ఏపీకి చెల్లిస్తే మీదే బాధ్యత
పదో షెడ్యూలు సంస్థల నగదు నిల్వలపై బ్యాంకర్లకు రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ
సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టం పదో షెడ్యూలు లో ఉన్న సంస్థల నగదు నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన నగదు నిల్వలను రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 142 పదో షెడ్యూలు సంస్థలు తమ ప్రాంతంలో ఉన్నందున వీటి ఆస్తులు, నిధులన్నీ తమవేనని రాష్ట్ర ప్రభుత్వ వాదన. ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాల్లో నగదు పంపిణీపై హైకోర్టులో తెలంగాణకు అనుకూలంగా తీర్పు రావటంతో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
సుప్రీం తీర్పుతో తెలంగాణ వాదన వీగి పోయినట్లయింది. ఏపీ ప్రభుత్వానికి ఏవైనా చెల్లింపులు చేస్తే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్ని బ్యాంకులకు తెలంగాణ ఆర్థిక శాఖ తాజాగా లేఖలు రాసింది. సుప్రీం తీర్పును అమలు చేయాలంటే 2014 జూన్ 2 నాటికి బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు, డిపాజిట్లను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.