సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో జల విద్యుదుత్పత్తికి విధి విధానాలు, నీటి నిల్వ, నీటి విడుదల ప్రక్రియలు (రూల్ కర్వ్), వరద జలాల మళ్లింపుపై అభిప్రాయాలు చెప్పేందుకు తెలంగాణకు కృష్ణా బోర్డు మరో అవకాశం ఇచ్చింది. వాటిపై రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్‌ఎంసీ) మూడో సమావేశాన్ని ఈనెల 16న ఏర్పాటు చేసింది.
గత నెలలో జరిగిన రెండు ఆర్‌ఎంసీ సమావేశాలకు తెలంగాణ హాజరుకాలేదు. దీంతో తెలంగాణకు మరో అవకాశమివ్వాలని బోర్డు నిర్ణయించింది. 16న జరిగే మూడో సమావేశానికి కూడా తెలంగాణ అధికారులు గైర్హాజరైతే బోర్డు ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లనుంది. కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశాల మేరకు బచావత్ ట్రిబ్యునల్, సీడబ్ల్యూసీ రూల్ కర్వ్ ముసాయిదా ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, నీటి నిల్వ, విడుదల ప్రక్రియ, వరద రోజుల్లో మళ్లించిన నీటిని కోటా కింద లెక్కించాలా? వద్దా? అన్నవే కారణమవుతున్నాయని బోర్డు గుర్తించింది. ఈ సమస్యల పరిష్కారానికి నివేదిక ఇచ్చే బాధ్యతను ఆర్‌ఎంసీకి అప్పగించింది. గత నెల 20న మొదటి సారి, 30న రెండో సారి ఆర్‌ఎంసీ భేటీ అయ్యింది.
ఈ రెండు సమావేశాలకు ఏపీ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ తరఫున అధికారులెవరూ రాలేదు. దీంతో మరోసారి అవకాశమివ్వనున్నారు. మూడో భేటీలో తెలంగాణ అధికారులు హాజరై అభిప్రాయాలు చెబితే ఇరు రాష్ట్రాల వాదనల ఆధారంగా ఆర్‌ఎంసీ నివేదిక ఇస్తుంది. వాటిని బోర్డు అమలు చేస్తుంది. తెలంగాణ అధికారులు గైర్హాజరైతే కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది.
స్పష్టమైన అభిప్రాయాలు చెప్పిన ఏపీ
శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగుల్లో ఏడాది పొడవునా నీటి నిల్వ ఉండేలా చూడాలని ఏపీ తరపున ఆర్‌ఎంసీ భేటీలకు హాజరైన ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ఇతర అధికారులు స్పష్టంగా చెప్పారు. సాగర్, శ్రీశైలంలో తాగు, సాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సాగుకు నీరు విడుదల చేసినప్పడే విద్యుదుత్పత్తి చేయాలన్నారు.
బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకే ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని స్పష్టంచేశారు. కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో సముద్రంలో జలాలు కలుస్తున్నప్పుడు వరద జలాలను ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని నికర జలాల కోటాలో కలపకూడదని చెప్పారు. ఏపీ వాదనతో ఆర్‌ఎంసీ ఏకీభవించింది.
Comments
Please login to add a commentAdd a comment