ఇంతకీ కేంద్రం ప్రకటించిన 'సాయం' ఏమిటి?
కొండంత రాగం తీసి.. పిట్టంత పాట పాడాడట వెనకటికెవరో. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్నట్లు ఘనంగా ప్రకటించిన 'ప్రత్యేక సాయం' కూడా ఇలాగే ఉంది. ప్రత్యేక హోదాను తుస్ మనిపించారు.. ప్రత్యేక ప్యాకేజి కూడా లేదన్నారు, చివరకు సాయం చేస్తున్నామంటూ అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను కూడా మభ్యపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నామని, ఈ దశాబ్దంలో నిర్మితమవుతున్న ఏకైక నగరం ఇదేనని.. దీనికి అత్యంత భారీగా ఖర్చవుతుందని ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊదరగొడుతుంటే, ఆ నగర నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం మొత్తం ఇస్తున్నది.. కేవలం రూ. 3,500 కోట్లు మాత్రమే. అందులో ఇప్పటికే రూ. 2,500 కోట్లు ఇచ్చేశామని, మరో వెయ్యి కోట్లు కూడా ఇస్తామని ప్రకటించారు.
ఐదు సంవత్సరాలలో రెవెన్యూ లోటు రూ. 22,113 కోట్లు ఉంటుందని, ఇప్పటికే రూ. 3,979 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. మిగిలినది వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామంది. అయితే ఎంత చెల్లించేదీ మాత్రం ఆర్థిక శాఖ స్పష్టంగా చెప్పలేదు. వెనకబడిన జిల్లాలకు ఇప్పటికే రూ. 1,050 కోట్లు ఇచ్చామని, మరో రూ. 1,050 కోట్లు కూడా ఇస్తామని ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకటనలో తెలిపింది.
వీటన్నింటితో పాటు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన వివిధ విద్యాసంస్థల వివరాలను కూడా వెబ్‌సైట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మరోసారి గుర్తుచేసింది. పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని, దీనికి 2014 మార్చి ఒకటో తేదీ నంచి అయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుందని చెప్పారు. అయితే అందులో కేవలం నీటిపారుదలకు సంబంధించిన వ్యయం మాత్రమే ఇస్తామని తెలిపారు. అంటే, ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌కు సంబంధించిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్న మాట. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు, కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రాజెక్టు నిర్మాణపనులను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడానికి కేంద్రం అంగీకరించినట్లు ఆ నివేదికలో చెప్పారు.
చివరగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రసంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. ఆయన చెప్పిన ఆరు అంశాలలో ఐదింటి విషయంలో ఎలాంటి సమస్య లేదని, ఒక్క ప్రత్యేక హోదా విషయం మాత్రం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనల ప్రకారం అసలు ఇక రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది ఉండబోదన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక సాయం చేయడానికి కేంద్రం అంగీకరించినట్లే పేర్కొన్నారు. 2015-16 నుంచి 2019-20 వరకు రాష్ట్రానికి కేంద్రం నుంచి అదనపు సాయం అందుతుందని చెప్పారు. అయితే అందులో ఎక్కడా ఎంత సాయం చేస్తామన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను కేంద్రం నెరవేరుస్తున్నట్లే అయిపోయిందని తేల్చి చెప్పేశారు.