బాబు అనైతిక పనికి, సెక్షన్ 8కు సంబంధమేంటి?
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సూటిప్రశ్న
* ప్రజలదృష్టి మళ్లించేందుకు కొత్త డ్రామా ఆడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: సెక్షన్-8తోసహా రాష్ట్ర విభజన చట్టంలో ఏమేమి అంశాలున్నాయో వాటన్నింటినీ కచ్చితంగా అమలుచేసి తీరాలని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చట్టంలోని సెక్షన్-8, సెక్షన్ 95 అమలుతోపాటుగా రాష్ట్రానికిస్తామన్న ప్రత్యేకహోదానూ ప్రకటించాలన్నారు.
సీఎం చంద్రబాబు తాను అనైతికమైన పనిలో ఇరుక్కున్నాకనే ప్రజల దృష్టి మళ్లించేందుకు సెక్షన్-8 పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని, ఇంతకాలం ఆయనకీ విషయం గుర్తుకెందుకు రాలేదని బొత్స ధ్వజమెత్తారు. పరిపాలనను గాలికొదిలేశారని విమర్శించారు. టీడీపీయే ఎప్పుడూ అధికారంలో ఉంటుందనుకోవద్దని, అనైతిక పనులకు మద్దతు నివ్వవద్దని అధికారులకు ఆయన సూచించారు.
ఆ ఆరోపణలకు ఆధారాలు చూపండి..
జగన్‌మోహన్‌రెడ్డి ఒక స్టార్ హోటల్లో టీఆర్‌ఎస్ నేతలతో భేటీ అయ్యారని పిచ్చిపిచ్చి ఆరోపణలు చేయకుండా టీడీపీ నేతలవద్ద ఆధారాలుంటే బయటపెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. తానుచేసిన అనైతిక పనులు కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సెక్షన్-8 అమలుపై జగన్ ఎందుకు మాట్లాడ్డం లేదని టీడీపీ నేతలడగడం అసమంజసంగా ఉందన్నారు.
పార్టీ తరపున ఈ అంశంపై తాము విస్పష్టంగా అనేకసార్లు మాట్లాడామని గుర్తుచేశారు. గత పదిరోజులుగా జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారని తెలిసి కూడా టీడీపీ నేతలు ఇలా మాట్లాడ్డం చూస్తే ‘తామే తెలివైనవాళ్లం’ అన్నట్లుగా ఎదుటివారిపై బురద జల్లుతున్నారని విమర్శించారు.