Telangana officials
-
జల వివాదాలకు తెరపడేనా?
సాక్షి, అమరావతి: జలాశయాల నిర్వహణ కమిటీ(ఆర్ఎంసీ) నివేదికను ఆమోదించి జల వివాదాలకు కృష్ణా బోర్డు తెరదించుతుందా? లేక యథాప్రకారం నివేదికను అటకెక్కించి జల వివాదాలను కొనసాగనిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్ఎంసీ నివేదికపై చర్చించి, ఆమోదించడమే అజెండాగా జనవరి 6న కృష్ణా బోర్డు 17వ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఇప్పటికే లేఖలు రాశారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరాక ఆర్ఎంసీ రూపొందించిన నివేదికపై సంతకాలు చేయడంలో తెలంగాణ అధికారులు అడ్డం తిరిగిన నేపథ్యంలో.. సర్వసభ్య సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. నివేదిక తయారీలోనే తీవ్ర జాప్యం ► కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు ప్రధానంగా కారణమవుతున్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, రూల్ కర్వ్స్(ప్రాజెక్టుల నిర్వహణ విధి విధానాలు), మళ్లించిన వరద జలాలను కోటాలో కలపాలా? వద్దా అనే అంశాలపై 2022, మే 6న సర్వ సభ్య సమావేశంలో చర్చించారు. ఈ మూడు సమస్యల పరిష్కారానికి కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీ, జెన్కోల డైరెక్టర్లు సభ్యులుగా ఆర్ఎంసీని 2022, మే 10న నియమించారు. ► ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపై 15 రోజుల్లోగా.. రూల్ కర్వ్స్, వరద జలాలపై నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్ఎంసీని ఆదేశించారు. కానీ.. గడువులోగా ఆర్ఎంసీ నివేదిక ఇవ్వలేదు. ► నివేదికను రూపకల్పనకు ఆరు సార్లు ఆర్ఎంసీ సమావేశమైంది. 3న శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులుగానూ, ఉత్పత్తయ్యే విద్యుత్‌లో చెరి సగం పంచుకునేలా.. దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉంటేనే విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేసేలా రెండు రాష్ట్రాల మద్య ఏకాభిప్రాయం కుదిరింది. సాగర్ రూల్ కర్వ్స్‌పై సీడబ్ల్యూసీను సంప్రదించి ఖరారు చేసుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. వరద రోజుల్లో మళ్లించే జలాలను లెక్కించినా.. వాటిని నికర జలాల కోటాలో కలపకూడదని నిర్ణయించాయి. ఇదే అంశాలతో 3న నివేదికను రూపొందించింది. కృష్ణా బోర్డు నిర్ణయమే ఫైనల్ ఆర్ఎంసీ నివేదికపై సంతకం చేయడానికి కొంత సమయం కావాలని తెలంగాణ అధికారులు అడిగారు. దాంతో 5న నివేదికపై సంతకాలు చేయడానికి ఆర్ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా, సంతకాలు చేసేదిలేదని తెలంగాణ అధికారులు సమావేశానికి డుమ్మాకొట్టారు. దీంతో నివేదికపై కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై, మౌతాంగ్, ఏపీ అధికారులు సంతకాలు చేసి 8న బోర్డు చైర్మన్‌కు అందజేశారు. ఈ నివేదికపై జనవరి 6న కృష్ణా బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్. నివేదికను అమలు చేస్తే జల వివాదాలకు తెరపడినట్టేనంటున్నారు. -
తెలంగాణకు మరో అవకాశం.. ఈసారి కూడా హాజరు కాకుంటే...!
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో జల విద్యుదుత్పత్తికి విధి విధానాలు, నీటి నిల్వ, నీటి విడుదల ప్రక్రియలు (రూల్ కర్వ్), వరద జలాల మళ్లింపుపై అభిప్రాయాలు చెప్పేందుకు తెలంగాణకు కృష్ణా బోర్డు మరో అవకాశం ఇచ్చింది. వాటిపై రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) మూడో సమావేశాన్ని ఈనెల 16న ఏర్పాటు చేసింది. గత నెలలో జరిగిన రెండు ఆర్ఎంసీ సమావేశాలకు తెలంగాణ హాజరుకాలేదు. దీంతో తెలంగాణకు మరో అవకాశమివ్వాలని బోర్డు నిర్ణయించింది. 16న జరిగే మూడో సమావేశానికి కూడా తెలంగాణ అధికారులు గైర్హాజరైతే బోర్డు ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లనుంది. కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశాల మేరకు బచావత్ ట్రిబ్యునల్, సీడబ్ల్యూసీ రూల్ కర్వ్ ముసాయిదా ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు వర్గాలు వెల్లడించాయి. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, నీటి నిల్వ, విడుదల ప్రక్రియ, వరద రోజుల్లో మళ్లించిన నీటిని కోటా కింద లెక్కించాలా? వద్దా? అన్నవే కారణమవుతున్నాయని బోర్డు గుర్తించింది. ఈ సమస్యల పరిష్కారానికి నివేదిక ఇచ్చే బాధ్యతను ఆర్‌ఎంసీకి అప్పగించింది. గత నెల 20న మొదటి సారి, 30న రెండో సారి ఆర్ఎంసీ భేటీ అయ్యింది. ఈ రెండు సమావేశాలకు ఏపీ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ తరఫున అధికారులెవరూ రాలేదు. దీంతో మరోసారి అవకాశమివ్వనున్నారు. మూడో భేటీలో తెలంగాణ అధికారులు హాజరై అభిప్రాయాలు చెబితే ఇరు రాష్ట్రాల వాదనల ఆధారంగా ఆర్ఎంసీ నివేదిక ఇస్తుంది. వాటిని బోర్డు అమలు చేస్తుంది. తెలంగాణ అధికారులు గైర్హాజరైతే కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. స్పష్టమైన అభిప్రాయాలు చెప్పిన ఏపీ శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగుల్లో ఏడాది పొడవునా నీటి నిల్వ ఉండేలా చూడాలని ఏపీ తరపున ఆర్ఎంసీ భేటీలకు హాజరైన ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఇతర అధికారులు స్పష్టంగా చెప్పారు. సాగర్, శ్రీశైలంలో తాగు, సాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సాగుకు నీరు విడుదల చేసినప్పడే విద్యుదుత్పత్తి చేయాలన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకే ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని స్పష్టంచేశారు. కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో సముద్రంలో జలాలు కలుస్తున్నప్పుడు వరద జలాలను ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని నికర జలాల కోటాలో కలపకూడదని చెప్పారు. ఏపీ వాదనతో ఆర్ఎంసీ ఏకీభవించింది. -
ప్రాజెక్టుల అప్పగింతపై హామీ ఇవ్వలేం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్క పెద్దవాగు మినహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల అప్పగింతపై ఎలాంటి హామీ ఇవ్వలేమని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కి తెలంగాణ నీటిపారుదల శాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లు, ప్లాంట్లు, యంత్రాలు, పరికరాలు, కార్యాలయాలు, ఫర్నిచర్, వాహనాలు, మంజూరైన పోస్టులు, ఇతర రికార్డులను బోర్డులకు అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాల్లేవని పేర్కొంది. తెలంగాణలోని రెండు, ఏపీలోని రెండు నీటి విడుదల పాయింట్లను బోర్డుల చేతికి అప్పగించే అంశంపై గోదావరి బోర్డు సబ్ కమిటీ బుధవారం జలసౌధలో సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు రాష్ట్ర వాదనను వినిపించారు. దేవాదుల పథకానికి సంబంధించిన ఇన్‌టెక్ పంపుహౌజ్ వద్ద గోదావరి బోర్డు జరిపిన క్షేత్రస్థాయి పర్యటనలో సబ్‌కమిటీని దూరంగా ఉంచిన నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టు అప్పగింతకు సంబంధించిన నివేదికను తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు. గోదావరిపై రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులేవీ లేనందున.. ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాల(సీఐఎస్ఎఫ్)ను మోహరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దానివల్ల రాష్ట్ర ఖజానాపై అనవసర భారం పడుతుందని వివరించారు. ‘‘గోదావరి ట్రిబ్యునల్ తీర్పులోని క్లాజ్–4 ప్రకారం.. తమ వాటాలోని ఏదైన భాగాన్ని ఇతర బేసిన్లకు బదిలీ చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో కట్టినవే. గోదావరి నీటిని కృష్ణాబేసిన్ ప్రాంతాలకు తరలించడంపై అప్పట్లో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు తెలంగాణకు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు సైతం అది వ్యతిరేకం’’ అని వివరించారు. ఇక ప్రాజెక్టుల అప్పగింతపై గోదావరి బోర్డు రూపొందించిన నివేదికపై అధ్యయనం కోసం కొంత సమయం కావాలని రాష్ట్ర అధికారులు కోరగా.. ఇందుకు బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. అప్పగింత నివేదికపై చర్చను తదుపరి సమావేశానికి వాయిదా వేశారు. సమావేశంలో తెలంగాణ తరఫున సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఇంటర్‌స్టేట్ విభాగం ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ సుబ్రమణ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ కేంద్రం పరిశీలనకు అనుమతించని తెలంగాణ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించేందుకు అనుమతించే ప్రశ్నే లేదని కృష్ణా బోర్డు సమన్వయ కమిటీకి తెలంగాణ జెన్కో అధికారులు తేల్చిచెప్పారు. సమన్వయ కమిటీ భేటీకి సభ్యులైన తెలంగాణ అంతర్ రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ, తెలంగాణ జెన్కో సీఈ గైర్హాజరయ్యారు. దాంతో ఆపరేషన్ ప్రోటోకాల్ తయారీపై సమన్వయ కమిటీ అధ్యయనం అసంపూర్తిగా ముగిసింది. మంగళవారం ఉదయం శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే, కుడి గట్టు విద్యుత్ కేంద్రాలను పరిశీలించిన కమిటీ మధ్యాహ్నం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని పరిశీలనకు వస్తున్నట్టు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, తెలంగాణ జెన్కో సీఈలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే సమాచారం ఇచ్చారు. అందుకు అనుమతించబోమని తెలంగాణ అధికారులు తెగేసి చెప్పడంతోపాటు శ్రీశైలంలో జరిగే సమన్వయ కమిటీ భేటీకి హాజరు కాబోమని స్పష్టం చేశారు. అదే అంశాన్ని బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు వివరించిన సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే ఏపీ అంతర్ రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ కేఏ శ్రీనివాసరెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు, జెన్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్వహించడానికి ఎంత మంది సిబ్బంది అవసరం, ఏడాదికి నిర్వహణకు ఎంత వ్యయం అవుతుంది, సీఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు ఏ మేరకు అవసరమనే అంశాలపై చర్చించారు. ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి, సాగు, తాగునీటి అవసరాలకు నీటి విడుదలపై చర్చించారు. క్షేత్ర స్థాయి పర్యటన, సమీక్ష సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రాజెక్టు ఆపరేషన్ ప్రోటోకాల్‌పై ముసాయిదా నివేదికను బోర్డుకు అందజేస్తామని సభ్య కార్యదర్శి తెలిపారు. -
కుదరని ఏకాభిప్రాయం
సాక్షి, అమరావతి: గోదావరి, కృష్ణా బోర్డు పరిధిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఆదివారం జరిగిన సబ్ కమిటీల సమావేశాల్లో రెండు రాష్ట్రాల అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. పరిధిపై నిర్ణయాధికారాన్ని సోమవారం జరిగే గోదావరి బోర్డు ప్రత్యేక సమావేశానికి గోదావరి బోర్డు సబ్ కమిటీ అప్పగించగా.. కృష్ణా సబ్ కమిటీ సోమవారం మరోసారి సమావేశమై పరిధిని కొలిక్కి తెచ్చే యత్నం చేయాలని నిర్ణయించింది. రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జులై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ ఈనెల 14 నుంచి అమల్లోకి వస్తుంది. దీని అమలు కోసం బోర్డు పరిధి, స్వరూపంపై ముసాయిదా నివేదిక ఇచ్చేందుకు రెండు బోర్డుల చైర్మన్లు సబ్ కమిటీలను ఏర్పాటుచేశారు. ఇవి ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యాయి. గోదావరి బోర్డు సమావేశం సోమవారం.. కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం మంగళవారం జరగనున్న నేపథ్యంలో వాటి పరిధి, స్వరూపంపై ముసాయిదా నివేదిక రూపొందించేందుకు ఆదివారం సబ్ కమిటీలు మరోసారి సమావేశమయ్యాయి. గోదావరి బోర్డు పరిధి పెద్దవాగుతో మొదలు.. కన్వీనర్ బీపీ పాండే నేతృత్వంలో గోదావరి బోర్డు సబ్ కమిటీ ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. అందులో తేలింది ఏమిటంటే.. ► రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగును తొలుత బోర్డు పరిధిలోకి తీసుకుని.. ఆ తర్వాత దశల వారీగా ఇతర ప్రాజెక్టులను తీసుకుంటామని బీపీ పాండే తెలిపారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ అంతర్రాష్ట్ర విభాగం సీఈ శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. కేవలం 16 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకోవడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. తెలంగాణలో శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ (సీతారామ ఎత్తిపోతల్లో అంతర్భాగం) వరకూ అన్ని ప్రాజెక్టులను గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకుని.. నీటి వినియోగాన్ని నియంత్రిస్తేనే దిగువనున్న పోలవరం, గోదావరి డెల్టా హక్కులను పరిరక్షించడానికి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. దాంతో పరిధిపై నిర్ణయాధికారాన్ని సోమవారం జరిగే గోదావరి బోర్డు ప్రత్యేక సమావేశానికి అప్పగించాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ► బోర్డు నిర్వహణకు సీడ్ మనీ కింద రెండు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్లను డిపాజిట్ చేయాలని బీపీ పాండే కోరారు. ఈ అంశంపై ప్రభుత్వాలతో చర్చించి చెబుతామని ఏపీ, తెలంగాణ సీఈలు శ్రీనివాసరెడ్డి, మోహన్‌కుమార్‌లు తెలిపారు. కృష్ణా సబ్ కమిటీకి వివరాలివ్వని తెలంగాణ.. మరోవైపు.. కన్వీనర్ ఆర్కే పిళ్లై నేతృత్వంలో కృష్ణా బోర్డు సబ్ కమిటీ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఇందులో.. ► గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు షెడ్యూల్–2లో అన్ని ప్రాజెక్టులు, సిబ్బంది తదితర వివరాలన్నీ ఏపీ అధికారులు ఇప్పటికే సబ్ కమిటీకి అందజేశారు. కానీ.. తెలంగాణ ఇవ్వకపోవడంపై పిళ్లై అసహనం వ్యక్తంచేశారు. ► జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల స్పిల్ వేలు, వాటిపై ఉన్న విద్యుత్కేంద్రాలు, కాలువలకు నీటిని విడుదలచేసే రెగ్యులేటర్లు, ఎత్తిపోతల పథకాలను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. జూరాల ఉమ్మడి ప్రాజెక్టు కాదని.. దాన్ని బోర్డు పరిధిలోకి తీసుకోకూడదని స్పష్టంచేశారు. అయితే.. సుంకేశుల బ్యారేజీ, కేసీ కెనాల్‌ను బోర్డు పరిధిలోకి ఇచ్చేదిలేదని ఏపీ అధికారులు స్పష్టంచేశారు. అలాగే, శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కే పరిమితం కావాలని.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌ను బోర్డు పరిధిలోకి తీసుకోకూడదన్నారు. ► శ్రీశైలం ఎడమ గట్టు, సాగర్, పులిచింతల విద్యుత్కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవాలా? వద్దా? అన్నది ప్రభుత్వంతో చర్చించి చెబుతామని తెలంగాణ అధికారులు చెప్పారు. ఇలా.. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తంకావడం, తెలంగాణ అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో కృష్ణా బోర్డు సబ్ కమిటీ సమావేశాన్ని సోమవారం మరోసారి నిర్వహించాలని కన్వీనర్ ఆర్కే పిళ్లై నిర్ణయించారు. ఈ సమావేశంలో పరిధి నిర్ణయాధికారాన్ని మంగళవారం జరిగే కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశానికి అప్పగించనున్నారు. -
గిరిజనులకు భూమి పట్టాల పంపిణీలో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: అర్హత కలిగిన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టం (ఆర్ఓఎఫ్ఆర్) పథకం ద్వారా భూమి పట్టాలను అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానం అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని తెలంగాణ అధికారుల బృందం ప్రశంసించింది. గిరిజనులకు భూమి పట్టాల పంపిణీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొంది. ఏపీలో ఆర్ఓఎఫ్ఆర్ పథకం అమలు అవుతున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆ రాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పట్టాలను ఏ విధంగా పంపిణీ చేశారనే విషయమై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర అధికారుల బృందం శనివారం ఏపీకి వచ్చింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు దిలీప్ కుమార్, ప్రవీణ్‌కుమార్, టి,మహేష్, టి.శ్రీనివాసరావు వెలగపూడి సచివాలయంలో ఏపీ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ పి.రంజిత్ బాషాతో సమావేశమయ్యారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేయడానికి అనుసరించిన విధానాలను అడిగి తెలుసుకున్నారు. అటవీ హక్కుల పట్టాలను మంజూరు చేసే చట్టాలలో ఉన్న సమస్యలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. 2.29 లక్షల ఎకరాలు పంపిణీ రాష్ట్రంలో అర్హత కలిగిన గిరిజనులందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పథకం ద్వారా అటవీ భూములకు పట్టాలు అందిస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారని రంజిత్ బాషా తెలంగాణ అధికారులకు వివరించారు. గతేడాది అక్టోబర్ 2న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని ప్రారంభించారన్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఇవ్వనంత భారీగా ఇప్పటి వరకూ 2.29 లక్షల ఎకరాల భూమి పట్టాలను గిరిజనులకు అందించారని చెప్పారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి గిరిజన కుటుంబానికి ఆర్ఓఎఫ్ఆర్ పథకం కింద కనీసం 2 ఎకరాల భూమికి పట్టాలను అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. అటవీ భూములలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందించామని తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. అటవీ భూములు కాకపోతే తిరస్కరించే వారు ► గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములు అటవీ శాఖకు చెందినవి అయితేనే గతంలో వారికి పట్టాలు ఇచ్చే వారు. అటవీ భూములు కాకపోతే దరఖాస్తులు తిరస్కరించే వారు. ఈసారి అలా కాకుండా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు అటవీ శాఖకు చెందని రెవెన్యూ భూములైతే వాటికి డీకేటీ పట్టాలను అందించాలని సీఎం ఆదేశించారు. ► ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలతో పాటుగా డీకేటీ పట్టాలను కూడా గిరిజనులకు అందించాం. ఇప్పటి వరకు 2,28,334 ఎకరాల భూమిని 1.24 లక్షల మంది గిరిజనులకు పట్టాలుగా ఇచ్చాం. 26 వేల మంది గిరిజనులకు 39 వేల ఎకరాల రెవెన్యూ భూమిని డీకేటీ పట్టాలుగా అందించాం. ► ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మరింత మంది గిరిజనులకు భూమి పట్టాలను అందించనున్నాం. పట్టాలు మంజూరు చేసిన భూములలో సరిహద్దు రాళ్లను నాటడంతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా ఆ భూముల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ► గిరిజనులకు సంబంధించిన భూమి వివరాలు.. ఇతర సంక్షేమ పథకాల ద్వారా వారు పొందుతున్న ప్రయోజనాలను సమీక్షించడానికి ‘గిరిభూమి’ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నాం. -
ఏపీలో సంక్షేమ పథకాలు భేష్
షేర్‌మహ్మద్‌పేట (జగ్గయ్యపేట అర్బన్) /మక్కపేట (వత్సవాయి) /నందిగామ: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ బృందం ప్రశంసించింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు–నేడు పథకాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎ.శ్రీదేవసేన నేతృత్వంలో 17 మంది ఉన్నతాధికారుల బృందం సోమవారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ మండలాల్లో పర్యటించింది. ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి ఆ బృందం జగ్గయ్యపేట మండలం షేర్మహ్మద్పేటలోని జెడ్పీ హైస్కూల్లో నాడు–నేడు పనులను పరిశీలించింది. ఈ పనులు చేపట్టిన విధానం, పనుల నిర్వహణ, నిధుల వినియోగం తదితర అంశాల గురించి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రమణను, విద్యాకమిటీ చైర్మన్, సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో 5 రోజులు 5 రకాల మెనూ అమలు చేస్తున్నట్లు హెచ్ఎం వివరించగా.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవసేన మాట్లాడుతూ తెలంగాణలో మనబడి నాడు–నేడు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు పనుల్లో నాణ్యత ప్రమాణాలు, పారదర్శకత, స్కూల్ కమిటీల భాగస్వామ్యం పరిశీలించామని, స్కూల్లోని మౌలిక సదుపాయాలు బావున్నాయని, పనులు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ విప్ ఉదయభాను మాట్లాడుతూ.. రాష్ట్రంలో 45,329 స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు నాణ్యమైన విద్యను అందించేందుకు 3 దశల్లో ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ రూపకల్పన చేశారని చెప్పారు. అనంతరం వత్సవాయి మండలం మక్కపేటలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పనులను ఈ బృందం పరిశీలించింది. జగనన్న విద్యాకిట్ల గురించి వాకబు చేసి కిట్‌లో ఉన్న వస్తువులను బృందం సభ్యులు పరిశీలించారు. నందిగామ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు–నేడు పనులను కూడా పరిశీలించారు. బృందంలో ట్రైనీ ఐఏఎస్ అధికారి మకందర్, పాఠశాల సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ ఎండీ పార్థసారథి తదితరులున్నారు. -
దేవునిగుట్టకు ప్రాణప్రతిష్ట
సాక్షి, హైదరాబాద్: కంబోడియాలోని ఆంకోర్‌వాట్ దేవాలయ నిర్మాణ శైలిని పోలిన దేశం లోని ఏకైక దేవునిగుట్ట ఆలయ పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. మన దేశంలో ఈ తరహా నిర్మాణ శైలితో ఆలయాలున్నట్టు రికార్డు కాలేదు. దాదాపు 1,500 ఏళ్ల కిందటిదిగా భావిస్తున్న ఈ దేవాలయం ఆలనాపాలనా లేక శిథిలావస్థకు చేరుకుంది. అంత శిథిలమైనా నిర్మాణ ప్రత్యేకతల వల్ల ఇటీవలి భారీ వర్షాలకు కూడా నిలిచే ఉండటం విశేషం. ఈ ఆలయాన్ని పునరుద్ధరించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూ.కోటి నిధులు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఆ నిధులతో ఆలయాన్ని విడదీసి అలాగే తిరిగి పేర్చటం ద్వారా పునుద్ధరించాలని తెలంగాణ హెరిటేజ్ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండ్రోజుల కింద ఆ శాఖ అధికారులు ఆలయాన్ని పరిశీలించి వచ్చారు. జిల్లా కలెక్టర్ విచక్షణాధికారం పరిధిలో ఉండే క్రూషి యల్ బ్యాలెన్స్ ఫండ్ నుంచి రూ.కోటి నిధులు ఇచ్చేందుకు సిద్ధమైన ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య.. వచ్చే నెలలో విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో వెంటనే పనులు ప్రారంభించాలని హెరిటేజ్ తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. స్థానికుల వరకే తెలిసిన ఈ ఆలయ విశేషాలను మూడేళ్ల కింద ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత హెరిటేజ్ తెలంగాణ అధికారులు సర్వే చేశారు. ప్రస్తుతం అది ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోగానీ అటు ఏఎస్ఐ ద్వారా కేంద్రం పరిధిలో గాని పురాతన కట్టడంగా లేదు. జీతాలకు తప్ప నిధులు లేక కునారిల్లుతున్న హెరిటేజ్ తెలంగాణ శాఖ చూస్తుండటం తప్ప దాని పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంతకాలానికి కలెక్టర్ చొరవతో మంచిరోజులు వచ్చినట్లయింది. రాతి ఇటుకలపై శిల్పాలు.. మన దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిపై శిల్పాలను ఓ రాతిపై చెక్కుతారు. కానీ ఈ దేవాలయంలో శైలి అందుకు పూర్తి విరుద్ధం. శిల్పం రూపాన్ని విభజించి అనేక చిన్న రాళ్లపై భాగాలుగా చెక్కుతారు. ఆ తర్వాత జత చేస్తూ వాటిని పేర్చి పూర్తి శిల్పానికి రూపమిస్తారు. ఈ నిర్మాణ శైలి కంబోడియాలోని ఆంకోర్‌వాట్ దేవాలయంలో కనిపిస్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన ఆ దేవాలయాన్ని నిత్యం కొన్ని వేల మంది సందర్శిస్తారు. ఆ తరహా శైలిలో మనదేశంలో నిర్మితమైనట్లు ఇప్పటివరకు వివరాలు రికార్డు కాలేదు. దేవునిగుట్ట ఆలయం మాత్రం ఫక్తు అదే శైలి ప్రతిబింబిస్తుంది. ఆలయానికి మొత్తం ఇసుక రాళ్లను వాడారు. ములుగు జిల్లా కేంద్రానికి 20 కి.మీ. దూరంలో ఉన్న కొత్తూరు గ్రామ పొలిమేరలో దట్టమైన అడవిలో ఈ దేవాలయం ఉంది. అడుగడుగునా శిల్పాలే.. ఆలయం మొత్తం గాథలను ప్రతిబింబించే శిల్పాలున్నాయి. ఇందులో బుద్ధుడి జాతక కథలు కనిపిస్తున్నాయి. దక్షిణ భాగంలో అజంతా శైలిలో లలితాసనంలో ఉన్న బోధిసత్వ పద్మపాణి విగ్రహం ఉంది. ఇది దక్షిణామూర్తిని కూడా పోలి ఉందన్న వాదనా ఉంది. పశ్చిమ భాగంలో అర్ధనారీశ్వరుడిని పోలిన చిత్రం ఉంది. కుడిచేయి గణపతి మీద, ఎడమ చేయి కుమారస్వామి మీద పెట్టినట్టుగా ఈ చిత్రం కనిపిస్తోంది. వజ్ర యానంలో బుద్ధుడిని పరమశివుడి రూపం లో పూజించే పద్ధతి ఉన్నందున శివుని రూపాలను చిత్రించినట్లు తెలుస్తోంది. ఆలయం వెలుపలి వైపు శిల్పాలను పేర్చినట్టుగానే, లోపలి వైపు కూడా చిత్ర భాగాలతో కూడిన రాళ్లను పేర్చి పలురకాల ఆకృతులకు రూపమిచ్చారు. బయటివైపు ఒక రాతి పొర, లోపలి వైపు మరో రాతి పొర ఉందన్నమాట. ఈ గోడలు 9 అడుగుల మందంతో ఉన్నాయి. ఆలయం 35 అడుగుల ఎత్తు ఉండగా, చుట్టు కొలత 20 మీటర్ల మేర ఉంది. దీనికి 250 మీటర్ల దూరంలో దాదాపు 25 ఎకరాల్లో విస్తరించిన తటాకం ఉంది. గర్భాలయంలోపలి నుంచి పైకి చూస్తే పిరమిడ్ తరహాలో ఆలయ శిఖరం చివరి వరకు కనిపిస్తుంది. బౌద్ధ స్తూపం ముందుండే ఆయక స్తంభాన్ని పోలిన సున్నపు రాయి స్తంభం ఉంది. స్తంభం విరిగి రెండు ముక్కలై ఉంటుందని భావిస్తున్నారు. ఆలయ పునరుద్ధరణకు పూర్తి సహకారం ‘దేవునిగుట్ట ఆలయానికి చరిత్రలో ప్రత్యేక స్థానముంది. ఇది ఐదారు శతాబ్దాల కిందటిదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇటీవలే నేను ఆలయాన్ని చూశాను. చాలా అద్భుతంగా ఉంది. నా పరిధిలో క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ కింద రూ.కోటి అందుబాటులో ఉంది. ఆ నిధులను ఈ అద్భుత దేవాలయ పునరుద్ధరణకు కేటాయించాలని నిర్ణయించాను. దీన్ని పునరుద్ధరించేందుకు నా పరిమితులకు లోబడి సాధ్యమైనంత వరకు కృషి చేస్తాను. ఇప్పటికే హెరిటేజ్ తెలంగాణ అధికారులు నాకు ప్రాథమిక డీపీఆర్ అందజేశారు.’ –కృష్ణ ఆదిత్య, ములుగు జిల్లా కలెక్టర్ ఆంకోర్‌వాట్ కంటే చాలా పురాతనం ఆంకోర్‌వాట్ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించారు. దేవునిగుట్ట దేవాలయం 5 లేదా ఆరో శతాబ్దంలోనే నిర్మించినట్లు తెలుస్తోంది. వాకాటక రాజులు కానీ, విష్ణుకుండినులు గాని నిర్మించి ఉంటారు. – రంగాచార్య, చరిత్రకారులు -
కరోనా: జూలై నెలాఖరుకు పరిస్థితి తీవ్రం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనలకు దాదాపు పూర్తిగా మినహాయింపులిచ్చారని, ఇలాగే కరోనా కేసుల సంఖ్య నమోదవుతుంటే జూలై నెలాఖరుకు పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు హోమ్ కంటైన్మెంట్, కమ్యూనిటీ సహకారం చాలా కీలకమని చెప్పారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర బృందం సభ్యులు వికాస్ గాడే, రవీందర్‌లతో కలసి జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్, అదనపు కమిషనర్ బి.సంతోష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, సీసీపీ దేవేందర్‌రెడ్డి, కోవిడ్ కంట్రోల్ రూం ఓఎస్డీ అనురాధలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. జీహెచ్ఎంసీ పరిధిలో జోన్లు, సర్కిళ్లు, వార్డుల వారీగా నెలకొన్న పరిస్థితి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. (మాకు రక్షణ ఏదీ?) అక్కడ 70 శాతం కేసులు ప్రైవేటులోనే.. ఢిల్లీ, ముంబై, చెన్నైలలో ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. ప్రైవేటుగా నిర్వహించిన పరీక్షల్లోనే 70 శాతం పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయని సంజయ్ జాజు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తించిన పాజిటివ్ కేసుల సంఖ్య, సంబంధిత కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్‌కు అనుసరిస్తున్న పద్ధతి, కోవిడ్ లక్షణాలు కనిపించిన వ్యక్తులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న సదుపాయాలు, ఆస్పత్రులు, హోం క్వారంటైన్, హోం ఐసోలేషన్, కంటైన్మెంట్ అంశాల గురించి వివరంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు హోం కంటైన్మెంట్ మాత్రమే అందుబాటులో ఉన్న ఏకైక మార్గమన్నారు. ప్రస్తుతం రోజుకు 100 కేసుల కంటే ఎక్కువగా నిర్ధారణ అవుతున్నందున జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, డిప్యూటీ కమిషనర్లతో వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ సమన్వయాన్ని పెంచాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సూచనలు, సహకారాన్ని పొందేందుకు సంబంధిత వాట్సాప్ గ్రూప్‌లో ప్రజారోగ్య సంచాలకులతో పాటు తనను కూడా చేర్చాలన్నారు. కోవిడ్ కంట్రోల్ రూం నిర్వహిస్తున్న విధుల గురించి వాకబు చేశారు. (ఇళ్లలోనే బోనాలు) -
పోలీసు అధికారుల విభజన ఏకపక్షమేల?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు కావస్తోంది. అన్ని విభాగాల్లో అధికారుల విభజన పూర్తయినా పోలీస్ అధికారుల విభజన మాత్రం పెండింగ్‌లోనే ఉంది. దీనికి ప్రధానకారణం సీనియారిటీ సమస్య. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఎస్ఐలు, డీఎస్పీల సీనియారిటీ జాబితాపై కోర్టుల్లో కేసులుండటంతో సమీక్షించేందుకు సమయం పట్టింది. ఈ సీనియారిటీపై ఏపీ పోలీస్‌శాఖ సమీక్ష నిర్వహించాల్సి ఉండడంతో తెలంగాణ ఉన్నతాధికారులు దీనికి ఎలాంటి పరిష్కారమార్గాలు చూపించే అవకాశం లేకుండాపోయింది. దీనితో తెలంగాణ అధికారుల సీనియారిటీ జాబితాపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండుసార్లు సీనియారిటీ జాబితా సవరించి అభ్యంతరాలు స్వీకరించారు. అయినా, తెలంగాణ అధికారుల సీనియారిటీ సమస్యకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతలోనే ఏపీ పోలీస్ శాఖ 2రోజుల క్రితం రెండు రాష్ట్రాలకు పోలీసులను విభజించాలంటూ ప్రతిపాదిత అధికారుల జాబితానుకేంద్ర శిక్షణ, అంతర్గత వ్యవహారాల శాఖ (డీవోపీటీ)కి పంపడం ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఏకపక్షమెందుకు..? సీనియారిటీ జాబితాను రివ్యూ చేసి, అందులో తెలంగాణ అధికారులకు అన్యాయం జరిగిన వ్యవహారంపై ఆచితూచి వ్యవహరించాల్సిన ఏపీ పోలీస్‌శాఖ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలీస్ అధికారులు విభజన, సీనియారిటీ సమస్య పరిష్కారం ఏపీ అధికారుల చేతుల్లో ఉండటంతోనే ఇలా ఏకపక్షంగా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విభజన కాకుండానే కన్ఫర్డ్ జాబితా? రెండు రాష్ట్రాలకు డీఎస్పీ, అదనపు ఎస్పీ, నాన్‌క్యాడర్ ఎస్పీ అధికారుల విభజన పూర్తి కాలేనప్పుడు కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతుల కోసం కేంద్రానికి ప్రతిపాదన ఎలా పంపారన్న దానిపైనా వివాదం ఏర్పడే అవకాశముంది. రెండు రాష్ట్రాలకు 476 మంది డీఎస్పీ, ఆపై స్థాయి అధికారుల విభజన జరగాలి. కానీ, 3 నెలల క్రితం 10 మంది అధికారులను కన్ఫర్డ్ ఐపీఎస్ కోటా కింద పదోన్నతి కల్పించాలని కేంద్రానికి ప్రతిపాదనలు ఎలా పంపుతారని తెలంగాణ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి వెళ్లాలనుకున్న అధికారులు తెలంగాణలో, తెలంగాణకు రావాల్సిన అధికారులు ఏపీలో ఉండగానే ఇది ఎలా చేశారన్న దానిపై కొంతమంది అధికారులు కోర్టుకెళ్లాలని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 650 మందికి పైగా అధికారులకు అదనపు ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీ, డీఎస్పీ పదోన్నతులు కల్పించారు. సీనియారిటీ సమస్య పరిష్కారం కాకుండా అడ్çహాక్ పద్ధతిలో పదోన్నతులు కల్పించడం కూడా వివాదంగా మారబోతోంది. మా పరిస్థితి ఏంటి? ఏపీలో పనిచేస్తున్న తమ బ్యాచ్ అధికారులు కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా, నాన్‌క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతులు పొందుతుండటంతో తమ పరిస్థితి ఏంటని తెలంగాణ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 16 కన్ఫర్డ్ ఐపీఎస్ పోస్టులు భర్తీకి నోచుకోవడంలేదని, కేంద్ర హోంశాఖ ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణలో పనిచేస్తున్న తమ పేర్లను సీనియారిటీ ప్రకారం డీవోపీటీకి పంపాలని, ఈ ప్యానల్ ఏడాదైనా పదోన్నతి దక్కేలా చూడాలని గ్రూప్ వన్, ప్రమోటీ అధికారులు కోరుతున్నారు. -
రోజుకు 1,500 క్యూసెక్కులు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఎడమ కాలువ మూడో జోన్‌లోని పంటలను కాపాడుకునేందుకు రోజుకు 1,500 క్యూసెక్కుల చొప్పున ఈ నెల 10 వరకు నీటిని విడుదల చేసేలా తెలంగాణ అధికారులను ఆదేశించాలని కృష్ణా బోర్డును ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎ.పరమేశంకు లేఖ రాశారు. కృష్ణా బోర్డు మార్చి 20న నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నాలుగు టీఎంసీలను కేటాయించింది. అప్పటినుంచి నాగార్జున ఎడమ కాలువ ద్వారా ఏపీ సరిహద్దుకు రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున ఈ నెల 2 వరకు విడుదల చేశారు. అయితే కాలువలో నీటి మట్టం అంతంత మాత్రంగానే ఉండటంతో విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టు వరకు అందడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయని.. నీళ్లందించి కాపాడాలంటూ రోజూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజుకు కనీసం 1,500 క్యూసెక్కులు విడుదల చేయాలని ఏపీ ఈఎన్సీ బోర్డును కోరారు. తమకు కేటాయించిన కోటాలో ఇంకా 2.09 టీఎంసీలు మిగిలి ఉన్నాయని లేఖలో గుర్తు చేశారు. -
కనగానపల్లెలో తెలంగాణ అధికారుల బృందం
కనగానపల్లి : తెలంగాణ రాష్ట్ర అధికారులు కనగానపల్లిలో గురువారం పర్యటించారు. గొర్రెల పెంపకం, వాటి పోషణ గురించి అధ్యయనం చేసేందుకు బృందం వచ్చింది. బృందంలో పశుసంవర్థక, రెవెన్యూ అధికారులు ఉన్నట్లు కనగానపల్లి వెటర్నరీ డాక్టర్ గౌసియాబేగం తెలిపారు. జిల్లాలోనే అత్యధికంగా గొర్రెల పెంపకం ఈ మండలంలో ఉందన్నారు. తెలంగాణలోని గద్వేలు నియోజకవర్గ ఆర్డీఓ విజయేంద్ర, పశుసంవర్థక శాఖ ఏడీలు భాస్కరరెడ్డి, యంకన్న బృందంలో ఉన్నారు. గొర్రెల కాపరులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పశుగ్రాసం కొరత లేదని, అయితే గొర్రెల పోషణ గురించి రైతులకు పెద్దగా తెలియకపోవడంతో ఉత్పత్తి చాలా తక్కువగా ఉందన్నారు. దీంతో ఈ ప్రాంత రైతుల సలహాలతో తమ రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ప్రజల్లో చైతన్యం తీసుకురాన్నట్లు వెల్లడించారు. తరువాత ఈ ప్రాంతంలోని గొర్రెలను కొనుగోలు చేస్తామన్నారు. -
ఆ అధికారులను ఏపీకి పంపించాలి
సీఎస్ ఎస్పీ సింగ్‌కు గ్రూప్–1 అధికారుల విజ్ఞప్తి హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఆంధ్రా అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు రాష్ట్ర గ్రూప్–1 అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం సచివా లయంలో సీఎస్‌ను కలసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ఇతర నేతలు శ్రీనివాసులు, శశికిరణాచారి, అరవింద్‌రెడ్డి తదితరులు వినతిపత్రం అందజేశారు. ఆంధ్రాకు చెందిన అధికారులు ఏపీకి ఆప్షన్ ఇచ్చినప్పటికీ అక్కడ ఖాళీలు లేవన్న సాకుతో కమలనాథన్ కమిటీ తెలంగాణకు కేటాయించిందని, వారిని వెంటనే ఖాళీలతో సంబంధం లేకుండా ఆంధ్రాకు కేటాయించాలని కోరారు. అలాగే ఏపీలో పని చేస్తున్న తెలంగాణ అధికారులు, ఉద్యోగులను రాష్ట్రానికి రప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలను ఆప్షన్లతో సంబంధం లేకుండా వారి సొంత రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. -
పోలీస్ శాఖలో భారీగా పదోన్నతులు
80 అదనపు ఎస్పీ, నాన్‌కేడర్ ఎస్పీ, 170 డీఎస్పీ ప్రమోషన్లు తాత్కాలిక పద్ధతిన ఇచ్చేందుకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో భారీగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. కొన్నేళ్లుగా వివాదాస్పదం గా ఉన్న ఇన్స్పెక్టర్ల సీనియారిటీ జాబితా జీవో నం.54 ఓ కొలిక్కి రావడంతో.. పోలీస్ శాఖ పదోన్నతులకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇన్స్పెక్టర్ల ర్యాంక్ నుంచి నాన్ కేడర్ ఎస్పీ వరకు పదోన్నతులు కల్పించనున్నట్టు ఉన్నతాధికారులు చెప్పారు. రాష్ట్రంలోని 2 జోన్లలోనూ ఈ ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జీవో నంబర్ 54 సమీక్ష తర్వాత 170 మంది ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు మార్గం సుగమమైందన్నారు. డీఎస్పీ, అదనపు ఎస్పీలు 80 మందిని అదనపు ఎస్పీ, నాన్‌కేడర్ ఎస్పీకి ప్రమోట్ అవుతారని శాఖ వర్గాలు తెలిపాయి. సీనియారిటీ జాబితాపై పలు కోర్టుల్లో కేసులున్నందున పదోన్నతులన్నీ తాత్కాలిక పద్ధతిన ఇస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు... గతంలో ఉన్న సూపర్‌న్యూమరీ పోస్టులు పోనూ, కొత్త జిల్లాలు, కొన్ని అదనపు పోస్టుల ఏర్పాటును దృష్టిలో పెట్టుకొని పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో డీజీపీ అనురాగ్‌శర్మ కోరారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌తో డీజీపీ చర్చించి నట్టు తెలిసింది. దీంతో త్వరలోనే పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్నట్టు పోలీస్ శాఖ వర్గాలు తెలిపాయి. మరి విభజన సంగతేంటి? రాష్ట్ర స్థాయి అధికారులైన సివిల్ డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్‌కేడర్ ఎస్పీల పూర్తిస్థాయి విభజన జరగ లేదు. ఈ అంశంపై కోర్టులో స్టే ఉండటంతో కమల్‌నాథన్ కమిటీ విభజనను పక్కనపెట్టింది. అధికారుల విభజన పూర్తి కాకుండా అదనపు ఎస్పీ, నాన్ కేడర్ ఎస్పీ పదోన్న తులు ఇవ్వడం వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. డీఎస్పీల సీనియా రిటీ జాబితా ఉన్న జీవో నం.108పై సమీక్ష జరగకపోవ డం మరో వివాదంగా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవోపైనా కోర్టులో కేసులుం డటంతో అడ్హాక్ పద్ధతిన ప్రమోషన్లు ఇవ్వడంపై... బాధి త అధికారులు కోర్టుకెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
విద్యుత్ ఉద్యోగుల విభజన మళ్లీ మొదటికి!
♦ ఎవరి వాదన వారిదే ♦ రిలీవ్ ఉద్యోగులపై దిగిరాని తెలంగాణ ♦ చర్చలపై ఉద్యోగుల అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య బుధవారం జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కన్పించలేదు. ఇరు పక్షాలూ వారి వాదనలకే కట్టుబడ్డారు. దీంతో ఏ విధమైన పరిష్కారం లేకుండా ఈ నెల 30వ తేదీకి వాయిదా పడ్డాయి. జనాభా ప్రాతిపదికన విద్యుత్ ఉద్యోగుల విభజన జరగాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అధికారులు పట్టుపట్టారు. స్థానికతే కొలమానంగా తాము పొందుపర్చిన మార్గదర్శకాల ఆధారంగానే ముందుకెళ్లాలని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. అలాంటప్పుడు చర్చల ప్రక్రియ ఎందుకని ఏపీ అధికారులు కొంత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎనిమిది నెలల క్రితం 1252 మందిని రిలీవ్ చేశారు. ఈ అంశంపై అధికారుల మధ్య వాడివేడిగా చర్చ జరిగినట్టు తెలిసింది. విభజన చట్టంలో జనాభా ప్రాతిపదికన తెలంగాణకు 42 శాతం, ఆంధ్రకు 58 శాతం ఉద్యోగులను కేటాయించాల్సి ఉందని ఏపీ అధికారులు గుర్తుచేశారు. దీనికి విరుద్ధంగా రిలీవ్ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అధికారుల విముఖత.. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల దాదాపు 400 మంది ఉద్యోగులను తిరిగి ఇచ్చేస్తామని, అంత మొత్తాన్ని తెలంగాణలో ఉన్న ఏపీ స్థానికత ఉద్యోగులను తీసుకుంటామని, మిగతా ఉద్యోగుల విషయంలో జనాభా ప్రాతిపదికన వెళ్దామని ఏపీ అధికారులు సూచించారు. దీనికి తెలంగాణ అధికారులు ఎంతమాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. భార్య లేదా భర్త తెలంగాణ ప్రాంతానికి చెంది ఉంటే వారికి మాత్రమే తమ సంస్థల్లో చోటు కల్పిస్తామని, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా లివర్, కిడ్నీ, మానసిక వికలాంగత్వం ఉంటే సానుభూతి కోణంలో వారికి ఆప్షన్ ఇస్తామని తెలంగాణ అధికారులు తెలిపారు. ఇలాంటి కేసులు 50 లోపే ఉంటాయని, దీనివల్ల సమస్య పరిష్కారం కాదని ఏపీ అధికారులు తెలిపారు. తెలంగాణ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని, పరిష్కారం దిశగా చర్చల్లో పాల్గొనడం లేదని వారు ఆరోపించారు. చర్చలు జరుగుతున్న తీరుపై రిలీవ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాలు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా తెలంగాణ చర్చలకు పిలవడం, స్పష్టమైన విధానాలు లేకుండానే ఏపీ అధికారులు వెళ్లడం వెనుక రాజకీయ కోణం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. -
విద్యుత్ వివాదం మళ్లీ మొదటికి
గైర్హాజరైన తెలంగాణ అధికారులు సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విద్యుత్ వివాదానికి పీటముడి పడింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) సోమవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రా ల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. అయితే ఈ భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. ఆ రాష్ట్ర ఇంధన కార్యదర్శి అరవిందకుమార్ రాలేకపోయారు. దీంతో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తమ వాదనను సీఈఏ ముందుంచారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు 53.89శాతం, ఏపీకి 46.11శాతం విద్యుత్ వాటాలు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు మినహా మిగతా వాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. దీంతో అటు తెలంగాణలో, ఇట ఏపీలో కొత్త ప్రాజెక్టుల విద్యుత్ వాటాలపై వివాదం తలెత్తింది. ఏపీలోని కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల పీపీఏలు అంగీకరించలేదు. కాబట్టి ఇందులో తెలంగాణకు ఎలాంటి హక్కు లేదని ఏపీ పట్టుబట్టిం ది. వివాదం పరిష్కారం కోసం కేంద్రం ఏర్పా టు చేసిన కమిటీ ఎలాంటి నిర్ణయం ఇవ్వకుండానే కాల పరిమితి ముగిసింది. ఈ క్రమంలో సీఈఏ నేరుగా రెండు రాష్ట్రాల అధికారులతో సమాలోచనలు జరపాలని నిర్ణయించింది. తాజా భేటీలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణపట్నం విద్యుత్ అవసరం లేదని తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు లేఖ రాసిందన్నారు. కనుక దీన్ని తమకే కేటాయించాలన్నారు. అలాగే హిందూజా కూడా ఏపీకే చెందాలన్నారు. తెలంగాణలో 600 మెగావాట్లతో నిర్మిస్తున్న కాకతీయ థర్మల్ పవర్‌స్టేషన్ రెండో దశలో ఏపీకి 46.11 శాతం వాటా రావాలన్నారు. 120 మెగావాట్ల పులిచింత విద్యుత్ కేంద్రంలో ఇదే నిష్పత్తిలో వాటా కోరారు. ఆదిలాబాద్ జిల్లాల్లో నిర్మిస్తున్న సింగరేణి ప్రాజెక్టులోనూ 484 మెగావాట్లు ఏపీకి హక్కు ఉందని స్పష్టం చేశారు. ఏపీలో కొత్తగా రాయసీమ థర్మల్ స్టేషన్ నాలుగో దశ, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ఆంధ్రప్రదేశ్‌కే ఇవ్వాలన్నారు. తమ వాదనపై తెలంగాణ అభిప్రాయాలు తెలుసుకుని, నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీఈఏ ఛైర్మన్ చెప్పినట్టు విజయానంద్ తెలిపారు. -
ముంపు ముచ్చటే లేదు!
♦ మా ప్రాంతంలో ఒక్క అడుగు మునిగినా ఒప్పుకోం ♦ తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై తేల్చిచెప్పిన మహారాష్ట్ర ♦ 148 మీటర్ల ఎత్తుకే కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ ♦ 152 మీటర్ల ఎత్తు పెంపునకు అంగీకరించాలని కోరిన తెలంగాణ ♦ అసంపూర్తిగా ముగిసిన రెండు రాష్ట్రాల అధికారుల చర్చలు సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న బ్యారేజీ ఎత్తు పెంచేందుకు అంగీకరించేది లేదని మహారాష్ట్ర మరోసారి స్పష్టం చేసింది. బ్యారేజీతో తమ ప్రాంతంలో ఒక్క అడుగు మేర ముంపు ఉన్నా సమ్మతించ బోమని పేర్కొంది. తాము మొదట్నుంచీ చెబుతున్న 148 మీటర్ల ఎత్తుకే కట్టుబడి ఉన్నామని తెలిపింది. తెలంగాణ కోరుతున్నట్టుగా 152 మీటర్ల ఎత్తు పెంపునకు ఏమాత్రం అంగీకరించబోమని స్పష్టంచేసింది. దీంతో సోమవారం తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్రం రూపకల్పన చేసింది. అయితే మహారాష్ట్ర మాత్రం ఎత్తు 148 మీటర్లకు మించొద్దని అంటోంది. దీంతో చేసేది లేక తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా మేడిగడ్డ ప్రాంతం నుంచి నీటిని తీసుకునే ందుకు తెలంగాణ సిద్ధమైంది. అయితే తుమ్మిడిహెట్టి ఎత్తు ఎంత, బ్యారేజీ సామర్థ్యం ఎంత అన్నదానిపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాగ్‌పూర్ చీఫ్ ఇంజనీర్ ఆర్ఎం చవాన్, సూపరింటెండెంట్ ఇంజనీర్ భోగడేలతో కూడిన బృందంతో ఇక్కడి జలసౌధలో చర్చలు జరిగాయి. చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, ఈఎన్సీ మురళీధర్, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ హరిరామ్, సీడీఓ సీఈ నరేందర్‌రెడ్డి, హైడ్రాలజీ సీఈ శంకర్‌నాయక్ పాల్గొన్నారు. రాజకీయ పరిష్కారం కనుగొంటాం బ్యారేజీని ఏ ఎత్తులో నిర్మిస్తే ఎంత ముప్పు ఉంటుందన్న అంశంపై సర్వే చేసి ఒక అంచనాకు రావాలని తెలంగాణ అధికారులు మహారాష్ట్ర అధికారులకు సూచించారు. నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తే తాము రాజకీయంగా చర్చలు జరిపి పరిష్కారం కనుగొంటామని స్పష్టం చేశారు. చర్చల అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. ‘‘148 మీటర్ల ఎత్తుకు మించి మహారాష్ట్ర ఒప్పుకునేలా లేదు. సర్వేలో 148 మీటర్ల ఎత్తులోనూ కొంత ముంపు ఉన్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్లో మహారాష్ట్ర ప్రభుత్వంతో రాజకీయంగా చర్చలు జరిపి ఎత్తుపై తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని అన్నారు. మా నిర్ణయం ఇంతే మహారాష్ట్ర అధికారులు బ్యారేజీ ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ 148 మీటర్లకు మించి అనుమతించలేమని మహారాష్ట్ర అధికారులు చెప్పారు. తమ రాష్ట్ర రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు ముంపును వ్యతిరేకిస్తున్నాయని స్పష్టంచేశారు. బ్యారేజీ ఎత్తు 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచితే ఎంత మేర ముంపు ఉంటుందన్న అంశంపై తామింకా సర్వే చేయలేదన్నారు. ఒకవేళ 48 మీటర్ల ఎత్తులోనూ ముంపు ఉన్నట్టు తేలితే అందుకు కూడా అంగీకరించబోమని తేల్చిచెప్పారు. 152 నుంచి 148 మీటర్ల ఎత్తులో ముంపు ఎంత మేర ఉంటుందో పది రోజుల్లో నిర్ధారించి తమ ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. దీనిపై రాజకీయంగానే తేల్చుకోవాలని సూచించారు. -
ఖాతాలపైనే పీటముడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ సంస్థలకు సంబంధించిన ఆస్తులు, అప్పుల పంపిణీపై మరోసారి పీటముడి పడింది. డీమెర్జర్ ఖాతాలు (ఒక ఖాతాను రెండుగా విభజిస్తూ) తెరవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు దీనికి వ్యతిరేకించారు. తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీపై చర్చించేందుకు శుక్రవారం షీలాబిడే కమిటీ సమావేశమైంది. దీనికి ఇరు రాష్ట్రాలకు చెందిన 7 కార్పొరేషన్ల అధికారులు హాజరయ్యారు. ప్రధానంగా ఆస్తులు, అప్పులకు సంబంధించి న సమాచారంపై చర్చించారు. ఈ సంస్థల విభజనకు రిజర్వు సర్ప్లస్ అకౌంట్ తెరవాలని గతంలోనే షీలాబిడే కమిటీ రెండు రాష్ట్రాలకు సూచించింది. కానీ అందుకు భిన్నంగా సంస్థల విభజనకు ముందే డీమెర్జర్ ఖాతా తెరవాలని ఏపీ పట్టుబట్టింది. అయితే దానివల్ల తమకు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన సజావుగా జరుగకుండా ఏపీ అధికారులు అడ్డుపడుతున్నారంటూ టీఎస్ వేర్‌హౌజింగ్ జేఎండీ శరత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ ప్రతిపాదనను ఏపీ తెరపైకి తెచ్చిందని... డీమెర్జర్ ఖాతా తెరిస్తే తెలంగాణ లాభాల్లో వాటా అడిగే వెసులుబాటు ఏపీకి ఉంటుందనే వాదనను వినిపించారు. అయితే కొందరు తెలంగాణ అధికారులు ఏపీ ప్రతిపాదనను ఆమోదిస్తూ సంతకాలు సైతం చేసినట్లు తెలిసింది. పూర్తి సమాచారం లేకుండా ముందుకెళితే భారీ నష్టం వాటిల్లుతుందని.. న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలనే భావన మేరకు తెలంగాణ అధికారులు వెనక్కి తగ్గారు.