special Assistance
-
అనుభవం.. నేర్పని పాఠం!
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబుపత్రాలు మూల్యాంకనం చేయడం ఎంత ముఖ్యమో.. వచ్చిన మార్కులు టోటలింగ్ చేయడం, మార్కుల పోస్టింగ్‌లు పరిశీలించడం కూడా అంతే ముఖ్యం. ఇందులో స్పెషల్ అసిస్టెంట్ల(ఎస్ఏ)లే కీలకం. మూల్యాంకనంలో ప్రతి ముగ్గురు ఏఈ(అసిస్టెంట్ ఎగ్జామినర్లు)లకు ఒక స్పెషల్ అసిస్టెంట్(ఎస్ఏ)ను ఇవ్వాల్సి ఉంది. సుమారు 400 మందికి పైగా స్పెషల్ అసిస్టెంట్లు అవసరం కాగా వీరిలో సగంమంది కూడా రావడం లేదు. ఏటా ఇదే తంతు. గత అనుభవాలతో విద్యాశాఖ అధికారులు గుణపాఠం నేర్చుకోని పరిస్థితి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. జిల్లాకు దాదాపు 5.40 లక్షల జవాబు పత్రాలు రానున్నాయి. రెండు రోజులుగా జవాబుపత్రాలు వస్తున్నాయి. స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తున్నారు. స్పెషల్ అసిస్టెంట్లు కీలకం ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు దిద్ది మార్కులు వేసిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్లు జవాబుపత్రం తీసుకుని మార్కుల పోస్టింగ్‌లు, మార్కుల టోటలింగ్ పరిశీలించాలి. ♦ ఏఈలు జవాబు పత్రాలు దిద్దుతున్న కంగారులో మార్కుల టోటలింగ్‌లో ఏవైనా తప్పులు జరిగే అవకాశం ఉంది. దీనికితోడు మండుతున్న వేసవితో ఉక్కపోత, సౌకర్యాల లేమితో తీవ్ర అసహనానికి లోనవుతుంటారు. ఈ క్రమంలో చిన్నచిన్న తప్పులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏఈలు దిద్దిన జవాబు పత్రాలను స్పెషల్ అసిస్టెంట్లు మరోసారి పరిశీలించి మార్కుల వివరాలను ధ్రువీకరిస్తారు. ♦ పొరపాటున ఏఈల చేతుల్లో టోటలింగ్‌లో తక్కువ వచ్చిన అంశాల్ని స్పెషల్ అసిస్టెంట్లు గుర్తించిన సందర్భాలు అనేకం. చాలీచాలని రెమ్యూనరేషన్ మూల్యాంకనం విధుల్లో పాల్గొంటున్న ఇతర అన్ని కేడర్ల కంటే కూడా స్పెషల్ అసిస్టెంట్లకే రెమ్యూనరేషన్ తక్కువ. ఏఈలకు డీఏ, పేపర్లు దిద్దినందుకు రోజుకు సగటున రూ.550 దాకా వస్తుంది. చీఫ్ ఎగ్జామినర్లకు కూడా ఇదే స్థాయిలో వస్తుంది. అయితే స్పెషల్ అసిస్టెంట్లకు మాత్రం కేవలం రూ.137.50లతో సరిపెడుతున్నారు. దీనికి తోడు డీఏ ఇవ్వడం లేదు. మండుతున్న ఎండలకు తోడు ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతోనే చాలామంది టీచర్లు స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. గుణపాఠం నేర్వని విద్యాశాఖ ఏటా ఇదే తంతు. గత అనుభవాలతో గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు టీచర్లు ఆసక్తి చూపడం లేదు. మూల్యాంకనంలో ఏమాత్రం తేడా వచ్చినా నష్టోపోయేది విద్యార్థులే. వారికి ఇష్టమున్నా.. లేకున్నా అధికారులే బలవంతంగా విధుల్లోకి తీసుకోవాలి. అలా చేస్తేనే పూరిస్థాయిలో స్పెషల్ అసిస్టెంట్లు వస్తారు. అయితే అధికారులు అలా చేయకపోవడం గమనార్హం. సమస్యను అధిగమిస్తాం ఏప్రిల్ 2 నుంచి 15వ తేదీ వరకు మూల్యాంకనం జరుగుతుంది. రెమ్యూనరేషన్ తక్కువ, డీఏ ఉండదనే కారణంతో స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపని పరిస్థితి వాస్తవమే. ఈసారి సమస్యను అధిగమిస్తాం. వీలైనంత ఎక్కువ మందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. – గోవిందు నాయక్,డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ -
ప్రత్యేక సాయాన్ని తిరస్కరించారు: వైవీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం లోక్‌సభలో ప్రత్యేక ప్రస్తావనల కింద ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు మూడేళ్లుగా విజ్ఞప్తిచేస్తూ వస్తున్నారు. నీతి ఆయోగ్ దీనిపై అధ్యయనం చేస్తుందని గతంలో కేంద్రం చెప్పింది.గతేడాది ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయాన్ని ప్రకటించారు. దీనిని గతవారం కేంద్ర మంత్రిమండలి కూడా ఆమోదించింది. కానీ అందులో ఉన్న అంశాలన్నీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కల్పించిన ప్రయోజనాలే తప్ప ప్రత్యేకంగా పెద్దగా ప్రయోజనం ఉన్న అంశాలేవీ లేవు. అందువల్ల ప్రజలు ప్రత్యేక సాయాన్ని తిరస్కరించారు. ప్రత్యేక హోదా కోసమే డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల నీతిఆయోగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టండి. ఆ సిఫారసులతో సంబంధం లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయండి..’’ అని విన్నవించారు. -
ఇంతకీ కేంద్రం ప్రకటించిన 'సాయం' ఏమిటి?
కొండంత రాగం తీసి.. పిట్టంత పాట పాడాడట వెనకటికెవరో. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్నట్లు ఘనంగా ప్రకటించిన 'ప్రత్యేక సాయం' కూడా ఇలాగే ఉంది. ప్రత్యేక హోదాను తుస్ మనిపించారు.. ప్రత్యేక ప్యాకేజి కూడా లేదన్నారు, చివరకు సాయం చేస్తున్నామంటూ అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను కూడా మభ్యపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నామని, ఈ దశాబ్దంలో నిర్మితమవుతున్న ఏకైక నగరం ఇదేనని.. దీనికి అత్యంత భారీగా ఖర్చవుతుందని ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊదరగొడుతుంటే, ఆ నగర నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం మొత్తం ఇస్తున్నది.. కేవలం రూ. 3,500 కోట్లు మాత్రమే. అందులో ఇప్పటికే రూ. 2,500 కోట్లు ఇచ్చేశామని, మరో వెయ్యి కోట్లు కూడా ఇస్తామని ప్రకటించారు. ఐదు సంవత్సరాలలో రెవెన్యూ లోటు రూ. 22,113 కోట్లు ఉంటుందని, ఇప్పటికే రూ. 3,979 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. మిగిలినది వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామంది. అయితే ఎంత చెల్లించేదీ మాత్రం ఆర్థిక శాఖ స్పష్టంగా చెప్పలేదు. వెనకబడిన జిల్లాలకు ఇప్పటికే రూ. 1,050 కోట్లు ఇచ్చామని, మరో రూ. 1,050 కోట్లు కూడా ఇస్తామని ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తన వెబ్సైట్లో పేర్కొన్న ప్రకటనలో తెలిపింది. వీటన్నింటితో పాటు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన వివిధ విద్యాసంస్థల వివరాలను కూడా వెబ్సైట్లో కేంద్ర ఆర్థికశాఖ మరోసారి గుర్తుచేసింది. పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని, దీనికి 2014 మార్చి ఒకటో తేదీ నంచి అయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుందని చెప్పారు. అయితే అందులో కేవలం నీటిపారుదలకు సంబంధించిన వ్యయం మాత్రమే ఇస్తామని తెలిపారు. అంటే, ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌కు సంబంధించిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్న మాట. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు, కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రాజెక్టు నిర్మాణపనులను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడానికి కేంద్రం అంగీకరించినట్లు ఆ నివేదికలో చెప్పారు. చివరగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రసంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. ఆయన చెప్పిన ఆరు అంశాలలో ఐదింటి విషయంలో ఎలాంటి సమస్య లేదని, ఒక్క ప్రత్యేక హోదా విషయం మాత్రం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనల ప్రకారం అసలు ఇక రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది ఉండబోదన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక సాయం చేయడానికి కేంద్రం అంగీకరించినట్లే పేర్కొన్నారు. 2015-16 నుంచి 2019-20 వరకు రాష్ట్రానికి కేంద్రం నుంచి అదనపు సాయం అందుతుందని చెప్పారు. అయితే అందులో ఎక్కడా ఎంత సాయం చేస్తామన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను కేంద్రం నెరవేరుస్తున్నట్లే అయిపోయిందని తేల్చి చెప్పేశారు. -
చట్టంలో హామీలకే.. కొత్త పేరు
♦ ‘స్పెషల్ అసిస్టెన్స్’ పేరిట రూ.వెయ్యి కోట్లు ♦ పోలవరం రీయింబర్స్మెంట్ నిధులు ఇదే కోటాలో ♦ ఏడు జిల్లాలకిచ్చే వెనుకబాటు నిధులకూ ఇదే రంగు.. ♦ చట్టప్రకారం దక్కాల్సిన వాటినే ప్రత్యేకమని చూపుతున్న కేంద్రం ♦ సీఎం చంద్రబాబు అభ్యర్థన మేరకే కొత్తపేరు... సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకు ఇవ్వాల్సిన నిధులనే ‘స్పెషల్ అసిస్టెన్స్’ అనే కొత్త పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ.వెయ్యి కోట్లను ప్రకటించింది. ప్రత్యేక హోదా సాధన కోసం రాజకీయంగా పెరుగుతున్న ఒత్తిడి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రకటన నేపథ్యం... వెరసి సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి అభ్యర్థించిన మేరకే మరుసటి రోజే ‘స్పెషల్ అసిస్టెన్స్’ ప్రకటన వెలువడింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం ఏపీకి రూ. వెయ్యి కోట్లు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు ప్రకటనతో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో రాజ్‌భవన్, సచివాలయం, హైకోర్టు, శాసనసభ, శాసనమండలి, ఇతర మౌలిక వసతులకు, వెనుకబడిన ఏడు జిల్లాలకు, పోలవరం ప్రాజెక్టుకు.. ఇలా మొత్తంగా రూ.1000 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని మొత్తం 7 జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున ఏటా ఇవ్వాల్సిన రూ.350 కోట్లను, నూతన రాజధానికి రూ.350 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.300 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనూ రూ.4,403 కోట్లు ఇచ్చామని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. అంటే.. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు గత ఆర్థిక సంవత్సరంలో నిధులు ఇచ్చిన తరహాలోనే, ఏటా ఇవ్వాల్సిన నిధులనే కేంద్రం ఇప్పుడూ ప్రకటించింది. అయితే, దీనినే స్పెషల్ అసిస్టెన్స్‌గా పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నిధులు ప్రకటించినప్పుడు లేని ‘స్పెషల్ అసిస్టెన్స్’ ఇప్పుడు పేర్కొనడం విశేషం. చంద్రబాబు కోరిక మేరకే... స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా, విభజన హామీలన్నీ కలిపి ఒక స్పెషల్ ప్యాకేజీ అయినా ఇవ్వాలని టీడీపీ కోరగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పెషల్ ప్యాకేజీ పై నీతి ఆయోగ్ మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. దీనిని రాజధాని శంకుస్థాపన రోజున ప్రకటించాలని ముహూర్తంగా నిర్ణయించిన విషయం విదితమే. ఇదే క్రమంలో ఏపీలో ప్రత్యేక హోదా సాధనపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో.. దాని తీవ్రతను తగ్గించేందుకు చంద్రబాబు కోరికమేరకు స్పెషల్ అసిస్టెన్స్ అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన నిధులను ఈ శీర్షికతో చూపించారు. పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన ఖర్చును తిరిగి చెల్లించడం కేంద్రం బాధ్యత. అది జాతీయ ప్రాజెక్టు అయినందున ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోజాలదు. అందుకే తాజాగా రూ.300 కోట్లు ఇచ్చింది. విభజన చట్టంలోని మరో హామీ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ. దీనిలో భాగంగానే గతేడాది రూ.350 కోట్లు ప్రకటించారు. ఈ ఏడాది రూ.350 కోట్లు ఇచ్చారు. ఇక రాజధాని నిర్మాణానికి చట్టంలోనే నిబంధన ఉంది. ఈమేరకు గతేడాది రాజధాని నిర్మాణానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. దీనిని కూడా ఈ ఏడాది ప్రత్యేకంగా చూపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాజధాని నిర్మాణానికి గతేడాది కేటాయించిన నిధులతో అక్కడ కనీస పనులు కూడా చేపట్టకపోవడం గమనార్హం.