సచివాలయంలో నరసింహన్
* సెక్రటేరియట్‌కు వచ్చిన తొలి గవర్నర్‌గా చరిత్ర
* విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల పాలనకు బ్లాకుల కేటాయింపులపై స్వీయ పరిశీలన
* డి బ్లాకు, సౌత్ బ్లాకు, అసెంబ్లీ, మండలి, జూబ్లీహాల్‌ను పరిశీలించిన నరసింహన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ సచివాలయాన్ని సందర్శించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ గవర్నర్ సచివాలయానికి రాలేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి గవర్నర్లు రావడం, సభ్యులనుద్దేశించి ప్రసంగించడం సాధారణమే. అయితే ముఖ్యమంత్రి పాలనా కేంద్రమైన సచివాలయాన్ని గవర్నర్ సందర్శించడం ఇదే తొలిసారి. అయితే గవర్నర్ నరసింహన్ ఈ సందర్శన రాష్ట్రపతి పాలనలో భాగంగా చేయలేదు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయంలోని బ్లాకులను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉద్యోగులకు పంపిణీ చేయాల్సి ఉన్నందున గవర్నర్ నరసింహన్ స్వయంగా పరిశీలించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా సచివాలయ సందర్శన జరిగింది. జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కార్యాలయాలను, మంత్రులు, ఉద్యోగుల కార్యాలయాలను సచివాలయంలోనే కేటాయించాల్సి ఉంది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే గ్రేటర్ హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాలకు భవనాల కేటాయింపు అధికారం గవర్నర్‌కే ఉంది.
ఈ నేపథ్యంలో నరసింహన్ ఆదివారం సాయంత్రం సచివాలయానికి వచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, సలహాదారు ఎ.ఎన్.రాయ్, ఐఏఎస్ అధికారులు శ్యాంబాబు, లక్ష్మీపార్థసారథిలు కూడా ఉన్నారు. తొలుత సచివాలయంలోని డి బ్లాకుకు గవర్నర్ చేరుకున్నారు. ఆ బ్లాకులోని మూడు అంతస్థులను పరిశీలించారు. అక్కడి నుంచి సౌత్ హెచ్ బ్లాకు వెనుక నుంచి నడుచుకుంటూ సచివాలయం ప్రధాన గేటు ముందు వరకు వచ్చారు. అక్కడే అధికారులతో గవర్నర్ చర్చించారు.
అక్కడి నుంచి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంగా కేటాయించాలని ప్రతిపాదించిన సౌత్ హెచ్ బ్లాకులోకి వెళ్లి పరిశీలించారు. అదే బ్లాకులో గల లైబ్రరీలోకి వెళ్లారు. అక్కడ అధికారులు సచివాలయానికి సంబంధించిన మ్యాప్‌లతో గవర్నర్‌కు వివరాలు తెలిపారు. అనంతరం సౌత్ హెచ్ బ్లాకు ముందు గల పాడుబడిన జి బ్లాకును బయట నుంచే గవర్నర్ పరిశీలించారు. తరువాత అసెంబ్లీకి, శాసనమండలికి, జూబ్లీహాల్‌కు వెళ్లి పరిశీలించి రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు.