సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ సంస్థలకు సంబంధించిన ఆస్తులు, అప్పుల పంపిణీపై మరోసారి పీటముడి పడింది. డీమెర్జర్ ఖాతాలు (ఒక ఖాతాను రెండుగా విభజిస్తూ) తెరవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు దీనికి వ్యతిరేకించారు. తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీపై చర్చించేందుకు శుక్రవారం షీలాబిడే కమిటీ సమావేశమైంది. దీనికి ఇరు రాష్ట్రాలకు చెందిన 7 కార్పొరేషన్ల అధికారులు హాజరయ్యారు. ప్రధానంగా ఆస్తులు, అప్పులకు సంబంధించి న సమాచారంపై చర్చించారు.
ఈ సంస్థల విభజనకు రిజర్వు సర్‌ప్లస్ అకౌంట్ తెరవాలని గతంలోనే షీలాబిడే కమిటీ రెండు రాష్ట్రాలకు సూచించింది. కానీ అందుకు భిన్నంగా సంస్థల విభజనకు ముందే డీమెర్జర్ ఖాతా తెరవాలని ఏపీ పట్టుబట్టింది. అయితే దానివల్ల తమకు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన సజావుగా జరుగకుండా ఏపీ అధికారులు అడ్డుపడుతున్నారంటూ టీఎస్ వేర్‌హౌజింగ్ జేఎండీ శరత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ ప్రతిపాదనను ఏపీ తెరపైకి తెచ్చిందని... డీమెర్జర్ ఖాతా తెరిస్తే తెలంగాణ లాభాల్లో వాటా అడిగే వెసులుబాటు ఏపీకి ఉంటుందనే వాదనను వినిపించారు. అయితే కొందరు తెలంగాణ అధికారులు ఏపీ ప్రతిపాదనను ఆమోదిస్తూ సంతకాలు సైతం చేసినట్లు తెలిసింది. పూర్తి సమాచారం లేకుండా ముందుకెళితే భారీ నష్టం వాటిల్లుతుందని.. న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలనే భావన మేరకు తెలంగాణ అధికారులు వెనక్కి తగ్గారు.
ఖాతాలపైనే పీటముడి
Published Sat, Aug 15 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM
Advertisement
Advertisement