చేరకపోవడం గమనార్హం. టీబీ డ్యామ్ చరిత్రలో 2016–17లో వచి్చన 85.71 టీఎంసీలే కనిష్ట ప్రవాహం. ఈ ఏడాది వచ్చింది రెండో కనిష్ట ప్రవాహం. శనివారం నాటికి టీబీ డ్యామ్‌లో 10.29 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 76.91 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. టీబీ డ్యామ్‌లో ఇదే సమయానికి గత పదేళ్లలో సగటున 50.60 టీఎంసీలు నిల్వ ఉండేవి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే గత పదేళ్లలో కనిష్ట నీటి నిల్వ ఉండడం కూడా ఇదే తొలిసారి. టీబీ డ్యామ్ నుంచి కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండడంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తున్నది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని.. నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో 3 రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తున్నది. ఈ ఏడాది నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో ఆయకట్టులో ఆరు తడి పంటలకు నీటిని సరఫరా చేశారు. 2019–20 నుంచి 2022–23 వరకుటీబీ డ్యామ్‌లోకి భారీగా వరద చేరడంతో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించారు. టీబీ డ్యామ్ చరిత్రలో గతేడాది అంటే 2022–23లో వచి్చన 606.64 టీఎంసీలే గరిష్ట వరద ప్రవాహం కావడం గమనార్హం. -
తెలంగాణకు మరో అవకాశం.. ఈసారి కూడా హాజరు కాకుంటే...!
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో జల విద్యుదుత్పత్తికి విధి విధానాలు, నీటి నిల్వ, నీటి విడుదల ప్రక్రియలు (రూల్ కర్వ్), వరద జలాల మళ్లింపుపై అభిప్రాయాలు చెప్పేందుకు తెలంగాణకు కృష్ణా బోర్డు మరో అవకాశం ఇచ్చింది. వాటిపై రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) మూడో సమావేశాన్ని ఈనెల 16న ఏర్పాటు చేసింది. గత నెలలో జరిగిన రెండు ఆర్ఎంసీ సమావేశాలకు తెలంగాణ హాజరుకాలేదు. దీంతో తెలంగాణకు మరో అవకాశమివ్వాలని బోర్డు నిర్ణయించింది. 16న జరిగే మూడో సమావేశానికి కూడా తెలంగాణ అధికారులు గైర్హాజరైతే బోర్డు ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లనుంది. కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశాల మేరకు బచావత్ ట్రిబ్యునల్, సీడబ్ల్యూసీ రూల్ కర్వ్ ముసాయిదా ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు వర్గాలు వెల్లడించాయి. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, నీటి నిల్వ, విడుదల ప్రక్రియ, వరద రోజుల్లో మళ్లించిన నీటిని కోటా కింద లెక్కించాలా? వద్దా? అన్నవే కారణమవుతున్నాయని బోర్డు గుర్తించింది. ఈ సమస్యల పరిష్కారానికి నివేదిక ఇచ్చే బాధ్యతను ఆర్‌ఎంసీకి అప్పగించింది. గత నెల 20న మొదటి సారి, 30న రెండో సారి ఆర్ఎంసీ భేటీ అయ్యింది. ఈ రెండు సమావేశాలకు ఏపీ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ తరఫున అధికారులెవరూ రాలేదు. దీంతో మరోసారి అవకాశమివ్వనున్నారు. మూడో భేటీలో తెలంగాణ అధికారులు హాజరై అభిప్రాయాలు చెబితే ఇరు రాష్ట్రాల వాదనల ఆధారంగా ఆర్ఎంసీ నివేదిక ఇస్తుంది. వాటిని బోర్డు అమలు చేస్తుంది. తెలంగాణ అధికారులు గైర్హాజరైతే కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. స్పష్టమైన అభిప్రాయాలు చెప్పిన ఏపీ శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగుల్లో ఏడాది పొడవునా నీటి నిల్వ ఉండేలా చూడాలని ఏపీ తరపున ఆర్ఎంసీ భేటీలకు హాజరైన ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఇతర అధికారులు స్పష్టంగా చెప్పారు. సాగర్, శ్రీశైలంలో తాగు, సాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సాగుకు నీరు విడుదల చేసినప్పడే విద్యుదుత్పత్తి చేయాలన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకే ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని స్పష్టంచేశారు. కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో సముద్రంలో జలాలు కలుస్తున్నప్పుడు వరద జలాలను ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని నికర జలాల కోటాలో కలపకూడదని చెప్పారు. ఏపీ వాదనతో ఆర్ఎంసీ ఏకీభవించింది. -
కృష్ణా జలాలపై తెలంగాణ తొండాట
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో వాటాపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నీటిపారుదలరంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ 34 టీఎంసీల (ఎస్సార్బీసీకి 19, చెన్నై తాగునీటికి 15)ను మాత్రమే వాడుకుంటేనే.. ఉమ్మడి ప్రాజెక్టుల్లో 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు నీటిని పంపిణీ చేయాలని సోమవారం కృష్ణాబోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి 34 టీఎంసీల కంటే అధికంగా వాడుకుంటే.. కృష్ణాజలాల్లో ఏపీ, తెలంగాణలకు చెరిసగం పంపిణీ చేయాలని.. ఇదే అంశాన్ని గత సమావేశంలో ప్రస్తావించినా వాటిని మినిట్స్‌లో పేర్కొనలేదని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 6న జరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని కోరడంపై నిపుణులు నివ్వెరపోతున్నారు. ‘బచావత్’ కేటాయింపులే ఆధారం బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా ఉమ్మడి రాష్ట్రానికి చేసిన 811 టీఎంసీల కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015, జూన్ 19న కేంద్రం తాత్కాలిక ఒప్పందం కుదుర్చింది. దీనిపై అటు తెలంగాణ.. ఇటు ఏపీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. 2015–16, 2016–17 సంవత్సరాల్లో ఇదే పద్ధతిలో కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేసింది. 2017, నవంబర్ 4న జరిగిన బోర్డు సమావేశంలో.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిని 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేయాలని రెండు రాష్ట్రాలు ప్రతిపాదించాయి. దాంతో.. ఆ పద్ధతి ప్రకారమే 2017–18, 2018–19, 2020–21, 2021–22లలో కృష్ణాబోర్డు నీటిని పంపిణీ చేసింది. ఏమిటీ వితండ వాదన.. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసిన బచావత్ ట్రిబ్యునల్.. వాటాగా దక్కిన జలాలను రాష్ట్రంలో ఎక్కడైనా వినియోగించుకునే స్వేచ్ఛనూ ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కూడా కొనసాగించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. ఇప్పటికీ బచావత్ ట్రిబ్యునల్ తీర్పే అమల్లో ఉంది. ఇక వరద జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ట్రిబ్యునల్ కేటాయింపుల ద్వారా హక్కుగా దక్కిన జలాలను.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవాతోపాటు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ వాడుకోవడం తప్పెలా అవుతుందని నీటిపారుదలరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చినా.. కృష్ణా జలాల్లో ఏపీ వాటా ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ ఉన్నతాధికారులకు వాస్తవాలు తెలిసి కూడా వితండవాదనకు దిగడాన్ని వారు తప్పుపడుతున్నారు. -
'కృష్ణా'పై ఇదేం కిరికిరి?
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కారు తాజాగా కృష్ణా బోర్డుకు లేఖ రాయడాన్ని నీటిపారుదల రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015 జూన్ 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీనికి అంగీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంతకం కూడా చేసింది. 2017–18 నీటి సంవత్సరంలో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఆవిరి నష్టాలు పోనూ లభ్యతగా ఉన్న నీటిని 66 : 34 చొప్పున పంపిణీ చేసుకునేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ ఇదే పద్ధతిలో నీటిని పంచుకోవాలని నిర్ణయించడంతో 2018–19, 2019–20, 2020–21, 2021–22లలో అదే విధానం ప్రకారం నీటిని కృష్ణా బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. పదే పదే పేచీ.. తెలంగాణ సర్కార్ 2015, 2017–18లలో కుదిరిన ఒప్పందాలను తుంగలో తొక్కుతూ ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల పంపిణీపై పదేపదే పేచీకి దిగుతోంది. రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ లేఖ రాయడంతో మే 6న నిర్వహించే బోర్డు సర్వ సభ్య సమావేశంలో చర్చించాలని బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ నిర్ణయించి అజెండాలో చేర్చారు. చెరి సగం అసాధ్యం.. కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు, పునరుత్పత్తి 70 టీఎంసీలతో కలిపి 2,130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఏపీకి 811 టీఎంసీలను కేటాయించింది. మిగులు జలాలను హక్కుగా కాకుండా వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి ఇచ్చింది. ► ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16 టీఎంసీల వాటా కల్పించింది. నిర్మాణం, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. ► ఆ కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక ఏర్పాటు చేసింది. ► బచావత్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం కాబట్టే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వాటిని కొనసాగించింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే చెరి సగం వాటా కావాలని తెలంగాణ సర్కార్ లేఖ రాయడం చట్టవిరుద్ధమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. -
కృష్ణా బోర్డు తీరు సరికాదు!
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్న సమయంలో మళ్లించిన వరద జలాలను కృష్ణా బోర్డు ఏపీ కోటాలో కలపడంపై సాగునీటిరంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించడమేనని స్పష్టంచేస్తున్నారు. నిజానికి.. వరద జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛను కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. అలాగే, విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్ధారించింది. ఈ నేపథ్యంలో.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ఇప్పటికీ అమల్లో ఉన్నందున వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే 2019లో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండిపోవడంతో కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి కలిసే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ సర్కార్ వరద నీటిని దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు మళ్లించింది. రెండేళ్లయినా నివేదిక ఇవ్వని సీడబ్ల్యూసీ వరద జలాలు వృథాగా కడలిలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. దీన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది. దాంతో.. ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి 2020, జూన్‌లోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని 2019లో కృష్ణా బోర్డు కోరింది. కానీ, 2020 మేలో రెండు రాష్ట్రాల జలనవరుల శాఖ అధికారులతో ఒకసారి మాత్రమే సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ తర్వాత దీనిపై సీడబ్ల్యూసీ దృష్టిసారించకపోవడమేకాక.. నివేదిక కూడా ఇవ్వలేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించినట్లే.. ప్రకాశం బ్యారేజీ నుంచి 2019–20లో 798.29, 2020–21లో 1,289, 2021–22లో 501.36 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి. మూడేళ్లలోనూ సగటున 72 రోజులు వరద ప్రవాహం వృథాగా సముద్రంలో కలిసింది. సీడబ్ల్యూసీ నివేదిక వచ్చే వరకూ ఏపీ మళ్లించిన వరద జలాల్లో 50 శాతాన్ని కోటా కింద పరిగణించాలని తెలంగాణ ప్రతిపాదనను కృష్ణా బోర్డు ఆమోదించింది. 2020–21లో 22 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 11, 2021–22లో 40 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 20 టీఎంసీలను ఏపీ కోటాలో బోర్డు కలిపింది. ఇక 2020–21లో కృష్ణాలో 953 టీఎంసీల లభ్యత ఉంటే ఇందులో 66 శాతం అంటే 629 టీఎంసీలు ఏపీకి, 34 శాతం అంటే 324 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఏపీ వాడుకున్న వరద జలాల్లో 20 టీఎంసీలను నికర జలాల కోటాలో కలిపింది. లేదంటే.. ఏపీకి అదనంగా 20 టీఎంసీల జలాలు వచ్చేవే. ఇది బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించడమేనని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. మళ్లించకపోతే వరద ముప్పే నిజానికి.. శ్రీశైలం నుంచి కృష్ణా వరదను మళ్లించకపోతే దిగువన కృష్ణా, గుంటూరు జిల్లాలకు తీవ్ర ముప్పు తప్పదు. అందుకే విభజన చట్టంలో సెక్షన్–85 (7) ప్రకారం విపత్తు నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం అప్పగించింది. ఆ చట్టం ప్రకారం వరద ముప్పును తప్పించడానికి ఏపీ సర్కార్ మళ్లించిన వరద జలాలను నికర జలాల కోటాలో కలపడంపై నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కృష్ణా బోర్డు సీడబ్ల్యూసీ నివేదిక ఇవ్వలేదనే సాకుచూపి.. ఏపీ ప్రయోజనాలను పరిరక్షించకపోవడం సరికాదంటున్నారు. -
'కృష్ణా జలాల పునఃపంపిణీ' అసాధ్యం!
(రామగోపాలరెడ్డి ఆలమూరు–సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయించిన కృష్ణా నదీ జలాలను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీ)–1956 సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయడం సాధ్యమవుతుందా? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను పునఃపంపణీ చేయడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలకు కానే కాదని న్యాయ, నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టంలో సెక్షన్–4(2), సెక్షన్–6(2) ప్రకారం ట్రిబ్యునల్ జారీ చేసిన తీర్పే అంతిమం అని, అది సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించే అధికారం ఎవరికీ లేదని చెబుతున్నారు. కృష్ణా నదీ జలాల్లో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 2,130 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) ముట్టుకోక పోవడానికి అదే కారణమని ఎత్తిచూపుతున్నారు. 75 శాతం, 65 శాతం లభ్యత మధ్య ఉన్న 163 టీఎంసీలు, మిగులు జలాలు 285 వెరసి 448 టీఎంసీలను మాత్రమే అదనంగా మూడు రాష్ట్రాలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పంపిణీ చేసిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనపై న్యాయ శాఖ వెల్లడించే అభిప్రాయం ఆధారంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి సంజయ్ అవస్థి శుక్రవారం స్పష్టం చేయడమే అందుకు తార్కాణమని చెబుతున్నారు. పునఃపంపిణీ చేయాలంటున్న తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలకు తగ్గట్టుగా వాదనలు విన్పించలేదని.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను పునఃపంపిణీ చేయాలని 2014 జూలై 14న కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ 2015 మే 1న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టంలో సెక్షన్6(2) ప్రకారం.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని నాటి ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కేంద్రానికి తేల్చి చెబుతూ ప్రత్యుత్తరమిచ్చారు. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ 20న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను సెక్షన్–3 ప్రకారం రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సెక్షన్–5(2) కింద ముసాయిదా, 5(3) కింద కేంద్రానికి ఇచ్చిన తుది నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని.. ప్రతిపాదన పంపితే న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని, తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఆ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జూన్ 9న తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని ఇరు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని కోరుతూ జూన్ 14న కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ.. న్యాయ శాఖ అభిప్రాయం కోరింది. ఇప్పటికే తేల్చి చెప్పిన కేంద్రం విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి పంపిణీ చేసిన కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు 2014 నుంచే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కసరత్తు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలకు కాకుండా.. నాలుగు రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నదీ జలాలను పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఏపీ, తెలంగాణ సర్కార్లు కోరాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ట్రిబ్యునల్ కోరింది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంచడానికే ట్రిబ్యునల్ గడువును పొడిగించామే తప్ప.. నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి కాదని స్పష్టం చేస్తూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దాంతో.. ఉమ్మడి రాష్ట్రాలకు కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలకే పంపిణీ చేస్తామని 2016 అక్టోబర్ 19న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఆ మేరకు గత ఐదేళ్లుగా విచారణ చేస్తోంది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కష్టమే బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను సెక్షన్–3 రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ రాసిన లేఖను కేంద్రం పరిగణనలోకి తీసుకుని కొత్త ట్రిబ్యునల్ వేయాలంటే.. బేసిన్ పరిధిలోని నాలుగు రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2013 నవంబర్ 19న ఇచ్చిన తుది నివేదికను సెక్షన్–6(2) ప్రకారం నోటిఫై చేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటకలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ నీటి పంపకాలకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆ రెండు రాష్ట్రాలు అంగీకరించే అవకాశం లేదు. ఇక రెండు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంగీకరించే ప్రశ్నే లేదు. కాదూ కూడదని కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే మిగతా మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఖాయం. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడో మాట.. ఇప్పుడో మాట బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్.. బేసిన్ పరిధిలోని మూడు రాష్ట్రాలకూ 2,578 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2020 డిసెంబర్ 30న సెక్షన్–5(2) కింద ముసాయిదా, 2013 నవంబర్ 29న సెక్షన్–5(3) కింద తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీలకు అదనంగా 194 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ నివేదికలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కూడా వాటికి వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. దాంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఇప్పటిదాకా కేంద్రం నోటిఫై చేయలేదు. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం ఆ ట్రిబ్యునల్ గడువును పొడిగించింది. రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యేనాటి కంటే ముందు అంటే 2014 జూన్ 2కు ముందు ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయిస్తూ తీర్పు ఇస్తూ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని విభజన చట్టంలో సెక్షన్–89 స్పష్టం చేసింది. విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో సెక్షన్–85(7)(ఈ)/4 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలు అలానే కొనసాగించాలి. ఈ దృష్ట్యా 2014 జూలై 14న సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయాలని రాసిన లేఖను పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయిస్తూ కేంద్రం చేసిన సర్దుబాటు ఒప్పందాన్ని అంగీకరిస్తూ తెలంగాణ సర్కార్ సంతకం చేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని విస్మరించి.. సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ పాత పల్లవిని కొత్తగా అందుకుంది. దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయన్నది బహిరంగ రహస్యమేనని న్యాయ, నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు పునఃసమీక్ష చట్టవిరుద్ధం కృష్ణా నదీ జలాలను బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేయడానికి కేంద్రం 1969 ఏప్రిల్ 10న బచావత్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణా నదిలో 2,060.. పునరుత్పత్తి 70 టీఎంసీలతో కలిపి 2,130 టీఎంసీలు ఉంటాయని అంచనా వేసింది. వాటిలో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయిస్తూ 1976 మే 31న తుది తీర్పు ఇచ్చింది. ఇందులో 749.16 టీఎంసీలతో 1971 మే 7న కుదిరిన అంతర్రాష్ట ఒప్పందం మేరకు చేపట్టిన ప్రాజెక్టులకు రక్షణ కల్పించింది. వీటికి అదనంగా 50.84 టీఎంసీలను కేటాయించింది. ఇందులో తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 17.84, శ్రీశైలం ప్రాజెక్టులో ఆవిరి నష్టాల కింద 33 టీఎంసీలను కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయించిన జలాల్లో రాయలసీమకు 144.70, కోస్తాకు 387.34, తెలంగాణకు 278.96 టీఎంసీలు దక్కాయి. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో మిగిలిన 30 టీఎంసీల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని భీమా ఎత్తిపోతలకు 20 టీఎంసీలు కేటాయించడంతో కోస్తాకు నీటి వాటా 367.34 టీఎంసీలకు తగ్గి.. తెలంగాణ వాటా 298.96 టీఎంసీలకు చేరుకుందని నీటిపారుదల రంగ నిపుణులు ఎత్తిచూపుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 811 టీఎంసీల్లో ఏపీ వాటా 512.04, తెలంగాణ వాటా 298.96 టీఎంసీలు. ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టానికి 2002 ఆగస్టు 6న కేంద్రం చేసిన సవరణ ప్రకారం.. ఈ సవరణకు ముందు జల వివాదాన్ని పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించడానికి వీల్లేదు. ఈ సవరణ కంటే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ముందు వెలువడింది కాబట్టి.. అదే అంతిమమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్–3 ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను పునఃపంపిణీ చేయడం సాధ్యం కానే కాదని స్పష్టం చేస్తున్నారు. -
కృష్ణా నీటి వివాదంపై చేతులెత్తేసిన బోర్డు
-
కేంద్రమే తేల్చాలి
కృష్ణా నీటి వివాదంపై చేతులెత్తేసిన బోర్డు సాక్షి, హైదరాబాద్: కృష్టా నీటి కేటాయింపుల వివాదం కేంద్రం కోర్టులోకి వెళ్లింది. దీనిపై కేంద్రంలో తేలేవరకు తామేమీ చేయలేమని కృష్ణా నది యాజమాన్య బోర్డు చేతులెత్తేసింది. ఈ వివాదాన్ని తేల్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విఫలమైనందున ఈ అంశాన్ని కేంద్రం తేల్చిన తర్వాతే బోర్డు సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేస్తూ శుక్రవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులోని క్లాజ్-15 ప్రకారం ఇరు రాష్ట్రాల నీటి కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని కేంద్రానికి విన్నవించామని, కేంద్రం స్పందించే వరకు బోర్డు భేటీ వల్ల ప్రయోజనం ఉండదని లేఖలో అభిప్రాయపడింది. ఈమేరకు బోర్డు కార్యదర్శి ఆర్.కె.గుప్తా రెండు రాష్ట్రాలకు లేఖలు రాశారు. లేఖలో క్లాజ్-15 గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ క్లాజ్‌కు న్యాయపరమైన భాష్యం(లీగల్ ఇంటర్‌ప్రిటేషన్) తెలియజేయాలంటూ రెండు రాష్ట్రాలకు గతంలో బోర్డు లేఖలు రాసినా సమాధానం రాలేదని వివరించారు. కేటాయింపులకు మించి నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీరు విడుదల చేశామని, బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి కేటాయింపుల విధానాన్ని తేల్చే వరకు కుడి కాల్వకు నీటి విడుదల నిలిపివేస్తామంటూ తెలంగాణ రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తూ.. కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకు బోర్డు సమావేశం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని గుప్తా స్పష్టం చేశారు. కాగా, ఈ వివాదంపై ఇప్పటికే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా కోరిన తెలంగాణ ప్రభుత్వం.. అక్కడి నుంచి వచ్చే స్పందన కోసం వేచిచూస్తోంది. ఒకట్రెండు రోజుల్లో న్యాయసలహా అందుతుందని, ఆ వెంటనే తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. క్లాజ్-15లో ఏముందంటే.. నీటి అవసరాలను సమీక్షించి కేటాయింపుల మేరకు ఆయా సంవత్సరాల్లో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యతను కృష్ణా వ్యాలీ అథారిటీకి అప్పగించినట్లు బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్-15 చెబుతోంది. నీటి అవసరాలను ఎప్పటికప్పుడు సమీక్షించి.. అవసరమైన ఆదేశాలను కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాలకు ఇవ్వడానికి అథారిటీకి అధికారం ఉంది. ప్రస్తుతం కృష్ణా వ్యాలీ అథారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య తలెత్తిన విభేదాలను క్లాజ్-15 ప్రకారం కేంద్రమే పరిష్కరించాలని బోర్డు విజ్ఞప్తి చేసింది. ‘‘కేటాయింపుల మేరకు కృష్ణా బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు నీరు అందతున్న తీరును కృష్ణా వ్యాలీ అథారిటీ ఎప్పటికప్పుడు సమీక్షించాలి. వాటర్ ఇయర్లో దిగువ రాష్ట్రాలకు కేటాయింపుల మేరకు నీరందని పక్షంలో.. ఎగవ రాష్ట్రాల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని అథారిటీ ఆదేశాలు జారీ చేయాలి. కరువు పరిస్థితులు ఉండి దిగువ రాష్ట్రానికి అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప.. జూలై నుంచి సెప్టెంబర్ ఆఖరు వరకు నీటి విడుదలకు ఎగువ రాష్ట్రాలను ఆదేశించకూడదు’’ అని క్లాజ్-15 పేర్కొంటోంది. లేఖలో కృష్ణా బోర్డు పేర్కొన్న అంశాలు # సాగర్ కుడి కాల్వ కింద ఏపీకి ఉన్న 132 టీఎంసీల నీటిని ఇప్పటికే విడుదల చేశామని, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి అనుసరించాల్సిన విధానం తేలే వరకు ఇకపై కుడి కాల్వకు నీరివ్వడం సాధ్యం కాదని బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది. # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కున్న కేటాయింపులను రెండు రాష్ట్రాల మధ్య విభజించడం.. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్-15కు సంబంధించిన అంశం. ఈ విషయం గురించి రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో బోర్డు పలుమార్లు చర్చించింది. క్లాజ్-15పై వివరణ(లీగల్ ఇంటర్‌ప్రిటేషన్) ఇవ్వాలని రెండు రాష్ట్రాలకు సూచించినా సమాధానం లేదు. # ఇరు రాష్ట్రాలు క్లాజ్-15 మీద స్పందించని నేపథ్యంలో.. ఈ అంశం మీద స్పష్టత ఇవ్వాలని కేంద్ర జల వనరుల శాఖకు విజ్ఞప్తి చే శాం. కేంద్రం ఇచ్చే స్పష్టతపై ఆధారపడే నీటి విడుదలను నియంత్రించే అంశం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత నీటి సంవత్సరం(వాటర్ ఇయర్)లో బోర్డు తన విధులను నిర్వర్తించడానికి కేంద్రం ఇచ్చే వివరణ అత్యంత ముఖ్యమైన అంశంగా బోర్డు భావిస్తోంది. # రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్సీల సమావేశం ఎలాంటి పరిష్కారం ఇవ్వలేకపోయింది. బోర్డులో వారే సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు బోర్డు భేటీ నిర్వహించినా నిర్మాణాత్మక పరిష్కారం లభిస్తుందనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో క్లాజ్-15 మీద కేంద్రం స్పష్టత ఇచ్చిన తర్వాతే బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తాం. -
ఏపీ సర్కార్‌ది మొండి, తొండి వాదన: హరీశ్
హైదరాబాద్ : కృష్ణాజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొండి, తొండి వాదన అని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అవసరం మేరకు వాడుకుని ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఏపీ సర్కార్ మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సచివాలయంలో హరీశ్ రావు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ టీడీపీ నేతల వైఖరి ఏంటో చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. టీ.టీడీపీ నేతలు ఎంతకాలం చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంపు ద్వారా భద్రాద్రి రాముడిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. రాజధాని శివార్లలో భూ వివాదంలో తన బంధువులంటూ వస్తున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు చేసే టీడీపీ నేతలు వాటిని రుజువు చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు. -
‘కృష్ణా’ జలాలపై తేలని లెక్క!
* వాటాను మించి ఏపీ వాడుకున్నదని తెలంగాణ అభ్యంతరం * నాగార్జున సాగర్‌లో 50 టీఎంసీలైనా ఇవ్వాలని ఏపీ పట్టు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలకు సంబంధించిన లెక్కలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. నీటి వాటాలపై ఇరు రాష్ట్రాలు ఎవరి వాదనకు వారే కట్టుబడి ఉండటంతో వాస్తవ లెక్కలు తేలడం లేదు. నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుత రబీ అవసరాలకు నీటి విడుదలపై సోమవారం మూడున్నర గంటలపాటు సుదీర్ఘ సమావేశం జరిగినా ఎలాంటి ఫలితాన్నివ్వలేదు. ఇప్పటికే కోటాకు మించి నీటిని వినియోగించుకొని మరింత వాటాను ఏపీ కోరుతోందంటూ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. కృష్ణా డెల్టాకు ఇంకా ఏమైనా ఖరీఫ్ అవసరాలు ఉంటే నీటిని అప్పుగా ఇస్తామని, వచ్చే ఏడాది ఆ మేరకు సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం చెప్పని ఏపీ.. ప్రస్తుతం లభ్యమవుతున్న నీటిలోంచే తమకు 40 నుంచి 50 టీఎంసీల వాటా ఇవ్వాలని వాదనకు దిగింది. సాగర్ కుడి, ఎడమ కాల్వల కింద ప్రస్తుత రబీ అవసరాలకు నీటిని వాడుకునే విషయమై ఇరు రాష్ట్రాలు తేల్చుకుని తమ వద్దకు రావాలని కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు తాజాగా సమావేశమై నీటి అవసరాలు, వాటాలపై చర్చించారు. రాజధానిలోని జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఎస్కే జోషి, ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు హాజరయ్యారు. ఎవరి వాదన వారిదే.. బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు, వాస్తవ వినియోగం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి లెక్కలను ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు తరఫున విద్యాసాగర్‌రావు వివరించారు. ‘బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకే నీటిని వాడుకుంటున్నాం. జూరాల కింద ఉన్న భీమా ప్రాజెక్టు, ఇతర చిన్న నీటి వనరులకు 70 టీఎంసీల కేటాయింపులున్నా వాటిని వాడుకోలేదు. ఇలా వాడుకోని జలాలు సాగర్‌ను చేరాయి. ఆ నీటినే ప్రస్తుత రబీ అవసరాలకు వాడుకుంటాం. ప్రస్తుతం సాగర్‌లో లభ్యతగా ఉన్న 110 టీఎంసీల నీరు తెలంగాణ తాగునీటి, రబీ అవసరాలకు సరిపోతుంది. లభ్యత నీటిలో ఏపీ వాటా కేవలం 1.72 టీఎంసీలు మాత్రమే. ఆ మేరకే ఏపీకి ఇస్తాం. అవసరమైతే ఖరీఫ్ అవసరాలకు కొన్ని షరతులతో నీటిని అప్పుగా ఇచ్చేందుకు సిద్ధం. తర్వాతి ఏడాదిలో తెలంగాణకు ఆ నీటిని ఏపీ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది’ అని ఏపీ అధికారులకు విద్యాసాగర్‌రావు తెలిపారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా వాస్తవ కేటాయింపు 24 టీఎంసీలను దాటి వరద జలాల పేరిట 70 టీఎంసీలను తరలించుకొనిపోయిందని గుర్తు చేశారు. అవి వరద జలాలు కావని, అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండి బయటకు వెళ్లే నీటినే వరద జలాలుగా పరిగణిస్తారని స్పష్టంచేశారు. జూరాల నుంచి సాగర్ వరకు ఈ ఏడాది లభ్యమైన మొత్తం 481 టీఎంసీల నీటిలో ఏపీ తన వాటా 281 టీఎంసీల నీటిని ఇప్పటికే వినియోగించుకొని ఇప్పుడు మరింత వాటా కోరడం తగదని వ్యాఖ్యానించారు. అయితే ఈ లెక్కలపై ఏపీ పూర్తి భిన్నంగా స్పందించింది. ప్రస్తుతం లభ్యతగా ఉన్న 110 టీఎంసీల నీటిలో తమకు 40 నుంచి 50 టీఎంసీల వాటా ఇవ్వాలని గట్టిగా కోరింది. నిజానికి సాగర్ కింద రబీ అవసరాలకు నీరివ్వడం ట్రిబ్యునల్ అవార్డులో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. లభ్యతగా ఉన్న నీటిని రబీ అవసరాలకు వాడుకోరాదని, కేవలం ప్రస్తుతం మిగిలిన ఖరీఫ్, తాగునీటి అవసరాలకే వాడాలని సూచించింది. చివరకు అన్ని అంశాలను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి చెబుతామని ఏపీ వర్గాలు తెలిపాయి. తర్వాతి సమావేశం ఎప్పుడన్నది కూడా తేల్చలేదు. -
త్వరలో తుంగభద్ర బోర్డు రద్దు
గద్వాల, న్యూస్‌లైన్: బచావత్ ట్రిబ్యునల్ అవార్డుతో ఏర్పాటైన తుంగభద్ర బోర్డును త్వరలోనే రద్దుచేసి కృష్ణానదీ జలాల పంపిణీ, కేటాయింపుల పర్యవేక్షణకు కృష్ణా వాటర్ అథారిటీ కార్యాలయాలను కర్ణాటకలోని ఆల్మట్టి, మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో కృష్ణానదీ జలాల సమస్యలను పరిష్కరించేందుకు, నీటి కేటాయింపులను పర్యవేక్షించేందుకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఆల్మట్టి వద్ద, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జూరాల ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేస్తారు. అక్కడ వీలుకాని పక్షంలో శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని ఈగలపెంట వద్ద ఈ కార్యాలయాలను వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు కృష్ణా ట్రిబ్యునల్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. 1966లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల సమస్య పరిష్కారానికి కేటాయింపులను నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు జడ్జి బచావత్ అధ్యక్షతన కేంద్రం ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసింది. ఆ తీర్పు మేరకు మూడు రాష్ట్రాలకు నదీ జలాలను పంపిణీ చేయడంతోపాటు, రెండు రాష్ట్రాల పరిధిలో సాగునీటిని అందిస్తున్న తుంగభద్ర ప్రాజెక్టు నీటి విడుదలను పర్యవేక్షించేందుకు తుంగభద్ర ప్రాజెక్టు వద్ద బోర్డును ఏర్పాటుచేశారు. 1970లో ఏర్పాటైన ఈ బోర్డులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా అధికారులు సభ్యులుగా ఉన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కాలం 2000 సంవత్సరంతో ముగియడంతో, కేంద్రం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ గతేడాది నదీజలాల వివాదాన్ని పరిష్కరిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పులో కృష్ణా వాటర్ అథారిటీ కార్యాలయాల ఏర్పాటు ఉంది. కృష్ణానది నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఆల్మట్టి, గద్వాల వద్ద అథారిటీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తుంగభద్ర బోర్డు అధికారుల ద్వారా తెలిసింది. -
