సంచలనమేమీ లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తను సమావేశం కావడంలో ఎలాంటి సంచలనం లేదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చెప్పారు. హోంమంత్రితో భేటీ సాధారణ సమావేశమేనని, ఇందులో చెప్పడానికి ఏమీ లేదన్నారు. గురువారం సాయంత్రం హోం శాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయల్‌తో 10 నిమిషాలు, ఆ తర్వాత హోం మంత్రి రాజ్‌నాథ్‌తో పావుగంట పాటు నరసింహన్ సమావేశమయ్యారు.
రాష్ట్ర విభజన చట్టంలోని అపరిష్కృత హామీలు, షెడ్యూల్ 9, 10లోని ఉమ్మడి ఆస్తుల పంపిణీ, ఉద్యోగుల విభజన తదితర సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పినట్టు తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాను నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు గైర్హాజరైన విషయాన్ని రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
ఇరు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు గవర్నర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై త్వరలోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదనే ఆరోపణలపై అడగ్గా.. ‘థాంక్యూ’ అని బదులిచ్చారు. జరిగిన పొరపాటును సరిదిద్దుతారా అని ప్రశ్నించగా, ‘చూద్దాం. రాజ్యాంగపరమైన సమస్య ఉత్పన్నమైనప్పుడు అధిగమిస్తాం’ అన్నారు.
రాష్ట్రపతి ప్రణబ్‌ను పరామర్శించిన గవర్నర్
రాష్ట్రపతి ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయనను గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించి సంతాపం తెలియచేశారు.