చట్టంలో హామీలకే.. కొత్త పేరు
♦ ‘స్పెషల్ అసిస్టెన్స్’ పేరిట రూ.వెయ్యి కోట్లు
♦ పోలవరం రీయింబర్స్‌మెంట్ నిధులు ఇదే కోటాలో
♦ ఏడు జిల్లాలకిచ్చే వెనుకబాటు నిధులకూ ఇదే రంగు..
♦ చట్టప్రకారం దక్కాల్సిన వాటినే ప్రత్యేకమని చూపుతున్న కేంద్రం
♦ సీఎం చంద్రబాబు అభ్యర్థన మేరకే కొత్తపేరు...
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకు ఇవ్వాల్సిన నిధులనే ‘స్పెషల్ అసిస్టెన్స్’ అనే కొత్త పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ.వెయ్యి కోట్లను ప్రకటించింది.
ప్రత్యేక హోదా సాధన కోసం రాజకీయంగా పెరుగుతున్న ఒత్తిడి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రకటన నేపథ్యం... వెరసి సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి అభ్యర్థించిన మేరకే మరుసటి రోజే ‘స్పెషల్ అసిస్టెన్స్’ ప్రకటన వెలువడింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం ఏపీకి రూ. వెయ్యి కోట్లు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు ప్రకటనతో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో రాజ్‌భవన్, సచివాలయం, హైకోర్టు, శాసనసభ, శాసనమండలి, ఇతర మౌలిక వసతులకు, వెనుకబడిన ఏడు జిల్లాలకు, పోలవరం ప్రాజెక్టుకు.. ఇలా మొత్తంగా రూ.1000 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని మొత్తం 7 జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున ఏటా ఇవ్వాల్సిన రూ.350 కోట్లను, నూతన రాజధానికి రూ.350 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.300 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించింది.
2014-15 ఆర్థిక సంవత్సరంలోనూ రూ.4,403 కోట్లు ఇచ్చామని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. అంటే.. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు గత ఆర్థిక సంవత్సరంలో నిధులు ఇచ్చిన తరహాలోనే, ఏటా ఇవ్వాల్సిన నిధులనే కేంద్రం ఇప్పుడూ ప్రకటించింది. అయితే, దీనినే స్పెషల్ అసిస్టెన్స్‌గా పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నిధులు ప్రకటించినప్పుడు లేని ‘స్పెషల్ అసిస్టెన్స్’ ఇప్పుడు పేర్కొనడం విశేషం.
చంద్రబాబు కోరిక మేరకే...
స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా, విభజన హామీలన్నీ కలిపి ఒక స్పెషల్ ప్యాకేజీ అయినా ఇవ్వాలని టీడీపీ కోరగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పెషల్ ప్యాకేజీ పై నీతి ఆయోగ్ మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. దీనిని రాజధాని శంకుస్థాపన రోజున ప్రకటించాలని ముహూర్తంగా నిర్ణయించిన విషయం విదితమే. ఇదే క్రమంలో ఏపీలో ప్రత్యేక హోదా సాధనపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో.. దాని తీవ్రతను తగ్గించేందుకు చంద్రబాబు కోరికమేరకు స్పెషల్ అసిస్టెన్స్ అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన నిధులను ఈ శీర్షికతో చూపించారు. పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన ఖర్చును తిరిగి చెల్లించడం కేంద్రం బాధ్యత. అది జాతీయ ప్రాజెక్టు అయినందున ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోజాలదు. అందుకే తాజాగా రూ.300 కోట్లు ఇచ్చింది. విభజన చట్టంలోని మరో హామీ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ. దీనిలో భాగంగానే గతేడాది రూ.350 కోట్లు ప్రకటించారు.
ఈ ఏడాది రూ.350 కోట్లు ఇచ్చారు. ఇక రాజధాని నిర్మాణానికి చట్టంలోనే నిబంధన ఉంది. ఈమేరకు గతేడాది రాజధాని నిర్మాణానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. దీనిని కూడా ఈ ఏడాది ప్రత్యేకంగా చూపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాజధాని నిర్మాణానికి గతేడాది కేటాయించిన నిధులతో అక్కడ కనీస పనులు కూడా చేపట్టకపోవడం గమనార్హం.