ఆ పాపం చంద్రబాబుదే: జగన్
-
ఆ పాపం చంద్రబాబుదే: జగన్
హైదరాబాద్: మిగుల జలాలపై మన రాష్ట్రానికి ఉన్న హక్కును రద్దు చేస్తూ సుప్రీకం కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానికి కౌంటర్ దాఖలు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తెలిపారు. లోటస్‌పాండ్‌లో కృష్ణా నదీ జలాలపై బచావత్ అవార్డును చంద్రబాబు అమలు చేయలేదని చెప్పారు. నదీ జలాల విషయంలో రాష్ట్రానికిఅన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ఏ విధంగా మిన్నకుండిపోయారో వివరించారు. 1973లో కృష్ణానదీ జలాలపై బచావత్ ఇచ్చిన తీర్పు ప్రకారం మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి హక్కులు లభించాయి. చంద్రబాబు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిగులు జలాలు ఉన్నా ప్రాజెక్టులు కట్టడానికి ఆయన ప్రయత్నించలేదు. ఈ చంద్రబాబే దేవగౌడను ప్రధానిని చేశారు. కేంద్రంలో చక్రం తిప్పారు. ఆ సమయంలో కర్ణాటక సుప్రీం కోర్టుకు వెళ్లింది. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక వాదనకు పూర్తిగా మద్దతు ఇచ్చింది. 2000లో సుప్రీం కోర్టు రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. మిగులు జలాల హక్కును సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాబు కర్ణాటకతో కుమ్మక్కయినందునో, మంచి న్యాయవాదులను పెట్టనందునో అన్యాయమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పుపై చంద్రబాబు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వీలైనన్ని ప్రాజెక్టులు కట్టి జలాలపై హక్కు సాధించాలని ఆరాటపడ్డారు. నికర జలాల్లో కేటాయింపులు పెంచుకునే ప్రయత్నాన్ని వైఎస్ చేశారు. అటువంటి మహానేతను విమర్శిస్తున్నారని బాధపడ్డారు. ఆ మహానేత తరువాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. వారిని విమర్శించకుండా ఎప్పుడో నాలుగేళ్ల క్రితం చనిపోయిన ఆ మహానేతను చంద్రబాబు విమర్శిస్తారన్నారు. 2009లో డిసెంబర్ 9న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టనరోజు సందర్భంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించారు. 2010లో కృష్ణాజలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు వచ్చిందని తెలిపారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయానికి మిగులు జలాల అంశం లేకుండా చేయాలని సోనియా గాంధీ అనుకున్నారు. ఇది సంక్షిష్ట అంశం కాకూడదని భావించారు. డిసెంబరు 9లోగా రాష్ట్రాన్ని విడగొట్టాలని అనుకున్నారు. అదేవిధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ హడావుడిగా తీర్పు ఇచ్చిందని చెప్పారు. మిగులు జలాలే లేవు, మీ చావు మీరు చావండని తీర్పు ఇచ్చారని చెప్పారు. ఇలాంటి కుట్ర ఒకటి పెట్టుకున్న సోనియాను తప్పపట్టకుండా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిని తప్పుపట్టకుండా 4 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిని వేలెత్తి చూపుతున్నారన్నారు. ఆ మహానేత వైఎస్ మరణించి 4 ఏళ్లు గడచిని తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ సమయంలో సమర్థవంతంగా వాదనలు వినిపించవద్దని, మరో కోణంలో వాదించవద్దని ఎవరైనా చెప్పారా? అని అడిగారు. సోనియా చర్యలను చంద్రబాబు వ్యతిరేకించరు. పైగా సమర్థిస్తారు. ఇలాంటి దారుణ రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నాం అని అన్నారు. ఏంచేస్తుందో కాంగ్రెస్‌కు తెలుసా? రాయలసీమను విభజించే హక్కు ఎవరు ఇచ్చారు? అని జగన్ ప్రశ్నించారు. రెండు జిల్లాలకు బదులు అన్ని జిల్లాలను కలిపి తెలంగాణ రాష్ట్రం అని పేరుపెడితే ఎవరు కాదన్నారు? అని జగన్ ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. తమకు ముగ్గురు సభ్యుల బలమే ఉన్నా తమ ప్రయత్నాలు తాము చేసస్తున్నట్లు తెలిపారు. అందుకోసమే దేశమంతటా పర్యటించి జాతీయ నేతలను కలుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే నదీజలాలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు అని తెలిసి కూడా విభజన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీట్లుకోసం, ఓట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని సవరించాలని కోరుతున్నట్లు తెలిపారు. దీనికి సహకరించాలని అన్నిపార్టీల నేతలకూ విజ్ఞప్తిచేస్తున్నామని చెప్పారు. మొదటి ఎస్సార్సీ నివేదికపై భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని తెలిపారు. 2/3 మెజార్టీతో అసెంబ్లీ, పార్లమెంటు తీర్మానాన్నిఆమోదించిన తర్వాతనే ఏ రాష్ట్రాన్నైనా విభజించాలని అన్నారు.