Margadarsi Chit Fund Case: Supreme Court Issues Notice To Ramoji Rao - Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై ‘సుప్రీం’ స్పందన.. మార్గదర్శి, రామోజీకి నోటీసులు

Published Mon, Sep 19 2022 4:13 PM | Last Updated on Tue, Sep 20 2022 10:03 AM

Supreme Court of India issues notices to Ramoji Rao in Margadarsi Case - Sakshi

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చట్ట నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్‌తో పాటు దాని అధినేత రామోజీరావును ప్రాసిక్యూట్‌ చేయాలంటూ నాంపల్లి మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపా­లిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో దాఖలైన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. 

ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంలో హైకోర్టు నుంచి సానుకూల తీర్పు పొందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ తన డిపాజిటర్లకు తిరిగి పూర్తి డిపాజిట్లు చెల్లించిందా? లేదా? అనే వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు...
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.2,600 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించినందుకు చట్ట ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావును ప్రాసిక్యూట్‌ చేయాలంటూ 2008లో సీఐడీ అధీకృత అధికారి టి.కృష్ణరాజు నాంపల్లి మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో క్రిమినల్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. దీన్ని కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు (31.12.2018)న అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ (ప్రస్తుతం ఎన్‌సీఎల్‌టీ సభ్యురాలు, అమరావతి బెంచ్‌) తీర్పునిచ్చారు.

మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఈ తీర్పును సవాలు చేస్తూ 2018లో సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2020లో ఇదే వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2022లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై తాజాగా జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 

ఆ వ్యాజ్యాన్ని కూడా కలిపి విచారించండి...
ఉండవల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్, న్యాయవాది రమేశ్‌ అల్లంకి వాదనలు వినిపిస్తూ, మార్గదర్శి రికార్డులు తనిఖీ చేయడానికి 2007లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రెండు జీవోలు విడుదల చేసి విచారణ అధికారిని నియమించిందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించిందని, స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆ సంస్థ సుప్రీంకోర్టుకు వచ్చిందని తెలిపారు. ఆ కేసు అప్పటి నుంచి పెండింగ్‌లో ఉందని, దానిని కూడా ఈ వ్యాజ్యాలకు జతచేíసి తమ వాదనలను వినాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ ఈ అంశాన్ని తదుపరి విచారణ సమయంలో పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

తనిఖీలకు ఏమాత్రం సహకరించలేదు..
మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ సంస్థ డిపాజిట్‌దారులందరికీ సొమ్ములను తిరిగి ఇచ్చేసిందా? అని ఏపీ ప్రభుత్వాన్ని విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వికాస్‌సింగ్‌ స్పందిస్తూ ఖాతాలను తనిఖీ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వలేదని నివేదించారు. తనిఖీలకు ఏమాత్రం సహకరించలేదన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) పేరిట అందరి నుంచి డిపాజిట్లు తీసుకోవడం ఆర్బీఐ చట్ట ప్రకారం నేరమని, దీనిపైనే ప్రధానంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనానికి విన్నవించారు.

డిపాజిట్‌దారులందరికీ సొమ్ములు తిరిగి వచ్చాయా? లేదా? అనే విషయాన్ని పరిశీలించిన తరువాత చెబుతామని వికాస్‌ సింగ్‌ తెలిపారు. ఆ వివరాలు సేకరించి తమ ముందుంచాలని వికాస్‌ సింగ్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. మార్గదర్శి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని విచారించిన ధర్మాసనం ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎవరైనా హాజరయ్యారా? అని ధర్మాసనం ప్రశ్నించగా ఎవరూ రాలేదని మార్గదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ లూత్రా బదులిచ్చారు.

అనుకూల తీర్పు పొంది కూడా రామోజీ కోర్టుకు ఎందుకొచ్చారో..!
హైకోర్టులో కేసు గెలిచినప్పటికీ రామోజీరావు సుప్రీంకోర్టుకు ఎందుకొచ్చారో అర్థం కావడంలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. క్రిమినల్‌ ఫిర్యాదును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆయనకు సంతృప్తినివ్వలేదేమో అని వ్యాఖ్యానించారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రామోజీరావుపై తనకేమీ కక్ష లేదని, జైల్లో పెట్టించాలని తనకేమీ లేదని ఉండవల్లి చెప్పారు. చట్టానికి రామోజీరావును అతీతుడిని చేయకూడదని, సమాజానికి, ధర్మానికి హాని జరగకూడదన్నదే తన ఉద్దేశమన్నారు.

హెచ్‌యూఎఫ్‌ ద్వారా డిపాజిట్లు సేకరించవచ్చంటే రామోజీ మాత్రమే కాకుండా అందరూ సేకరించవచ్చనన్నారు. డిపాజిట్లు ఇస్తే ఇస్తారు.. లేకపోతే లేదనేది తర్వాత అంశమన్నారు. మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారంలో ఇకపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. మార్గదర్శి పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కాబట్టి ఇకపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌంటర్‌ వేయక తప్పదన్నారు. మార్గదర్శి వ్యవహారాన్ని ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకురాగా అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామని చెప్పారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్న క్రమంలో కేసు ఓ తార్కిక ముగింపునకు వచ్చే అవకాశముందన్నారు. ఈ అంశంపై కేవలం హెచ్‌యూఎఫ్‌ వరకే తాము కోర్టును ఆశ్రయించామని తెలిపారు. డిపాజిట్‌దార్లకు సొమ్ములు అందాయా లేదా? అని తనిఖీ చేసేందుకు గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అధికారిని నియమించగా కొందరు డిపాజిట్‌దారులు అసోసియేషన్‌గా ఏర్పడి కోర్టుకు వెళ్లారన్నారు. తమ పేర్లు బయటపడితే రామోజీ దగ్గర సొమ్ములు దాచుకున్నామని వైఎస్సార్‌ కక్ష సాధిస్తారని భయంగా ఉందంటూ కోర్టు నుంచి స్టే తెచ్చారని ఉండవల్లి చెప్పారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని వివరాలు సేకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన క్రమంలో అన్ని అంశాలు బయటకు వస్తాయన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement