సాక్షి, ఢిల్లీ: రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేడు(మంగళవారం) కీలక విచారణ జరగనుంది. చట్ట విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో గత విచారణలో కేసు ఊహించని మలుపు తిరిగిన దృష్ట్యా.. ఇవాళ్టి విచారణపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఇంకోవైపు.. ఆర్‌బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు.
ఈ వాదనల తదనంతరం సమగ్ర విచారణ కోసం నేటికి విచారణను వాయిదా వేసింది కోర్టు. ఇవాళ జరగబోయే విచారణ మార్గదర్శి కేసును మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నేడు ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment