తుమ్మిడిహెట్టికి ఓకే!
* 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీకి మహారాష్ట్ర సూత్రప్రాయ అంగీకారం
* ముంపుపై అధ్యయనం చేశాక మేడిగడ్డపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
* మహారాష్ట్ర మంత్రితో హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం సమావేశం
* 29, 30వ తేదీల్లో రాష్ట్ర అధికారులతో మరోమారు హైదరాబాద్‌లో భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీని ముంపు ఉండని స్థాయిలో నిర్మించేందుకు మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకరించింది.
ఈ బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ముంపు లేనందున.. ఆ ఎత్తు తమకు సమ్మతేమనని పేర్కొంది. కాళేశ్వరం దిగువన నిర్మించే మేడిగడ్డ బ్యారేజీ ముంపుపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాకే నిర్ణయం చెబుతామని చెప్పింది. ఈ నెల 29, 30వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే ప్రాణహిత అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో సాంకేతిక అంశాలపై చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
నాగ్‌పూర్‌లో సమావేశం..
తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీలతో ముంపు విషయమై మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆ రాష్ట్ర మంత్రులు గిరీష్ మహాజన్, విజయ్ శివతరే, జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో... మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఉన్నతాధికారుల బృందం చర్చలు జరిపింది. తొలుత గోదావరిలో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు రూపొందిస్తున్న పథకాలను హరీశ్ వివరించారు.
తెలంగాణ ఉద్యమంలో నీటి పంపకాలే ప్రధాన ప్రాతిపదికగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. నీటి వనరుల అభివృద్ధి విషయంలో ప్రజలు ఆశలు పెట్టుకున్నారని.. అందుకు తగినట్లుగా రాబోయే ఐదేళ్లలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. సాగునీటి వనరుల అభివృద్ధితో రైతుల ఆత్మహత్యలను పూర్తిగా నివారించవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజీని ప్రతిపాదించి ఆ ప్రకారంగా కాలువల తవ్వకాన్ని కూడా ప్రారంభించిందన్నారు.
దానిపై మహారాష్ట్ర అభ్యంతరాలతోపాటు తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై కేంద్ర జల సంఘం వ్యక్తం చేసిన అనుమానాలను దృష్టిలో పెట్టుకుని... తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను అన్వేషించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ అధ్యయనం చేసి గోదావరిపై కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజీని ప్రతిపాదించిందని మంత్రి చెప్పారు.
ఈ ఎత్తులో ముంపు మొత్తం నది గర్భంలోనే ఉంటుందని వ్యాప్కోస్ అధ్యయనంలో తేలిందన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు పరిమితం చేసి, మిగతా జిల్లాల అవసరాలకు మేడిగడ్డ నుంచి ఎత్తిపోసేలా పథకాన్ని రూపొందించిందని వివరిస్తూ... ఈ రెండు బ్యారేజీలకు అనుమతివ్వాలని కోరారు.
అధ్యయనం చేశాక నిర్ణయం
తెలంగాణ వాదనలు విన్న మహారాష్ట్ర బృందం తుమ్మిడిహెట్టిపై సానుకూలత తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిర్ణయాన్ని చెప్పలేదు. మేడిగడ్డ వద్ద సర్వేలో తేలిన ముంపు వివరాలను తాము ధ్రువీకరించుకోవాల్సి ఉందని.. వారంలో ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. ఈ నెల 29, 30వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే ప్రాణహిత బోర్డు సమావేశంలో సాంకేతిక అంశాలపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. పెన్‌గంగ బ్యారేజీ నిర్మాణంపైనా బోర్డు సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకుందామని పేర్కొంది.