State Division Law
-
ఏపీకి చెల్లిస్తే మీదే బాధ్యత
పదో షెడ్యూలు సంస్థల నగదు నిల్వలపై బ్యాంకర్లకు రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టం పదో షెడ్యూలు లో ఉన్న సంస్థల నగదు నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన నగదు నిల్వలను రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 142 పదో షెడ్యూలు సంస్థలు తమ ప్రాంతంలో ఉన్నందున వీటి ఆస్తులు, నిధులన్నీ తమవేనని రాష్ట్ర ప్రభుత్వ వాదన. ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాల్లో నగదు పంపిణీపై హైకోర్టులో తెలంగాణకు అనుకూలంగా తీర్పు రావటంతో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం తీర్పుతో తెలంగాణ వాదన వీగి పోయినట్లయింది. ఏపీ ప్రభుత్వానికి ఏవైనా చెల్లింపులు చేస్తే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్ని బ్యాంకులకు తెలంగాణ ఆర్థిక శాఖ తాజాగా లేఖలు రాసింది. సుప్రీం తీర్పును అమలు చేయాలంటే 2014 జూన్ 2 నాటికి బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు, డిపాజిట్లను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. -
చట్టంలో హామీలకే.. కొత్త పేరు
♦ ‘స్పెషల్ అసిస్టెన్స్’ పేరిట రూ.వెయ్యి కోట్లు ♦ పోలవరం రీయింబర్స్మెంట్ నిధులు ఇదే కోటాలో ♦ ఏడు జిల్లాలకిచ్చే వెనుకబాటు నిధులకూ ఇదే రంగు.. ♦ చట్టప్రకారం దక్కాల్సిన వాటినే ప్రత్యేకమని చూపుతున్న కేంద్రం ♦ సీఎం చంద్రబాబు అభ్యర్థన మేరకే కొత్తపేరు... సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకు ఇవ్వాల్సిన నిధులనే ‘స్పెషల్ అసిస్టెన్స్’ అనే కొత్త పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ.వెయ్యి కోట్లను ప్రకటించింది. ప్రత్యేక హోదా సాధన కోసం రాజకీయంగా పెరుగుతున్న ఒత్తిడి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రకటన నేపథ్యం... వెరసి సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి అభ్యర్థించిన మేరకే మరుసటి రోజే ‘స్పెషల్ అసిస్టెన్స్’ ప్రకటన వెలువడింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం ఏపీకి రూ. వెయ్యి కోట్లు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు ప్రకటనతో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో రాజ్‌భవన్, సచివాలయం, హైకోర్టు, శాసనసభ, శాసనమండలి, ఇతర మౌలిక వసతులకు, వెనుకబడిన ఏడు జిల్లాలకు, పోలవరం ప్రాజెక్టుకు.. ఇలా మొత్తంగా రూ.1000 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని మొత్తం 7 జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున ఏటా ఇవ్వాల్సిన రూ.350 కోట్లను, నూతన రాజధానికి రూ.350 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.300 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనూ రూ.4,403 కోట్లు ఇచ్చామని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. అంటే.. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు గత ఆర్థిక సంవత్సరంలో నిధులు ఇచ్చిన తరహాలోనే, ఏటా ఇవ్వాల్సిన నిధులనే కేంద్రం ఇప్పుడూ ప్రకటించింది. అయితే, దీనినే స్పెషల్ అసిస్టెన్స్‌గా పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నిధులు ప్రకటించినప్పుడు లేని ‘స్పెషల్ అసిస్టెన్స్’ ఇప్పుడు పేర్కొనడం విశేషం. చంద్రబాబు కోరిక మేరకే... స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా, విభజన హామీలన్నీ కలిపి ఒక స్పెషల్ ప్యాకేజీ అయినా ఇవ్వాలని టీడీపీ కోరగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పెషల్ ప్యాకేజీ పై నీతి ఆయోగ్ మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. దీనిని రాజధాని శంకుస్థాపన రోజున ప్రకటించాలని ముహూర్తంగా నిర్ణయించిన విషయం విదితమే. ఇదే క్రమంలో ఏపీలో ప్రత్యేక హోదా సాధనపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో.. దాని తీవ్రతను తగ్గించేందుకు చంద్రబాబు కోరికమేరకు స్పెషల్ అసిస్టెన్స్ అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన నిధులను ఈ శీర్షికతో చూపించారు. పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన ఖర్చును తిరిగి చెల్లించడం కేంద్రం బాధ్యత. అది జాతీయ ప్రాజెక్టు అయినందున ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోజాలదు. అందుకే తాజాగా రూ.300 కోట్లు ఇచ్చింది. విభజన చట్టంలోని మరో హామీ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ. దీనిలో భాగంగానే గతేడాది రూ.350 కోట్లు ప్రకటించారు. ఈ ఏడాది రూ.350 కోట్లు ఇచ్చారు. ఇక రాజధాని నిర్మాణానికి చట్టంలోనే నిబంధన ఉంది. ఈమేరకు గతేడాది రాజధాని నిర్మాణానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. దీనిని కూడా ఈ ఏడాది ప్రత్యేకంగా చూపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాజధాని నిర్మాణానికి గతేడాది కేటాయించిన నిధులతో అక్కడ కనీస పనులు కూడా చేపట్టకపోవడం గమనార్హం. -
సంచలనమేమీ లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తను సమావేశం కావడంలో ఎలాంటి సంచలనం లేదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. హోంమంత్రితో భేటీ సాధారణ సమావేశమేనని, ఇందులో చెప్పడానికి ఏమీ లేదన్నారు. గురువారం సాయంత్రం హోం శాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్‌తో 10 నిమిషాలు, ఆ తర్వాత హోం మంత్రి రాజ్‌నాథ్‌తో పావుగంట పాటు నరసింహన్ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలోని అపరిష్కృత హామీలు, షెడ్యూల్ 9, 10లోని ఉమ్మడి ఆస్తుల పంపిణీ, ఉద్యోగుల విభజన తదితర సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పినట్టు తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాను నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు గైర్హాజరైన విషయాన్ని రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు గవర్నర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై త్వరలోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదనే ఆరోపణలపై అడగ్గా.. ‘థాంక్యూ’ అని బదులిచ్చారు. జరిగిన పొరపాటును సరిదిద్దుతారా అని ప్రశ్నించగా, ‘చూద్దాం. రాజ్యాంగపరమైన సమస్య ఉత్పన్నమైనప్పుడు అధిగమిస్తాం’ అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ను పరామర్శించిన గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయనను గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించి సంతాపం తెలియచేశారు. -
ఖాతాలపైనే పీటముడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ సంస్థలకు సంబంధించిన ఆస్తులు, అప్పుల పంపిణీపై మరోసారి పీటముడి పడింది. డీమెర్జర్ ఖాతాలు (ఒక ఖాతాను రెండుగా విభజిస్తూ) తెరవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు దీనికి వ్యతిరేకించారు. తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీపై చర్చించేందుకు శుక్రవారం షీలాబిడే కమిటీ సమావేశమైంది. దీనికి ఇరు రాష్ట్రాలకు చెందిన 7 కార్పొరేషన్ల అధికారులు హాజరయ్యారు. ప్రధానంగా ఆస్తులు, అప్పులకు సంబంధించి న సమాచారంపై చర్చించారు. ఈ సంస్థల విభజనకు రిజర్వు సర్ప్లస్ అకౌంట్ తెరవాలని గతంలోనే షీలాబిడే కమిటీ రెండు రాష్ట్రాలకు సూచించింది. కానీ అందుకు భిన్నంగా సంస్థల విభజనకు ముందే డీమెర్జర్ ఖాతా తెరవాలని ఏపీ పట్టుబట్టింది. అయితే దానివల్ల తమకు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన సజావుగా జరుగకుండా ఏపీ అధికారులు అడ్డుపడుతున్నారంటూ టీఎస్ వేర్‌హౌజింగ్ జేఎండీ శరత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ ప్రతిపాదనను ఏపీ తెరపైకి తెచ్చిందని... డీమెర్జర్ ఖాతా తెరిస్తే తెలంగాణ లాభాల్లో వాటా అడిగే వెసులుబాటు ఏపీకి ఉంటుందనే వాదనను వినిపించారు. అయితే కొందరు తెలంగాణ అధికారులు ఏపీ ప్రతిపాదనను ఆమోదిస్తూ సంతకాలు సైతం చేసినట్లు తెలిసింది. పూర్తి సమాచారం లేకుండా ముందుకెళితే భారీ నష్టం వాటిల్లుతుందని.. న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలనే భావన మేరకు తెలంగాణ అధికారులు వెనక్కి తగ్గారు. -
బాబు అనైతిక పనికి, సెక్షన్ 8కు సంబంధమేంటి?
వైఎస్సార్సీపీ నేత బొత్స సూటిప్రశ్న * ప్రజలదృష్టి మళ్లించేందుకు కొత్త డ్రామా ఆడుతున్నారు సాక్షి, హైదరాబాద్: సెక్షన్-8తోసహా రాష్ట్ర విభజన చట్టంలో ఏమేమి అంశాలున్నాయో వాటన్నింటినీ కచ్చితంగా అమలుచేసి తీరాలని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చట్టంలోని సెక్షన్-8, సెక్షన్ 95 అమలుతోపాటుగా రాష్ట్రానికిస్తామన్న ప్రత్యేకహోదానూ ప్రకటించాలన్నారు. సీఎం చంద్రబాబు తాను అనైతికమైన పనిలో ఇరుక్కున్నాకనే ప్రజల దృష్టి మళ్లించేందుకు సెక్షన్-8 పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని, ఇంతకాలం ఆయనకీ విషయం గుర్తుకెందుకు రాలేదని బొత్స ధ్వజమెత్తారు. పరిపాలనను గాలికొదిలేశారని విమర్శించారు. టీడీపీయే ఎప్పుడూ అధికారంలో ఉంటుందనుకోవద్దని, అనైతిక పనులకు మద్దతు నివ్వవద్దని అధికారులకు ఆయన సూచించారు. ఆ ఆరోపణలకు ఆధారాలు చూపండి.. జగన్మోహన్రెడ్డి ఒక స్టార్ హోటల్లో టీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారని పిచ్చిపిచ్చి ఆరోపణలు చేయకుండా టీడీపీ నేతలవద్ద ఆధారాలుంటే బయటపెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. తానుచేసిన అనైతిక పనులు కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సెక్షన్-8 అమలుపై జగన్ ఎందుకు మాట్లాడ్డం లేదని టీడీపీ నేతలడగడం అసమంజసంగా ఉందన్నారు. పార్టీ తరపున ఈ అంశంపై తాము విస్పష్టంగా అనేకసార్లు మాట్లాడామని గుర్తుచేశారు. గత పదిరోజులుగా జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారని తెలిసి కూడా టీడీపీ నేతలు ఇలా మాట్లాడ్డం చూస్తే ‘తామే తెలివైనవాళ్లం’ అన్నట్లుగా ఎదుటివారిపై బురద జల్లుతున్నారని విమర్శించారు. -
విభజన చట్టాన్ని అమలు చేయాలి
హన్మకొండ : రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేసి.. అధికారుల కేటాయింపు త్వరగా పూర్తి చేయూలని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను టీఆర్ఎస్ ఎంపీలు కలిసి.. రాష్ట్ర సమస్యలు వివరించామన్నారు. రాష్ట్ర విభజన చట్టం అమలుకాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కేటాయింపు పూర్తి కాకపోవడంతో ఇక్కడ పాలన కుంటుపడిందని అన్నారు. విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగులుతాయని, దీంతో నేరాలు పెరుగుతాయని భావించారన్నారు. దీనికి భిన్నంగా రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి పోతున్నారని, ప్రశాంతంగా ఉంటున్నారన్నారు. హైదరాబాద్‌లో పరిస్థితులు శాంతియుతంగా ఉన్నాయని వివరించి.. గవర్నర్ పెత్తనం లేకుండా చేశామన్నారు. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించామన్నారు. పత్తి ధర మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5వేలు పెంచాలని వివరించామన్నారు. తెలంగాణలో పత్తి 17.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని, 65 లక్షల బేళ్లు ఉత్పత్తి అవుతుందన్నారు. దేశంలో 1.72 ఎకరాల్లో పత్తి సాగుచేస్తుండగా.. 4 కోట్ల బేళ్లు ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఈ పత్తిలో 25 శాతం తెలంగాణలో ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఇందులో 3 కోట్ల బేళ్లను దేశ అవసరాలకు వినియోగించుకొంటుండగా, కోటి బేళ్లను విదేశాలకు ఎగుమతి చేసేవారమన్నారు. రాష్ట్రంలో పండుతున్న పత్తిని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు పత్తి ఆధారిత పరిశ్రమలైన జన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎంపీ ఆజ్మీర సీతారాంనాయక్, పార్టీ జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, నాయకులు గుడిమళ్ల రవికుమార్, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, ఎల్లావుల లలితాయాదవ్, కె.వాసుదేవరెడ్డి, జోరిక రమేష్ పాల్గొన్నారు.