
సాక్షి, హైదరాబాద్: అవసరాలు తీర్చడానికి నీళ్లు కేటాయించాలి కానీ అత్యాశ తీర్చడానికి కాదని తెలంగాణ పేర్కొంది. ఏపీలో కృష్ణా పరీవాహకం పరిధిలోని ప్రాంతాలకు సాగునీటి సరఫరాపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే తెలంగాణ పరీవాహకం పరిధిలోని ప్రాంతాలు కనీసం ఒక ఆరుతడి పంటకు సైతం సాగునీటికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
రైతులు నీళ్లు లభించక గోస పడుతున్నారని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఏపీలోని పరీవాహకం వెలుపలి ప్రాంతాలు కృష్ణా నీళ్లు వాడుకోవడాన్ని అనుమతించరాదని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై విచారణ జరుపుతున్న జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట.. తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ బుధవారం వాదనలు వినించారు.
శాస్త్రీయ విధానంలో విశ్లేషించాలి
కృష్ణా నదీ పరీవాహకం వెలుపలి ప్రాంతాలకు ఏపీ 323 టీఎంసీల కృష్ణా నికర జలాలను తరలించుకుంటోందని వైద్యనాథన్ ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. ఏపీలోని పరీవాహకం వెలుపలి ప్రాంతాలకు పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీలు, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 100 టీఎంసీలు, చింతలపుడి ఎత్తిపోతల ద్వారా 27 టీఎంసీల గోదావరి జలాలు తరలించుకుని అవసరాలు తీర్చుకోవడానికి అవకాశముందని తెలిపారు.
ఏపీ కృష్ణా జలాలను తరలిస్తున్న ఇతర నదుల పరీవాహక ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న నీటి లభ్యతను వివరించారు. పెన్నా పరీవాహకంలో 75 శాతం లభ్యత ఆధారంగా 98 టీఎంసీలు, సగటు లభ్యత ఆధారంగా 195 టీఎంసీల లభ్యత ఉందని తెలిపారు. గుండ్లకమ్మ వంటి నదుల కింద సైతం నీటి లభ్యత ఉందన్నారు. సమర్థ నీటి వినియోగాన్ని శాస్త్రీయ విధానంలో విశ్లేషిస్తే నీటి అవసరాలు తగ్గుతాయని, దీంతో మిగిలే జలాలను పరీవాహక ప్రాంతం లోపలి ప్రాజెక్టులకు కేటాయించాలని సూచించారు.
గ్రావిటీ ద్వారా నీళ్లొచ్చే అవకాశం పోయింది..
ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు నిర్మించుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని వైద్యనాథన్ స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకాల కింద రాష్ట్రంలో సాగునీరు సరఫరా చేస్తున్న, సరఫరా చేసేందుకు ప్రతిపాదించిన ప్రాంతాలకు.. వాస్తవానికి అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తుంగభద్ర డ్యామ్, కృష్ణా ప్రాజెక్టు కాల్వలు, భీమా ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా సాగునీరు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. 1956లో తెలంగాణ, ఆంధ్రను కలిపి ఉమ్మడి ఏపీగా ఏర్పాటు చేయడంతో రాష్ట్ర సరిహద్దులు మారిపోవడంతో గ్రావిటీ ద్వారా నీళ్లను పొందే అవకాశాన్ని తాము కోల్పోయామని చెప్పారు.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులు జరపాలి
రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టుల కింద నీటి వినియోగం చాలా తక్కువ అని, నిర్మాణంలోని ప్రాజెక్టులకు జరిపే నికర జలాల కేటాయింపులతో కృష్ణా పరీవాహకంలోని 25 లక్షల కుటుంబాలకు చెందిన 80 లక్షల మందికి జీవోనోపాధి లభించనుందని వైద్య నాథన్ ట్రిబ్యునల్‌కు వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1956 తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
గోదావరి జలాల మళ్లింపునకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో రాజధాని ప్రాంత అభివృద్ధితో కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కింద తగ్గిన నీటి వినియోగాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు. ఏపీలోని వాగుల ద్వారా కృష్ణా డెల్టా సిస్టమ్‌కు సరఫరా అవుతున్న 75 టీఎంసీల జలాలను లెక్కించలేదని, వాటిని సైతం లెక్కించాలని కోరారు. అంతర్రాష్ట్ర నదీ జలాలను న్యాయోచితంగా వాడుకోవాలని పేర్కొంటున్న జాతీయ, అంతర్జాతీయ న్యాయసూత్రాలను వైద్యనాథన్ వివరించారు. గురువారం ఏపీ వాదనలు వినిపించనుండగా, శుక్రవారం రెండు రాష్ట్రాలు ప్రతివాదనలు వినిపించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment