రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ రంజిత్ బాషాతో సమావేశమైన తెలంగాణ అధికారులు
సాక్షి, అమరావతి: అర్హత కలిగిన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్) పథకం ద్వారా భూమి పట్టాలను అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానం అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని తెలంగాణ అధికారుల బృందం ప్రశంసించింది. గిరిజనులకు భూమి పట్టాల పంపిణీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొంది. ఏపీలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పథకం అమలు అవుతున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆ రాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను పంపిణీ చేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పట్టాలను ఏ విధంగా పంపిణీ చేశారనే విషయమై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర అధికారుల బృందం శనివారం ఏపీకి వచ్చింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు దిలీప్ కుమార్, ప్రవీణ్‌కుమార్, టి,మహేష్, టి.శ్రీనివాసరావు వెలగపూడి సచివాలయంలో ఏపీ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ పి.రంజిత్ బాషాతో సమావేశమయ్యారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను పంపిణీ చేయడానికి అనుసరించిన విధానాలను అడిగి తెలుసుకున్నారు. అటవీ హక్కుల పట్టాలను మంజూరు చేసే చట్టాలలో ఉన్న సమస్యలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
2.29 లక్షల ఎకరాలు పంపిణీ
రాష్ట్రంలో అర్హత కలిగిన గిరిజనులందరికీ ఆర్‌ఓఎఫ్‌ఆర్ పథకం ద్వారా అటవీ భూములకు పట్టాలు అందిస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారని రంజిత్ బాషా తెలంగాణ అధికారులకు వివరించారు. గతేడాది అక్టోబర్ 2న ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీని ప్రారంభించారన్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఇవ్వనంత భారీగా ఇప్పటి వరకూ 2.29 లక్షల ఎకరాల భూమి పట్టాలను గిరిజనులకు అందించారని చెప్పారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి గిరిజన కుటుంబానికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పథకం కింద కనీసం 2 ఎకరాల భూమికి పట్టాలను అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. అటవీ భూములలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులందరికీ ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను అందించామని తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
అటవీ భూములు కాకపోతే తిరస్కరించే వారు
► గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములు అటవీ శాఖకు చెందినవి అయితేనే గతంలో వారికి పట్టాలు ఇచ్చే వారు. అటవీ భూములు కాకపోతే దరఖాస్తులు తిరస్కరించే వారు. ఈసారి అలా కాకుండా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు అటవీ శాఖకు చెందని రెవెన్యూ భూములైతే వాటికి డీకేటీ పట్టాలను అందించాలని సీఎం ఆదేశించారు.
► ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలతో పాటుగా డీకేటీ పట్టాలను కూడా గిరిజనులకు అందించాం. ఇప్పటి వరకు 2,28,334 ఎకరాల భూమిని 1.24 లక్షల మంది గిరిజనులకు పట్టాలుగా ఇచ్చాం. 26 వేల మంది గిరిజనులకు 39 వేల ఎకరాల రెవెన్యూ భూమిని డీకేటీ పట్టాలుగా అందించాం.
► ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మరింత మంది గిరిజనులకు భూమి పట్టాలను అందించనున్నాం. పట్టాలు మంజూరు చేసిన భూములలో సరిహద్దు రాళ్లను నాటడంతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా ఆ భూముల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం.
► గిరిజనులకు సంబంధించిన భూమి వివరాలు.. ఇతర సంక్షేమ పథకాల ద్వారా వారు పొందుతున్న ప్రయోజనాలను సమీక్షించడానికి ‘గిరిభూమి’ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment