సాక్షి, హైదరాబాద్: కంబోడియాలోని ఆంకోర్‌వాట్ దేవాలయ నిర్మాణ శైలిని పోలిన దేశం లోని ఏకైక దేవునిగుట్ట ఆలయ పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. మన దేశంలో ఈ తరహా నిర్మాణ శైలితో ఆలయాలున్నట్టు రికార్డు కాలేదు. దాదాపు 1,500 ఏళ్ల కిందటిదిగా భావిస్తున్న ఈ దేవాలయం ఆలనాపాలనా లేక శిథిలావస్థకు చేరుకుంది. అంత శిథిలమైనా నిర్మాణ ప్రత్యేకతల వల్ల ఇటీవలి భారీ వర్షాలకు కూడా నిలిచే ఉండటం విశేషం. ఈ ఆలయాన్ని పునరుద్ధరించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూ.కోటి నిధులు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఆ నిధులతో ఆలయాన్ని విడదీసి అలాగే తిరిగి పేర్చటం ద్వారా పునుద్ధరించాలని తెలంగాణ హెరిటేజ్ శాఖ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో రెండ్రోజుల కింద ఆ శాఖ అధికారులు ఆలయాన్ని పరిశీలించి వచ్చారు. జిల్లా కలెక్టర్ విచక్షణాధికారం పరిధిలో ఉండే క్రూషి యల్ బ్యాలెన్స్ ఫండ్ నుంచి రూ.కోటి నిధులు ఇచ్చేందుకు సిద్ధమైన ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య.. వచ్చే నెలలో విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో వెంటనే పనులు ప్రారంభించాలని హెరిటేజ్ తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. స్థానికుల వరకే తెలిసిన ఈ ఆలయ విశేషాలను మూడేళ్ల కింద ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత హెరిటేజ్ తెలంగాణ అధికారులు సర్వే చేశారు. ప్రస్తుతం అది ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోగానీ అటు ఏఎస్‌ఐ ద్వారా కేంద్రం పరిధిలో గాని పురాతన కట్టడంగా లేదు. జీతాలకు తప్ప నిధులు లేక కునారిల్లుతున్న హెరిటేజ్ తెలంగాణ శాఖ చూస్తుండటం తప్ప దాని పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంతకాలానికి కలెక్టర్ చొరవతో మంచిరోజులు వచ్చినట్లయింది.
రాతి ఇటుకలపై శిల్పాలు..
మన దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిపై శిల్పాలను ఓ రాతిపై చెక్కుతారు. కానీ ఈ దేవాలయంలో శైలి అందుకు పూర్తి విరుద్ధం. శిల్పం రూపాన్ని విభజించి అనేక చిన్న రాళ్లపై భాగాలుగా చెక్కుతారు. ఆ తర్వాత జత చేస్తూ వాటిని పేర్చి పూర్తి శిల్పానికి రూపమిస్తారు. ఈ నిర్మాణ శైలి కంబోడియాలోని ఆంకోర్‌వాట్ దేవాలయంలో కనిపిస్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన ఆ దేవాలయాన్ని నిత్యం కొన్ని వేల మంది సందర్శిస్తారు. ఆ తరహా శైలిలో మనదేశంలో నిర్మితమైనట్లు ఇప్పటివరకు వివరాలు రికార్డు కాలేదు. దేవునిగుట్ట ఆలయం మాత్రం ఫక్తు అదే శైలి ప్రతిబింబిస్తుంది. ఆలయానికి మొత్తం ఇసుక రాళ్లను వాడారు. ములుగు జిల్లా కేంద్రానికి 20 కి.మీ. దూరంలో ఉన్న కొత్తూరు గ్రామ పొలిమేరలో దట్టమైన అడవిలో ఈ దేవాలయం ఉంది.
అడుగడుగునా శిల్పాలే..
ఆలయం మొత్తం గాథలను ప్రతిబింబించే శిల్పాలున్నాయి. ఇందులో బుద్ధుడి జాతక కథలు కనిపిస్తున్నాయి. దక్షిణ భాగంలో అజంతా శైలిలో లలితాసనంలో ఉన్న బోధిసత్వ పద్మపాణి విగ్రహం ఉంది. ఇది దక్షిణామూర్తిని కూడా పోలి ఉందన్న వాదనా ఉంది. పశ్చిమ భాగంలో అర్ధనారీశ్వరుడిని పోలిన చిత్రం ఉంది. కుడిచేయి గణపతి మీద, ఎడమ చేయి కుమారస్వామి మీద పెట్టినట్టుగా ఈ చిత్రం కనిపిస్తోంది. వజ్ర యానంలో బుద్ధుడిని పరమశివుడి రూపం లో పూజించే పద్ధతి ఉన్నందున శివుని రూపాలను చిత్రించినట్లు తెలుస్తోంది. ఆలయం వెలుపలి వైపు శిల్పాలను పేర్చినట్టుగానే, లోపలి వైపు కూడా చిత్ర భాగాలతో కూడిన రాళ్లను పేర్చి పలురకాల ఆకృతులకు రూపమిచ్చారు. బయటివైపు ఒక రాతి పొర, లోపలి వైపు మరో రాతి పొర ఉందన్నమాట. ఈ గోడలు 9 అడుగుల మందంతో ఉన్నాయి. ఆలయం 35 అడుగుల ఎత్తు ఉండగా, చుట్టు కొలత 20 మీటర్ల మేర ఉంది. దీనికి 250 మీటర్ల దూరంలో దాదాపు 25 ఎకరాల్లో విస్తరించిన తటాకం ఉంది. గర్భాలయంలోపలి నుంచి పైకి చూస్తే పిరమిడ్ తరహాలో ఆలయ శిఖరం చివరి వరకు కనిపిస్తుంది. బౌద్ధ స్తూపం ముందుండే ఆయక స్తంభాన్ని పోలిన సున్నపు రాయి స్తంభం ఉంది. స్తంభం విరిగి రెండు ముక్కలై ఉంటుందని భావిస్తున్నారు.
ఆలయ పునరుద్ధరణకు పూర్తి సహకారం
‘దేవునిగుట్ట ఆలయానికి చరిత్రలో ప్రత్యేక స్థానముంది. ఇది ఐదారు శతాబ్దాల కిందటిదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇటీవలే నేను ఆలయాన్ని చూశాను. చాలా అద్భుతంగా ఉంది. నా పరిధిలో క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ కింద రూ.కోటి అందుబాటులో ఉంది. ఆ నిధులను ఈ అద్భుత దేవాలయ పునరుద్ధరణకు కేటాయించాలని నిర్ణయించాను. దీన్ని పునరుద్ధరించేందుకు నా పరిమితులకు లోబడి సాధ్యమైనంత వరకు కృషి చేస్తాను. ఇప్పటికే హెరిటేజ్ తెలంగాణ అధికారులు నాకు ప్రాథమిక డీపీఆర్ అందజేశారు.’
–కృష్ణ ఆదిత్య, ములుగు జిల్లా కలెక్టర్
ఆంకోర్‌వాట్ కంటే చాలా పురాతనం
ఆంకోర్‌వాట్ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించారు. దేవునిగుట్ట దేవాలయం 5 లేదా ఆరో శతాబ్దంలోనే నిర్మించినట్లు తెలుస్తోంది. వాకాటక రాజులు కానీ, విష్ణుకుండినులు గాని నిర్మించి ఉంటారు.
– రంగాచార్య, చరిత్రకారులు
Comments
Please login to add a commentAdd a comment