ముంపు ముచ్చటే లేదు! | Maharashtra would tummidihetti the height of barrage | Sakshi
Sakshi News home page

ముంపు ముచ్చటే లేదు!

Published Tue, Oct 27 2015 4:26 AM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM

ముంపు ముచ్చటే లేదు! - Sakshi

ముంపు ముచ్చటే లేదు!

♦ మా ప్రాంతంలో ఒక్క అడుగు మునిగినా ఒప్పుకోం
♦ తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై తేల్చిచెప్పిన మహారాష్ట్ర
♦ 148 మీటర్ల ఎత్తుకే కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
♦ 152 మీటర్ల ఎత్తు పెంపునకు అంగీకరించాలని కోరిన తెలంగాణ
♦ అసంపూర్తిగా ముగిసిన రెండు రాష్ట్రాల అధికారుల చర్చలు
 
 సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న బ్యారేజీ ఎత్తు పెంచేందుకు అంగీకరించేది లేదని మహారాష్ట్ర మరోసారి స్పష్టం చేసింది. బ్యారేజీతో తమ ప్రాంతంలో ఒక్క అడుగు మేర ముంపు ఉన్నా సమ్మతించ బోమని పేర్కొంది. తాము మొదట్నుంచీ చెబుతున్న 148 మీటర్ల ఎత్తుకే కట్టుబడి ఉన్నామని తెలిపింది. తెలంగాణ కోరుతున్నట్టుగా 152 మీటర్ల ఎత్తు పెంపునకు ఏమాత్రం అంగీకరించబోమని స్పష్టంచేసింది. దీంతో సోమవారం తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి.

ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్రం రూపకల్పన చేసింది. అయితే మహారాష్ట్ర మాత్రం ఎత్తు 148 మీటర్లకు మించొద్దని అంటోంది. దీంతో చేసేది లేక తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా మేడిగడ్డ ప్రాంతం నుంచి నీటిని తీసుకునే ందుకు తెలంగాణ సిద్ధమైంది. అయితే తుమ్మిడిహెట్టి ఎత్తు ఎంత, బ్యారేజీ సామర్థ్యం ఎంత అన్నదానిపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాగ్‌పూర్ చీఫ్ ఇంజనీర్ ఆర్‌ఎం చవాన్, సూపరింటెండెంట్ ఇంజనీర్ భోగడేలతో కూడిన బృందంతో ఇక్కడి జలసౌధలో చర్చలు జరిగాయి. చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, ఈఎన్‌సీ మురళీధర్, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ హరిరామ్, సీడీఓ సీఈ నరేందర్‌రెడ్డి, హైడ్రాలజీ సీఈ శంకర్‌నాయక్ పాల్గొన్నారు.

 రాజకీయ పరిష్కారం కనుగొంటాం
 బ్యారేజీని ఏ ఎత్తులో నిర్మిస్తే ఎంత ముప్పు ఉంటుందన్న అంశంపై సర్వే చేసి ఒక అంచనాకు రావాలని తెలంగాణ అధికారులు మహారాష్ట్ర అధికారులకు సూచించారు. నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తే తాము రాజకీయంగా చర్చలు జరిపి పరిష్కారం కనుగొంటామని స్పష్టం చేశారు. చర్చల అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. ‘‘148 మీటర్ల ఎత్తుకు మించి మహారాష్ట్ర ఒప్పుకునేలా లేదు. సర్వేలో 148 మీటర్ల ఎత్తులోనూ కొంత ముంపు ఉన్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వంతో రాజకీయంగా చర్చలు జరిపి ఎత్తుపై తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని అన్నారు.
 
 మా నిర్ణయం ఇంతే మహారాష్ట్ర అధికారులు
  బ్యారేజీ ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ 148 మీటర్లకు మించి అనుమతించలేమని మహారాష్ట్ర అధికారులు చెప్పారు. తమ రాష్ట్ర రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు ముంపును వ్యతిరేకిస్తున్నాయని స్పష్టంచేశారు. బ్యారేజీ ఎత్తు 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచితే ఎంత మేర ముంపు ఉంటుందన్న అంశంపై తామింకా సర్వే చేయలేదన్నారు. ఒకవేళ  48 మీటర్ల ఎత్తులోనూ ముంపు ఉన్నట్టు తేలితే అందుకు కూడా అంగీకరించబోమని తేల్చిచెప్పారు. 152 నుంచి 148 మీటర్ల ఎత్తులో ముంపు ఎంత మేర ఉంటుందో పది రోజుల్లో నిర్ధారించి తమ ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. దీనిపై రాజకీయంగానే తేల్చుకోవాలని సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement