డిపాజిట్లలో రహస్యం ఉందా? మార్గదర్శికి సుప్రీంకోర్టు ప్రశ్న | Supreme Court question to Margadarsi financiers and Ramoji Rao | Sakshi
Sakshi News home page

డిపాజిట్లలో రహస్యం ఉందా? మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కి, రామోజీరావుకి సుప్రీంకోర్టు ప్రశ్న

Published Wed, Apr 19 2023 2:08 AM | Last Updated on Wed, Apr 19 2023 7:13 AM

Supreme Court question to Margadarsi financiers and Ramoji Rao - Sakshi

ఒక చోట ప్రొప్రయిటర్‌ అన్నారు... మరొక చోట హెచ్‌యుఎఫ్‌ అన్నారు. అలా చెప్పటం చట్ట విరుద్ధం కదా? డిపాజిటర్లకు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ చేసిన చెల్లింపుల్లో ఏమైనా రహస్యం దాగుందా?. లేకుంటే వాటి వివరాలు బహిర్గతం చేయొచ్చు కదా?.. కోర్టుకు అన్ని వివరాలూ అందజేయండి.
– సుప్రీంకోర్టు 

సాక్షి, న్యూఢిల్లీ: డిపాజిటర్లకు చేసిన చెల్లింపుల్లో ఏమైనా రహస్యం దాగుందా అని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాంటిదేమీ లేని పక్షంలో ఆయా వివరాలు పూర్తిగా కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు మంగళవారం జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జేబీ పార్డీ­వాలాలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చాయి.

ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయ­వాది వైద్య­నాథన్‌ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ ప్రభు­త్వం నుంచి కొన్ని డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉందని, రెండు వారాలు గడువు ఇవ్వాలని కోరారు. ఏపీ ప్రభుత్వం వాయిదా కోరుతూ లెటర్‌ను సర్క్యులేట్‌ చేయగా.. దానిపై మార్గదర్శి అభ్యం­తరం చెప్పింది. అభ్యంతరాలతో కూడిన లెటర్‌ను సోమవారం రాత్రే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సర్క్యులేట్‌ చేసింది. దీన్ని గుర్తుచేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూత్రా.. వాదనలు వినిపించారు.

ఈ దశలో జస్టిస్‌ జేబీ పార్డీవాలా జోక్యం చేసుకుని.. ‘‘కొన్నిసార్లు వాదించినప్పుడు  ప్రొప్రయిటరీ అంటున్నారు. మరికొన్ని వాదనల్లో హెచ్‌యుఎఫ్‌ (హిందూ అవిభాజ్య కుటుంబం) అని పేర్కొంటున్నారు. ఇది సమస్యాత్మకం కదా? అని ప్రశ్నించారు. తదుపరి విచారణ జరిగేటప్పుడు దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.  

హెచ్‌యూఎఫ్‌– ప్రొప్రయిటర్‌ రెండూ ఎలా కుదురుతాయి? 
హెచ్‌యుఎఫ్‌ అంటే వ్యక్తుల సమూహం (అసోసియేషన్‌ ఆఫ్‌ ఇన్‌డివిడ్యుయల్స్‌) కదా? మరి ప్రొప్రయిటరీ షిప్‌ను కూడా ఇం­దులో ఇండివిడ్యుయల్‌ కెపాసిటీలో చూపుతున్నారా? ఇలా చే­యటం చట్ట విరుద్ధం కదా? అని జస్టిస్‌ పార్డీవాలా ప్రశ్నించా­రు. గత విచారణలో డిపాజిటర్లందరికీ సొమ్ములు వెనక్కి ఇచ్చేశాం అన్నారు కదా? అని కూడా లూత్రానుద్దేశించి జస్టిస్‌ సూ­ర్యకాంత్‌ ప్రశ్నించారు. పార్టీ ఇన్‌ పర్సన్‌ ఉండవల్లి అరుణ్‌కుమార్, న్యాయవాది అల్లంకి రమేశ్‌లు జో­క్యం చేసుకుంటూ... డిపాజిటర్లకు సొమ్ములు తిరిగి ఇచ్చేశాం అన్నారు కా­నీ, వివరాలు ఎక్కడా వెల్లడించలేదని గుర్తుచేశారు.

ఇటు ప్ర­భుత్వానికి కానీ అటు కోర్టుకు గానీ వివరాలు చెప్పలేదన్నారు. ఆయా వివరాలు అందజేయాల్సిందిగా కోరా­లని ధర్మాసనా­న్ని అభ్యర్థించారు. ఆడిటర్‌ స్టేట్‌మెంట్‌ ప్రకా­రం తాము వివరాలు ఇచ్చామని లూత్రా తెలిపారు. ఈ దశలో ఉండవల్లి జో­క్యం చేసుకుంటూ వారిని వివరాలు అందజేయాల్సిందిగా ధ­ర్మాసనాన్ని కోరారు. దీంతో... వివరాలు వెల్లడించడంలో ఏ­మై­నా సీక్రెట్‌ (రహస్య) దాగుందా? అని లూ­త్రాను జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రశ్నించారు. ఇందులో రహస్యం ఏమీ లేదని లూ­త్రా చెప్పగా... అయితే, కోర్టులో ఫైల్‌ చేయాలని జస్టిస్‌ సూ­ర్యకాంత్‌ ఆదేశించారు.

ఈ దశలో మార్గదర్శి తరఫున మ­రో సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి జోక్యం చేసుకొని హైకోర్టు ఆర్డర్‌ ప్రకారం ఎవౖ­రెనా వివరాలు కావా­ల­ని ముందుకొస్తే అందజేస్తామనిన్నారు. జస్టిస్‌ సూర్యకాంత్‌ కల్పించుకుని ‘‘డిపాజిట్లు తిరిగి ఎవరెవరికి ఇచ్చారు? ఎంతెంత ఇచ్చారు? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని లూ­త్రా, సింఘ్విలనుద్దేశించి అన్నారు. ‘‘2007 మార్చి చివరి నా­టి­కి  డిపాజిట్ల రూపంలో సేకరించిన  రూ.2541 కోట్లు. తిరిగి వెనక్కి ఇచ్చింది రూ.2596 కోట్లు.. తదనంతరం ఖాతాలో బ్యా­లెన్స్‌ రూ.­5.43 కోట్లు’’ అని ఆడిటర్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన విషయాన్ని లూ­త్రా కోర్టు దృష్టికి తెచ్చారు. తదుపరి విచా­రణ సమయానికి ఎవరెవరికి ఎంతెంత చెల్లించారనే వివరాలు సమగ్రంగా కోర్టుకు అందజేయాలని ధర్మాసనం పేర్కొంది.
 
ఇదీ.. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసు కథ 
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థకు జనం నుంచి డిపాజిట్లు సేకరించేందుకు అనుమతి లేదు. అయినా సరే... హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన సంస్థగా పేర్కొంటూ జనం నుంచి డిపాజిట్లు సేకరించి వారికి బాండ్లు జారీ చేశారు. ఆ బాండ్లపై హెచ్‌యూఎఫ్‌ కర్తగా రామోజీరావు సంతకం చేశారు. కానీ ఆ డిపాజిటర్లకు డబ్బులు చెల్లించాల్సి వచ్చినపుడు ఆ చెక్కులపై ప్రొప్రయిటర్‌ హోదాలో రామోజీరావు సంతకాలు చేశారు. ఇదంతా ఎందుకంటే 1934 నాటి రిజర్వు బ్యాంకు చట్టం సెక్షన్‌ 45(ఎస్‌) ప్రకారం... వ్యక్తులెవరూ ప్రజల నుంచి డిపా­జిట్లు సేకరించకుండా నిషేధించారు.

దీన్ని తప్పించుకోవటా­నికి అక్రమంగా హెచ్‌యూఎఫ్‌ ముసుగులో రామోజీ డిపాజిట్లు సేకరించినట్లు అప్పట్లో నాటి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటానికి దిగారు. అక్రమాలన్నీ నిజమేనని తేలటంతో... రామోజీరావు డిపాజిట్లు సేకరించటం నిలిపేశారు. కేసు విచారణలో ఉండగానే... మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను మూసేశారు. అయితే అక్రమంగా డిపాజిట్లు సేకరించటం నేరం కనక... ఆ నేరాన్ని నిర్ధారించడానికి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.  

డిపాజిటర్ల వివరాలు ఎందుకు దాస్తున్నారు?: ఉండవల్లి 
ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశంపై మార్గదర్శిలో తగిన యంత్రాంగం లేదని కూడా ఉండవల్లి కోర్టుకు తెలిపారు. రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై పలు కేసులు ఉన్నాయని, గూగుల్‌లో చూస్తే అన్నీ తెలుస్తాయని పేర్కొన్నారు. ‘‘డిపాజిటర్ల వివరాలు ఎందుకు దాస్తున్నారు? బయటకు వెల్లడించొచ్చు కదా!, ఆయా వివరాలపై అఫిడవిట్‌ దాఖలు చేయొచ్చు కదా!’’ అని ఉండవల్లి పేర్కొన్నారు.

గత విచారణ సమయంలో డిపాజిటర్ల వివరాలు రిజర్వు బ్యాంకుకు (ఆర్‌బీఐ) చెప్పాలని సుప్రీంకోర్టు సూచించగా.. ఆయా వివరాలు ఆర్‌బీఐకు అందజేశామని ఇక సమస్య ఏముందని లూత్రా చెప్పగా.... ఆర్‌బీఐ కూడా ఈ కేసులో పార్టీగా ఉందన్న విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు. దీంతో వివరాలు వెల్లడించడానికి తమకేమీ ఇబ్బంది లేదని లూత్రా పేర్కొన్నారు.

‘‘రిజాయిండర్‌ దాఖలు చేయడానికి ఏపీ ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం’’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆర్డర్‌ చదువుతుండగా.. డిపాజిటర్ల వివరాలు వెల్లడించాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఆదే­శించాలని ఉండవల్లి ఇంకోసారి అభ్యర్థించారు. ‘‘డిపాజిటర్లకు చెల్లింపు వివరాలు అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను, రామోజీరావును ఆదేశిస్తున్నాం’’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ ఉత్తర్వులు చదువుతూ చెప్పారు. తదుపరి విచారణ జూలైలో చేపడతామని ధర్మాసనం పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement