* వాటాను మించి ఏపీ వాడుకున్నదని తెలంగాణ అభ్యంతరం
* నాగార్జున సాగర్‌లో 50 టీఎంసీలైనా ఇవ్వాలని ఏపీ పట్టు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలకు సంబంధించిన లెక్కలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. నీటి వాటాలపై ఇరు రాష్ట్రాలు ఎవరి వాదనకు వారే కట్టుబడి ఉండటంతో వాస్తవ లెక్కలు తేలడం లేదు. నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుత రబీ అవసరాలకు నీటి విడుదలపై సోమవారం మూడున్నర గంటలపాటు సుదీర్ఘ సమావేశం జరిగినా ఎలాంటి ఫలితాన్నివ్వలేదు. ఇప్పటికే కోటాకు మించి నీటిని వినియోగించుకొని మరింత వాటాను ఏపీ కోరుతోందంటూ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. కృష్ణా డెల్టాకు ఇంకా ఏమైనా ఖరీఫ్ అవసరాలు ఉంటే నీటిని అప్పుగా ఇస్తామని, వచ్చే ఏడాది ఆ మేరకు సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది.
అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం చెప్పని ఏపీ.. ప్రస్తుతం లభ్యమవుతున్న నీటిలోంచే తమకు 40 నుంచి 50 టీఎంసీల వాటా ఇవ్వాలని వాదనకు దిగింది. సాగర్ కుడి, ఎడమ కాల్వల కింద ప్రస్తుత రబీ అవసరాలకు నీటిని వాడుకునే విషయమై ఇరు రాష్ట్రాలు తేల్చుకుని తమ వద్దకు రావాలని కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు తాజాగా సమావేశమై నీటి అవసరాలు, వాటాలపై చర్చించారు. రాజధానిలోని జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఎస్‌కే జోషి, ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావు హాజరయ్యారు.
ఎవరి వాదన వారిదే..
బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు, వాస్తవ వినియోగం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి లెక్కలను ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు తరఫున విద్యాసాగర్‌రావు వివరించారు. ‘బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకే నీటిని వాడుకుంటున్నాం. జూరాల కింద ఉన్న భీమా ప్రాజెక్టు, ఇతర చిన్న నీటి వనరులకు 70 టీఎంసీల కేటాయింపులున్నా వాటిని వాడుకోలేదు. ఇలా వాడుకోని జలాలు సాగర్‌ను చేరాయి. ఆ నీటినే ప్రస్తుత రబీ అవసరాలకు వాడుకుంటాం.
ప్రస్తుతం సాగర్‌లో లభ్యతగా ఉన్న 110 టీఎంసీల నీరు తెలంగాణ తాగునీటి, రబీ అవసరాలకు సరిపోతుంది. లభ్యత నీటిలో ఏపీ వాటా కేవలం 1.72 టీఎంసీలు మాత్రమే. ఆ మేరకే ఏపీకి ఇస్తాం. అవసరమైతే ఖరీఫ్ అవసరాలకు కొన్ని షరతులతో నీటిని అప్పుగా ఇచ్చేందుకు సిద్ధం. తర్వాతి ఏడాదిలో తెలంగాణకు ఆ నీటిని ఏపీ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది’ అని ఏపీ అధికారులకు విద్యాసాగర్‌రావు తెలిపారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా వాస్తవ కేటాయింపు 24 టీఎంసీలను దాటి వరద జలాల పేరిట 70 టీఎంసీలను తరలించుకొనిపోయిందని గుర్తు చేశారు. అవి వరద జలాలు కావని, అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండి బయటకు వెళ్లే నీటినే వరద జలాలుగా పరిగణిస్తారని స్పష్టంచేశారు.
జూరాల నుంచి సాగర్ వరకు ఈ ఏడాది లభ్యమైన మొత్తం 481 టీఎంసీల నీటిలో ఏపీ తన వాటా 281 టీఎంసీల నీటిని ఇప్పటికే వినియోగించుకొని ఇప్పుడు మరింత వాటా కోరడం తగదని వ్యాఖ్యానించారు. అయితే ఈ లెక్కలపై ఏపీ పూర్తి భిన్నంగా స్పందించింది. ప్రస్తుతం లభ్యతగా ఉన్న 110 టీఎంసీల నీటిలో తమకు 40 నుంచి 50 టీఎంసీల వాటా ఇవ్వాలని గట్టిగా కోరింది. నిజానికి సాగర్ కింద రబీ అవసరాలకు నీరివ్వడం ట్రిబ్యునల్ అవార్డులో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. లభ్యతగా ఉన్న నీటిని రబీ అవసరాలకు వాడుకోరాదని, కేవలం ప్రస్తుతం మిగిలిన ఖరీఫ్, తాగునీటి అవసరాలకే వాడాలని సూచించింది. చివరకు అన్ని అంశాలను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి చెబుతామని ఏపీ వర్గాలు తెలిపాయి. తర్వాతి సమావేశం ఎప్పుడన్నది కూడా తేల్చలేదు.
‘కృష్ణా’ జలాలపై తేలని లెక్క!
Published Tue, Dec 30 2014 2:20 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement