జిల్లాకు చేరిన జవాబు పత్రాలను పరిశీలిస్తున్న ఏసీ గోవిందునాయక్
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబుపత్రాలు మూల్యాంకనం చేయడం ఎంత ముఖ్యమో.. వచ్చిన మార్కులు టోటలింగ్ చేయడం, మార్కుల పోస్టింగ్‌లు పరిశీలించడం కూడా అంతే ముఖ్యం. ఇందులో స్పెషల్ అసిస్టెంట్ల(ఎస్‌ఏ)లే కీలకం. మూల్యాంకనంలో ప్రతి ముగ్గురు ఏఈ(అసిస్టెంట్ ఎగ్జామినర్లు)లకు ఒక స్పెషల్ అసిస్టెంట్(ఎస్‌ఏ)ను ఇవ్వాల్సి ఉంది. సుమారు 400 మందికి పైగా స్పెషల్ అసిస్టెంట్లు అవసరం కాగా వీరిలో సగంమంది కూడా రావడం లేదు. ఏటా ఇదే తంతు. గత అనుభవాలతో విద్యాశాఖ అధికారులు గుణపాఠం నేర్చుకోని పరిస్థితి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. జిల్లాకు దాదాపు 5.40 లక్షల జవాబు పత్రాలు రానున్నాయి. రెండు రోజులుగా జవాబుపత్రాలు వస్తున్నాయి. స్థానిక కేఎస్‌ఆర్ బాలికల పాఠశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తున్నారు.
స్పెషల్ అసిస్టెంట్లు కీలకం
♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు దిద్ది మార్కులు వేసిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్లు జవాబుపత్రం తీసుకుని మార్కుల పోస్టింగ్‌లు, మార్కుల టోటలింగ్ పరిశీలించాలి.
♦ ఏఈలు జవాబు పత్రాలు దిద్దుతున్న కంగారులో మార్కుల టోటలింగ్‌లో ఏవైనా తప్పులు జరిగే అవకాశం ఉంది. దీనికితోడు మండుతున్న వేసవితో ఉక్కపోత, సౌకర్యాల లేమితో తీవ్ర అసహనానికి లోనవుతుంటారు. ఈ క్రమంలో చిన్నచిన్న తప్పులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏఈలు దిద్దిన జవాబు పత్రాలను స్పెషల్ అసిస్టెంట్లు మరోసారి పరిశీలించి మార్కుల వివరాలను ధ్రువీకరిస్తారు.
♦ పొరపాటున ఏఈల చేతుల్లో టోటలింగ్‌లో తక్కువ వచ్చిన అంశాల్ని స్పెషల్ అసిస్టెంట్లు గుర్తించిన సందర్భాలు అనేకం.
చాలీచాలని రెమ్యూనరేషన్
మూల్యాంకనం విధుల్లో పాల్గొంటున్న ఇతర అన్ని కేడర్ల కంటే కూడా స్పెషల్ అసిస్టెంట్లకే రెమ్యూనరేషన్ తక్కువ. ఏఈలకు డీఏ, పేపర్లు దిద్దినందుకు రోజుకు సగటున రూ.550 దాకా వస్తుంది. చీఫ్ ఎగ్జామినర్లకు కూడా ఇదే స్థాయిలో వస్తుంది. అయితే స్పెషల్ అసిస్టెంట్లకు మాత్రం కేవలం రూ.137.50లతో సరిపెడుతున్నారు. దీనికి తోడు డీఏ ఇవ్వడం లేదు. మండుతున్న ఎండలకు తోడు ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతోనే చాలామంది టీచర్లు స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది.
గుణపాఠం నేర్వని విద్యాశాఖ
ఏటా ఇదే తంతు. గత అనుభవాలతో గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు టీచర్లు ఆసక్తి చూపడం లేదు. మూల్యాంకనంలో ఏమాత్రం తేడా వచ్చినా నష్టోపోయేది విద్యార్థులే. వారికి ఇష్టమున్నా.. లేకున్నా అధికారులే బలవంతంగా విధుల్లోకి తీసుకోవాలి. అలా చేస్తేనే పూరిస్థాయిలో స్పెషల్ అసిస్టెంట్లు వస్తారు. అయితే అధికారులు అలా చేయకపోవడం గమనార్హం.
సమస్యను అధిగమిస్తాం
ఏప్రిల్ 2 నుంచి 15వ తేదీ వరకు మూల్యాంకనం జరుగుతుంది. రెమ్యూనరేషన్ తక్కువ, డీఏ ఉండదనే కారణంతో స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపని పరిస్థితి వాస్తవమే. ఈసారి సమస్యను అధిగమిస్తాం. వీలైనంత ఎక్కువ మందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. – గోవిందు నాయక్,డిప్యూటీ క్యాంపు ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment