(రామగోపాలరెడ్డి ఆలమూరు–సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయించిన కృష్ణా నదీ జలాలను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ)–1956 సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయడం సాధ్యమవుతుందా? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను పునఃపంపణీ చేయడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలకు కానే కాదని న్యాయ, నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ–1956 చట్టంలో సెక్షన్–4(2), సెక్షన్–6(2) ప్రకారం ట్రిబ్యునల్ జారీ చేసిన తీర్పే అంతిమం అని, అది సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించే అధికారం ఎవరికీ లేదని చెబుతున్నారు. కృష్ణా నదీ జలాల్లో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 2,130 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) ముట్టుకోక పోవడానికి అదే కారణమని ఎత్తిచూపుతున్నారు. 75 శాతం, 65 శాతం లభ్యత మధ్య ఉన్న 163 టీఎంసీలు, మిగులు జలాలు 285 వెరసి 448 టీఎంసీలను మాత్రమే అదనంగా మూడు రాష్ట్రాలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పంపిణీ చేసిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనపై న్యాయ శాఖ వెల్లడించే అభిప్రాయం ఆధారంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి సంజయ్ అవస్థి శుక్రవారం స్పష్టం చేయడమే అందుకు తార్కాణమని చెబుతున్నారు.
పునఃపంపిణీ చేయాలంటున్న తెలంగాణ
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలకు తగ్గట్టుగా వాదనలు విన్పించలేదని.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను పునఃపంపిణీ చేయాలని 2014 జూలై 14న కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ 2015 మే 1న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ–1956 చట్టంలో సెక్షన్6(2) ప్రకారం.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని నాటి ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కేంద్రానికి తేల్చి చెబుతూ ప్రత్యుత్తరమిచ్చారు. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ 20న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను సెక్షన్–3 ప్రకారం రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సెక్షన్–5(2) కింద ముసాయిదా, 5(3) కింద కేంద్రానికి ఇచ్చిన తుది నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని.. ప్రతిపాదన పంపితే న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని, తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఆ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జూన్ 9న తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని ఇరు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని కోరుతూ జూన్ 14న కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ.. న్యాయ శాఖ అభిప్రాయం కోరింది.
ఇప్పటికే తేల్చి చెప్పిన కేంద్రం
విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి పంపిణీ చేసిన కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు 2014 నుంచే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కసరత్తు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలకు కాకుండా.. నాలుగు రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నదీ జలాలను పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఏపీ, తెలంగాణ సర్కార్‌లు కోరాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ట్రిబ్యునల్ కోరింది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంచడానికే ట్రిబ్యునల్ గడువును పొడిగించామే తప్ప.. నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి కాదని స్పష్టం చేస్తూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దాంతో.. ఉమ్మడి రాష్ట్రాలకు కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలకే పంపిణీ చేస్తామని 2016 అక్టోబర్ 19న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఆ మేరకు గత ఐదేళ్లుగా విచారణ చేస్తోంది.
కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కష్టమే
బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను సెక్షన్–3 రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ రాసిన లేఖను కేంద్రం పరిగణనలోకి తీసుకుని కొత్త ట్రిబ్యునల్ వేయాలంటే.. బేసిన్ పరిధిలోని నాలుగు రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2013 నవంబర్ 19న ఇచ్చిన తుది నివేదికను సెక్షన్–6(2) ప్రకారం నోటిఫై చేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటకలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ నీటి పంపకాలకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆ రెండు రాష్ట్రాలు అంగీకరించే అవకాశం లేదు. ఇక రెండు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంగీకరించే ప్రశ్నే లేదు. కాదూ కూడదని కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే మిగతా మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఖాయం. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అప్పుడో మాట.. ఇప్పుడో మాట
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్.. బేసిన్ పరిధిలోని మూడు రాష్ట్రాలకూ 2,578 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2020 డిసెంబర్ 30న సెక్షన్–5(2) కింద ముసాయిదా, 2013 నవంబర్ 29న సెక్షన్–5(3) కింద తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీలకు అదనంగా 194 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ నివేదికలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కూడా వాటికి వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. దాంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఇప్పటిదాకా కేంద్రం నోటిఫై చేయలేదు. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం ఆ ట్రిబ్యునల్ గడువును పొడిగించింది.
రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యేనాటి కంటే ముందు అంటే 2014 జూన్ 2కు ముందు ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయిస్తూ తీర్పు ఇస్తూ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని విభజన చట్టంలో సెక్షన్–89 స్పష్టం చేసింది. విభజన చట్టంలో 11వ షెడ్యూల్‌లో సెక్షన్–85(7)(ఈ)/4 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలు అలానే కొనసాగించాలి. ఈ దృష్ట్యా 2014 జూలై 14న సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయాలని రాసిన లేఖను పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయిస్తూ కేంద్రం చేసిన సర్దుబాటు ఒప్పందాన్ని అంగీకరిస్తూ తెలంగాణ సర్కార్ సంతకం చేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని విస్మరించి.. సెక్షన్–3 ప్రకారం పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ పాత పల్లవిని కొత్తగా అందుకుంది. దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయన్నది బహిరంగ రహస్యమేనని న్యాయ, నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు పునఃసమీక్ష చట్టవిరుద్ధం
కృష్ణా నదీ జలాలను బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేయడానికి కేంద్రం 1969 ఏప్రిల్ 10న బచావత్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణా నదిలో 2,060.. పునరుత్పత్తి 70 టీఎంసీలతో కలిపి 2,130 టీఎంసీలు ఉంటాయని అంచనా వేసింది. వాటిలో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయిస్తూ 1976 మే 31న తుది తీర్పు ఇచ్చింది. ఇందులో 749.16 టీఎంసీలతో 1971 మే 7న కుదిరిన అంతర్రాష్ట ఒప్పందం మేరకు చేపట్టిన ప్రాజెక్టులకు రక్షణ కల్పించింది. వీటికి అదనంగా 50.84 టీఎంసీలను కేటాయించింది.
ఇందులో తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 17.84, శ్రీశైలం ప్రాజెక్టులో ఆవిరి నష్టాల కింద 33 టీఎంసీలను కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయించిన జలాల్లో రాయలసీమకు 144.70, కోస్తాకు 387.34, తెలంగాణకు 278.96 టీఎంసీలు దక్కాయి. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో మిగిలిన 30 టీఎంసీల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని భీమా ఎత్తిపోతలకు 20 టీఎంసీలు కేటాయించడంతో కోస్తాకు నీటి వాటా 367.34 టీఎంసీలకు తగ్గి.. తెలంగాణ వాటా 298.96 టీఎంసీలకు చేరుకుందని నీటిపారుదల రంగ నిపుణులు ఎత్తిచూపుతున్నారు.
వీటిని పరిగణనలోకి తీసుకుంటే 811 టీఎంసీల్లో ఏపీ వాటా 512.04, తెలంగాణ వాటా 298.96 టీఎంసీలు. ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ–1956 చట్టానికి 2002 ఆగస్టు 6న కేంద్రం చేసిన సవరణ ప్రకారం.. ఈ సవరణకు ముందు జల వివాదాన్ని పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించడానికి వీల్లేదు. ఈ సవరణ కంటే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ముందు వెలువడింది కాబట్టి.. అదే అంతిమమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్–3 ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను పునఃపంపిణీ చేయడం సాధ్యం కానే కాదని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment